మీరు “మెలకువగా” ఉంటారా?
“ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.”—మత్త. 25:13.
1, 2. (ఎ) అంత్యదినాల గురించి యేసు ఏమి తెలియజేశాడు? (బి) మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?
యేసుక్రీస్తు ఒలీవ కొండమీద కూర్చొని, అక్కడి నుండి యెరూషలేము దేవాలయాన్ని చూస్తూ ఉండడాన్ని ఓసారి ఊహించుకోండి. ఆయనతోపాటు నలుగురు అపొస్తలులు పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను ఉన్నారు. వాళ్లు, యేసు చెప్తున్న ఓ ఆశ్చర్యకరమైన ప్రవచనాన్ని జాగ్రత్తగా వింటున్నారు. ఈ దుష్టలోక అంత్యదినాల్లో అంటే తాను దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించే సమయంలో ఏమి జరుగుతుందో యేసు ఆ ప్రవచనంలో వివరిస్తున్నాడు. ఆ ప్రాముఖ్యమైన కాలంలో, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” తనకు భూమ్మీద ప్రాతినిధ్యం వహిస్తూ, తన అనుచరులకు సమయానికి తగిన ఆధ్యాత్మిక ఆహారం పెడతాడని యేసు చెప్పాడు.—మత్త. 24:45-47.
2 తర్వాత, యేసు ఆ ప్రవచనంలోనే పదిమంది కన్యకల ఉపమానం కూడా చెప్పాడు. (మత్తయి 25:1-13 చదవండి.) ఇప్పుడు మనం ఈ ప్రశ్నల్ని పరిశీలిద్దాం: (1) ఆ ఉపమానంలోని ముఖ్యమైన పాఠం ఏమిటి? (2) ఆ పాఠాన్ని అభిషిక్త క్రైస్తవులు ఎలా పాటించారు? దానివల్ల వాళ్లు ఎలా ప్రయోజనం పొందారు? (3) నేడు, మనలో ప్రతీఒక్కరం ఆ ఉపమానం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?
ఉపమానంలోని ముఖ్యమైన పాఠం ఏమిటి?
3. పదిమంది కన్యకల ఉపమానాన్ని గతంలో మన ప్రచురణలు ఎలా వివరించాయి? మనం ఏ ప్రశ్న గురించి ఆలోచించాలి?
3 కొన్ని బైబిలు వృత్తాంతాలను నమ్మకమైన దాసుడు వివరించే విధానంలో ఇటీవల కొన్ని మార్పులు వచ్చాయని ముందటి ఆర్టికల్లో చూశాం. ఆ వృత్తాంతాలు ఫలానా వాటిని సూచిస్తున్నాయని చెప్పేబదులు, వాటినుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలనే దాసుడు ఇప్పుడు ఎక్కువగా వివరిస్తున్నాడు. ఉదాహరణకు, యేసు చెప్పిన పదిమంది కన్యకల ఉపమానాన్నే తీసుకోండి. అందులోని దివిటీలు, నూనె, సిద్దెలు ఫలానా వాటిని లేదా ఫలానా వ్యక్తులను సూచిస్తున్నాయని మన ప్రచురణలు ఒకప్పుడు చెప్పేవి. అయితే, మనం ఆ ఉపమానంలోని చిన్నచిన్న వివరాలపై మనసుపెట్టడం వల్ల, అందులో ఉన్న స్పష్టమైన, ముఖ్యమైన పాఠాన్ని వదిలేసే అవకాశం ఉందా? దానిగురించి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.
4. ఉపమానంలోని పెళ్లికొడుకు, కన్యకలు ఎవరో మనకెలా తెలుసు?
