‘నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి’
‘యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను విరిచి—ఇది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.’—1 కొరిం. 11:23, 24.
1, 2. యేసు చివరిసారి యెరూషలేముకు వెళ్లేముందు కొంతమంది అపొస్తలుల మనసులో బహుశా ఎలాంటి ఆలోచనలు మెదిలివుండవచ్చు?
‘ఆకాశం చూస్తే నిర్మలంగా ఉంది, నెలవంక స్పష్టంగా కనిపిస్తోంది. గత రాత్రి యెరూషలేములోని కావలివాళ్లు కూడా దాన్ని చూసేవుంటారు. మహాసభకు కూడా ఆ విషయం తెలిసింది కాబట్టి, నీసాను అనే కొత్తనెల మొదలయ్యిందని వాళ్లు ప్రకటించారు. దాంతో ఎత్తైన ప్రదేశాల్లో మంట వెలిగించి లేదా వార్తాహరులను పంపించి ఆ విషయాన్ని అందరికీ త్వరత్వరగా తెలియజేశారు. కొత్త నెల మొదలయ్యిందని ఇక్కడి ప్రజలకు కూడా తెలిసింది. యేసు పస్కాకు ముందే యెరూషలేములో ఉండేలా తప్పకుండా అక్కడకి వెళ్లాలనుకుంటాడు.’
2 యేసు చివరిసారి యెరూషలేముకు వెళ్లేముందు ఆయనతోపాటు ఉన్న కొంతమంది అపొస్తలుల మనసులో బహుశా ఇలాంటి ఆలోచనలే మెదిలివుండవచ్చు. వాళ్లప్పుడు యొర్దాను నది అవతలనున్న పెరయలో ఉన్నారు. (మత్త. 19:1; 20:17, 29; మార్కు 10:1, 32, 46) నీసాను 1వ తేదీ ఎప్పుడొస్తుందో తెలుసుకున్నాక, యూదులు మరో 13 రోజులు వేచి చూసి నీసాను 14 సూర్యాస్తమయం తర్వాత పస్కాను ఆచరిస్తారు.
3. పస్కా ఆచరణ తేదీ విషయంలో క్రైస్తవులకు ఎందుకు ఆసక్తి ఉండాలి?
3 పస్కా ఆచరణ తేదీకి సమానమైన తేదీన అంటే 2014, ఏప్రిల్ 14న సూర్యాస్తమయం తర్వాత మనం ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరిస్తాం. నిజ క్రైస్తవులకు, ఆసక్తిగల వాళ్లకు ఆ రోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకు? 1 కొరింథీయులు 11:23-25 వచనాల్లో పౌలు రాసిన ఈ మాటల్లో దానికి సమాధానం ఉంది: “ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి—యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.” ఆయన ద్రాక్షారసపు గిన్నె విషయంలో కూడా అలాగే చేశాడు.
4. (ఎ) జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించి మీరు ఎలాంటి ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు? (బి) ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ తేదీని ఎలా లెక్కిస్తారు? ( “2014 జ్ఞాపకార్థ దినం” బాక్సు చూడండి.)
4 ప్రతీ సంవత్సరం ఆచరించమని యేసు తన అనుచరులకు చెప్పింది ఒక్క జ్ఞాపకార్థ దినం గురించే, దానికి మీరు తప్పకుండా హాజరుకావాలని కోరుకుంటారు. దానికి ముందుగా ఇలా ప్రశ్నించుకోండి: ‘ఆ సాయంత్రం కోసం నేను ఎలా సిద్ధపడాలి? ఆ ఆచరణలో ఏ చిహ్నాలను ఉపయోగిస్తారు? ఆ ఆచరణ ఎలా జరుగుతుంది? జ్ఞాపకార్థ దినం, అందులో ఉపయోగించే చిహ్నాలు నాకు ఎందుకు ప్రాముఖ్యమైనవిగా ఉండాలి?’
జ్ఞాపకార్థ చిహ్నాలు
5. యేసు తన అపొస్తలులతో చేసిన చివరి పస్కా కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయించాడు?
