మీ మనస్సాక్షి మిమ్మల్ని సరిగ్గా నడిపిస్తుందా?
‘ఉపదేశ సారం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి కలిగే ప్రేమే.’—1 తిమో. 1:5.
1, 2. మనకు మనస్సాక్షిని ఎవరు ఇచ్చారు? దాని విషయంలో మనమెందుకు కృతజ్ఞత చూపించాలి?
యెహోవా దేవుడు మనుషులకు స్వేచ్ఛాచిత్తాన్ని అంటే సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. దానితోపాటు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయంచేసే ఓ బహుమానాన్ని కూడా ఇచ్చాడు. అదే మనస్సాక్షి. ఏది మంచో, ఏది చెడో గుర్తించే మనలోని సామర్థ్యమే మనస్సాక్షి. దాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడు మనం మంచిని చేస్తాం, చెడుకు దూరంగా ఉంటాం. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మనం సరైనదే చేయాలని కోరుకుంటున్నాడని చెప్పడానికి మనస్సాక్షే ఓ రుజువు.
2 బైబిలు ప్రమాణాల గురించి తెలియని కొంతమంది కూడా మంచి పనులు చేస్తూ, చెడును అసహ్యించుకుంటున్నారు. (రోమీయులు 2:14, 15 చదవండి.) ఎందుకు? ఎందుకంటే వాళ్లకు మనస్సాక్షి ఉంది. దానివల్లే చాలామంది ప్రజలు చెడు పనులకు దూరంగా ఉండగలుగుతున్నారు. అసలు మనస్సాక్షే లేకపోతే లోకం ఎలా ఉండేదో ఆలోచించండి! మనం ఇప్పుడు వింటున్న వాటికన్నా ఘోరమైన విషయాల్ని వినాల్సివచ్చేది. యెహోవా మనుషులకు మనస్సాక్షి ఇచ్చినందుకు మనం ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం.
3. మనం మనస్సాక్షికి శిక్షణనిస్తే సంఘం ఎలా ప్రయోజనం పొందుతుంది?
3 అయితే చాలామంది తమ మనస్సాక్షికి శిక్షణ ఇవ్వరు. కానీ యెహోవా ప్రజలు తమ మనస్సాక్షికి శిక్షణ ఇవ్వాలని కోరుకుంటారు, ఎందుకంటే అది సంఘ ఐక్యతకు తోడ్పడుతుంది. మన మనస్సాక్షి, మంచిచెడుల విషయంలో బైబిలు ప్రమాణాలను మనకు గుర్తుచేయాలని కోరుకుంటాం. అయితే మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వాలంటే కేవలం బైబిలు చదివితే సరిపోదు. మనం బైబిలు ప్రమాణాలను ప్రేమించాలి, అవి మనకు మేలు చేస్తాయని నమ్మాలి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘ఉపదేశ సారం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమే.’ (1 తిమో. 1:5) మన మనస్సాక్షికి శిక్షణనిచ్చి, అది చెప్పేది విన్నప్పుడు మనకు యెహోవా మీద ప్రేమ, విశ్వాసం పెరుగుతాయి. నిజానికి, మన మనస్సాక్షిని ఉపయోగించే విధానాన్ని బట్టే యెహోవాతో మనకు ఎంత దగ్గరి సంబంధం ఉందో, ఆయన్ను సంతోషపెట్టాలని ఎంతగా కోరుకుంటున్నామో చూపిస్తాం. అంతేకాదు మనం నిజంగా ఎలాంటివాళ్లమో కూడా చూపిస్తాం.
4. మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?
4 మన మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు? మనం క్రమంగా బైబిలు చదువుతూ, దాన్ని ధ్యానించాలి. నేర్చుకున్నవాటిని పాటించడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాలి. బైబిలు చదివేటప్పుడు, కేవలం కొన్ని వాస్తవాలు లేదా నియమాలు తెలుసుకోవాలని కాదుగానీ, యెహోవా గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చదవాలి. అప్పుడు యెహోవా ఎలాంటి దేవుడో, ఆయన ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకుంటాం. ఆయన గురించి తెలుసుకునేకొద్దీ, ఆయన దృష్టిలో ఏది మంచో ఏది చెడో మన మనస్సాక్షి వెంటనే గుర్తించగలుగుతుంది. మనస్సాక్షికి ఎంత ఎక్కువగా శిక్షణనిస్తే, అంత ఎక్కువగా యెహోవాలా ఆలోచించగలుగుతాం.
