మీ దగ్గర సత్యం ఉందని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?
‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి.’—రోమా. 12:2.
1. యుద్ధాలు జరిగినప్పుడు క్రైస్తవమత గురువులు ఏమి చేశారు?
నిజ క్రైస్తవులు యుద్ధాలు చేసి వేరే దేశానికి చెందినవాళ్లను చంపితే దేవుడు ఇష్టపడతాడా? అయితే, క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది గత 100 ఏళ్లలో ఎక్కువగా చేసింది అదే. క్యాథలిక్ మత గురువులు తమ సైన్యాలను, ఆయుధాలను ఆశీర్వదించి శత్రు దేశాలకు చెందిన క్యాథలిక్ సైనికుల మీదకు ఉసిగొల్పారు. ప్రొటెస్టెంట్ మత గురువులు కూడా అలాగే చేశారు. దానివల్ల జరిగిన మారణహోమానికి రెండవ ప్రపంచ యుద్ధమే సాక్ష్యం.
2, 3. రెండవ ప్రపంచ యుద్ధంలో, ఆ తర్వాత జరిగిన పోరాటాల్లో యెహోవాసాక్షులు పాల్గొన్నారా? ఎందుకు?
2 అయితే ఆ యుద్ధం జరిగిన సమయంలో యెహోవాసాక్షులు ఏమి చేశారు? వాళ్లు తటస్థంగా ఉన్నారని చరిత్ర చూపిస్తుంది. వాళ్లు అలా ఉండడానికి కారణం ఏమిటి? యేసు ఉంచిన ఆదర్శం, ఆయన బోధలే అందుకు ప్రధాన కారణం. ఆయనిలా అన్నాడు, “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహా. 13:35) అంతేకాక, పౌలు కొరింథీయులకు రాసిన మాటల్లో ఉన్న సూత్రాలను వాళ్లు గుర్తుపెట్టుకుని, ఆ పరిస్థితుల్లో వాటిని పాటించారు.—2 కొరింథీయులు 10:3, 4 చదవండి.
3 అందుకే బైబిలు సహాయంతో తమ మనస్సాక్షికి శిక్షణ ఇచ్చిన నిజక్రైస్తవులు యుద్ధ శిక్షణ తీసుకోరు, యుద్ధాలు చేయరు. తమ నిర్ణయానికి కట్టుబడివుండడం వల్ల వేలాదిమంది సాక్షులు ఎన్నో హింసలు పొందారు. వాళ్లలో పిల్లలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు ఉన్నారు. చాలామందిని శిబిరాల్లో, జైళ్లలో పెట్టి బలవంతంగా చాకిరీ చేయించారు. జర్మనీలో నాజీ పరిపాలనలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఐరోపా దేశాల్లో క్రూరమైన హింసలు వచ్చినప్పటికీ, యెహోవా రాజ్య సువార్తను ప్రకటించే తమ పనిని సాక్షులు ఏనాడూ మర్చిపోలేదు. వాళ్లు జైళ్లలో, నిర్బంధ శిబిరాల్లో, చివరికి తమను వేరే ప్రాంతాలకు తరలించినప్పుడు కూడా నమ్మకంగా సువార్త ప్రకటించారు. a ఆ తర్వాత, 1994లో రువాండాలో జరిగిన జాతినిర్మూలనా పోరాటాలకు యెహోవాసాక్షులు దూరంగా ఉన్నారు. ఒకప్పటి యుగోస్లొవియా ముక్కలైనప్పుడు, బాల్కన్ దేశాల్లో జరిగిన పోరాటాల్లో కూడా సాక్షులు తటస్థంగా ఉన్నారు.
4. యెహోవాసాక్షులు తటస్థంగా ఉండడం ఇతరులమీద ఎలాంటి ప్రభావం చూపించింది?
4 యెహోవాసాక్షులు యుద్ధాలప్పుడు తటస్థంగా ఉండడం ప్రపంచవ్యాప్తంగా చాలామంది గమనించారు. సాక్షులకు దేవుని మీదా పొరుగువాళ్ల మీదా నిజమైన ప్రేమ ఉందని, వాళ్లు నిజ క్రైస్తవులని అది ఇతరుల్ని ఒప్పించింది. అయితే, సాక్షుల ఆరాధనకు సంబంధించిన ఇతర అంశాలు కూడా వాళ్లు నిజ క్రైస్తవులని ప్రజలను ఒప్పించాయి.