4 ఇప్పుడు ఆ ఉపమానంలో ఉన్న ముఖ్యమైన పాఠం ఏమిటో చూద్దాం. ముందుగా, అందులోని వ్యక్తుల గురించి ఆలోచిద్దాం. ఆ ఉపమానంలోని పెళ్లికొడుకు ఎవరు? యేసు తన గురించే చెప్తున్నాడు. తాను పెళ్లికొడుకునని ఆయనే స్వయంగా ఓసారి అన్నాడు. (లూకా 5:34, 35) మరి కన్యకలు ఎవర్ని సూచిస్తున్నారు? వాళ్లు ‘చిన్న మందను’ అంటే అభిషిక్త క్రైస్తవులను సూచిస్తున్నారు. ఆ విషయం మనకెలా తెలుసు? పెళ్లికొడుకు వచ్చేటప్పుడు, వెలుగుతున్న తమ దివిటీలతో కన్యకలు సిద్ధంగా ఉండాలని యేసు ఆ ఉపమానంలో చెప్పాడు. యేసు ఆంతకుముందు తన అభిషిక్త అనుచరులకు చెప్పిన ఈ మాటల్ని గమనించండి, “మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురుచూచు మనుష్యులవలె ఉండుడి.” (లూకా 12:32, 35, 36) అపొస్తలుడైన పౌలు, యోహాను కూడా క్రీస్తు అభిషిక్త అనుచరుల్ని పవిత్రమైన కన్యకలతో పోల్చారు. (2 కొరిం. 11:2; ప్రక. 14:4) కాబట్టి, మత్తయి 25:1-13లో పదిమంది కన్యకలకు యేసు ఇచ్చిన ఆ సలహా, హెచ్చరిక అభిషిక్త అనుచరులకేనని తెలుస్తుంది.
5. యేసు ఆ ఉపమానంలో ఏ సమయం గురించి చెప్పాడో ఎలా తెలుసుకోవచ్చు?
5 ఇప్పుడు, యేసు ఏ సమయం గురించి మాట్లాడుతున్నాడో పరిశీలిద్దాం. ఆయన ఆ ఉపమానం చివర్లో చెప్పిన మాటల్ని బట్టి మనం ఆ సమయం గురించి తెలుసుకోవచ్చు. ఆయనిలా అన్నాడు, “పెండ్లికుమారుడు వచ్చెను.” (మత్త. 25:10) మత్తయి 24, 25 అధ్యాయాల్లోని ప్రవచనంలో, యేసు ‘వస్తాడు’ లేక ‘వచ్చాడు’ వంటి మాటలు ఎనిమిది సార్లు ఉన్నాయని కావలికోట జూలై 15, 2013 సంచికలో చూశాం. ఆ మాటలు, మహాశ్రమల కాలంలో యేసు ఈ దుష్టలోకానికి తీర్పుతీర్చడానికి, దాన్ని నాశనం చేయడానికి వచ్చే సమయాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి యేసు కన్యకల ఉపమానంలో అంత్యదినాల గురించి, అలాగే మహాశ్రమల కాలంలో తాను వచ్చే సమయం గురించి చెప్తున్నాడని అర్థమౌతుంది.
6. ఆ ఉపమానంలోని ముఖ్యమైన పాఠం ఏమిటి?
6 ఆ ఉపమానం నుండి మనం ఏ ముఖ్యమైన పాఠం నేర్చుకుంటాం? యేసు ఆ ఉపమానం చెప్పిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. ఆయన మత్తయి 24వ అధ్యాయంలో, ‘నమ్మకమైన, బుద్ధిమంతుడైన దాసుని’ గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ‘దాసుడు,’ అంత్యదినాల్లో క్రీస్తు అనుచరులకు నాయకత్వం వహించే కొంతమంది అభిషిక్త సహోదరుల గుంపును సూచిస్తున్నాడు. వాళ్లు ఎప్పుడూ నమ్మకంగా ఉండాలని యేసు వాళ్లను హెచ్చరించాడు. తర్వాత అధ్యాయంలో, అంత్యదినాల్లో ఉన్న తన అభిషిక్త అనుచరులందర్నీ హెచ్చరించడానికి, ఆయన పదిమంది కన్యకల ఉపమానం చెప్పాడు. అందులోని ముఖ్యమైన పాఠం ఏమిటంటే, వాళ్లు “మెలకువగా” ఉండాలి, లేకపోతే తమ అమూల్యమైన బహుమతిని పోగొట్టుకుంటారు. (మత్త. 25:13) ఇప్పుడు మనం యేసు చెప్పిన ఆ ఉపమానాన్ని పరిశీలించి, అందులోని సలహాను అభిషిక్త క్రైస్తవులు ఎలా పాటించారో చూద్దాం.
ఉపమానంలోని సలహాను అభిషిక్తులు ఎలా పాటించారు?
