మీరు చేస్తున్న పనిని మనుషులు గుర్తించాలా?
బెసలేలు, అహోలీయాబులకు నిర్మాణ పని కొత్తేమీ కాదు. వాళ్లు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, లెక్కలేనన్ని ఇటుకలు తయారు చేసివుంటారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు వాళ్లకు అత్యంత గొప్ప పనిలో అంటే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడంలో నాయకత్వం వహించే బాధ్యత అప్పగించబడింది. (నిర్గ. 31:1-11) కానీ వాళ్లు చేసిన అద్భుతమైన వస్తువుల్ని కొంతమంది మాత్రమే చూడగలిగారు. మరి తమకు తగిన గుర్తింపు రాలేదని వాళ్లు బాధపడ్డారా? వాళ్ల పనిని ఎవరు చూశారన్నది అంత ప్రాముఖ్యమా? మీ కష్టాన్ని మనుషులు గుర్తించాలా?
కొంతమంది మాత్రమే చూశారు
ప్రత్యక్ష గుడారంలోని కొన్ని వస్తువులు అద్భుతమైన కళాఖండాలు. ఉదాహరణకు, నిబంధన మందసంపై ఉన్న బంగారపు కెరూబుల గురించి ఒక్కసారి ఆలోచించండి. అపొస్తలుడైన పౌలు వాటిని “మహిమగల కెరూబులు” అని వర్ణించాడు. (హెబ్రీ. 9:5) బంగారంతో చేసిన ఆ కెరూబులు ఎంత అద్భుతంగా ఉండివుంటాయో కదా!—నిర్గ. 37:7-9.
బెసలేలు, అహోలీయాబు చేసిన కళాఖండాలు ఇప్పుడు గనుక దొరికితే, ఖచ్చితంగా వాటిని పెద్దపెద్ద మ్యూజియమ్‌లలో పెడతారు, చాలామంది వాటిని చూసి మెచ్చుకుంటారు. కానీ, ఆ కాలంలో వాటిని నిజంగా ఎంతమంది చూసివుంటారు? కెరూబులు అతిపరిశుద్ధ స్థలంలో ఉండేవి. కాబట్టి ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థ దినాన మాత్రమే వాటిని చూసేవాడు. (హెబ్రీ. 9:6, 7) కాబట్టి కొంతమందే వాటిని చూశారు.
ఇతరులు గుర్తించకపోయినా సంతృప్తితో ఉండండి
ఒకవేళ మీరే బెసలేలు లేదా అహోలీయాబు అయ్యుంటే, మీరెంతో కష్టపడి చేసిన ఆ అద్భుతమైన కళాఖండాల్ని కొద్దిమందే చూశారని తెలిస్తే ఎలా భావించి ఉండేవాళ్లు? నేడు చాలామంది ప్రజలు, తాము చేసినవాటిని తోటివాళ్లు పొగిడితే, మెచ్చుకుంటే చాలా గొప్పగా భావిస్తారు. ఇతరులు తమ పనుల్ని ఎంత గుర్తిస్తే తమ కష్టానికి అంత విలువుంటుందని వాళ్లు అనుకుంటారు. అయితే యెహోవా సేవకులమైన మనం అలా అనుకోం. బెసలేలు అహోలీయాబుల్లాగే మనం కూడా యెహోవా చెప్పిన పని చేయడంలో, ఆయన అనుగ్రహం పొందడంలో సంతోషిస్తాం.