కనీవినీ ఎరుగని గొప్ప విద్యాపని
5. క్రీస్తు తొలి అనుచరులు ఏ మార్పును చూశారు?
5 దేవుని రాజ్య సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో, యేసు పరిచర్య ఆరంభం నుండే నొక్కి చెబుతూ వచ్చాడు. ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకుని, ప్రపంచవ్యాప్త పని కోసం పునాది వేశాడు; తర్వాత 70 మందికి శిక్షణనిచ్చాడు. (లూకా 6:13; 10:1) ముందుగా యూదులకు సువార్త ప్రకటించేందుకు వాళ్లకు శిక్షణనిచ్చాడు. ఆ తర్వాత, సున్నతి పొందని అన్యులకు కూడా సువార్త ప్రకటించమని చెప్పాడు. ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తున్న ఆ యూదా క్రైస్తవులకు అది నిజంగా పెద్ద మార్పు.—అపొ. 1:8.
6. యెహోవాకు పక్షపాతం లేదని పేతురు ఎలా అర్థంచేసుకున్నాడు?
6 దేవుడు పేతురును సున్నతి పొందని అన్యుడైన కొర్నేలి ఇంటికి పంపాడు. దేవునికి పక్షపాతం లేదని పేతురుకు అప్పుడు అర్థమైంది. కొర్నేలి, అతని కుటుంబ సభ్యులు బాప్తిస్మం పొందారు. అలా క్రైస్తవత్వం విస్తారమైన కొత్త ప్రాంతానికి కూడా వ్యాపించడం మొదలైంది. సువార్త విని, దాన్ని అంగీకరించే అవకాశం అన్ని దేశాల ప్రజలకు దొరికింది. (అపొ. 10:9-48) అలా భూమంతా సువార్త ప్రకటించాల్సిన క్షేత్రం అయ్యింది.
7, 8. యెహోవా సంస్థ ఏ విషయంలో చొరవ తీసుకుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)
7 మన కాలంలో, యెహోవా సంస్థలో నాయకత్వం వహిస్తున్న సహోదరులు, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించే, బోధించే పనికి ఎంతో ఉత్సాహంగా మద్దతిస్తూ, సంస్థీకరిస్తున్నారు. నేడు దాదాపు 80 లక్షలమంది ఉత్సాహవంతులైన సాక్షులు, క్రీస్తు సందేశాన్ని 600 కన్నా ఎక్కువ భాషల్లో ప్రకటించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆ భాషల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది! యెహోవాసాక్షులు ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు టేబుల్‌పై లేదా కార్ట్‌పై ప్రచురణలు పెట్టి వీధుల్లో ప్రకటిస్తున్నప్పుడు వాళ్లను ఇట్టే గుర్తుపట్టవచ్చు.
8 బైబిల్ని, బైబిలు ఆధారిత సాహిత్యాన్ని అనువదించడం కోసం వాళ్లలో 2,900 కన్నా ఎక్కువమంది అనువాదకులు ప్రత్యేక శిక్షణ పొందారు. అయితే సాక్షులు పెద్దపెద్ద భాషల్లోనే కాదు, లక్షలమంది మాట్లాడే వందలాది చిన్నచిన్న భాషల్లో కూడా సాహిత్యాన్ని అనువదిస్తున్నారు. ఉదాహరణకు, స్పెయిన్ దేశంలోని యెహోవాసాక్షులు ఇప్పుడు కాటలన్ భాషలో బైబిలు ప్రచురణలను అనువదిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలాల్లో అండోర్రా దేశంలో, ఆలీకాంటే, వలెన్సియ నగరాల్లో, బాలీయారిక్ ఐలాండ్స్‌లో చాలామంది ప్రజలు ఆ భాషను మళ్లీ ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాటలన్ భాష మాట్లాడే ప్రజలు లక్షల్లో ఉన్నారు. యెహోవాసాక్షుల అనువాద పనివల్ల, కాటలన్ భాష మాట్లాడే ప్రజలకు తమ మాతృభాషలో సాహిత్యం అందుబాటులో ఉంది, కూటాలు కూడా ఆ భాషలోనే జరుగుతున్నాయి. అవి వాళ్ల మనసును హత్తుకుంటున్నాయి.
9, 10. దేవుని సంస్థకు ప్రజలందరి ఆధ్యాత్మిక అవసరాల పట్ల శ్రద్ధ ఉందని ఎలా చెప్పవచ్చు?
