‘మంచి ధైర్యంతో ఉండండి’—యెహోవాయే మీకు సహాయం చేస్తాడు!
‘ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడనని మంచి ధైర్యముతో చెప్పండి.’—హెబ్రీ. 13:6.
1, 2. విదేశాలనుండి ఇంటికి వచ్చేసిన చాలామందికి ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి? (ప్రారంభ చిత్రం చూడండి.)
ఎరిక్ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “నేను వేరే దేశంలో మంచి ఉద్యోగం చేస్తూ చాలా డబ్బు సంపాదించేవాణ్ణి. a అయితే యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పుడు, నా కుటుంబాన్ని భౌతికంగానే కాకుండా, ఆధ్యాత్మికంగా కూడా చూసుకోవాల్సిన ప్రాముఖ్యమైన బాధ్యత ఉందని అర్థమైంది. దాంతో తిరిగి ఇంటికొచ్చేశాను.”—ఎఫె. 6:4.
2 అలా తాను మళ్లీ కుటుంబంతో కలిసినందుకు యెహోవా సంతోషించాడని ఎరిక్కు తెలుసు. అయితే ముందటి ఆర్టికల్లో చూసిన మేరీలాగే, దెబ్బతిన్న కుటుంబ బంధాలను క్రమేణా బాగుచేసుకోవడం ఎరిక్ ముందున్న సవాలు. దానితోపాటు అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో భార్యాపిల్లలను పోషించడం కూడా ఆయనకు సవాలుగా అనిపించింది. మరి, కుటుంబ పోషణ కోసం ఆయన ఏమి చేశాడు? సంఘంలోని వాళ్లు ఈ విషయంలో ఏమైనా సహాయసహకారాలు అందించారా?
ఆధ్యాత్మికతను, కుటుంబాన్ని బాగుచేసుకోవడం
3. తల్లిదండ్రుల్లో ఒకరు ఇంటికి దూరంగా ఉంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది?
3 “పిల్లలకు నా నిర్దేశం, ప్రేమాప్యాయతలు ఎంతో అవసరమైన సమయంలో నేను వాళ్లను పట్టించుకోలేదని నాకర్థమైంది. నేను వాళ్లకు బైబిలు కథలు చదివి వినిపించలేదు, వాళ్లతో కలిసి ప్రార్థించలేదు, వాళ్లను దగ్గరకు తీసుకుని లాలించలేదు, వాళ్లతో సరదాగా గడపలేదు” అని ఎరిక్ ఒప్పుకుంటున్నాడు. (ద్వితీ. 6:7) ఆయన పెద్ద కూతురు స్టెల్లా ఇలా గుర్తుచేసుకుంటోంది, “మా నాన్న మాతోపాటు ఇంట్లో ఉండకపోవడం వల్ల, ఆయనకసలు నామీద ప్రేమే లేదని అనిపించేది. ఆయన తిరిగొచ్చినప్పుడు, ఆయన ముఖంతో, స్వరంతో మాత్రమే మాకు పరిచయం ఉండేది. ఆయన నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడు కూడా ఏదో కొత్తగా అనిపించింది.”
4. ఇంటికి దూరంగా ఉండడం వల్ల, ఓ భర్త శిరస్సత్వాన్ని నిర్వర్తించే సామర్థ్యానికి ఏమౌతుంది?
