ఎవ్వరూ, ఇద్దరు యజమానులను సేవించలేరు
“ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు . . . మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.”—మత్త. 6:24.
1-3. (ఎ) ప్రస్తుతం చాలామంది ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు? వాటి పరిష్కారం కోసం కొంతమంది ఏ మార్గం ఎంచుకుంటున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) పిల్లల్ని పెంచే విషయంలో ఏ సమస్య తలెత్తుతుంది?
మేరీ ఇలా అంటోంది, “నా భర్త, జేమ్స్ ప్రతిరోజూ పనిలో బాగా అలిసిపోయి ఇంటికి వచ్చేవాడు, కానీ ఆయనకొచ్చే సంపాదన మా రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే సరిపోయేది. a అందుకే ఆయన భారాన్ని కాస్త తగ్గించాలని, మా కొడుకు జిమ్మీకి వాడి స్నేహితులకున్న మంచి వస్తువులను కొనివ్వాలని కోరుకున్నాను.” అంతేకాక, తన బంధువుల బాగోగులు చూసుకోవడంతోపాటు, భవిష్యత్తు కోసం ఏమైనా వెనకేసుకోవాలని కూడా ఆమె అనుకుంది. ఆమె స్నేహితుల్లో చాలామంది వేరే దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. దాంతో తాను కూడా విదేశాలకు వెళ్లడం మంచిదనుకుంది, కానీ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడింది. ఎందుకు?
2 ప్రాణంగా ప్రేమించే తన కుటుంబాన్ని, చక్కని ఆధ్యాత్మిక అలవాట్లను విడిచిపెట్టి వెళ్లడమనే ఆలోచనే ఆమెకు భయం కలిగించింది. అయితే, ‘వేరేవాళ్లు కూడా కొంతకాలం పాటు అలా వెళ్లినా, వాళ్ల కుటుంబాలు ఆధ్యాత్మికంగా బాగానే ఉన్నాయిగా’ అని తనకు తాను సర్దిచెప్పుకుంది. కానీ అలా దూరంగా ఉంటూ జిమ్మీని సరిగ్గా పెంచలేనేమోనని మదనపడింది. తన కొడుకును “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచే విషయంలో తన బాధ్యతను ఇంటర్నెట్ ద్వారా ఆమె సక్రమంగా నిర్వర్తించగలదా?—ఎఫె. 6:4.
3 మేరీ ఈ విషయంలో ఇతరులను సలహా అడిగింది. ఆమె అలా వెళ్లడం భర్తకు ఇష్టం లేకపోయినా, ఆమె వెళ్లాలనుకుంటే మాత్రం అభ్యంతరం చెప్పనన్నాడు. కుటుంబానికి దూరంగా వెళ్లొద్దని సంఘంలోని పెద్దలు, మరితరులు కూడా సలహా ఇచ్చారు. కానీ సంఘంలోని కొంతమంది సహోదరీలు మాత్రం, విదేశాలకు వెళ్తేనే మంచిదని ప్రోత్సహించారు. “నీ కుటుంబం మీద నిజంగా ప్రేముంటే వెళ్తావు. యెహోవా సేవకు అదేమీ అడ్డు కాదు” అని వాళ్లు సలహా ఇచ్చారు. లోలోపల భయాందోళనలు ఉన్నా, భర్తకు, కొడుకుకు వీడ్కోలు చెప్పి ఉద్యోగం కోసం వేరే దేశానికి బయలుదేరింది. “త్వరలోనే వచ్చేస్తాను” అని ఆమె మాటిచ్చింది.
కుటుంబ బాధ్యతలు, బైబిలు సూత్రాలు
4. చాలామంది ఎందుకు వలసవెళ్తారు? అలాంటివాళ్ల పిల్లలను చూసుకునే బాధ్యత ఎవరిమీద పడుతుంది?