5. ఈ ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?
5 మనం ఇప్పుడు ఈ ప్రశ్నల గురించి ఆలోచిద్దాం, చక్కని శిక్షణ పొందిన మనస్సాక్షి మనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది? మనం తోటి క్రైస్తవుల మనస్సాక్షిని ఎలా గౌరవించవచ్చు? మంచి పనులు చేసేలా మనస్సాక్షి మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది? వీటి గురించి ఆలోచిస్తూ, చక్కని శిక్షణ పొందిన మనస్సాక్షి మనకు, (1) ఆరోగ్యం, (2) వినోదం, (3) ప్రకటనా పని వంటి విషయాల్లో ఎలా సహాయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
సహేతుకంగా ఉండండి
6. చికిత్స విషయంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది?
6 హాని కలిగించే అలవాట్లకు దూరంగా ఉండమని, తినడం-త్రాగడం వంటి విషయాల్లో మితంగా ఉండమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (సామె. 23:20; 2 కొరిం. 7:1) మనకు వయసు పైబడుతున్నా లేదా అనారోగ్య సమస్యలు ఉన్నా, బైబిలు సలహాల్ని పాటిస్తే కొంతవరకు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కొన్ని దేశాల్లో, సాధారణ చికిత్సా విధానాలతో పాటు, ఇతర చికిత్సలు కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే సహోదరసహోదరీలు బ్రాంచి కార్యాలయాలకు ఉత్తరాలు రాస్తూ వైద్య చికిత్స విషయంలో సలహాలు అడుగుతుంటారు. వాళ్లలో ఎక్కువమంది అడిగే ప్రశ్నేమిటంటే, ‘ఫలానా చికిత్సను యెహోవాసాక్షులు అంగీకరించవచ్చా?’
7. ఏ వైద్య చికిత్సను అంగీకరించాలో మనం ఎలా నిర్ణయించుకోవచ్చు?
7 అయితే, వాళ్లు ఎలాంటి చికిత్స తీసుకోవాలో నిర్ణయించే అధికారం బ్రాంచి కార్యాలయానికిగానీ, సంఘ పెద్దలకుగానీ లేదు. (గల. 6:5) కానీ పెద్దలు, ఈ విషయంలో యెహోవా అభిప్రాయం ఏమిటో చెప్పి, వాళ్లు సరైన నిర్ణయం తీసుకునేలా సహాయం చేయగలరు. ఉదాహరణకు, ‘రక్తాన్ని విసర్జించమని’ దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. (అపొ. 15:28, 29) కాబట్టి క్రైస్తవులు రక్తాన్ని లేదా దానిలోని నాలుగు ప్రధాన భాగాల్లో దేన్నీ ఎక్కించుకోరు, అలాంటి చికిత్సలను అంగీకరించరు. అంతేకాదు, రక్తంలోని సూక్ష్మ భాగాలను ఎక్కించుకోవాలో వద్దో తమ మనస్సాక్షిని బట్టి నిర్ణయించుకుంటారు. a చికిత్స విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ ఇతర బైబిలు సలహాలు మనకు సహాయం చేస్తాయి?
8. ఆరోగ్యం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఫిలిప్పీయులు 4:5 ఎలా సహాయం చేస్తుంది?