4 ఇంటికి దూరంగా ఉన్న తండ్రులు, కుటుంబ శిరస్సుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే సామర్థ్యాన్ని కూడా కొంతవరకు కోల్పోతారు. ఎరిక్ భార్య రోజీ ఏమంటుందంటే, “అమ్మా నాన్నా, ఈ రెండు పాత్రలూ నేనే పోషించాల్సి వచ్చేది, కుటుంబానికి సంబంధించిన చాలా నిర్ణయాలు సొంతగా తీసుకోవడం అలవాటైపోయింది. క్రైస్తవ విధేయత చూపించడమంటే నిజంగా ఏమిటో నా భర్త తిరిగొచ్చినప్పుడు, నేను నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా, నా భర్త ఇంట్లోనే ఉన్నాడని అప్పుడప్పుడూ నాకు నేను గుర్తుచేసుకోవాల్సి వస్తుంది.” (ఎఫె. 5:22, 23) ఎరిక్ ఇంకా ఇలా అంటున్నాడు, “నా కూతుళ్లు ఏమి చేయాలన్నా వాళ్ల అమ్మను అడగడానికే అలవాటుపడ్డారు. తల్లిదండ్రులుగా మేమిద్దరం ఒక్కతాటిపై ఉన్నట్లు పిల్లలకు చూపించడం అవసరమని అర్థం చేసుకున్నాం, అంతేకాక శిరస్సత్వాన్ని క్రైస్తవ పద్ధతిలో ఎలా నిర్వహించాలో కూడా నేను నేర్చుకోవాల్సి వచ్చింది.”
5. కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడానికి ఓ తండ్రి ఏమి చేశాడు? అందువల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?
5 కుటుంబానికి తనకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి, వాళ్లను ఆధ్యాత్మికంగా బలపర్చడానికి చేయగలిగినదంతా చేయాలని ఎరిక్ నిశ్చయించుకున్నాడు. “మాటల ద్వారా, క్రియల ద్వారా నా పిల్లల్లో సత్యాన్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాను, అంటే కేవలం యెహోవాను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదుగానీ, దాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాను” అని ఎరిక్ అన్నాడు. (1 యోహా. 3:18) మరి విశ్వాసంతో ఎరిక్ చేసిన కృషిని యెహోవా ఆశీర్వదించాడా? స్టెల్లా ఇలా చెబుతోంది, “ఒక మంచి తండ్రిగా ఉండేందుకు, మళ్లీ మాకు దగ్గరయ్యేందుకు నాన్న పడిన కష్టం చక్కని ఫలితాన్నిచ్చింది. సంఘ బాధ్యతలకు అవసరమైన అర్హతలు సంపాదించుకోవడానికి ఆయన కృషి చేయడం చూసి మాకెంతో గర్వంగా అనిపించింది. యెహోవా నుండి మమ్మల్ని దూరం చేయడానికి లోకం ఎంతో ప్రయత్నించింది. అయితే మా అమ్మానాన్నలు సత్యం మీద మనసు నిలపడం చూసి, మేము కూడా వాళ్లలా ఉండడానికి కృషి చేశాం. మమ్మల్ని మళ్లీ ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్లనని నాన్న మాటిచ్చాడు, దాన్ని నిలబెట్టుకున్నాడు కూడా. ఒకవేళ నాన్న మళ్లీ వెళ్లిపోయి ఉంటే, నేనీ రోజున యెహోవా సంస్థలో ఉండేదాన్ని కాను.”
బాధ్యతను స్వీకరించండి
6. యుద్ధ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు ఏ పాఠం నేర్చుకున్నారు?
6 బాల్కన్ దేశాల్లో యుద్ధం జరుగుతున్న రోజుల్లో, ఘోరమైన పరిస్థితులున్నా అక్కడి యెహోవాసాక్షుల పిల్లలు సంతోషంగా ఉన్నట్లు కొన్ని అనుభవాలు చెబుతున్నాయి. కారణం? ఆ సమయంలో, తల్లిదండ్రులు పనికోసం బయటకు వెళ్లలేకపోయారు. దాంతో ఇంట్లోనే ఉండి పిల్లలతో అధ్యయనం చేసేవాళ్లు, వాళ్లతో ఆడేవాళ్లు, సరదాగా మాట్లాడేవాళ్లు. దీనినుండి ఆ తల్లిదండ్రులు ఏ పాఠం నేర్చుకున్నారు? డబ్బుకన్నా, బహుమతులకన్నా పిల్లలకు అవసరమైంది తల్లిదండ్రులు వాళ్లతోపాటు ఉండడమే. అవును, దేవుని వాక్యం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తమ పిల్లల మీద శ్రద్ధ చూపిస్తూ, శిక్షణ ఇచ్చినప్పుడే పిల్లలు ప్రయోజనం పొందుతారు.—సామె. 22:6.