5 పస్కా భోజనం కోసం గదిని సిద్ధం చేయమని యేసు తన అపొస్తలులకు చెప్పినప్పుడు ఆ గదిని ఆర్భాటంగా అలంకరించమని చెప్పలేదు; బదులుగా హాజరైన వాళ్లకు సౌకర్యంగా ఉండే సరైన, శుభ్రమైన గదిని ఆయన కోరుకున్నాడు. (మార్కు 14:12-16 చదవండి.) వాళ్లు ఆ భోజనం కోసం పులియని రొట్టె, ఎర్రని ద్రాక్షారసంతో పాటు ఇతర అవసరమైన వస్తువులు కూడా సమకూర్చాలి. పస్కా భోజనం అయిపోయిన తర్వాత యేసు రెండు చిహ్నాలపై మనసు నిలిపాడు.
6. (ఎ) పస్కా భోజనం తర్వాత యేసు రొట్టె గురించి ఏమి చెప్పాడు? (బి) జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఎలాంటి రొట్టెలు ఉపయోగిస్తారు?
6 ఆ సందర్భంలో యేసుతో ఉన్న మత్తయి ఇలా రాశాడు: ‘యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి—“మీరు తీసికొని తినుడి” అని చెప్పెను.’ (మత్త. 26:26) ఆ “రొట్టె,” పస్కా భోజనమప్పుడు ఉపయోగించిన పులియని రొట్టె. (నిర్గ. 12:8; ద్వితీ. 16:3) దాన్ని గోధుమ పిండి, నీళ్లు కలిపి ఎలాంటి పులి పిండి లేదా ఉప్పు చేర్చకుండా తయారుచేసేవాళ్లు. ఆ రొట్టెను పులియని పిండితో చేస్తారు కాబట్టి అది పొంగేది కాదు. అది ముక్కలుగా విరవడానికి అనుకూలంగా ఉండే ఒక సాధారణమైన, కరకరలాడే రొట్టె. మనకాలంలో, జ్ఞాపకార్థ దినానికి ముందుగానే అలాంటి రొట్టెలు చేయమని పెద్దలు సంఘంలో ఒకరికి చెబుతారు. గోధుమ పిండి, నీళ్లు కలిపి రొట్టెలుగా చేసి వాటిని పెనం మీద కొంచెం నూనెతో కాల్చి తయారుచేయాలి. (ఒకవేళ గోధుమ పిండి దొరకకపోతే వరి, బార్లీ, జొన్న లేదా అలాంటి మరో ధాన్యపు పిండితో చేయవచ్చు.)
7. యేసు ఏ ద్రాక్షారసం గురించి మాట్లాడాడు? జ్ఞాపకార్థ ఆచరణ కోసం నేడు ఏ రకమైన ద్రాక్షారసం ఉపయోగించవచ్చు?
7 మత్తయి ఇంకా ఇలా రాశాడు: ‘[యేసు] గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి—దీనిలోనిది మీరందరు త్రాగుడని చెప్పెను.’ (మత్త. 26:27, 28) యేసు పట్టుకున్న గిన్నెలో ఎర్రని ద్రాక్షారసం ఉంది. అయితే, అది తాజా ద్రాక్షారసం కాదు. ఎందుకంటే చాలాకాలం క్రితమే ద్రాక్ష కోతకాలం ముగిసింది. ఐగుప్తులో మొదటి పస్కా ఆచరణప్పుడు ప్రజలు ద్రాక్షారసాన్ని ఉపయోగించలేదు, అయితే పస్కా ఆచరణప్పుడు ద్రాక్షారసం తాగడం తప్పని యేసు చెప్పలేదు. దానిలో కొంత భాగాన్ని ప్రభువు రాత్రి భోజన సమయంలో ఆయన ఉపయోగించాడు కూడా. అందుకే క్రైస్తవులు జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో ద్రాక్షారసాన్ని కూడా ఉంచుతారు. అయితే ఎలాంటి ద్రాక్షారసాన్ని ఉపయోగించాలి? యేసు చిందించిన రక్తాన్ని మరింత విలువైనదిగా చేయడానికి దేన్నీ కలపాల్సిన అవసరం రాలేదు, కాబట్టి బ్రాందీ లేదా సుగంధ ద్రవ్యాలు కలిపిన ద్రాక్షారసాన్ని ఉపయోగించకూడదు. మామూలు ఎర్రని ద్రాక్షారసాన్నే ఉపయోగించాలి. ఇంట్లో తయారుచేసిన ద్రాక్షారసం (వైన్) లేదా బజారులో దొరికే బోజోలా, బర్గండి, కీయాంటీ రకాల వైన్ ఉపయోగించవచ్చు.