8 సామెతలు 14:15 (పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) ఇలా చెప్తుంది, ‘బుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు. కానీ జ్ఞానం గలవాడు ప్రతీదాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాడు.’ ప్రస్తుతం కొన్ని జబ్బులకు చికిత్స ఉండకపోవచ్చు. కాబట్టి ఫలానా జబ్బుకు ఓ చికిత్స ఉందని ఎవరైనా చెప్తే, ముఖ్యంగా దాన్ని నమ్మడానికి ఆధారాలు లేకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. పౌలు ఇలా రాశాడు, ‘మీ సహనాన్ని [“సహేతుకతను,” NW] సకల జనులకు తెలియనివ్వండి.’ (ఫిలి. 4:5) మనకు సహేతుకత ఉంటే ఆరోగ్యం గురించి అతిగా ఆలోచించే బదులు యెహోవా ఆరాధన మీదే మనసుపెడతాం. ఆరోగ్యమే మనకు అత్యంత ముఖ్యమైన విషయంగా తయారైతే మనం మన గురించే ఆలోచిస్తూ ఉంటాం. (ఫిలి. 2:4) ప్రస్తుతం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండడం సాధ్యం కాదని మనకు తెలుసు. కాబట్టి మన జీవితంలో యెహోవా సేవకే మొదటి స్థానం ఇవ్వాలి.—ఫిలిప్పీయులు 1:9, 10 చదవండి.
9. ఆరోగ్యం విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు రోమీయులు 14:13, 19 వచనాలు ఎలా సహాయం చేస్తాయి? సంఘ ఐక్యత ఎలా ప్రమాదంలో పడవచ్చు?
9 సహేతుకత ఉన్న క్రైస్తవుడు తన అభిప్రాయాలను వేరేవాళ్ల మీద రుద్దడు. ఒకానొక దేశంలో ఒక జంట, ఫలానా ఆహార పదార్థాల్ని తినమని, ఫలానా ఆహార నియమాలు పాటించమని ఇతరులను ప్రోత్సహించింది. వాళ్ల ఒత్తిడితో సంఘంలో కొంతమంది వాటిని పాటించడం మొదలుపెట్టారు. కానీ వాటివల్ల మంచి ఫలితాలు రాకపోవడంతో ఆ సహోదరసహోదరీలు నిరాశపడ్డారు. కాబట్టి తాము ఏ ఆహారం తినాలో, ఏ ఆహార నియమాలు పాటించాలో నిర్ణయించుకునే హక్కు ఆ జంటకు ఉంది. అంతేగానీ వాటిని పాటించమని వేరేవాళ్లను ఒత్తిడిచేసి, సంఘ ఐక్యతను పాడుచేయకూడదు. ప్రాచీన రోములో కొంతమంది క్రైస్తవులకు కొన్ని రకాల ఆహార పదార్థాల విషయంలో, ఆచారాల విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండేవి. పౌలు వాళ్లకు ఈ సలహా ఇచ్చాడు, “ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్యమైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని సమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడూ తాను పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి.” (పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) కాబట్టి మనం ఇతరులకు అభ్యంతరం కలిగించకుండా జాగ్రత్తగా ఉందాం.—రోమీయులు 14:5, 13, 15, 19, 20 చదవండి.
10. ఇతరుల వ్యక్తిగత నిర్ణయాల్ని మనం ఎందుకు గౌరవించాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)
10 కొన్నిసార్లు ఓ సహోదరుడు ఫలానా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో మనకు అర్థంకాకపోవచ్చు. అప్పుడు మనమేమి చేయాలి? మనం ఆయన్ను తప్పుపట్టకూడదు లేదా నిర్ణయం మార్చుకోమని బలవంతపెట్టకూడదు. బహుశా ఆయన మనస్సాక్షికి మరింత శిక్షణ అవసరం కావచ్చు లేదా ఆయన మనస్సాక్షి బలహీనంగా ఉండవచ్చు. (1 కొరిం. 8:11, 12) లేకపోతే మన మనస్సాక్షికే ఇంకా శిక్షణ అవసరమేమో. ఏదేమైనా, ఆరోగ్యం విషయంలో ప్రతీ ఒక్కరు ఎవరికి వాళ్లే నిర్ణయాలు తీసుకోవాలి, వాటివల్ల వచ్చే ఫలితాలకు బాధ్యత వహించాలి.
వినోదం
11, 12. వినోదాన్ని ఎంపిక చేసుకునే విషయంలో బైబిలు సలహాలు మనకెలా సహాయం చేస్తాయి?
