పాఠకుల ప్రశ్నలు
ప్రతీ సంఘంలో పెద్దల్ని, పరిచర్య సేవకుల్ని ఎలా నియమిస్తారు?
సా.శ. మొదటి శతాబ్దంలో ఎఫెసు సంఘంలో సేవ చేస్తున్న పెద్దలకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీమట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” (అపొ. 20:28) నేడు పెద్దల్ని, పరిచర్య సేవకుల్ని నియమించడంలో పరిశుద్ధాత్మ పాత్ర ఏమిటి?
మొదటిగా, పెద్దలకూ పరిచర్య సేవకులకూ ఉండాల్సిన అర్హతల గురించి రాసేలా పరిశుద్ధాత్మ బైబిలు రచయితల్ని ప్రేరేపించింది. 1 తిమోతి 3:1-7 వచనాల్లో, పెద్దలకు ఉండాల్సిన 16 వివిధ అర్హతలు ఉన్నాయి. వాళ్లకు ఉండాల్సిన మరికొన్ని అర్హతలు తీతు 1:5-9, యాకోబు 3:17, 18 వచనాల్లో ఉన్నాయి. 1 తిమోతి 3:8-10, 12, 13 వచనాల్లో పరిచర్య సేవకులకు ఉండాల్సిన అర్హతలను బైబిలు పేర్కొంటోంది. రెండవదిగా, వాళ్లను సిఫారసు చేసే, నియమించే సహోదరులు యెహోవా ఆత్మ కోసం ప్రార్థించి, వాళ్లు లేఖనాధార అర్హతలను తగిన స్థాయిలో చేరుకున్నారో లేదో సమీక్షించడానికి సహాయం చేయమని వేడుకుంటారు. మూడవదిగా, నియామకం పొందబోయే సహోదరులు దేవుని పరిశుద్ధాత్మ ఫలాన్ని తమ జీవితాల్లో చూపించాలి. (గల. 5:22-24) కాబట్టి సహోదరుల్ని నియమించే ప్రక్రియలో మొదటినుండి చివరిదాకా దేవుని ఆత్మ పనిచేస్తుంది.
అయితే ఆ సహోదరుల్ని నిజానికి ఎవరు నియమిస్తారు? గతంలో, పెద్దల-పరిచర్య సేవకుల నియామకాలకు సంబంధించిన సిఫారసులను స్థానిక బ్రాంచి కార్యాలయానికి పంపించేవాళ్లు. అక్కడ, పరిపాలక సభ నియమించిన సహోదరులు ఆ సిఫారసులను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకునేవాళ్లు. తర్వాత బ్రాంచి కార్యాలయం ఆ విషయం గురించి పెద్దలసభకు తెలియజేసేది. అప్పుడు, సంఘపెద్దలు కొత్తగా నియామకం పొందిన సహోదరులకు ఆ విషయాన్ని చెప్పి, దాన్ని స్వీకరించడానికి వాళ్లకు ఇష్టం ఉందో లేదో, దానికి వాళ్లు నిజంగా అర్హులని అనుకుంటున్నారో లేదో అడిగేవాళ్లు. చివరిగా, ఆ నియామకం గురించి సంఘంలో ఒక ప్రకటన చేసేవాళ్లు.
అయితే, అలాంటి నియామకాలు మొదటి శతాబ్దంలో ఎలా జరిగేవి? కొన్ని సందర్భాల్లో అపొస్తలులు కొన్ని ప్రత్యేక నియామకాలు చేశారు. విధవరాళ్లకు ప్రతీరోజు ఆహారం అందించే పనిని చూసుకోవడానికి ఏడుగురు సహోదరులను నియమించడం వాటిలో ఒకటి. (అపొ. 6:1-6) అయితే, ఈ అదనపు నియామకాన్ని పొందడానికి ముందే వాళ్లు బహుశా పెద్దలుగా సేవ చేస్తుండవచ్చు.
అప్పట్లో ప్రతీ నియామకం ఎలా జరిగేదో లేఖనాలు వివరంగా చెప్పకపోయినా, ఆ పని ఎలా జరిగేదో అర్థం చేసుకోవడానికి బైబిల్లోని కొన్ని ఉదాహరణలు సహాయం చేస్తాయి. పౌలు, బర్నబా తమ మొదటి మిషనరీ యాత్ర అపొ. 14:23) కొన్ని సంవత్సరాల తర్వాత, తనతోపాటు ప్రయాణించిన తీతుకు పౌలు పత్రిక రాస్తూ ఇలా చెప్పాడు, “నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.” (తీతు 1:5) అలాగే పౌలుతో ఎక్కువగా ప్రయాణించిన తిమోతికి కూడా పౌలు అలాంటి అధికారాన్నే ఇచ్చాడని తెలుస్తుంది. (1 తిమో. 5:22) కాబట్టి, అప్పట్లో అలాంటి నియామకాలను చేసింది ప్రయాణ పర్యవేక్షకులేగానీ, అపొస్తలులో యెరూషలేములోని పెద్దలో కాదు.