రొట్టె, ద్రాక్షారసం వేటికి సూచన?
8. రొట్టె-ద్రాక్షారసం సూచనగా ఉన్నవాటి విషయంలో క్రైస్తవులు ఎందుకు ఆసక్తి కలిగివుంటారు?
8 అపొస్తలులే కాక ఇతర క్రైస్తవులు కూడా జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవాలని పౌలు స్పష్టంగా చెప్పాడు. కొరింథులోని తోటి విశ్వాసులకు ఆయనిలా రాశాడు: “నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు . . . యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి—యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.” (1 కొరిం. 11:23, 24) అందుకే నేటి క్రైస్తవులు కూడా సంవత్సరానికి ఒకసారి ఈ ప్రత్యేక ఆచరణను జరుపుకుంటారు, అంతేకాక రొట్టె-ద్రాక్షారసం సూచనగా ఉన్నవాటి విషయంలో వాళ్లు ఎంతో ఆసక్తి కలిగివుంటారు.
9. యేసు ఉపయోగించిన రొట్టె విషయంలో కొంతమందికి ఏ తప్పుడు అభిప్రాయం ఉంది?
9 “ఇది మీకొరకైన నా శరీరము” అని యేసు చెప్పిన మాటలను చర్చీకెళ్లే కొంతమంది అక్షరార్థంగా తీసుకుని, యేసు శరీరమే అద్భుతరీతిలో రొట్టెగా మారిపోయిందని నమ్ముతారు. అయితే ఆ నమ్మకం వాస్తవ దూరం. a యేసు శరీరం నమ్మకమైన ఆయన అపొస్తలుల కళ్లెదుటే ఉంది అలాగే వాళ్లు తినబోయే పులియని రొట్టె కూడా వాళ్లముందే ఉంది. యేసు గతంలో అనేకసార్లు మాట్లాడినట్లు ఈ సందర్భంలో కూడా సూచనార్థకంగా మాట్లాడుతున్నాడనేది సుస్పష్టం.—యోహా. 2:19-21; 4:13, 14; 10:7; 15:1.
10. ప్రభువు రాత్రి భోజనంలో ఉపయోగించే రొట్టె దేన్ని సూచిస్తుంది?
10 అపొస్తలులు చూస్తున్న, కాసేపట్లో తినబోతున్న రొట్టె యేసు శరీరాన్ని సూచిస్తుంది. ఏ శరీరం? యేసు రొట్టెను విరిచాడు కానీ ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరగలేదు కాబట్టి, రొట్టె ‘క్రీస్తు శరీరంగా’ ఉన్న అభిషిక్తుల సంఘాన్ని సూచిస్తుందని దేవుని సేవకులు ఒకప్పుడు అనుకున్నారు. (ఎఫె. 4:12; రోమా. 12:4, 5; 1 కొరిం. 10:16, 17; 12:27) అయితే ఎంతో పరిశోధన చేశాక రొట్టె యేసు మానవ శరీరాన్ని సూచిస్తుందని వాళ్లు అర్థం చేసుకున్నారు. యేసు ఎలా “శరీరమందు శ్రమపడి,” చివరికి మ్రానుమీద చనిపోయాడో లేఖనాలు తరచూ ప్రస్తావించాయి. కాబట్టి, జ్ఞాపకార్థ రొట్టె మన పాపాల కోసం యేసు అర్పించిన మానవ శరీరాన్ని సూచిస్తుంది.—1 పేతు. 2:21-24; 4:1; యోహా. 19:33-36; హెబ్రీ. 10:5-7.
