జీవిత కథ
యెహోవా ఆశీర్వాదాలు నా జీవితాన్ని సుసంపన్నం చేశాయి
కెనడాలో సస్కత్‌చెవాన్‌లోని వాకా అనే ఓ చిన్న పల్లెటూర్లో 1927లో నేను పుట్టాను. మా అమ్మానాన్నలకు మేము ఏడుగురు పిల్లలం, నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అలా ఎక్కువ మందితో ఉండడం చిన్నప్పుడే నాకు అలవాటైంది.
అయితే 1930లలో వచ్చిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభ ప్రభావం మా కుటుంబం మీద కూడా పడింది. మేము డబ్బున్నవాళ్లం కాకపోయినా, ఏరోజూ తిండికి లోటు రాలేదు. మాకు కొన్ని కోళ్లు, ఒక ఆవు ఉండడంవల్ల ఇంట్లో ఎప్పుడూ గుడ్లు, పాలు, వెన్న, జున్ను వంటివి ఉండేవి. అలాగే ఇంట్లో అందరికీ ఏదోక పని ఉండేది.
చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు నాకెన్నో ఉన్నాయి. మా గది అంతా కమ్మని ఆపిల్‌పండ్ల వాసనతో నిండిపోవడం నాకిప్పటికీ గుర్తుంది. మా నాన్న వసంత కాలంలో కోడిగుడ్లను, పాల పదార్థాలను అమ్మడానికి పట్టణానికి వెళ్లి, తిరిగొచ్చేటప్పుడు తాజా ఆపిల్‌పండ్ల బుట్ట కొనుక్కొచ్చేవాడు. మేమందరం రోజూ వాటిని తింటూ ఎంతో సంబరపడేవాళ్లం.
మా కుటుంబం సత్యం నేర్చుకోవడం
నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు సత్యం తెలుసుకున్నారు. వాళ్లకు మొదట జానీ అనే కొడుకు పుట్టి కొన్నిరోజులకే చనిపోయాడు. దాంతో వాళ్లు బాగా కృంగిపోయి స్థానిక పాస్టర్ దగ్గరకు వెళ్లి ‘మా జానీ ఇప్పుడు ఎక్కడున్నాడు?’ అని అడిగారు. దానికి ఆ పాస్టర్, ‘జానీకి బాప్తిస్మం ఇవ్వలేదు కాబట్టి పరలోకానికి వెళ్లలేదు. నాకు డబ్బులిస్తే మీ బాబు పరలోకానికి వెళ్లేలా ప్రార్థన చేస్తాను’ అని అన్నాడు. మా అమ్మానాన్నల స్థానంలో మీరుంటే మీకెలా అనిపించేది? అమ్మానాన్నలు బాగా నిరాశపడి, ఇంకెప్పుడూ ఆ పాస్టర్‌తో మాట్లాడలేదు. కానీ జానీ ఎక్కడున్నాడనే ఆలోచన మాత్రం వాళ్లను ఎప్పుడూ వెంటాడేది.
ఒకరోజు, యెహోవాసాక్షులు ప్రచురించిన ‘మృతులు ఎక్కడ ఉన్నారు?’ (ఇంగ్లీషు) అనే చిన్న పుస్తకం అమ్మకు దొరికింది. ఆమె దాన్ని ఎంతో ఆత్రుతతో చదివి, నాన్న ఇంటికొచ్చాక ఉత్సాహంగా ఇలా అంది, “జానీ ఎక్కడున్నాడో నాకు తెలిసింది! వాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు, కానీ ఏదోకరోజు తిరిగి లేస్తాడు.” ఆ రోజు సాయంత్రం నాన్న కూడా ఆ చిన్న పుస్తకం మొత్తం చదివేశాడు. చనిపోయినవాళ్లు నిద్రపోతున్నారని, భవిష్యత్తులో మళ్లీ బ్రతుకుతారని బైబిలు చెప్తుందని తెలుసుకుని అమ్మానాన్నలు ఎంతో ఓదార్పు పొందారు.—ప్రసం. 9:5, 10; అపొ. 24:14, 15.