7, 8. (ఎ) తిరిగొచ్చిన కొంతమంది తల్లిదండ్రులు ఏ తప్పు చేస్తారు? (బి) తమకు పిల్లలకు మధ్యవున్న దూరాన్ని తగ్గించుకోవడానికి తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?
7 అయితే విచారకరంగా, విదేశాల నుండి తిరిగొచ్చిన కొంతమంది తల్లిదండ్రులు, తమ పిల్లలు కోపంగా ఉండడం, ప్రేమగా ఉండకపోవడం చూసి, “మీ కోసం నేను ఇన్ని త్యాగాలు చేసినా మీకస్సలు కృతజ్ఞతే లేదు” అని నిందిస్తారు. అయితే పిల్లలు అలా ఉండడానికి, తల్లిదండ్రుల్లో ఒకరు చాలాకాలం పాటు ఇంట్లో ఉండకపోవడమే కారణం కావచ్చు. బీటలువారిన ఆ బంధాన్ని బాగుచేసుకోవడానికి తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?
8 కుటుంబ సభ్యులను మరింతగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు, సమస్యకు మీరు కూడా బాధ్యులేనని ఒప్పుకోండి. క్షమించమని మనస్ఫూర్తిగా అడగడం వల్ల ఫలితం ఉంటుంది. విషయాలను చక్కదిద్దడానికి మీరు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారని మీ భార్యా పిల్లలూ గమనించినప్పుడు, ఈ విషయంలో మీ నిజాయితీని వాళ్లు అర్థంచేసుకుంటారు. పట్టుదలతో, సహనంతో కృషి చేస్తే మీరు నెమ్మదిగా మీ కుటుంబ సభ్యుల ప్రేమను, గౌరవాన్ని మళ్లీ సంపాదించుకోవచ్చు.
‘స్వకీయులను సంరక్షించడం’
9. ‘స్వకీయులను సంరక్షించేందుకు’ అదేపనిగా వస్తుసంపదల వెంటపడాల్సిన అవసరం ఎందుకు లేదు?
9 వయసుపైబడిన క్రైస్తవులు తమ అవసరాలను తీర్చుకోలేని స్థితిలో ఉంటే, వాళ్ల పిల్లలు, మనవళ్లు “తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము” చేయాలని అపొస్తలుడైన పౌలు నిర్దేశించాడు. అయితే క్రైస్తవులందరూ ఆహారం, వస్త్రాలు, వసతి వంటి కనీస అవసరాలతో తృప్తి పడాలని కూడా తర్వాత ఆయన చెప్పాడు. మరింత సౌకర్యంగా జీవించడానికి లేదా భవిష్యత్తు కోసం వెనకేసుకోవడానికి మనం అదేపనిగా కృషి చేయకూడదు. (1 తిమోతి 5:4, 8; 6:6-10 చదవండి.) ‘స్వకీయులను సంరక్షించేందుకు’ క్రైస్తవులు, త్వరలోనే నాశనం కానున్న ఈ లోకంలోని వస్తుసంపదల వెంటపడాల్సిన అవసరం లేదు. (1 యోహా. 2:15-17) ‘ఐహిక విచారాల్లో, ధనమోసంలో’ పడి, దేవుని నీతియుక్త నూతన లోకంలో మన కుటుంబం పొందబోయే ‘వాస్తవమైన జీవంపై’ పట్టు కోల్పోకుండా చూసుకోవాలి.—మార్కు 4:18, 19; లూకా 21:34-36; 1 తిమో. 6:18, 19.