9 ప్రజల మాతృభాషలో బైబిలు సాహిత్యాన్ని అనువదించడం, వాళ్లకు బోధించడం వంటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మెక్సికోలో ప్రజలు ఎక్కువగా స్పానిష్ భాష మాట్లాడతారు, అయితే అక్కడ చాలామంది ప్రజలు స్థానిక భాషలు కూడా మాట్లాడతారు. అలాంటి భాషల్లో “మాయా” భాష ఒకటి. మెక్సికో బ్రాంచి, మాయా భాష అనువాద బృందాన్ని ఆ భాష మాట్లాడే ప్రజలున్న ప్రాంతానికి పంపించింది, ఎందుకంటే వాళ్లక్కడ రోజూ ఆ భాషను మాట్లాడగలుగుతారు, వినగలుగుతారు. నేపాలీ భాష మరో ఉదాహరణ. సుమారు 3 కోట్ల జనాభాగల నేపాల్‌లో దాదాపు 120 భాషలు ఉన్నప్పటికీ, కోటి కన్నా ఎక్కువమంది నేపాలీ మాట్లాడతారు. ఇంకా చాలామంది దాన్ని రెండవ భాషగా ఉపయోగిస్తున్నారు. నేపాలీ భాషలో కూడా మన బైబిలు సాహిత్యం అందుబాటులో ఉంది.
10 ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అనువాద బృందాలకు యెహోవా సంస్థ ఇస్తున్న మద్దతు చూస్తుంటే, భూవ్యాప్తంగా సువార్త ప్రకటించే పనిని ఆ సంస్థ ఎంత ప్రాముఖ్యంగా ఎంచుతుందో అర్థమౌతుంది. సాక్షులు భూవ్యాప్తంగా కోట్లకొద్దీ కరపత్రాలను, బ్రోషుర్లను, పత్రికలను డబ్బులు వసూలు చేయకుండా ప్రజలకు ఇస్తున్నారు. అందుకయ్యే ఖర్చుల కోసం యెహోవా సాక్షులు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారు. “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అని యేసు చెప్పిన మాటను వాళ్లు పాటిస్తారు.—మత్త. 10:8.
11, 12. యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ప్రకటనా పని ఇతరులపై ఎలాంటి మంచి ప్రభావం చూపించింది?
11 తమ దగ్గర సత్యం ఉందని యెహోవాసాక్షులు ఎంత గట్టిగా నమ్ముతున్నారంటే, వాళ్లు అన్ని దేశాల, సంస్కృతుల ప్రజలకు ప్రకటించడానికి ఎన్నో త్యాగాలు చేశారు. ఈ ప్రాముఖ్యమైన పనిలో పాల్గొనేందుకు వాళ్లలో చాలామంది తమ జీవితాల్ని నిరాడంబరం చేసుకున్నారు, వేరే భాషను నేర్చుకున్నారు, వేరే సంస్కృతికి కూడా అలవాటు పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రకటనా బోధనా పనివల్ల కూడా యెహోవాసాక్షులు క్రీస్తు నిజమైన అనుచరులని చాలామంది ఒప్పుకుంటున్నారు.
12 తాము సత్యాన్ని కనుగొన్నామని యెహోవాసాక్షులు నమ్ముతున్నారు కాబట్టే ఇదంతా చేస్తున్నారు. అయితే, తమ దగ్గర సత్యం ఉందని ప్రత్యేకంగా ఏ విషయాలు కొంతమంది సహోదరసహోదరీలను ఒప్పించాయి?—రోమీయులు 14:17, 18 చదవండి.
కొంతమందిని ఏది ఒప్పించింది?
13. సాక్షులు తమ సంస్థను ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు?
13 తమ దగ్గర సత్యం ఉందని కొంతమంది సహోదరసహోదరీలు నమ్మడానికి గల కారణాలను పరిశీలించి మనం ప్రయోజనం పొందవచ్చు. ఎంతోకాలంగా సేవ చేస్తున్న ఒక సహోదరుడు తన మనసులోని మాటను ఇలా చెప్పాడు, “యెహోవా సంస్థను నైతికంగా పరిశుభ్రంగా, మచ్చ లేకుండా ఉంచడానికి సాక్షులు అన్నివిధాలుగా ప్రయత్నిస్తారు, అందుకోసం ఎవరికైనా సలహా లేదా క్రమశిక్షణ ఇస్తారు.” సంస్థను అలా నైతికంగా ఉన్నతంగా ఉంచడం ఎలా సాధ్యమైంది? దేవుని వాక్యంలో ఉన్న ప్రమాణాలను, యేసూ ఆయన శిష్యులూ ఉంచిన ఆదర్శాన్ని పాటించడం ద్వారానే. కేవలం కొంతమంది సాక్షులు మాత్రమే దేవుని ప్రమాణాలను పాటించలేదు, వాళ్లను సంఘం నుండి బహిష్కరించాల్సి వచ్చింది. అయితే, ఎక్కువమంది యెహోవాసాక్షులు మాత్రం దేవుని దృష్టిలో నీతిగా జీవిస్తున్నారు. ఒకప్పుడు దేవునికి ఇష్టంలేని విధంగా జీవించినవాళ్లు కూడా ప్రవర్తనను మార్చుకుని, ప్రస్తుతం దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నారు.—1 కొరింథీయులు 6:9-11 చదవండి.