ఆ విషయం మాకెంతో ఊరటను, సంతోషాన్ని ఇచ్చి మా జీవితాల్లో మంచి మార్పును తీసుకొచ్చింది. అమ్మానాన్నలు యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకుంటూ, వాకాలో ఉన్న చిన్న సంఘంతో సహవసించేవాళ్లు. ఆ సంఘంలో ఎక్కువమంది యుక్రెయిన్‌కు చెందినవాళ్లు ఉండేవాళ్లు. కొంతకాలానికే అమ్మానాన్నలు ప్రకటనా పనిలో పాల్గొనడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత కొంతకాలానికి మేము బ్రిటీష్ కొలంబియాకు వెళ్లి స్థిరపడ్డాం. అక్కడ ఓ సంఘంలోని సహోదరసహోదరీలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. మా కుటుంబమంతా కలిసి ఆదివారం జరిగే కావలికోట అధ్యయనానికి సిద్ధపడడం నాకిప్పటికీ గుర్తే. దానివల్ల మా అందరిలో యెహోవాపట్ల,
సత్యంపట్ల ప్రేమ మరింత పెరిగింది. మా జీవితాలు ఎలా సంతోషభరితం అవుతున్నాయో, యెహోవా మమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడో నేను చూడగలిగాను.మేము పిల్లలం కాబట్టి మా నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడడానికి భయమేసేది. అయితే నేనూ, మా చెల్లి ఈవ కలిసి పరిచర్యలో ఆ నెలలో ఇవ్వాల్సిన ప్రచురణను ఎలా అందించాలో సిద్ధపడి, సేవాకూటంలో ప్రదర్శించేవాళ్లం. దానివల్ల మా భయం పోయింది, అంతేకాదు ఇతరులతో మాట్లాడాలంటే సిగ్గుపడే మేము బైబిలు గురించి చక్కగా మాట్లాడడం నేర్చుకున్నాం. అలాంటి చక్కని శిక్షణ ఇచ్చినందుకు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని.
చిన్నప్పుడు మాకు చాలా సంతోషాన్నిచ్చిన విషయాల్లో ఒకటి, పూర్తికాల సేవకులు మా ఇంట్లో ఉండడం. ఉదాహరణకు, మా ప్రాంతీయ పర్యవేక్షకుడు జాక్ నేథన్ మా సంఘాన్ని సందర్శించేటప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు. ఆయన ఎన్నో అనుభవాలు చెప్తుంటే మేము ఇష్టంగా వినేవాళ్లం. ఆయన మమ్మల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ చెప్పిన మాటలు యెహోవాను నమ్మకంగా సేవించాలనే కోరికను మాలో కలిగించాయి.
“పెద్దయ్యాక నేను నేథన్ బ్రదర్‌లా అవ్వాలి” అని అనుకునేదాన్ని. అయితే ఆయన ఆదర్శం, పూర్తికాల సేవను జీవితంగా చేసుకునేలా నన్ను సిద్ధం చేస్తోందని నాకప్పుడు తెలీదు. నాకు 15 ఏళ్లు వచ్చేసరికి యెహోవా సేవ చేయాలని నిశ్చయించుకున్నాను. 1942లో నేనూ, ఈవ బాప్తిస్మం తీసుకున్నాం.
మా విశ్వాసానికి ఎదురైన పరీక్షలు
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగుతోంది. స్కాట్ అనే ఓ స్కూలు టీచరు, జెండా వందనం చేయలేదని మా ఇద్దరు చెల్లెళ్లనీ, తమ్ముడినీ స్కూలు నుండి తీసేసింది. ఆ తర్వాత ఆమె మా టీచరును కలిసి, నన్ను కూడా స్కూలు నుండి తీసేయమని చెప్పింది. అందుకు మా టీచరు, “మనం స్వతంత్ర దేశంలో జీవిస్తున్నాం, దేశభక్తి ఆచారాల్లో పాల్గొనాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది” అని ఆమెతో చెప్పింది. ఆమె ఎంత ఒత్తిడి చేసినా మా టీచరు మాత్రం “ఇది నా నిర్ణయం” అని తెగేసి చెప్పింది.