10. అప్పుల విషయంలో మనం దైవిక జ్ఞానాన్ని ఎలా చూపించవచ్చు?
10 మనకు కొంత డబ్బు అవసరమని యెహోవాకు తెలుసు. అయితే దైవిక జ్ఞానం మనల్ని సంరక్షించి, కాపాడినంతగా డబ్బు సంరక్షించలేదు, కాపాడలేదు. (ప్రసం. 7:12; లూకా 12:15) సాధారణంగా, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే చాలామంది అలా వెళ్లడానికి అయ్యే ఖర్చును తక్కువ అంచనా వేస్తారు. పైగా, విదేశాలకు వెళ్లినంత మాత్రాన బాగా డబ్బు సంపాదించవచ్చనే గ్యారంటీ ఏమీ లేదు. నిజానికి, అలా వెళ్లడం వల్ల పెద్ద కష్టాలు కొనితెచ్చుకుంటారు. విదేశాలకు వెళ్లే చాలామంది మరిన్ని అప్పుల్లో కూరుకుపోయి వెనక్కి వస్తుంటారు. అలాంటి వాళ్లు మరింత స్వేచ్ఛగా దేవుణ్ణి సేవించే మాట అటుంచితే, అప్పిచ్చిన వాళ్లను సేవించే దుస్థితి తెచ్చుకుంటారు. (సామెతలు 22:7 చదవండి.) కాబట్టి, అసలు అప్పు చేయకుండా ఉండడమే ఉత్తమం.
11. ఖర్చులను తగ్గించుకోవడానికి వాటిగురించి లెక్కలు వేసుకోవడం ఎలా సహాయకరంగా ఉంటుంది?
11 కుటుంబంతోపాటు ఉండాలనే తన నిర్ణయం సత్ఫలితాలు ఇవ్వాలంటే, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎరిక్కు తెలుసు. అందుకే, తమ కుటుంబానికి నిజంగా అవసరమైనవాటికి ఎంత ఖర్చు అవుతుందో భార్యతో కలిసి ఎరిక్ లెక్కలు వేశాడు. అయితే గతంతో పోలిస్తే తమ ఖర్చును చాలా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇంట్లోని అందరూ సహకరించడంతో, అంతగా అవసరంలేని వాటి కోసం ఖర్చుపెట్టడం మానుకున్నారు. b తాము చేసుకున్న మార్పుల్లో ఒకదాని గురించి వివరిస్తూ ఎరిక్ ఇలా అన్నాడు, “మా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో నుండి మంచి ప్రభుత్వ పాఠశాలలకు మార్చాం.” తమ కుటుంబ ఆధ్యాత్మిక దినచర్యకు భంగం కలిగించని ఉద్యోగం ఎరిక్కు దొరకాలని కుటుంబమంతా ఎంతో ప్రార్థించారు. మరి వాళ్ల ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?
12, 13. తన కుటుంబాన్ని పోషించడానికి ఒక తండ్రి ఏయే చర్యలు చేపట్టాడు? నిరాడంబరమైన జీవితం గడపాలనే ఆయన నిర్ణయాన్ని యెహోవా ఎలా ఆశీర్వదించాడు?
12 ఎరిక్ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “మొదటి రెండు సంవత్సరాలు చాలా కష్టంగా నెట్టుకొచ్చాం, ఓపక్క నేను దాచుకున్న డబ్బులు అడుగంటుతుంటే, చాలీచాలని జీతం ఏమూలకూ సరిపోయేది కాదు. పైగా పనిలో బాగా అలిసిపోయేవాణ్ణి. కానీ మేము అన్ని కూటాలకు, పరిచర్యకు కలిసి వెళ్లగలిగేవాళ్లం.” తనను కొన్ని నెలలు లేదా సంవత్సరంపాటు కుటుంబానికి దూరం చేయగల ఉద్యోగాల్లో చేరకూడదని ఎరిక్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. “బదులుగా నేను రకరకాల పనులు నేర్చుకున్నాను, దానివల్ల ఒక పని దొరకడం కష్టమైతే మరో పని చేసేవాణ్ణి” అని ఎరిక్ చెబుతున్నాడు.