14. బహిష్కరించబడిన చాలామంది ఏమి చేశారు? దాని ఫలితం ఏమిటి?
14 దేవునికి విధేయత చూపించడానికి ఇష్టపడని వాళ్లను సంఘంనుండి బహిష్కరించమని బైబిలు క్రైస్తవులను నిర్దేశిస్తుంది. అయితే సంతోషకరంగా, అలాంటి వేలాదిమంది తమ తప్పుడు ప్రవర్తన విషయంలో పశ్చాత్తాపపడి, మళ్లీ సంఘంలోకి వచ్చారు. (2 కొరింథీయులు 2:6-8 చదవండి.) ఉన్నతమైన బైబిలు ప్రమాణాలను పాటించడంవల్ల సంఘాలు పరిశుభ్రంగా ఉన్నాయి. అందువల్ల ఈ సంస్థకు దేవుని ఆమోదం ఉందనే నమ్మకం కలుగుతుంది. చాలా చర్చీలు తమ సభ్యులు ఏమి చేసినా పట్టించుకోవు, అయితే యెహోవాసాక్షులు మాత్రం దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తారు. యెహోవాసాక్షుల దగ్గర సత్యం ఉందని చాలామంది ఒప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణం.
15. తన దగ్గర సత్యం ఉందని ఓ సహోదరుణ్ణి ఏది ఒప్పించింది?
15 తాము సత్యం కనుగొన్నామని అనుభవజ్ఞులైన కొందరు సాక్షులు ఎందుకు నమ్ముతున్నారు? 54 ఏళ్ల ఓ సహోదరుడు ఏమి చెబుతున్నాడో వినండి, “నా విశ్వాసం మూడు ప్రాముఖ్యమైన స్తంభాలపై ఆధారపడివుందని నా చిన్నప్పటి నుండి నమ్ముతున్నాను. అవి: (1) దేవుడు ఉన్నాడు; (2) బైబిల్ని ఆయనే రాయించాడు; (3) నేడు యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్న నేను, ఎప్పటికప్పుడు ఆ స్తంభాలను పరీక్షిస్తూ, అవి గట్టిగా నిలబడివున్నాయో లేవో నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను. వాటికి సంబంధించిన రుజువులు ప్రతీ సంవత్సరం పెరుగుతూ, నా విశ్వాసాన్ని దృఢపరుస్తూ, మన దగ్గర నిజంగానే సత్యం ఉందనే నా నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.”
16. సత్యం విషయంలో ఒక సహోదరికి ఏది బాగా నచ్చింది?
16 న్యూయార్క్‌లోని ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవ చేస్తున్న ఓ పెళ్లయిన సహోదరి, యెహోవా సంస్థ గురించి ఇలా వ్యాఖ్యానించింది, ‘యెహోవా పేరు గురించి పట్టుదలగా ప్రకటిస్తున్న సంస్థ ఇదొక్కటే. దేవుని పేరు బైబిల్లో సుమారు 7,000 సార్లు ఉంది కాబట్టి, అలా చేయడం ఎంత సముచితమో! “తనయెడల యథార్థహృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” అని 2 దినవృత్తాంతములు 16:9 ఇస్తున్న ప్రోత్సాహమంటే నాకు చాలా ఇష్టం. నాకు యథార్థ హృదయం ఉన్నప్పుడే యెహోవా నన్ను ఎక్కువగా బలపరుస్తాడని తెలుసు, అలాంటి హృదయాన్ని ఎలా కలిగివుండాలో సత్యం నాకు నేర్పించింది. యెహోవాతో ఉన్న సంబంధం నాకు చాలా అమూల్యమైనది. అలాగే దేవుణ్ణి సన్నిహితంగా తెలుసుకునేలా సహాయం చేసిన యేసుక్రీస్తుకు ఎంతో కృతజ్ఞురాల్ని, ఆ జ్ఞానమే నన్ను సంరక్షిస్తుంది.’