4 తన సేవకులు కటిక పేదరికంలో జీవించాలని యెహోవా కోరుకోవడం లేదు. అయితే, పేదరికం నుండి బయటపడేందుకు ప్రజలు వలసవెళ్లడం కొత్తేమీ కాదు. (కీర్త. 37:25; సామె. 30:8) పూర్వకాలంలో యాకోబు, కరువు కోరలనుండి తప్పించుకోవడానికి తన కుమారులను ఐగుప్తుకు పంపించి ధాన్యం కొనుగోలు చేశాడు. b (ఆది. 42:1, 2) అయితే నేడు చాలామంది వలసవెళ్లేది మాత్రం ఆహారం దొరక్కకాదు. బహుశా వాళ్లు అప్పుల ఊబిలో చిక్కుకునివుండవచ్చు. కానీ కొంతమంది మాత్రం, కేవలం తమ కుటుంబ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపర్చుకోవడానికే విదేశాలకు వెళ్తున్నారు. ఆర్థికస్థితి క్షీణిస్తున్న పరిస్థితుల్లో తమ లక్ష్యాలను సాధించుకోవడానికి చాలామంది, తమ కుటుంబ సభ్యులకు దూరంగా అదే దేశంలో లేదా విదేశాల్లో ఉండి పనిచేస్తుంటారు. వాళ్లు తమ పిల్లల్ని పెంచే బాధ్యతను తరచూ భర్తకో, భార్యకో, పెద్ద వయసు పిల్లలకో, అమ్మమ్మ తాతయ్యలకో, మిగతా బంధువులకో లేదా స్నేహితులకో వదిలేస్తారు. అలా భర్తను లేదా భార్యను, పిల్లల్ని వదిలివెళ్లడం ఇష్టం లేకపోయినా, తమకు మరోదారి లేదని చాలామంది అనుకుంటారు.
5, 6. (ఎ) నిజమైన సంతోషం, భద్రత గురించి యేసు ఏమి బోధించాడు? (బి) వేటి గురించి ప్రార్థించమని యేసు తన అనుచరులకు చెప్పాడు? (సి) యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడంటే దానర్థం ఏమిటి?
5 యేసు కాలంలో కూడా చాలామంది బీదరికంలో, కష్టాల్లో ఉన్నారు. తమ దగ్గర ఇంకాస్త డబ్బుంటే మరింత సుఖంగా, సురక్షితంగా ఉంటామని వాళ్లు అనుకునివుండవచ్చు. (మార్కు 14:7) అయితే వాళ్లు డబ్బు మీద కాకుండా, శాశ్వతమైన సంపదలకు మూలమైన యెహోవామీద నమ్మకం పెట్టుకోవాలని యేసు కోరుకున్నాడు. వస్తుసంపదల వల్ల, సొంత ప్రయత్నాల వల్ల కాదుగానీ మన పరలోక తండ్రైన యెహోవాతో స్నేహం వల్లే మనకు నిజమైన సంతోషం, భద్రత వస్తాయని కొండమీద ప్రసంగంలో యేసు వివరించాడు.
6 యేసు తన మాదిరి ప్రార్థనలో, “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము” అన్నప్పుడు, ఆర్థిక భద్రత కోసం కాదుగాని, రోజువారీ అవసరాల కోసం ప్రార్థించమని నేర్పించాడు. ఆయన తన శ్రోతలకు సూటిగా ఇలా చెప్పాడు, “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు . . . పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి.” (మత్త. 6:9-11, 19, 20) యెహోవా మాట ఇచ్చినట్లే మనల్ని ఆశీర్వదిస్తాడని మనం పూర్తి నమ్మకం పెట్టుకోవచ్చు. ఆశీర్వదిస్తాడంటే యెహోవా కేవలం తన ఆమోదాన్ని తెలియజేస్తాడని కాదుగాని, మన అవసరాలు తీరేలా చూసుకుంటాడని అర్థం. అందుకే నిజమైన సంతోషం, భద్రత కోసం డబ్బుమీద కాకుండా మనల్ని శ్రద్ధగా చూసుకునే తండ్రిపై నమ్మకం పెట్టుకోవడమే ఏకైక మార్గం.—మత్తయి 6:24, 25, 31-34 చదవండి.