7, 8. (ఎ) బుద్ధిగల కన్యకలు పెళ్లికొడుకును ఎందుకు ఆహ్వానించగలిగారు? (బి) అభిషిక్త క్రైస్తవులు ఏవిధంగా సిద్ధంగా ఉన్నారు?
7 బుద్ధిలేని కన్యకల్లా కాకుండా బుద్ధిగల కన్యకలు పెళ్లికొడుకు వచ్చినప్పుడు ఆయన్ను ఆహ్వానించారని యేసు ఆ ఉపమానంలో నొక్కిచెప్పాడు. వాళ్లు సిద్ధంగా ఉండడంతోపాటు అప్రమత్తంగా కూడా ఉన్నారు కాబట్టే అలా చేయగలిగారు. నిజానికి, పెళ్లికొడుకు వచ్చేవరకు మెలకువగా ఉంటూ, తమ దివిటీలు ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పదిమంది కన్యకలకూ ఉంది. అయితే ఐదుగురు బుద్ధిగల కన్యకలు మాత్రమే దివిటీలతోపాటు ఎక్కువ నూనెను కూడా తెచ్చుకున్నారు. అందుకే వాళ్లు సిద్ధంగా ఉన్నారు. మరైతే, అభిషిక్త క్రైస్తవులు యేసు రాక కోసం ఏవిధంగా సిద్ధంగా ఉన్నారు?
8 యేసు ఇచ్చిన పనిని అంతం వరకూ చేయడానికి అభిషిక్త క్రైస్తవులు సిద్ధంగా ఉన్నారు. దేవుని సేవ చేయాలంటే ఈ సాతాను లోకంలోని వస్తుసంపదలను వదులుకోవాలని వాళ్లకు తెలుసు. అయినా వాళ్లు సంతోషంగా వాటిని వదులుకున్నారు. అంతం దగ్గర పడిందని కాదుగానీ, దేవునిపై ఆయన కుమారునిపై ఉన్న ప్రేమతోనే వాళ్లు యెహోవాను నమ్మకంగా సేవించాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు తమ యథార్థతను కాపాడుకుంటూ లోకంలోని సంపదలకు, అనైతికమైన పనులకు, స్వార్థానికి లొంగకుండా ఉన్నారు. వెలుగుతున్న తమ దివిటీలతో సిద్ధంగా ఉన్న కన్యకల్లా, అభిషిక్తులు ‘జ్యోతుల్లా’ వెలుగుతూనే ఉన్నారు. పెళ్లికొడుకు ఆలస్యం చేస్తున్నట్లు అనిపించినా వాళ్లు ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు.—ఫిలి. 2:16.
9. (ఎ) ఏమి జరిగే ప్రమాదం ఉందని యేసు హెచ్చరించాడు? (బి) “ఇదిగో పెండ్లికుమారుడు” అనే పిలుపుకు అభిషిక్తులు ఎలా స్పందించారు? (అధస్సూచి కూడా చూడండి.)
9 బుద్ధిగల కన్యకలు అప్రమత్తంగా ఉండడం వల్ల కూడా పెళ్లికొడుకును ఆహ్వానించగలిగారు. పెళ్లికొడుకు ఆలస్యం చేస్తున్నట్లు అనిపించడంవల్ల పదిమంది కన్యకలూ ‘కునికి, నిద్రపోయారు’ అని ఆ ఉపమానంలో యేసు చెప్పాడు. కాబట్టి, క్రీస్తు రాక కోసం ఎదురుచూస్తున్న నేటి అభిషిక్త క్రైస్తవులు కూడా ‘నిద్రపోయే’ అవకాశం, అంటే వాళ్ల దృష్టి మళ్లే అవకాశం ఉందా? ఉంది. తన రాకకోసం ఎంతో సిద్ధంగా ఉండి, ఆత్రుతతో ఎదురుచూసేవాళ్లు కూడా నెమ్మదిగా బలహీనపడవచ్చని, వాళ్ల ధ్యాస పక్కకు మళ్లవచ్చని యేసుకు తెలుసు. అందుకే, నమ్మకమైన అభిషిక్తులు మెలకువగా ఉండడానికి ఎంతో కృషి చేశారు. ఎలా? “ఇదిగో పెండ్లికుమారుడు” అనే కేక వినిపించినప్పుడు పదిమంది కన్యకలూ స్పందించారు, కానీ బుద్ధిగల కన్యకలు మాత్రమే చివరి వరకూ అప్రమత్తంగా ఉన్నారు. (మత్త. 25:5, 6; 26:41) అదేవిధంగా, అంత్యదినాల్లో “ఇదిగో పెండ్లికుమారుడు” అనే కేక వినిపించినప్పుడు నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు స్పందించారు. వాళ్లు, యేసు రాబోతున్నాడని సూచించే స్పష్టమైన రుజువుల్ని అంగీకరించి, ఆయన రాక కోసం సిద్ధంగా ఉన్నారు. a అయితే ఆ ఉపమానంలో చివరి మాటలు ముఖ్యంగా ఓ నిర్దిష్ట కాలానికి వర్తిస్తాయి. దానిగురించి ఇప్పుడు చూద్దాం.