యేసు కాలంలోని మతనాయకులు, ఇతరుల గుర్తింపు పొందడం కోసమే ప్రార్థనలు చేసేవాళ్లు. కానీ, మనం ఇతరుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో కాకుండా మనస్ఫూర్తిగా ప్రార్థించాలని యేసు చెప్పాడు. అప్పుడే “రహస్యమందు మత్త. 6:5, 6) కాబట్టి మన ప్రార్థనల గురించి వేరేవాళ్లు ఏమనుకుంటున్నారు అనేది కాదుగానీ యెహోవా ఏమనుకుంటున్నాడు అనేదే ముఖ్యం. ఆయన ఏమనుకుంటున్నాడనే దాన్నిబట్టే మన ప్రార్థనలకు విలువ ఉంటుంది. యెహోవా సేవలో మనం చేసే ఏ పనికైనా ఇదే వర్తిస్తుంది. ఇతరులు మనల్ని పొగిడినప్పుడు కాదుగానీ, ‘రహస్యమందు చూసే’ యెహోవాను సంతోషపెట్టినప్పుడే దాని విలువ పెరుగుతుంది.
చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును” అని ఆయన అన్నాడు. (గుడారాన్ని నిర్మించడం పూర్తయ్యాక, “మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను” అని బైబిలు చెప్తుంది. (నిర్గ. 40:34, 35) దాన్నిబట్టి బెసలేలు, అహోలీయాబుల పనిని యెహోవా ఆమోదించాడని స్పష్టంగా తెలుస్తుంది. ఆ క్షణం వాళ్లకు ఎలా అనిపించివుంటుంది? ఆ వస్తువుల మీద తమ పేర్లు చెక్కకపోయినా, యెహోవా తమ కష్టాన్నంతటినీ ఆశీర్వదించాడని తెలుసుకుని వాళ్లు ఎంతో సంతృప్తి పడివుంటారు. (సామె. 10:22) వాటిని ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా యెహోవా ఆరాధనలో ఉపయోగించడం చూసి ఖచ్చితంగా ఆనందించి ఉంటారు. కొత్తలోకంలో వాళ్లు తిరిగి బ్రతికినప్పుడు, ప్రత్యక్ష గుడారాన్ని ప్రజలు దాదాపు 500 సంవత్సరాలపాటు సత్యారాధనలో ఉపయోగించారనే విషయం తెలుసుకుని తప్పకుండా సంతోషిస్తారు.
నేడు యెహోవా సంస్థలో, యానిమేషన్ వీడియోలు చేసేవాళ్లు, చిత్రకారులు, సంగీతకారులు, ఫోటోగ్రాఫర్లు, అనువాదకులు, రచనా విభాగంలో పనిచేసేవాళ్లు ఉన్నారు. వాళ్లెవరూ గుర్తింపును కోరుకోరు. ఆ విధంగా వాళ్లు ఏ పని చేస్తున్నారో ఎవరూ “చూడరు.” ప్రపంచవ్యాప్తంగా 1,10,000కు పైగా ఉన్న సంఘాల్లో జరుగుతున్న పని విషయంలో కూడా ఇది నిజం. ఉదాహరణకు, సంఘంలో అకౌంట్స్ చూసుకునే సహోదరుడు ప్రతినెలా చివర్లో ఎంతో పని చేస్తాడు. కార్యదర్శి, సంఘ క్షేత్రసేవా రిపోర్టులను తయారు చేసేటప్పుడు చాలా ప్రయాసపడతాడు. రాజ్యమందిరంలో ఏదైనా రిపేరు చేయాల్సి వచ్చినప్పుడు ఓ సహోదరుడు/సహోదరి ఎంతో కష్టపడి పనిచేస్తారు. వీళ్లందరూ చేస్తున్న పనిని ఎవరు చూస్తున్నారు?
నాణ్యమైన, అద్భుతమైన కళాఖండాలను చేసినందుకు గుర్తింపుగా బెసలేలు అహోలీయాబులు ట్రోఫీలు లేదా మెడల్స్ అందుకోలేదు. లేదా శిలాఫలకాల మీద వాళ్ల పేర్లను చెక్కించలేదు. కానీ వాటన్నిటికన్నా ఎంతో విలువైన యెహోవా అనుగ్రహాన్ని వాళ్లు పొందారు. వాళ్లు చేసిన పనిని యెహోవా గుర్తించాడు. మనం కూడా వాళ్లలాగే వినయంగా, ఇష్టపూర్వకంగా యెహోవా సేవ చేద్దాం.