7. (ఎ) పిల్లల్ని పెంచే బాధ్యతను యెహోవా ఎవరికి అప్పగించాడు? (బి) పిల్లల విషయంలో తల్లిదండ్రులిద్దరూ శ్రద్ధ తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
7 ‘దేవుని నీతిని మొదట వెదికే’ వాళ్లు, కుటుంబ బాధ్యతల విషయంలో యెహోవా అభిప్రాయాన్ని అలవర్చుకుంటారు. ఉదాహరణకు, తమ పిల్లలు యెహోవాను సేవించేలా తల్లిదండ్రులు వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది. యెహోవాను సంతోషపెట్టాలనుకునే క్రైస్తవులు కూడా దాన్ని పాటించాలి. (ద్వితీయోపదేశకాండము 6:6, 7 చదవండి.) ఆ బాధ్యతను యెహోవా అప్పగించింది తల్లిదండ్రులకే కానీ, అమ్మమ్మలకో తాతయ్యలకో మరెవరికో కాదు. రాజైన సొలొమోను ఇలా చెప్పాడు, “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.” (సామె. 1:8) తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లల దగ్గరే ఉండి, వాళ్లకు బోధించాలని, నిర్దేశం ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు. (సామె. 31:10, 27, 28) పిల్లలు తల్లిదండ్రుల నుండి ఎన్నో నేర్చుకుంటారు. ముఖ్యంగా వాళ్లిద్దరూ రోజూ యెహోవా గురించి మాట్లాడుకునే విషయాలు వింటూ, వాళ్ల ప్రవర్తనను గమనిస్తూ పిల్లలు యెహోవా గురించి ఎంతో నేర్చుకుంటారు.
ఊహించని పరిణామాలు
8, 9. (ఎ) తల్లిదండ్రుల్లో ఒకరు ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే ఆ కుటుంబ సభ్యుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? (బి) అలాంటి వాళ్లు ఎలాంటి భావోద్వేగ, నైతిక ప్రమాదాలకు గురికావచ్చు?
8 వేరే దేశాలకు వలసవెళ్లే వాళ్లు, అందులోని సాధకబాధకాల గురించి ముందుగా ఆలోచిస్తారు. అయితే కుటుంబానికి దూరంగా ఉండడంవల్ల రాగల ఇబ్బందులన్నిటినీ కొంతమందే గ్రహించగలుగుతారు. (సామె. 22:3) c మేరీ విదేశానికి వెళ్లిన వెంటనే, కుటుంబానికి దూరమయ్యానన్న బాధ ఆమెలో మొదలైంది. దూరంలో ఉన్న భర్త, కొడుకు పరిస్థితి కూడా అలాగే తయారైంది. “నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయావ్?” అని జిమ్మీ ఆమెను అడుగుతుండేవాడు. వేరే దేశంలో పనిచేయాలనుకున్న నెలలు కాస్తా సంవత్సరాలుగా మారేకొద్దీ భర్తలో, కొడుకులో వస్తున్న మార్పులు చూసి ఆమెలో ఆందోళన మొదలయ్యింది. జిమ్మీ అంతకంతకూ ముభావంగా తయారౌతూ, మేరీకి దూరమయ్యాడు. “వాడికి నామీద ప్రేమ తగ్గిపోయింది” అని మేరీ గుర్తుచేసుకుని బాధపడింది.
9 తల్లిదండ్రులు, పిల్లలు కలిసి జీవించకపోతే వాళ్లు మానసికంగా, నైతికంగా దెబ్బతింటారు. d పిల్లలు చిన్నవాళ్లయితే, ఆ దూరం ఎక్కువ కాలం ఉంటే, ఆ గాయాలు ఇంకా లోతుగా ఉంటాయి. తను జిమ్మీ శ్రేయస్సు కోసమే అలాంటి త్యాగం చేశానని మేరీ ఎంత వివరించి చెప్పినా, జిమ్మీకి మాత్రం అమ్మ తనను వదిలేసిపోయిందనే భావనే ఉండేది. మొదట్లో, వాళ్లమ్మ ఇంట్లో లేనందుకు బాధపడ్డ జిమ్మీ, సెలవుల్లో మేరీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఇంట్లో ఉన్నందుకు ఇబ్బందిపడేవాడు. తల్లిదండ్రుల దగ్గర పెరగని చాలామంది పిల్లల్లాగే, జిమ్మీ కూడా తన గౌరవం, ప్రేమ పొందే హక్కును వాళ్లమ్మ పోగొట్టుకుందని అనుకున్నాడు.—సామెతలు 29:15 చదవండి.