17. ఒకప్పుడు దేవుణ్ణి నమ్మనివ్యక్తి ఏమని ఒప్పుకున్నాడు? ఎందుకు?
17 సత్యం తెలుసుకోకముందు దేవుణ్ణి నమ్మని ఓ సహోదరుడు ఇలా ఒప్పుకుంటున్నాడు, “మనుషులు సంతోషంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడనీ, అందుకే కష్టాలను ఎప్పటికీ ఉండనివ్వడనీ సృష్టిని చూస్తే నాకు అర్థమైంది. ఒకవైపు లోకంలో దైవభక్తి అంతకంతకూ తగ్గుతుంటే, యెహోవా ప్రజల్లో మాత్రం విశ్వాసం, ఉత్సాహం, ప్రేమ పెరుగుతున్నాయి. ఇలాంటి ఆధునిక అద్భుతం కేవలం యెహోవా ఆత్మవల్లే సాధ్యం.”—1 పేతురు 4:1-4 చదవండి.
18. ఇద్దరు సహోదరులు చెప్పిన విషయాల గురించి మీరెలా భావిస్తున్నారు?
18 చాలాకాలంగా సత్యంలో ఉన్న మరో సహోదరుడు, తన దగ్గర సత్యం ఉందని ఎందుకు నమ్ముతున్నాడో ఇలా చెబుతున్నాడు, “నేను సంవత్సరాలుగా చేస్తున్న అధ్యయనం వల్ల, యెహోవాసాక్షులు మొదటి శతాబ్దపు క్రైస్తవత్వాన్ని ఆచరించడానికి తీవ్రమైన కృషి చేశారనే నమ్మకం కుదిరింది. అలాగే వేర్వేరు దేశాలకు ప్రయాణించినప్పుడు, యెహోవాసాక్షుల భూవ్యాప్త ఐక్యతను కళ్లారా చూశాను. బైబిల్లోని సత్యం నాకు సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది.” యెహోవాసాక్షులు యేసును నిజంగా నమ్ముతారని 60 ఏళ్లు దాటిన మరో సహోదరుడు చెప్పాడు. ఆయనిలా వివరిస్తున్నాడు, “మనం యేసు జీవితం గురించీ పరిచర్య గురించీ శ్రద్ధగా అధ్యయనం చేసి, ఆయన మాదిరిని అర్థం చేసుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి మరింత దగ్గరవ్వడానికి జీవితంలో మార్పులు చేసుకున్నాం. క్రీస్తు విమోచన క్రయధనం మన రక్షణకు ఆధారమని గుర్తించాం. ఆయన పునరుత్థానం అయ్యాడని మనకు తెలుసు. ఆయనను ప్రత్యక్షంగా చూసిన నమ్మకస్థుల సాక్ష్యం కూడా మన దగ్గర ఉంది.”—1 కొరింథీయులు 15:3-8 చదవండి.
సత్యాన్ని ఇతరులకు చెప్పండి
19, 20. (ఎ) ఏ బాధ్యత గురించి పౌలు రోమాలోని క్రైస్తవులకు నొక్కిచెప్పాడు? (బి) సమర్పిత క్రైస్తవులముగా మనకు ఏ గొప్ప అవకాశం ఉంది?
19 క్రైస్తవులమైన మనం పొరుగువాళ్లను ప్రేమిస్తాం కాబట్టి సత్యం గురించిన అమూల్యమైన జ్ఞానాన్ని మన దగ్గరే ఉంచుకోలేము. రోమాలోని సహోదరులకు పౌలు ఇలా చెప్పాడు, “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.”—రోమా. 10:9, 10.
20 యెహోవాకు సమర్పిత సాక్షులముగా మన దగ్గర సత్యం ఉందని, దేవుని రాజ్య పాలన గురించిన సువార్తను ఇతరులకు చెప్పే గొప్ప అవకాశం మనకుందని నమ్ముతున్నాం. కాబట్టి ఇతరులకు బైబిలు గురించి బోధించడంతో పాటు, మీ దగ్గర సత్యం ఉందని నమ్ముతున్నారని మీ జీవన విధానం ద్వారా చూపించండి.
a యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఇంగ్లీషు) పుస్తకంలోని 191-198, 448-454 పేజీలు చూడండి.