11 మనం సరదాగా సమయం గడుపుతూ, దానివల్ల సేదదీర్పును పొందేలా యెహోవా మనల్ని సృష్టించాడు. ‘నవ్వడానికి, నాట్యమాడడానికి’ సమయం ఉందని సొలొమోను రాశాడు. (ప్రసం. 3:4) అయితే సరదా కోసం మనం చేసేవన్నీ సేదదీర్పును, ఉల్లాసాన్ని ఇవ్వకపోవచ్చు. అంతేకాక వాటిలో మరీ ఎక్కువ సమయం గడపడం కూడా మంచిది కాదు. అయితే, యెహోవా అంగీకరించే వినోదాన్ని ఎంపిక చేసుకోవడానికి మన మనస్సాక్షి ఎలా సహాయం చేస్తుంది?
12 శరీర కార్యాలకు దూరంగా ఉండమని బైబిలు హెచ్చరిస్తుంది. వాటిలో ‘వ్యభిచారం, అపవిత్రత, కామం, విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య, కోపం, స్వార్థం, విరోధం, చీలికలు, అసూయ, త్రాగుబోతుతనం, కామకేళీలు మొదలైనవి’ ఉన్నాయి. “ఈ విధంగా జీవించేవాళ్లు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు” అని పౌలు రాశాడు. (గల. 5:19-21, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) కాబట్టి మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘కోపం, పోటీతత్వం, దేశభక్తి లేదా హింస ఎక్కువగా ఉన్న ఆటలకు దూరంగా ఉండమని నా మనస్సాక్షి చెప్తుందా? అసభ్యకరమైన సన్నివేశాలు, విచ్చలవిడితనం, త్రాగుబోతుతనం, మంత్రతంత్రాలు ఉండే సినిమాల్ని చూడాలనిపిస్తే నా మనస్సాక్షి వద్దని చెప్తుందా?’
13. వినోదం విషయంలో 1 తిమోతి 4:8, సామెతలు 13:20 వచనాలు మనకెలా సహాయం చేస్తాయి?
13 వినోదం విషయంలో కూడా బైబిలు సూత్రాలను ఉపయోగించి మనస్సాక్షికి శిక్షణ ఇవ్వవచ్చు. ఉదాహరణకు, “శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది” అని బైబిలు చెప్తుంది. (1 తిమో. 4:8, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) క్రమంగా వ్యాయామం చేయడంవల్ల ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటామని చాలామంది అంటారు. అయితే మనం ఎవరితో కలిసి వ్యాయామం చేస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. సామెతలు 13:20 ఇలా చెప్తుంది, “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” కాబట్టి, సరదాగా సమయం గడిపే విషయంలో బైబిలు శిక్షిత మనస్సాక్షి చెప్పేది వినడం చాలా ముఖ్యం.
14. రోమీయులు 14:2-4లోని సూత్రాల్ని ఓ కుటుంబం ఎలా అన్వయించుకుంది?
14 క్రిస్టియన్, డాన్యేల అనే దంపతులకు ఇద్దరు టీనేజీ కూతుళ్లు ఉన్నారు. క్రిస్టియన్ ఇలా చెప్తున్నాడు, ‘మేము ఓసారి కుటుంబ ఆరాధనలో వినోదం గురించి చర్చించుకున్నాం. మనం సరదా కోసం చేసే పనులన్నిటినీ యెహోవా అంగీకరించడని మేము మాట్లాడుకున్నాం. ఎవరితో స్నేహం చేయాలనే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, మా అమ్మాయి తన స్కూల్లో కొంతమంది యౌవన సాక్షుల గురించి చెప్పింది. స్కూల్లో వాళ్ల ప్రవర్తన సరిగ్గా లేదని తనకు అనిపించిందని, అయితే వాళ్లను చూసి తనకు కూడా అలాగే చేయాలనిపించిందని మా అమ్మాయి చెప్పింది. అప్పుడు మేము, ప్రతీ ఒక్కరికి మనస్సాక్షి ఉంటుందని, మనం ఏమి చేయాలో, ఎవరితో సమయం గడపాలో మనస్సాక్షిని బట్టి నిర్ణయించుకోవాలని తనకు వివరించాం.’—రోమీయులు 14:2-4 చదవండి.
15. సరదాగా సమయం గడిపే విషయంలో మత్తయి 6:33 మనకు ఎలా సహాయం చేస్తుంది?