11, 12. (ఎ) ద్రాక్షారసం గురించి యేసు ఏమి చెప్పాడు? (బి) ద్రాక్షారసం దేన్ని సూచిస్తుంది?
11 మనం ఈ విషయం అర్థంచేసుకుంటే, యేసు ఆ తర్వాత ద్రాక్షారసం గురించి చెప్పిన విషయం కూడా అర్థమౌతుంది. మనం ఇలా చదువుతాం: ‘ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని—యీ పాత్ర “నా రక్తమువలననైన క్రొత్తనిబంధన” అని చెప్పెను.’ (1 కొరిం. 11:25) యేసు తన చేత్తో పట్టుకున్న పాత్రనే కొత్త నిబంధన అంటున్నాడా? కాదు. “పాత్ర” అన్నప్పుడు అందులోని ద్రాక్షారసం గురించి యేసు మాట్లాడుతున్నాడు. మరి ఆ ద్రాక్షారసం దేన్ని సూచిస్తుంది? యేసు చిందించిన రక్తాన్ని సూచిస్తుంది.
12 యేసు చెప్పిన మాటలు మార్కు సువార్తలో ఇలా ఉన్నాయి: “ఇది నిబంధన విషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము.” (మార్కు 14:24) అవును, యేసు రక్తం ‘పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడనుంది.’ (మత్త. 26:28) అలా ఎర్రని ద్రాక్షారసం సరిగ్గానే యేసు రక్తాన్ని సూచిస్తుంది. యేసు చిందించిన రక్తం “మన అపరాధములకు క్షమాపణ” దొరికేలా విమోచన క్రయధనం అయ్యింది.—ఎఫెసీయులు 1:7 చదవండి.
క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకునే విధానం
13. క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ ఎలా ఉంటుందో వివరించండి.
13 మీరు యెహోవాసాక్షులు ఏర్పాటు చేసిన జ్ఞాపకార్థ ఆచరణకు మొదటిసారి హాజరౌతున్నట్లయితే మీరక్కడ ఏమి చూస్తారు? హాజరైన వాళ్లందరూ సౌకర్యంగా కూర్చొని, ఆనందంగా వినేలా ఓ ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన స్థలంలో ఆ కూటాన్ని నిర్వహిస్తారు. ఆ స్థలం అక్కడక్కడా పూలతో అలంకరించబడి ఉంటుంది, అయితే హాజరైన వాళ్ల దృష్టి మళ్లేలా చేసే హంగు, ఆర్భాటాలు ఉండవు, లేదా ఫంక్షన్లలో కనిపించే ఆడంబరాలు ఉండవు. అర్హుడైన ఓ పెద్ద ఆ ఆచరణ గురించి బైబిలు చెబుతున్న విషయాలను స్పష్టంగా, గౌరవపూర్వకంగా చర్చిస్తాడు. మనం జీవించి ఉండడం కోసం క్రీస్తు మనకోసం విమోచన క్రయధనంగా చనిపోయాడని ఆయన వివరిస్తాడు. (రోమీయులు 5:8-10 చదవండి.) బైబిల్లో క్రైస్తవుల కోసం ఉన్న రెండు రకాల నిరీక్షణల గురించి ప్రసంగీకుడు వివరిస్తాడు.
14. జ్ఞాపకార్థ ప్రసంగంలో ఏయే నిరీక్షణల గురించి చర్చిస్తారు?