10. (ఎ) తల్లిదండ్రులు ఇంట్లో ఉండని లోటును బహుమతుల ద్వారా తీర్చాలని చూస్తే పిల్లలు ఎలా తయారవుతారు? (బి) తల్లిదండ్రుల్లో ఒకరు దూరంగా ఉంటూ పిల్లల్ని పెంచాలని చూస్తే ఏమౌతుంది?
10 తాను ఇంట్లోలేని లోటును డబ్బు, బహుమానాలు పంపిస్తూ తీర్చాలని మేరీ చూసింది. కానీ అలా చేస్తూ తన కొడుకును ఇంకా దూరం చేసుకున్నాననీ ఆధ్యాత్మిక విషయాలు, కుటుంబ బాంధవ్యాలకన్నా వస్తువులకే ప్రాధాన్యం ఇచ్చేలా వాణ్ణి తయారుచేశాననీ మేరీకి అర్థమైంది. (సామె. 22:6) జిమ్మీ ఆమెతో, “వెనక్కి రావద్దు, అక్కడే ఉండి గిఫ్టులు పంపిస్తూవుండు” అని చెప్పేవాడు. దాంతో, దూరం నుండి ఉత్తరాలు, ఫోన్లు లేదా ఇంటర్నెట్ ద్వారా కొడుకుతో మాట్లాడుతూ వాణ్ణి పెంచలేనన్న సంగతి మేరీ గ్రహించింది. “ఇంటర్నెట్లో మీ బిడ్డను హత్తుకోలేరు, ముద్దుపెట్టి నిద్రబుచ్చలేరు” అని మేరీ అంటోంది.
11. (ఎ) ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం ఓ జంట మీద ఎలాంటి ప్రభావం చూపించింది? (బి) తిరిగి వెళ్లి తన కుటుంబంతో కలిసి ఉండాలనే నిర్ణయానికి ఓ సహోదరి ఎలా వచ్చింది?
11 మేరీకి యెహోవాతో ఉన్న స్నేహంతోపాటు, తన భర్తతో కొడుకుతో ఉన్న అనుబంధం కూడా దెబ్బతింది. వారానికి ఒక్కరోజు మాత్రమే కూటాలకు, పరిచర్యకు వెళ్లడం ఆమెకు వీలయ్యేది. కొన్నిసార్లు అది కూడా కుదిరేది కాదు. దానితోపాటు తనకు దగ్గరవ్వాలని చూసే యజమాని నుండి తనను తాను కాపాడుకోవాల్సి వచ్చేది. సమస్యలను పంచుకోవడానికి జీవిత భాగస్వామి దగ్గర లేకపోవడంతో మేరీ, జేమ్స్ మానసికంగా వేరేవాళ్లకు మరీ దగ్గరై, దాదాపు తప్పు చేసే వరకూ వెళ్లారు. తానుగానీ తన భర్తగానీ వ్యభిచారం చేయకపోయినా, తాము దూరంగా ఉండడంవల్ల భాగస్వామి భావోద్వేగ, శారీరక అవసరాలు తీర్చాలని చెబుతున్న బైబిలు నిర్దేశాన్ని పాటించలేకపోతున్నామని మేరీకి అర్థమైంది. మనసులోని ఆలోచనలు వెంటనే పంచుకోవడం, ఒకరినొకరు చూసుకోవడం, చిరునవ్వులు చిందించడం, కోమలమైన చేతి స్పర్శ ఆస్వాదించడం, ఆప్యాయంగా హత్తుకోవడం, అంతరంగిక “ప్రేమ” చూపించడం, వివాహ “ధర్మములు” తీర్చడం వంటివి వాళ్లు చేయలేకపోయేవాళ్లు. (పరమ. 1:2; 1 కొరిం. 7:3, 5) అలాగే తమ కొడుకుతో కలిసి యెహోవా ఆరాధనలో పూర్తిగా పాల్గొనలేక పోయేవాళ్లు. మేరీ ఇలా గుర్తుచేసుకుంటుంది, “మనం యెహోవా మహాదినాన్ని తప్పించుకోవాలంటే కుటుంబ ఆరాధన చాలా ప్రాముఖ్యమని నేను ఓ సమావేశంలో నేర్చుకున్నాను, దాంతో ఇంటికి తిరిగివెళ్లాలని నాకర్థమైంది. నా ఆధ్యాత్మిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని బాగుచేసుకోవాలి.”
