కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చిన్నప్పుడే నేను చేసుకున్న ఎంపిక

చిన్నప్పుడే నేను చేసుకున్న ఎంపిక

నా చిన్నప్పుడు

అమెరికాలో ఉన్న, ఒహాయోలోని, కోలంబస్‌లో నేను 1985లో చదువుకునేటప్పుడు కంబోడియా నుండి కొంతమంది పిల్లలు మా స్కూలుకు వచ్చారు. అప్పుడు నా వయసు పదేళ్లే. వాళ్లలో ఒక అబ్బాయికి కొన్ని ఇంగ్లీషు మాటలే తెలుసు. అతను నాకు చిత్రాలు చూపిస్తూ, కంబోడియాలోని ప్రజలను చిత్రహింసలు పెట్టడం, చంపడం, కొంతమంది తప్పించుకోవడం గురించి ఒళ్లు గగుర్పొడిచే కథనాలను చెప్పేవాడు. ఆ పిల్లల గురించి ఆలోచించినప్పుడు నాకు రాత్రిళ్లు ఏడుపొచ్చేది. వాళ్లకు పరదైసు గురించి, పునరుత్థానం గురించి చెప్పాలనుకునే వాణ్ణి, కానీ వాళ్లకు నా భాష అర్థమయ్యేదికాదు. కంబోడియా భాష మాట్లాడే నా తోటి విద్యార్థులకు యెహోవా గురించి చెప్పడం కోసం ఆ భాష నేర్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవితాన్ని ఎలా మార్చనుందో నాకప్పుడు అర్థంకాలేదు.

కంబోడియా భాష నేర్చుకోవడం నాకు కష్టమైంది. నేర్చుకోవడం ఆపేద్దామని రెండుసార్లు అనుకున్నాను, కానీ యెహోవా మా అమ్మానాన్నల ద్వారా నన్ను ప్రోత్సహించాడు. అయితే కాలం గడుస్తుండగా టీచర్లు, తోటి విద్యార్థులు పెద్దపెద్ద చదువులు చదవమని నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. కాని నాకైతే పయినీరు అవ్వాలని ఉండేది. అందుకే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం సంపాదించుకోవడానికి వీలయ్యే హైస్కూల్‌ కోర్సులో చేరాను. స్కూల్‌ నుండి వచ్చిన తర్వాత నేను కొంతమంది పయినీర్లతో కలిసి పరిచర్య చేసేవాణ్ణి. దాంతోపాటు పిల్లలకు ఉచితంగా ఇంగ్లీషు నేర్పించేవాణ్ణి, అది ఆ తర్వాత నాకెంతో మేలు చేసింది.

నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు, అమెరికాలో ఉన్న కాలిఫోర్నియాలోని లాంగ్‌ బీచ్‌లో కంబోడియా భాషా గుంపు ఉందని తెలిసింది. నేను అక్కడికి వెళ్లి కంబోడియా భాష చదవడం నేర్చుకున్నాను. నా పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న వెంటనే పయినీరు సేవ మొదలుపెట్టి మా ఇంటి దగ్గర్లోని కంబోడియా ప్రజలకు ప్రకటించడం కొనసాగించాను. 18 ఏళ్లు వచ్చేసరికి, కంబోడియా దేశానికి వెళ్లాలనే ఆలోచన మొదలైంది. అయితే, ఆ ప్రాంతం అప్పటికీ ప్రమాదకరంగానే ఉండేది, కానీ అక్కడ నివసిస్తున్న సుమారు కోటి జనాభాలో కొంతమంది రాజ్యసువార్తను విన్నారని నాకు తెలుసు. అప్పట్లో, ఆ దేశమంతటిలో 13మంది ప్రచారకులుగల ఒకేఒక్క సంఘం ఉండేది. 19 ఏళ్లప్పుడు మొట్టమొదటిసారి కంబోడియాకు వెళ్లొచ్చాను. మరో రెండేళ్ల తర్వాత మళ్లీ కంబోడియాకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డాను. పరిచర్య చేస్తూ నన్ను నేను పోషించుకోవడానికి ఇంగ్లీషును అనువదించే, నేర్పించే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేపట్టాను. కొంతకాలానికి, నాకున్నలాంటి లక్ష్యాలే ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం కలిసి, చాలామంది కంబోడియా ప్రజలు తమ జీవితాలను దేవునికి సమర్పించుకోవడానికి సంతోషంగా సహాయం చేశాం.

యెహోవా ‘నా హృదయవాంఛలను తీర్చాడు.’ (కీర్త. 37:4) శిష్యులను చేసే పనిలో ఉండే సంతృప్తి మరే పనిలోనూ దొరకదు. నేను కంబోడియాలో ఉన్న 16 సంవత్సరాల్లో, 13 మంది సాక్షులుగల ఆ చిన్న సంఘం, 12 సంఘాలుగా, నాలుగు గుంపులుగా అభివృద్ధి చెందడం చూశాను.—జేసన్‌ బ్లాక్‌వెల్‌ చెప్పినది.