13 అయితే ఎరిక్ అప్పులను నెమ్మదిగా తీర్చాల్సిరావడంతో, తీసుకున్న అప్పుకు ఎక్కువ వడ్డీ కట్టాల్సి వచ్చింది. అయితే తన కుటుంబంతో కలిసి యెహోవా సేవ చేయగలిగే అవకాశంతో పోలిస్తే, అది పెద్ద భారంగా అనిపించలేదు. “వేరే దేశంలో ఉన్నప్పటితో పోలిస్తే, నేను ఇప్పుడు పదో వంతు కూడా సంపాదించడం లేదు. కానీ మేము ఎవరమూ పస్తులు ఉండడం లేదు. ‘యెహోవా హస్తము కురుచకాలేదు.’ అంతేకాదు, మేము పయినీరు సేవ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత ఆర్థిక ఒత్తిడులు తగ్గి, మా అవసరాలు తీర్చుకోవడం తేలికైంది” అని ఆయన అన్నాడు.—యెష. 59:1.
కుటుంబ ఒత్తిడిని జయించడం
14, 15. ఆధ్యాత్మిక విషయాల కన్నా వస్తుపరమైనవాటికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఒత్తిడిని కుటుంబాలు ఎలా అధిగమించవచ్చు? ఈ విషయంలో వాళ్లు ఆదర్శంగా ఉంటే ఎలాంటి ఫలితం వస్తుంది?
14 బంధువులకు, స్నేహితులకు డబ్బు లేదా బహుమతులు ఇవ్వడాన్ని ఓ బాధ్యతగా చాలా ప్రాంతాల ప్రజలు భావిస్తారు. “అలా ఇవ్వడం మా సంస్కృతిలో ఓ భాగం, అందులో మాకు సంతోషం ఉంటుంది. అయితే ప్రతీ దానికి హద్దు ఉంటుంది. నా కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలకు, కార్యకలాపాలకు ఆటంకం కలిగించకుండా ఎంత ఇవ్వగలుగుతానో అంత ఇస్తానని నొప్పించకుండా మా బంధువులకు వివరించాను” అని ఎరిక్ చెబుతున్నాడు.
15 విదేశాల నుండి తిరిగొచ్చినవాళ్లూ, కుటుంబం కోసం విదేశాల్లో ఉద్యోగాన్ని కాదనుకున్నవాళ్లూ, తమమీద ఆధారపడే బంధువుల కోపాన్ని, సూటిపోటి మాటల్ని, నిరుత్సాహాన్ని తరచూ ఎదుర్కొంటారు. వాళ్లకు ఏమాత్రం ప్రేమ లేదంటూ కొంతమంది బంధువులు నిందిస్తారు. (సామె. 19:6, 7) “అయితే వస్తుపరమైన వాటికోసం మేము ఆధ్యాత్మిక విషయాల్ని త్యాగం చేయడానికి ఏమాత్రం ఇష్టపడక పోవడం చూసి, మాకు క్రైస్తవ జీవితం నిజంగా ఎంత ప్రాముఖ్యమో మా బంధువుల్లో కొంతమంది అర్థంచేసుకున్నారు. అలాకాకుండా మేము వాళ్ల కోరికలకు తలొగ్గివుంటే వాళ్లు ఎప్పటికైనా దాన్ని అర్థంచేసుకునేవాళ్లా?” అని ఎరిక్ కూతురు స్టెల్లా అంటోంది.—1 పేతురు 3:1, 2 పోల్చండి.
దేవునిపై విశ్వాసం ఉంచండి
16. (ఎ) ఓ వ్యక్తి ఎలా ‘తప్పుడు ఆలోచనలతో తనను తాను మోసపర్చుకునే’ అవకాశం ఉంది? (యాకో. 1:22) (బి) యెహోవా ఎటువంటి నిర్ణయాలను ఆశీర్వదిస్తాడు?