నుండి తిరిగొస్తున్నప్పుడు “ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.” (అందుకే బైబిల్లో ఉన్న ఆ పద్ధతిని బట్టి యెహోవాసాక్షుల పరిపాలక సభ, పెద్దల్నీ పరిచర్య సేవకుల్నీ నియమించే పద్ధతిని సవరించింది. 2014, సెప్టెంబరు 1 నుండి అలాంటి నియామకాలన్నీ ఈ విధంగా జరుగుతాయి: ప్రతీ ప్రాంతీయ పర్యవేక్షకుడు తన సర్క్యూట్‌లోని సిఫారసులను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఆయన సంఘాలను సందర్శించేటప్పుడు వీలైతే ఆ సహోదరులతో పరిచర్య చేసి, వాళ్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ సిఫారసుల గురించి స్థానిక పెద్దల సభలతో చర్చించిన తర్వాత, తన సర్క్యూట్‌లోని సంఘాల్లో పెద్దలనూ పరిచర్య సేవకులనూ నియమించే బాధ్యత ప్రాంతీయ పర్యవేక్షకునిదే. అలా, ఈ ఏర్పాటు మొదటి శతాబ్దంలోని పద్ధతికి మరింత దగ్గరగా ఉంటుంది.
ఈ ప్రక్రియలో వివిధ పాత్రలను ఎవరు నిర్వర్తిస్తారు? ఎప్పటిలానే ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ ఇంటివాళ్లను పోషించే ప్రాముఖ్యమైన బాధ్యత ఉంది. (మత్త. 24:45-47) దానికోసం ఆ దాసుడు పరిశుద్ధాత్మ సహాయంతో లేఖనాలను పరిశీలించి, ప్రపంచవ్యాప్త సంఘ సంస్థీకరణ మీద ప్రభావం చూపించే బైబిలు సూత్రాలను ఎలా పాటించాలో తగిన నిర్దేశం ఇస్తాడు. అంతేకాదు, ఆ దాసుడు ప్రాంతీయ పర్యవేక్షకుల, బ్రాంచి కమిటీ సభ్యుల నియామకాలను కూడా చూసుకుంటాడు. ఆ నిర్దేశాన్ని పాటించడానికి కావాల్సిన సహాయాన్ని బ్రాంచి కార్యాలయాలు సంఘాలకు అందిస్తాయి. సంఘంలోని సహోదరులను నియామకాల కోసం సిఫారసు చేసేటప్పుడు వాళ్ల లేఖన అర్హతలను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన బరువైన బాధ్యత పెద్దల సభకు ఉంది. పెద్దలు చేసిన సిఫారసులను జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా పరిశీలించి, అర్హులైన సహోదరులను నియమించాల్సిన గంభీరమైన బాధ్యత ప్రతీ ప్రాంతీయ పర్యవేక్షకునికి ఉంది.
నియామకాలు ఎలా జరుగుతాయో అర్థంచేసుకున్నప్పుడు ఈ ప్రక్రియలో పరిశుద్ధాత్మ పాత్ర ఏంటో పూర్తిగా గ్రహించగలుగుతాం. అప్పుడు, క్రైస్తవ సంఘంలో నియామకం పొందిన సహోదరుల మీద మనకు మరింత నమ్మకం, గౌరవం ఉంటాయి.—హెబ్రీ. 13:7, 17.
ప్రకటన 11వ అధ్యాయం ప్రస్తావించిన ఇద్దరు సాక్షులు ఎవరు?
ఇద్దరు సాక్షులు 1,260 రోజులపాటు ప్రవచిస్తారని ప్రకటన 11:3 చెబుతుంది. అప్పుడు క్రూరమృగము ‘వారితో యుద్ధం చేసి చంపేస్తుందని’ ఆ వృత్తాంతం తెలియజేస్తుంది. అయితే, చూసేవాళ్లకు ఎంతో ఆశ్చర్యం కలిగేలా, ‘మూడున్నర దినముల’ తర్వాత ఆ ఇద్దరు సాక్షులు మళ్లీ బ్రతుకుతారు.—ప్రక. 11:7, 11.