మంచి సలహా, చెడ్డ సలహా
12. తమ కుటుంబానికి దూరంగా ఉంటున్న వాళ్లకు ఏ లేఖనాధార సలహాను ఇవ్వవచ్చు?
12 అయితే తిరిగి వెళ్లాలన్న మేరీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించలేదు. విదేశంలో ఆమె సహవసిస్తున్న సంఘంలోని పెద్దలు ఆమె విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రశంసించారు. అయితే ఆమెలాగే భర్తను, పిల్లలను, దేశాన్ని విడిచిపెట్టివచ్చి పనిచేసుకుంటున్న కొంతమంది మాత్రం ఆమెను తప్పుబట్టారు. తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆమెను ఆదర్శంగా తీసుకునే బదులు వాళ్లు ఆమెను నిరుత్సాహపర్చారు. “నువ్వు త్వరలోనే తిరిగొస్తావు చూడు, ఇంటికి వెళ్లిపోతే ఖర్చులకు డబ్బులు ఎక్కడనుండి వస్తాయి?” అని వాళ్లు అన్నారు. అయితే, తోటి క్రైస్తవులు అలా నిరుత్సాహం కలిగేలా మాట్లాడే బదులు, ‘దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలను శిశువులను ప్రేమించువారును ఇంట ఉండి’ అంటే తమ ఇంట్లో ఉండి పనిచేసుకోవాలని సలహా ఇవ్వాలి.—తీతు 2:3-5 చదవండి.
13, 14. కుటుంబ సభ్యుల ఇష్టాయిష్టాలకన్నా యెహోవా అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే విశ్వాసం ఎందుకు అవసరం? ఉదాహరణతో చెప్పండి.
13 వలస వెళ్లిన చాలామంది, ఆచారాలకూ-కుటుంబానికీ ముఖ్యంగా తల్లిదండ్రులను చూసుకునే బాధ్యతకు అమిత ప్రాధాన్యం ఇచ్చే సంస్కృతుల్లో పెరిగారు. అయితే యెహోవాను సంతోషపెట్టడం కోసం అలాంటి ప్రసిద్ధమైన ఓ ఆచారానికి, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకునే క్రైస్తవులు నిజమైన విశ్వాసం చూపిస్తున్నారు.