బుద్ధిగలవాళ్లకు బహుమానం, బుద్ధిలేనివాళ్లకు అవమానం
10. బుద్ధిలేని కన్యకలు నూనె అడిగినప్పుడు బుద్ధిగల కన్యకలు ఇవ్వకపోవడం, ఏ ప్రశ్నను లేవదీస్తుంది?
10 బుద్ధిలేని కన్యకలు నూనెకోసం బుద్ధిగల కన్యకల్ని అడిగారని యేసు ఉపమానం చివర్లో చెప్పాడు. కానీ వాళ్లు ఇవ్వలేదు. (మత్తయి 25:8, 9 చదవండి.) అయితే, నమ్మకమైన అభిషిక్తులు అవసరంలో ఉన్నవాళ్లకు ఎప్పుడు సహాయం చేయకుండా ఉన్నారు? ఆ ఉపమానం ఏ కాలానికి వర్తిస్తుందో ఓసారి గుర్తుచేసుకోండి. ‘పెండ్లి కుమారుడైన’ యేసు, తీర్పుతీర్చడానికి మహాశ్రమల చివర్లో వస్తాడు. కాబట్టి వాళ్లలా అడగడం, బహుశా మహాశ్రమల ముగింపుకు కొంచెం ముందు జరగబోయేదాన్ని సూచిస్తుండవచ్చు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, ఆ సమయానికల్లా అభిషిక్తులు తమ చివరి ముద్రను పొందివుంటారు.
11. (ఎ) మహాశ్రమలు మొదలవ్వడానికి కొంచెం ముందు ఏం జరుగుతుంది? (బి) వెళ్లి నూనెను కొనుక్కోమని బుద్ధిగల కన్యకలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి?
11 కాబట్టి, మహాశ్రమలు మొదలవ్వడానికి కొంచెం ముందు, నమ్మకమైన అభిషిక్తులందరూ తమ చివరి ముద్రను పొందుతారు. (ప్రక. 7:1-4) దాంతో వాళ్లు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. అయితే, మహాశ్రమలకు ముందున్న సంవత్సరాల్లో మెలకువగా, నమ్మకంగా ఉండని అభిషిక్తుల పరిస్థితేంటి? వాళ్లు చివరి ముద్రను పొందరు. ఆ సమయానికల్లా, వాళ్ల స్థానంలో ఇతర నమ్మకమైన క్రైస్తవులు అభిషిక్తులయ్యుంటారు. ఒక్కసారి మహాశ్రమలు మొదలయ్యాక, మహాబబులోను నాశనం అవడం చూసి, నమ్మకంగా ఉండని అభిషిక్తులు దిగ్భ్రాంతికి లోనవుతారు. తాము యేసు రాకకోసం సిద్ధంగా లేమని బహుశా అప్పుడే వాళ్లకు అర్థమౌతుంది. వాళ్లు ఆ సమయంలో సహాయం కోసం అడిగితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? దానికి జవాబు ఆ ఉపమానంలోనే ఉంది. బుద్ధిగల కన్యకలు తమ దగ్గరున్న నూనెను బుద్ధిలేని కన్యకలకు ఇవ్వలేదు, బదులుగా వెళ్లి కొనుక్కోమని చెప్పారు. అది “అర్థరాత్రి” కాబట్టి, నూనె అమ్మేవాళ్లు ఎవరూ లేరు. అప్పటికే బాగా ఆలస్యమైంది.
