మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
యేసు ఎప్పుడు ‘చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్లి ప్రకటించాడు’? (1 పేతు. 3:19)
యేసు తన పునరుత్థానం తర్వాత కొంతకాలానికి, ఆ దుష్ట దూతలకు తగిన శిక్ష రాబోతుందని ప్రకటించినట్లు తెలుస్తోంది.—6/15, 23వ పేజీ.
యేసు ప్రజలను గొర్రెలుగా, మేకలుగా ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? (మత్త. 25:32)
యేసు మహాశ్రమల కాలంలో, అబద్ధమతం నాశనమైన తర్వాత ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా తీర్పు తీరుస్తాడు.—7/15, 6వ పేజీ.
గోధుమలు, గురుగులు ఉపమానంలో యేసు ప్రస్తావించిన దుర్నీతిపరులు ఎప్పుడు ఏడుస్తూ తమ పండ్లు కొరుక్కుంటారు? (మత్త. 13:36, 41, 42)
వాళ్లు మహాశ్రమల కాలంలో, నాశనం నుండి తప్పించుకోలేమని గుర్తించినప్పుడు ఏడుస్తూ తమ పండ్లు కొరుక్కుంటారు.—7/15, 13వ పేజీ.
నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి సంబంధించి యేసు చెప్పిన మాటలు ఎప్పుడు నెరవేరాయి? (మత్త. 24:45-47)
ఆ మాటలు సా.శ. 33 పెంతెకొస్తు రోజున కాదుగానీ, 1914 తర్వాతే నెరవేరడం మొదలైంది. 1919లో, ఇంటివారి మీద ఆ దాసుడు నియమించబడ్డాడు. ఆధ్యాత్మిక ఆహారం తీసుకుంటున్న క్రైస్తవులందరూ ఆ ఇంటివారిలో ఉన్నారు.—7/15, 21-23 పేజీలు.
యేసు నమ్మకమైన దాసుణ్ణి తన యావదాస్తిమీద ఎప్పుడు నియమిస్తాడు?
అది భవిష్యత్తులో, అంటే మహాశ్రమల కాలంలో నమ్మకమైన దాసుడు పరలోక బహుమానాన్ని అందుకున్నప్పుడు జరుగుతుంది.—7/15, 25వ పేజీ.
సాక్సన్హౌజన్ నిర్బంధ శిబిరం నుండి చాలాదూరం నడిచిన 230 మంది సాక్షులు బ్రతికి బయటపడడానికి దేవుడిచ్చిన బలంతో పాటు ఏది సహాయం చేసింది?
తిండి లేకపోవడం వల్ల, జబ్బుపడడం వల్ల నీరసించినా, అలా నడుస్తూ ఉండాలని వాళ్లు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూనే ఉన్నారు.—8/15, 18వ పేజీ.
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించేముందు యొర్దాను నదిని దాటడానికి సంబంధించిన వృత్తాంతం మనకు ఎందుకు ప్రోత్సాహకరంగా ఉంది?
నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా, తన ప్రజలు ఆ నదిని దాటగలిగేలా యెహోవా నీటి ప్రవాహాన్ని ఆపాడు. దానివల్ల వాళ్లకు యెహోవా మీద విశ్వాసం, నమ్మకం మరింత బలపడివుంటాయి. ఆ వృత్తాంతం మనకు కూడా ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది.—9/15, 16వ పేజీ.
కాపరులు, ప్రధానులకు సంబంధించిన మీకా 5:5 ప్రవచనం నేడు ఎలా నెరవేరుతోంది?
మీకా 5:5లో బైబిలు ప్రస్తావించిన ‘ఏడుగురు గొఱ్ఱెల కాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు’ సంఘాల్లోని నియమిత పెద్దలను సూచిస్తున్నారని మనం అర్థం చేసుకున్నాం. భవిష్యత్తులో జరిగే దాడిని తట్టుకునేలా దేవుని ప్రజలకు ఈ పెద్దలు సహాయం చేస్తారు.—11/15, 20వ పేజీ.