14 పరలోకంలో క్రీస్తుతో పాటు పరిపాలించే నిరీక్షణ వాటిలో ఒకటి. యేసు నమ్మకస్థులైన అపొస్తలుల్లాంటి కొంతమంది క్రైస్తవులకే ఈ నిరీక్షణ ఉంది. (లూకా 12:32; 22:19, 20; ప్రక. 14:1) నేడు దేవుణ్ణి నమ్మకంగా సేవించే చాలామంది క్రైస్తవులకు మరో నిరీక్షణ ఉంది. పరదైసులా మారే భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణ వాళ్లకు ఉంది. క్రైస్తవులు ఎంతోకాలం నుండి ప్రార్థిస్తున్నట్లుగా దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లుగానే భూమ్మీద కూడా నెరవేరుతుంది. (మత్త. 6:9, 10) అప్పుడు వాళ్లు శాశ్వతంగా అనుభవించే అద్భుత జీవితం గురించి లేఖనాలు వివరిస్తున్నాయి.—యెష. 11:6-9; 35:5, 6; 65:21-23.
15, 16. ప్రభువు రాత్రి భోజనమప్పుడు రొట్టెను ఏమి చేస్తారు?
15 ఆ చర్చ ముగింపుకు వస్తుందనగా, ప్రభువు రాత్రి భోజనంలో యేసు చేసిన పనిని ఇప్పుడు చేద్దామని ప్రసంగీకుడు చెబుతాడు. ప్రసంగీకుని సమీపంలో ఓ టేబుల్ మీద పులియని రొట్టె, ఎర్రని ద్రాక్షారసం ఉంటాయి. ఆ ఆచరణను స్థాపించినప్పుడు యేసు చెప్పిన మాటలు, చేసిన పనులు ఉన్న బైబిలు వృత్తాంతాన్ని ఆయన చదువుతాడు. ఉదాహరణకు, మత్తయి సువార్తలోని వృత్తాంతంలో ఇలా ఉంది: “యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి—మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.” (మత్త. 26:26) యేసు తన ఇరువైపులా ఉన్న అపొస్తలులకు అందించడానికి పులియని రొట్టెను విరిచాడు. ఏప్రిల్ 14న జరిగే జ్ఞాపకార్థ ఆచరణలో, టేబుల్ మీదున్న ప్లేట్లలో ముందే విరిచి ఉంచిన రొట్టె ముక్కలను మీరు చూస్తారు.
16 హాజరైన వాళ్లందరికీ సముచితమైన సమయంలో వాటిని అందించడానికి వీలుగా సరిపడా ప్లేట్లను ఉపయోగిస్తారు. అది చాలాసేపు జరిగే ఓ ఆచరణలా ఉండదు. క్లుప్తంగా ప్రార్థించిన తర్వాత ప్లేట్లను, స్థానిక పరిస్థితులకు సరిపోయే అనువైన, క్రమ పద్ధతిలో హాజరైనవాళ్లకు అందిస్తారు. 2013లో జ్ఞాపకార్థ ఆచరణప్పుడు చాలా సంఘాల్లో జరిగినట్లుగా కొంతమంది మాత్రమే ఆ రొట్టెను తింటారు లేదా ఎవ్వరూ తినకపోవచ్చు.
17. ద్రాక్షారసం విషయంలో యేసు నిర్దేశాన్ని జ్ఞాపకార్థ ఆచరణప్పుడు ఎలా పాటిస్తారు?
17 తర్వాత, యేసు ద్రాక్షారసంతో ఏమి చేశాడో చెబుతూ ప్రసంగీకుడు మత్తయి సువార్తలో ఇలా చదువుతాడు: ‘[యేసు] గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి—దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తమని చెప్పెను.’ (మత్త. 26:27, 28) ఆ పద్ధతినే పాటిస్తూ మరోసారి ప్రార్థించి, ఎర్రని ద్రాక్షారసం ఉన్న గ్లాసులను హాజరైన వాళ్లందరికీ అందిస్తారు.
18. జ్ఞాపకార్థ చిహ్నాల్లో కొంతమందే భాగం వహించినా, లేదా ఎవ్వరూ భాగం వహించకున్నా దానికి హాజరవడం ఎందుకు ప్రాముఖ్యం?