15 వినోద కార్యకలాపాల్లో మీరెంత సమయం గడుపుతున్నారు? మీ జీవితంలో మొదటి స్థానాన్ని మీటింగ్స్‌కి, పరిచర్యకు, బైబిలు అధ్యయనానికి ఇస్తున్నారా లేదా వినోదానికా? మీకు ఏది అన్నిటికన్నా ముఖ్యమైనది? యేసు ఇలా చెప్పాడు, “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్త. 6:33) సరదాగా సమయం గడపడం గురించి ఆలోచించేటప్పుడు, మీ మనస్సాక్షి యేసు మాటల్ని మీకు గుర్తుచేస్తుందా?
ప్రకటనా పని చేయండి
16. ప్రకటనా పని చేసేలా మనస్సాక్షి మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?
16 చక్కగా శిక్షణ పొందిన మనస్సాక్షి, తప్పు చేసేటప్పుడు మనల్ని హెచ్చరించడమే కాదు, మంచి పనులు చేసేలా ప్రోత్సహిస్తుంది కూడా. అలాంటి పనుల్లో ఒకటి, ఇంటింటి పరిచర్య చేయడం, మనకు కలిసిన వాళ్లకు సాక్ష్యమివ్వడం. అపొస్తలుడైన పౌలు అదే చేశాడు. ఆయనిలా రాశాడు, “సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.” (1 కొరిం. 9:16) పౌలులాగే మనం కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సరైన పనిని చేస్తున్నామనే నమ్మకంతో, మంచి మనస్సాక్షితో ఉండవచ్చు. అలాగే మనం ఇతరులకు సువార్త ప్రకటించేటప్పుడు, మన మంచి ప్రవర్తన ద్వారా ఇదే సత్యమని వాళ్లు గుర్తించడానికి సహాయం చేస్తాం. పౌలు ఇలా రాశాడు, ‘సత్యాన్ని ప్రత్యక్షపర్చడం వల్ల, ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖంలో మెప్పించుకుంటున్నాం.’—2 కొరిం. 4:2.
17. మనస్సాక్షి చెప్పిన మాటను ఓ యువ సహోదరి ఎలా పాటించింది?
17 జాక్లీన్ అనే సహోదరికి 16 ఏళ్లున్నప్పుడు, వాళ్ల బయోలజీ టీచరు పరిణామ సిద్ధాంతం గురించి క్లాసులో వివరించాడు. జాక్లీన్ ఇలా చెప్తుంది, ‘దాని గురించి క్లాసులో చర్చిస్తున్నప్పుడు, నా మనస్సాక్షివల్ల నేను ఎప్పటిలా ఆ చర్చల్లో పూర్తిగా పాల్గొనలేకపోయాను. నేను పరిణామ సిద్ధాంతాన్ని సమర్థించలేదు. మా టీచరు దగ్గరికి వెళ్లి నా నమ్మకాల గురించి చెప్పాను. అయితే ఆశ్చర్యకరంగా ఆయన చాలా స్నేహంగా మాట్లాడి, క్లాసులో అందరిముందు సృష్టి గురించి మాట్లాడే అవకాశం నాకిచ్చాడు.’ బైబిలు శిక్షిత మనస్సాక్షి చెప్పిన మాట విన్నందుకు జాక్లీన్‌కు ఎంతో సంతృప్తి అనిపించింది. మీ మనస్సాక్షి కూడా సరైనది చేసేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుందా?
18. చక్కగా శిక్షణ పొందిన మనస్సాక్షి మనకెందుకు అవసరం?
18 దేవుని సూత్రాలు, ప్రమాణాల ప్రకారం జీవించాలన్నదే మన లక్ష్యం. అలా జీవించడానికి మనస్సాక్షి మనకు సహాయం చేయగలదు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ, చదివిన వాటి గురించి ఆలోచిస్తూ, వాటిని పాటిస్తే, మన మనస్సాక్షికి చక్కగా శిక్షణ ఇవ్వగలుగుతాం. అలాంటి మనస్సాక్షి మనల్ని సరైన దారిలో నడిపించగలదు.
a కావలికోట జూన్ 15, 2004 సంచికలోని 29-31 పేజీల్లో ఉన్న “పాఠకుల ప్రశ్నలు” చూడండి.