14 క్యాథీ అనే మహిళ అనుభవం పరిశీలించండి. ఆమె ఇలా చెబుతుంది, “మా అబ్బాయి బాబీ పుట్టినప్పుడు, నేనూ నా భర్తా విదేశాల్లో పని చేస్తున్నాం. నేను అప్పటికి కొంతకాలం నుండి బైబిలు అధ్యయనం చేస్తున్నాను. మేము ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు మా అబ్బాయిని మా సొంతూరికి పంపించి మా అమ్మానాన్నల దగ్గర ఉంచమని బంధువులందరూ సలహా ఇచ్చారు.” అయితే బాబీని తన దగ్గరే ఉంచుకుంటానని ఆమె చెప్పినప్పుడు, ఆమెకు పని చేయడం ఇష్టం లేదంటూ భర్తతోసహా, బంధువులందరూ ఎగతాళి చేశారు. ఆమె ఇలా చెబుతుంది, “నిజం చెప్పాలంటే, బాబీని కొన్నేళ్లపాటు మా అమ్మానాన్నల దగ్గర ఉంచితే తప్పేంటో అప్పట్లో నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. అయితే మా కొడుకును పెంచే బాధ్యతను వాడి తల్లిదండ్రులమైన మాకు యెహోవా అప్పగించాడని తెలుసు.” అయితే క్యాథీ మరోసారి గర్భం దాల్చినప్పుడు, గర్భస్రావం చేయించుకోమని అవిశ్వాసియైన ఆమె భర్త పట్టుబట్టాడు. కానీ గతంలో తీసుకున్న సరైన నిర్ణయంవల్ల ఆమె విశ్వాసం బలపడి ఈసారి కూడా యెహోవా కోసం స్థిరంగా నిలబడింది. ప్రస్తుతం ఆమె, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు అందరూ కలిసివున్నందుకు ఎంతో సంతోషిస్తున్నారు. క్యాథీ ఒకవేళ పిల్లల్ని సొంతూరికి పంపించి, ఇతరుల పెంపకంలో ఉంచివుంటే ఫలితాలు చాలా భిన్నంగా ఉండేవి.
15, 16. (ఎ) తల్లిదండ్రులకు దూరంగా పెరిగిన సహోదరి అనుభవం చెప్పండి. (బి) తన కూతుర్ని పెంచే విషయంలో వాళ్లమ్మ బాటలో నడవకూడదని ఆమె ఎందుకు నిర్ణయించుకుంది?
15 రూబీ అనే సహోదరి ఇలా వివరిస్తుంది, “కొన్నేళ్లపాటు నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను, మా చెల్లి మాత్రం అమ్మానాన్నల దగ్గరే ఉండేది. తిరిగి అమ్మానాన్నల దగ్గరికి వెళ్లినప్పుడు, వాళ్లతో అంతకు ముందులా ఉండలేకపోయాను. మా చెల్లెలైతే ఏమాత్రం ఇబ్బంది పడకుండా వాళ్లతో మాట్లాడేది, హత్తుకునేది, చాలా చనువుగా ఉండేది. నాకు మాత్రం వాళ్లు కాస్త పరాయివాళ్లలా అనిపించేవాళ్లు, పెద్దయ్యాక కూడా వాళ్ల పట్ల నాకున్న భావాలను వ్యక్తం చేయడం కష్టమైంది. వాళ్లకు వయసుపైబడినప్పుడు శ్రద్ధగా చూసుకుంటామని నేనూ చెల్లెలూ భరోసా ఇచ్చాం. అయితే మా చెల్లెలు వాళ్ల మీదున్న ప్రేమతో చూసుకుంటుందేమోగానీ నేను మాత్రం దాన్ని ఓ బాధ్యతలానే చూస్తానేమో.”
16 “మా అమ్మ నన్ను వాళ్లమ్మ దగ్గరికి పంపించినట్లే, ఇప్పుడు నా కూతుర్ని కూడా తన దగ్గరకు పంపించమంటోంది. అయితే నేను మాత్రం సున్నితంగా తిరస్కరించాను. మా బిడ్డను యెహోవా మార్గాల్లో పెంచాలని నేనూ నా భర్తా కోరుకున్నాం. భవిష్యత్తులో నా బిడ్డ నన్ను పరాయిదానిలా చూడడం నాకిష్టం లేదు” అంటూ ఆమె ముగించింది. ఆర్థిక లక్ష్యాలకు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు కాకుండా, యెహోవాకూ ఆయన సూత్రాలకూ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నిజమైన ఆనందం పొందుతామని రూబీ అనుభవంతో తెలుసుకుంది. “ఎవడును ఇద్దరు యజమానులకు” అంటే దేవునికీ సంపదకూ “దాసుడుగా నుండనేరడు” అని యేసు సూటిగా చెప్పాడు.—మత్త. 6:24; నిర్గ. 23:2.