12. (ఎ) మహాశ్రమల కాలంలో, నమ్మకంగా ఉండనివాళ్లకు అభిషిక్తులు సహాయం చేయగలరా? (బి) బుద్ధిలేని కన్యకల్లాంటి వాళ్లకు ఏం జరుగుతుంది?
12 నమ్మకంగా ఉండనివాళ్లకు అభిషిక్తులు మహాశ్రమల కాలంలో ఎలాంటి సహాయం చేయలేరు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయుంటుంది. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? నూనెను కొనుక్కోవడానికి వెళ్లిన బుద్ధిలేని కన్యకలకు ఏమి జరిగిందో గుర్తుచేసుకోండి. యేసు ఇలా చెప్పాడు, “పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడియున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను.” కాబట్టి, మహాశ్రమల ముగింపులో యేసు తన మహిమతో వచ్చినప్పుడు, నమ్మకమైన అభిషిక్తులను పరలోకానికి తీసుకెళ్తాడు. (మత్త. 24:31; 25:10; యోహా. 14:1-3; 1 థెస్స. 4:17) కానీ నమ్మకంగా లేనివాళ్లను ఆయన అంగీకరించడు. బుద్ధిలేని కన్యకల్లా బహుశా వాళ్లు కూడా “అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుము” అని అడుగుతారు. అప్పుడు యేసు, ‘మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను’ అని మేకల్లాంటి చాలామందితో అన్నట్లే వీళ్లతో కూడా అంటాడు.—మత్త. 7:21-23; 25:11, 12.
13. (ఎ) అభిషిక్తుల్లో చాలామంది చివరివరకు నమ్మకంగా ఉండరని మనం అనుకోవాలా? వివరించండి. (బి) యేసుకు అభిషిక్తుల మీద నమ్మకం ఉందని ఆయన చెప్పిన ఉపమానం బట్టి ఎలా తెలుస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)
13 అంటే, అభిషిక్తుల్లో చాలామంది చివరి వరకు నమ్మకంగా ఉండరనీ, వాళ్ల స్థానంలో వేరేవాళ్లు అభిషిక్తులవుతారనీ యేసు చెప్తున్నాడా? లేదు. యేసు మత్తయి 24వ అధ్యాయంలో, చెడ్డ దాసునిగా మారవద్దని నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుణ్ణి హెచ్చరించాడని గుర్తుచేసుకోండి. అయితే, దానర్థం నమ్మకమైన దాసుడు చెడ్డగా మారతాడని కాదు. అదేవిధంగా, పదిమంది కన్యకల ఉపమానం కూడా అభిషిక్తులకు ఒక హెచ్చరికే. ఆ ఉపమానంలోని పదిమంది కన్యకల్లో ఐదుగురు బుద్ధిగలవాళ్లు, మరో ఐదుగురు బుద్ధిలేనివాళ్లు కాబట్టి, అభిషిక్తుల్లో సగం మంది నమ్మకంగా ఉండరని యేసు చెప్పడం లేదు. బదులుగా, నమ్మకంగా ఉండాలో వద్దో ప్రతీ అభిషిక్త క్రైస్తవుడూ తనకు తానే నిర్ణయించుకోవాలన్నదే అందులోని పాఠం. అపొస్తలుడైన పౌలు కూడా తోటి అభిషిక్త క్రైస్తవులకు అలాంటి హెచ్చరికనే ఇచ్చాడు. (హెబ్రీయులు 6:4-9 చదవండి; ద్వితీయోపదేశకాండము 30:19తో పోల్చండి.) పౌలు అలా సూటిగా హెచ్చరించినా, తన సహోదరసహోదరీలు పరలోక బహుమానాన్ని పొందుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. పదిమంది కన్యకల ఉపమానంలో యేసు అభిషిక్తులకు ఇచ్చిన హెచ్చరికను బట్టి, ఆయనకు కూడా వాళ్లమీద అలాంటి నమ్మకమే ఉందని అర్థమౌతుంది. చివరి వరకు నమ్మకంగా ఉండి, ఆ అద్భుతమైన బహుమానాన్ని పొందే సామర్థ్యం ప్రతీ అభిషిక్త క్రైస్తవునికి ఉందని యేసుకు తెలుసు.