18 క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించబోయే వాళ్లు మాత్రమే ఆ రొట్టెను తిని, ద్రాక్షారసాన్ని తాగుతారు. అందుకే చిహ్నాలు తమ దగ్గరికి వచ్చినప్పుడు హాజరైన వాళ్లలో చాలామంది వాటిని తినకుండా, తాగకుండా గౌరవపూర్వకంగా పక్కవాళ్లకు అందిస్తారు. (లూకా 22:28-30 చదవండి; 2 తిమో. 4:18) చిహ్నాల్లో భాగం వహించకపోయినా ఆ ఆచరణకు హాజరవడం చాలామంది క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే, యేసు అర్పించిన బలిని ఎంతో విలువైనదిగా ఎంచుతున్నారని దానికి హాజరవడం ద్వారా వాళ్లు చూపిస్తారు. యేసు విమోచన క్రయధనం తమకు తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి ఆ సందర్భంలో వాళ్లు ఆలోచిస్తుంటారు. “మహాశ్రమలను” తప్పించుకోనున్న ‘గొప్పసమూహంలో’ సభ్యులయ్యే నిరీక్షణ వాళ్లకు ఉంది. ఆ ఆరాధకులు ‘గొఱ్ఱెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుంటారు.’—ప్రక. 7:9, 14-17.
19. ప్రభువు రాత్రి భోజనానికి సిద్ధపడడం కోసం, దానినుండి ప్రయోజనం పొందడం కోసం మీరు ఏమి చేయవచ్చు?
19 భూవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఈ ప్రత్యేక కూటం కోసం ముందే సిద్ధపడతారు. వీలైనంత ఎక్కువమంది ప్రజలు దానికి హాజరయ్యేలా మనం కొన్ని వారాల ముందే ఆహ్వానపత్రాలు పంచిపెట్టే పనిని మొదలుపెడతాం. దానితోపాటు, సా.శ. 33లో ప్రభువు రాత్రి భోజనానికి ముందు రోజుల్లో యేసు చెప్పిన విషయాలకు, జరిగిన సంఘటనలకు సంబంధించిన బైబిలు వృత్తాంతాలను ఈ ప్రత్యేక కూటానికి ముందు రోజుల్లో చదువుతాం. ఆ కూటానికి తప్పకుండా హాజరయ్యేలా మనం పనులను చక్కబెట్టుకుంటాం. ఆ ఆచరణకు వచ్చే వాళ్లను సాదరంగా ఆహ్వానించడానికి, మొత్తం కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడానికి వీలుగా మనం ప్రారంభ పాట, ప్రార్థనకు చాలాముందే వస్తే మంచిది. ప్రసంగీకుడు లేఖనాలను చదివి, వివరించేటప్పుడు బైబిలు తెరచి చూడడం ద్వారా ఆహ్వానితులతోపాటు మనందరికీ ప్రయోజనం ఉంటుంది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు యేసు బలిపట్ల నిండు హృదయంతో కృతజ్ఞత చూపిస్తాం, అంతేకాక “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి” అని ఆయనిచ్చిన ఆజ్ఞకు లోబడుతున్నామని చూపిస్తాం.—1 కొరిం. 11:24.
a హెన్రిక్ మెయర్ అనే జర్మనీ విద్వాంసుడు ఇలా చెప్పాడు: ‘వాళ్లు చూస్తున్నట్లుగా, యేసు శరీరం ఇంకా విరగలేదు (ఇంకా సజీవంగానే ఉంది), ఆయన రక్తం ఇంకా చిందింపబడలేదు, కాబట్టి తాము నిజంగానే ప్రభువు శరీరాన్ని తినబోతున్నామని, ఆయన రక్తాన్ని తాగబోతున్నామని ఆయన ఆహ్వానితులు (అపొస్తలులు) అనుకునే అవకాశమే లేదు, [అందుకే] తాను చెప్పిన సరళమైన ఆ మాటలను అపొస్తలులు వేరే రకంగా అర్థం చేసుకోవాలని యేసు అనుకోలేదు.’