16 తన భర్తను, పిల్లలను విడిచిపెట్టి పనికోసం ఓ ధనిక దేశానికి తరలివెళ్లిన ఒక సహోదరి అక్కడి సంఘ పెద్దలతో ఇలా చెప్పింది, “నేను ఇక్కడికి రావడం కోసం మేము పెద్దపెద్ద త్యాగాలు చేశాం. మా ఆయనైతే సంఘపెద్ద బాధ్యతను కూడా వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి యెహోవా ఈ నిర్ణయాన్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను.” తన మీదున్న విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలను యెహోవా ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. అయితే తన చిత్తానికి విరుద్ధంగా ఉన్న ఓ నిర్ణయాన్ని, ముఖ్యంగా పరిశుద్ధమైన సేవావకాశాలను అనవసరంగా వదులుకునేలా చేసే నిర్ణయాన్ని ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు?—హెబ్రీయులు 11:6; 1 యోహాను 5:13-15 చదవండి.
17. నిర్ణయాలు తీసుకునే ముందే యెహోవా నిర్దేశం కోసం ఎందుకు వెదకాలి? ఆ పని మనం ఎలా చేయవచ్చు?
17 ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి, మాటివ్వడానికి ముందే యెహోవా నిర్దేశం కోసం వెదకండి. పరిశుద్ధాత్మ కోసం, జ్ఞానం కోసం, నడిపింపు కోసం ప్రార్థించండి. (2 తిమో. 1:7) ‘నేను యెహోవాను సేవించగలిగేలా త్యాగాలు చేయడానికి ఇష్టపడతానా? అంతగా సౌకర్యవంతమైన జీవితం లేకపోయినా, కుటుంబంతో కలిసి ఉండాలని యెహోవా చెబుతోన్న మాటను పాటిస్తానా?’ అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. (లూకా 14:33) సహాయం కోసం పెద్దలను సంప్రదించండి, వాళ్లిచ్చే లేఖనాధార సలహాను పాటించండి. మీరలా చేసినప్పుడు, మీకు సహాయం చేస్తానన్న యెహోవా వాగ్దానంపై విశ్వాసం, నమ్మకం ఉన్నాయని చూపిస్తారు. పెద్దలు మీ తరఫున నిర్ణయాలు తీసుకోరు, అయితే ముందుముందు మీకు సంతోషాన్నిచ్చే తెలివైన నిర్ణయాలు తీసుకునేందుకు మీకు సహాయం చేయగలరు.—2 కొరిం. 1:24.
18. కుటుంబాన్ని పోషించే బాధ్యత ఎవరిది? అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఇతరులు సహాయం చేయవచ్చు?
18 కుటుంబ సభ్యుల అనుదిన “బరువు” మోసే బాధ్యతను యెహోవా కుటుంబ శిరస్సుకు అప్పగించాడు. ఎంత ఒత్తిడివున్నా భార్యాపిల్లలను విడిచి దూరంగా వెళ్లకుండానే ఆ బాధ్యత నిర్వర్తిస్తున్న వాళ్లను మనం తప్పకుండా మెచ్చుకోవాలి. విపత్తులు, అనారోగ్యం వంటి అనుకోని పరిస్థితుల్లో ఆ తోటి క్రైస్తవులు చిక్కుకున్నప్పుడు నిజమైన క్రైస్తవ ప్రేమ, సానుభూతి చూపించే అవకాశం మనకుంటుంది. (గల. 6:2, 5; 1 పేతు. 3:8) అత్యవసరంలో ఉన్న అలాంటివాళ్లకు మీరు ధనసహాయం చేయగలరా? లేదా తోటి క్రైస్తవుడు దగ్గర్లోనే ఏదైనా ఉద్యోగం వెదుక్కోవడానికి సహాయం చేయగలరా? మీరలా చేస్తే, పని కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లాలనే ఒత్తిడిని తగ్గించిన వాళ్లవుతారు.—సామె. 3:27, 28; 1 యోహా. 3:17.
