మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
శవదహనం చేయడం క్రైస్తవులకు సరైనదేనా?
శవదహనం చేయాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం. దీని గురించి బైబిలు సూటిగా ఏమీ చెప్పకపోయినా రాజైన సౌలు, అతని కుమారుడైన యోనాతానుల శవాలను కాల్చి, ఆ తర్వాత పాతిపెట్టారనేది గమనించాల్సిన విషయం. (1 సమూ. 31:2, 8-13)—6/15, 7వ పేజీ.
పొగతాగే అలవాటు ఎంత ప్రమాదకరమైనది?
గత వందేళ్లలో 10 కోట్లమందిని అది పొట్టనబెట్టుకుంది. దానివల్ల ప్రతీ సంవత్సరం దాదాపు 60 లక్షలమంది చనిపోతున్నారు.—7/1, 3వ పేజీ.
అశ్లీల చిత్రాలు చూడాలనే శోధనను మనం ఎలా ఎదిరించవచ్చు?
(1) అశ్లీల చిత్రం కంటపడితే వెంటనే పక్కకు చూడండి. (2) మంచి విషయాల గురించి ఆలోచిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ మీ ఆలోచనలను కాపాడుకోండి. (3) అశ్లీల చిత్రాలు ఉన్న సినిమాలకు, వెబ్సైట్లకు దూరంగా ఉంటూ మీ అడుగులను కాపాడుకోండి.—7/1, 9-11 పేజీలు.
వేరే దేశాలకు వెళ్లి, అవసరం ఎక్కువ ఉన్న చోట సేవచేసేవాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి?
మూడు సవాళ్లు ఎదురౌతాయి, అవి: (1) జీవన విధానం, (2) ఇంటిమీద బెంగ, (3) స్నేహితులను చేసుకోవడం. ఈ సవాళ్లను అధిగమించిన చాలామంది ఎన్నో దీవెనలు పొందారు.—7/15, 4-5 పేజీలు.
కొత్త కరపత్రాలు ఎందుకు అంత సమర్థవంతంగా, ఉపయోగించడానికి సులువుగా ఉన్నాయి?
అన్ని కరపత్రాలు ఒకేలా ఉన్నాయి. మనం ఒక బైబిలు వచనాన్ని చదివి, ఇంటి వ్యక్తిని ఓ ప్రశ్న అడిగేందుకు వీలుగా కరపత్రాల్ని తయారుచేశారు. ఆయన ఏ జవాబిచ్చినా, కరపత్రాన్ని తెరచి బైబిలు ఏమి చెబుతుందో చూపించవచ్చు. కరపత్రం వెనక ఉన్న ఓ ప్రశ్నను చూపించి, మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకోవచ్చు.—8/15, 13-14 పేజీలు.
క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా సంరక్షించవచ్చు?
పిల్లలు చెప్పేది వింటూ, వాళ్ల గురించి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. వాళ్లను ఆధ్యాత్మికంగా పోషించడానికి కృషిచేయండి. ముఖ్యంగా, వాళ్లకు సత్యం విషయంలో సందేహాలు ఉంటే, ప్రేమగా మార్గనిర్దేశం ఇవ్వండి.—9/15, 18-21 పేజీలు.
క్రీస్తుతోపాటు ఇతరులు కూడా పరిపాలించేలా బైబిల్లోని ఏ నిబంధన వీలు కల్పించింది?
అపొస్తలులతో చివరి పస్కాను ఆచరించిన తర్వాత, యేసు తన నమ్మకమైన శిష్యులతో ఒక నిబంధన చేశాడు. అదే రాజ్య నిబంధన. (లూకా 22:28-30) వాళ్లు యేసుతోపాటు పరలోకంలో పరిపాలిస్తారని ఆ నిబంధన హామీ ఇచ్చింది. —10/15, 16-17 పేజీలు.
అపొస్తలుల కార్యములు 15:14 లో, “తన నామముకొరకు ఒక జనము” గురించి యాకోబు ప్రస్తావించాడు. ఆ జనం ఎవరు?
దేవుడు తన ‘గుణాతిశయములను ప్రచురము చేయడానికి’ ఏర్పరచుకున్న వాళ్లే ఆ “జనము.” అందులో, విశ్వాసులుగా మారిన యూదులు, అన్యులు ఉన్నారు. (1 పేతు. 2:9, 10)—11/15, 24-25 పేజీలు.