ఆ ఇద్దరు సాక్షులు ఎవరు? ఆ వృత్తాంతంలోని వివరాలను బట్టి ఆ ఇద్దరు సాక్షులు ఎవరో గుర్తుపట్టవచ్చు. మొదటిగా, వాళ్లు “భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు” అని బైబిలు మనకు చెబుతుంది. (ప్రక. 11:4) ఆ మాటల్ని చూస్తే జెకర్యా ప్రవచనంలోని దీపస్తంభం, రెండు ఒలీవచెట్లు మనకు గుర్తొస్తాయి. ఆ ఒలీవచెట్లు ‘సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడిన’ ఇద్దరు అభిషిక్తులను అంటే అధిపతియైన జెరుబ్బాబెలును, ప్రధాన యాజకుడైన యెహోషువను సూచిస్తున్నాయి. (జెక. 4:1-3, 14, అధస్సూచి.) రెండవదిగా, ఒకప్పుడు మోషే, ఏలీయాలు చేసినలాంటి సూచకక్రియలే వాళ్లిద్దరూ చేస్తున్నారని ఆ వృత్తాంతం చెబుతుంది.—ప్రకటన 11:5, 6 వచనాల్ని సంఖ్యాకాండము 16:1-7, 28-35; 1 రాజులు 17:1; 18:41-45 వచనాలతో పోల్చండి.
ఆ రెండు వృత్తాంతాల మధ్య ఎలాంటి పోలిక ఉంది? ప్రతీ వృత్తాంతం, తీవ్రమైన పరీక్షల సమయంలో నాయకత్వం వహించిన దేవుని అభిషిక్తుల గురించి మాట్లాడుతుంది. కాబట్టి, 1914 లో దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడినప్పుడు, నాయకత్వం వహించిన అభిషిక్త సహోదరులు “గోనెపట్ట” ధరించి మూడున్నర సంవత్సరాలపాటు ప్రకటించినప్పుడు ప్రకటన 11వ అధ్యాయంలోని మాటలు నెరవేరాయి.
ఆ ప్రకటనా పని ముగిశాక వాళ్లను కొద్ది కాలంపాటు అంటే సూచనార్థకమైన మూడున్నర రోజుల పాటు జైల్లో ఉంచారు. అలా ఆ అభిషిక్తులు సూచనార్థకంగా చనిపోయారు. దేవుని శత్రువుల దృష్టిలో, వాళ్లు చేస్తున్న పని ఆగిపోయింది. దాంతో ఆ శత్రువులు సంతోషించారు.—ప్రక. 11:8-10.
అయితే ఆ ప్రవచనంలో ఉన్నట్లుగా, మూడున్నర రోజుల తర్వాత ఆ ఇద్దరు సాక్షులు మళ్లీ బ్రతికారు. ఆ అభిషిక్తులు జైలు నుండి విడుదలవ్వడంతోపాటు, వాళ్లలో నమ్మకంగా ఉన్నవాళ్లు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన నియామకం పొందారు. అంత్యదినాల్లో దేవుని ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి 1919లో యేసు నియమించిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిలో’ ఆ అభిషిక్తులు ఉన్నారు.—మత్త. 24:45-47; ప్రక. 11:11, 12.
ఆసక్తికరంగా, ప్రకటన 11:1, 2 వచనాలు ఆ సంఘటనలను ఆధ్యాత్మిక ఆలయాన్ని కొలిచే సమయంతో ముడిపెడుతున్నాయి. మలాకీ 3వ అధ్యాయం కూడా ఆధ్యాత్మిక ఆలయ తనిఖీ గురించి, ఆ తర్వాత జరిగే శుద్ధీకరణ సమయం గురించి మాట్లాడుతుంది. (మలా. 3:1-4) ఈ తనిఖీ, అలాగే శుద్ధీకరణ ఎంత కాలం కొనసాగింది? అది 1914 నుండి 1919 తొలి భాగం వరకు కొనసాగింది. ఆ కాలనిడివిలో ప్రకటన 11వ అధ్యాయం ప్రస్తావించిన 1,260 రోజులు (42 నెలలు), అలాగే సూచనార్థకమైన మూడున్నర రోజులు ఉన్నాయి.
యెహోవా ఆ ఆధ్యాత్మిక శుద్ధీకరణను ఏర్పాటు చేసి, సత్క్రియలు చేసేలా ఓ ప్రత్యేకమైన ప్రజల్ని శుద్ధీకరించినందుకు మనమెంత సంతోషిస్తున్నామో! (తీతు 2:14) దానితోపాటు ఆ పరీక్షల సమయంలో నాయకత్వం వహించి, సూచనార్థకమైన ఇద్దరు సాక్షులుగా సేవచేసిన నమ్మకమైన అభిషిక్తులు ఉంచిన ఆదర్శాన్ని విలువైనదిగా ఎంచుతాం. a
a మరింత సమాచారం కోసం, కావలికోట జూలై 15, 2013, 22వ పేజీ, 12వ పేరా చూడండి.