యెహోవాయే మీకు సహాయం చేస్తాడని గుర్తుంచుకోండి!
19, 20. యెహోవా తమకు సహాయం చేస్తాడని క్రైస్తవులు తప్పకుండా ఎందుకు నమ్మవచ్చు?
19 “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.—నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి—ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము” అని లేఖనాలు మనకు భరోసా ఇస్తున్నాయి. (హెబ్రీ. 13:5, 6) మన జీవితంలో దాన్ని ఎలా పాటించవచ్చు?
20 అభివృద్ధి చెందుతున్న ఓ దేశంలో ఎప్పటినుండో సంఘ పెద్దగా సేవ చేస్తున్న ఓ సహోదరుడు ఇలా చెబుతున్నాడు, “యెహోవాసాక్షులు ఎంతో సంతోషంగా ఉంటారని ప్రజలు తరచూ అంటుంటారు. చివరికి సాక్షుల్లో పేదవాళ్లు కూడా చక్కగా బట్టలు వేసుకోవడం, ఇతరుల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నట్లు కనిపించడం వాళ్లు గమనిస్తుంటారు.” ఆ మాటలు, రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చేవాళ్ల విషయంలో యేసు చేసిన వాగ్దానాన్ని గుర్తుచేస్తాయి. (మత్త. 6:28-30, 33) అవును, మీ పరలోక తండ్రి యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకూ మీ పిల్లలకూ అత్యుత్తమ జీవితం ఉండాలనే ఆయన కోరుకుంటున్నాడు. “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దిన. 16:9) యెహోవా మన ప్రయోజనం కోసమే ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు, కుటుంబ జీవితానికి, వస్తుపరమైన అవసరాలకు సంబంధించి ఇచ్చిన ఆజ్ఞలు కూడా అలాంటివే. మనం వాటిని పాటించినప్పుడు ఆయన మీద మనకు ప్రేమ, నమ్మకం ఉన్నాయని చూపిస్తాం. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహా. 5:3.
21, 22. యెహోవాపై నమ్మకం ఉంచాలని మీరు ఎందుకు నిశ్చయించుకున్నారు?
21 “నేను దూరంగా ఉన్నప్పుడు నా భార్యాపిల్లలతో గడపలేకపోయిన ఆ సమయాన్ని వెనక్కి తేలేనని తెలుసు. అయితే దాన్నే తలుచుకుంటూ నేను కుమిలిపోవడం లేదు. నాతోపాటు ఉద్యోగం చేసినవాళ్లలో చాలామంది బాగా డబ్బు సంపాదించారు, కానీ వాళ్లు సంతోషంగా లేరు. వాళ్ల కుటుంబాల్లో పెద్దపెద్ద సమస్యలు ఉన్నాయి. అయితే నా కుటుంబం చాలా సంతోషంగా ఉంది! ఈ దేశంలోని సహోదరుల్లో చాలామంది, చివరికి పేదవాళ్లు కూడా తమ జీవితాల్లో ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇవ్వడం నన్నెంతో కదిలించింది. యేసు మాటల్లోని వాస్తవాన్ని మేమంతా రుచి చూసి తెలుసుకున్నాం” అని ఎరిక్ అంటున్నాడు.—మత్తయి 6:33 చదవండి.
22 ధైర్యంగా ఉండండి! యెహోవాకు లోబడండి, ఆయనపై నమ్మకం ఉంచండి. దేవునిపై, మీ వివాహ భాగస్వామిపై, మీ పిల్లలపై మీకున్న ప్రేమ మీ కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించే మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేలా కదిలించాలి. అలా చేస్తున్నప్పుడు, ‘యెహోవా మీకు సహాయం చేస్తాడని’ మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.