‘వేరేగొర్రెలు’ ఎలా ప్రయోజనం పొందుతారు?
14. పదిమంది కన్యకల ఉపమానం నుండి ‘వేరే గొర్రెలు’ ఏ పాఠం నేర్చుకోవచ్చు?
14 యేసు ఆ ఉపమానాన్ని అభిషిక్త క్రైస్తవుల్ని మనసులో పెట్టుకునే చెప్పాడు. మరి దానిలో ‘వేరేగొర్రెలకు’ కూడా ఏదైనా పాఠం ఉందా? (యోహా. 10:16) తప్పకుండా ఉంది. మనం ‘మెలకువగా ఉండాలి’ అనేదే అందులోని పాఠం. “నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను” అని యేసు ఓ సందర్భంలో అన్నాడు. (మార్కు 13:37) అవును, తన శిష్యులందరూ సిద్ధంగా, మెలకువగా ఉండాలని యేసు కోరుకుంటున్నాడు. అందుకే, ప్రకటనాపనికి తమ జీవితాల్లో మొదటి స్థానమిస్తున్న అభిషిక్తుల్ని క్రైస్తవులందరూ అనుకరిస్తారు. బుద్ధిగల కన్యకల దగ్గరున్న నూనెను కొంచెం ఇవ్వమని బుద్ధిలేని కన్యకలు అడిగారని గుర్తుపెట్టుకోండి. ఆ మాటలు మనకు ఓ విషయాన్ని గుర్తుచేస్తాయి. అదేంటంటే, దేవునికి నమ్మకంగా ఉంటూ సిద్ధంగా, మెలకువగా ఉండాల్సింది మనమేగానీ, మనకు బదులు వేరేవాళ్లు అలా ఉండలేరు. నీతియుక్త న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తుకు మనలో ప్రతీఒక్కరం లెక్క అప్పజెప్పాలి. ఆయన త్వరలోనే వస్తున్నాడు కాబట్టి మనందరం సిద్ధంగా ఉండాలి.
‘వెళ్లి, నూనె తెచ్చుకోండి’ అని బుద్ధిగల కన్యకలు చెప్పిన మాట, వేరేవాళ్లు మనకు బదులు నమ్మకంగా, మెలకువగా ఉండలేరని గుర్తుచేస్తుంది
15. పరలోకంలో జరిగే పెళ్లి విషయంలో, పెళ్లి కుమార్తె విషయంలో నిజ క్రైస్తవులందరూ ఎందుకు ఆసక్తి చూపిస్తారు?
15 యేసు కన్యకల ఉపమానంలో చెప్పిన పెళ్లి గురించి క్రైస్తవులందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. హార్మెగిద్దోను యుద్ధం అయిపోయాక, అభిషిక్త క్రైస్తవులందరూ క్రీస్తు ‘పెండ్లి కుమార్తె’ అవుతారు. (ప్రక. 19:6-9) పరలోకంలో జరిగే ఆ పెళ్లివల్ల, భూమ్మీదున్న ప్రతీఒక్కరు ప్రయోజనం పొందుతారు. ఏవిధంగా? దానివల్ల ఏర్పడే పరిపూర్ణమైన ప్రభుత్వం మనుషులందరికీ మేలు చేస్తుంది. కాబట్టి, మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా మనందరం సిద్ధంగా, మెలకువగా ఉండాలని నిశ్చయించుకుందాం. అలా ఉన్నప్పుడే, యెహోవా మనకోసం ఏర్పాటు చేసిన అద్భుతమైన జీవితాన్ని సొంతం చేసుకుంటాం.
a ఉపమానంలో, “ఇదిగో పెండ్లికుమారుడు” అనే కేక వినిపించిన తర్వాత (6వ వచనం) పెళ్లికొడుకు రావడానికి (10వ వచనం) కొంత సమయం పట్టింది. అంత్యదినాల అంతటిలో అభిషిక్త క్రైస్తవులు మెలకువగానే ఉన్నారు. వాళ్లు యేసు ప్రత్యక్షతకు సంబంధించిన సూచనను గుర్తించారు. ఆయన దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలిస్తున్నాడని వాళ్లు అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ, మహాశ్రమల కాలంలో ఆయన వచ్చేంతవరకు వాళ్లు మెలకువగా ఉండాలి.