యెహోవా మన ప్రయత్నాలను ‘సఫలం’ చేస్తాడు
17, 18. (ఎ) క్రైస్తవులకు ఏ పరిస్థితి ఎన్నడూ రాదు? (బి) తర్వాతి ఆర్టికల్లో ఏ ప్రశ్నల గురించి పరిశీలిస్తాం?
17 మన జీవితాల్లో యెహోవా రాజ్యానికీ నీతికీ మొదటి స్థానం ఇస్తే, మనకు నిజంగా అవసరమైనవి సమకూరేలా సహాయం చేయడానికి మన తండ్రి కట్టుబడివున్నాడు. (మత్త. 6:33) అందుకే, నిజ క్రైస్తవులకు మరోదారి ఉండని పరిస్థితి ఎన్నడూ రాదు. మనం ఎలాంటి కష్టాల్లో చిక్కుకున్నా, బైబిలు సూత్రాలతో రాజీ పడకుండా “తప్పించుకొను మార్గము” దయచేస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (1 కొరింథీయులు 10:13 చదవండి.) మనం యెహోవా కోసం “కనిపెట్టుకొని” ఉండడంతోపాటు, ఆయనిచ్చే జ్ఞానం కోసం, నిర్దేశం కోసం ప్రార్థిస్తూ ఆయన ఆజ్ఞలను, సూత్రాలను పాటిస్తూ “ఆయనను నమ్ముకొని” ఉంటే, ఆయన మన “కార్యము నెరవేర్చును.” (కీర్త. 37:5, 7) ఆయనను మాత్రమే నిజమైన యజమానిగా సేవించడానికి మనం మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నాలను యెహోవా తప్పకుండా దీవిస్తాడు. మనం ఆయనకు ప్రథమస్థానం ఇస్తే, ఆయన మన జీవితాల్ని ‘సఫలం’ చేస్తాడు.—ఆదికాండము 39:3 పోల్చండి.
18 అయితే, కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల కలిగిన గాయాలను ఎలా మాన్పవచ్చు? మన కుటుంబం నుండి దూరంగా వెళ్లకుండానే వాళ్ల అవసరాలు తీర్చడానికి ఏమి చేయవచ్చు? ఈ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా మనం ఇతరులను ప్రేమగా ఎలా ప్రోత్సహించవచ్చు? తర్వాతి ఆర్టికల్లో వీటి గురించి చూద్దాం.
a అసలు పేర్లు కావు.
b యాకోబు కుమారులు ఐగుప్తుకు ఎప్పుడు వెళ్లినా, బహుశా మూడు వారాలకు మించి తమ కుటుంబాలకు దూరంగా లేరు. తర్వాత యాకోబు, ఆయన కుమారులు ఐగుప్తులో స్థిరపడడానికి వెళ్లినప్పుడు వాళ్లు తమ భార్యలను, పిల్లలను కూడా తీసుకెళ్లారు.—ఆది. 46:6, 7.
c ఫిబ్రవరి 2013, తేజరిల్లు! (ఇంగ్లీషు) సంచికలోని, “వలసవెళ్లడం—కలలు, వాస్తవాలు” ఆర్టికల్ చూడండి.
d వివాహ భాగస్వామికి, పిల్లలకు దూరంగా ఉంటూ విదేశాల్లో పనిచేయడం వల్ల అలాంటివాళ్లు తీవ్రమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశముందని చాలా దేశాల నుండి వచ్చిన నివేదికలు చూపిస్తున్నాయి. భార్యాభర్తల్లో ఒకరు లేదా ఇద్దరూ నమ్మకద్రోహానికి పాల్పడడం, స్వలింగ సంయోగం, రక్త సంబంధికులతో తప్పు చేయడం, పిల్లల్లోనైతే అనూహ్య ప్రవర్తన, చదువులో వెనకబడడం, ఉద్రేకం, ఆందోళన, కృంగుదల, ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవడం ఆ సమస్యల్లో కొన్ని.