అందుకు స్కాట్, ‘నిర్ణయం తీసుకునేది నువ్వుకాదు, మలీటను స్కూలు నుండి తీసేయకపోతే నీమీద ఫిర్యాదు చేస్తా’ అని చెప్పింది. దాంతో మా టీచరు మా అమ్మానాన్నలను పిలిపించి, తప్పని తెలిసినా ఉద్యోగం నిలబెట్టుకోవడం కోసం నన్ను స్కూలు నుండి తీసేయక తప్పట్లేదని వివరించింది. మమ్మల్ని స్కూలు నుండి తీసేసినా, పుస్తకాలు తెచ్చుకుని ఇంట్లోనే ఉండి చదువుకున్నాం. తర్వాత కొంతకాలానికే, మేము 32 కి.మీ. దూరంలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లిపోయి అక్కడ ఇంకో స్కూల్లో చేరాం.
యుద్ధ సమయంలో మన ప్రచురణలపై నిషేధం ఉన్నా, మేము బైబిలు ఉపయోగిస్తూ ఇంటింటి పరిచర్య చేశాం. దానివల్ల కేవలం లేఖనాలనే ఉపయోగిస్తూ రాజ్య సువార్త ఎలా ప్రకటించాలో చక్కగా నేర్చుకున్నాం. మేం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, యెహోవా మద్దతును రుచి చూడడానికి అది ఎంతో సహాయం చేసింది.
పూర్తికాల సేవ మొదలుపెట్టాను
నేను, ఈవ స్కూలు చదువులు అవ్వగానే పయినీరు సేవ మొదలుపెట్టాం. ఖర్చుల కోసం నేను మొదట్లో ఓ షాపులో పని చేశాను, ఆ తర్వాత హెయిర్ కట్టింగ్‌లో ఆరునెలల కోర్సు చేశాను. అప్పుడప్పుడూ సరదాగా ఇంట్లో కూడా ఆ పని చేసేదాన్ని. వారంలో రెండు రోజులు ఓ హెయిర్ సెలూన్లో పని చేస్తూ, నెలలో రెండు సార్లు ఇతరులకు దాన్ని నేర్పించేదాన్ని. అలా నా పూర్తికాల సేవ కోసం అవసరమైన డబ్బు సంపాదించేదాన్ని.
నేను 1955లో, న్యూయార్క్‌లో అలాగే జర్మనీలోని న్యూరెమ్బర్గ్లో జరగబోతున్న “విజయవంతమైన రాజ్యం” అనే సమావేశాలకు వెళ్లాలనుకున్నాను. ఆ సమయంలోనే బ్రదర్ నేథన్ నార్, తన భార్యతో కలిసి కెనడాలోని వాంకోవర్‌లో జరుగుతున్న ఓ సమావేశానికి వచ్చాడు. అప్పుడు నేను
ఆయన భార్యకు హెయిర్ కటింగ్ చేశాను. ఆయనకు నా పని నచ్చి నన్ను కలవాలనుకున్నాడు. మాటల మధ్యలో, నేను జర్మనీ వెళ్లే ముందు న్యూయార్క్ కూడా వెళ్లాలనుకుంటున్నానని ఆయనతో అన్నాను. అప్పుడు ఆయన నన్ను బ్రూక్లిన్ బెతెల్‌లో తొమ్మిది రోజులపాటు పని చేయడానికి రమ్మని ఆహ్వానించాడు.న్యూయార్క్ వెళ్లడం నా జీవితాన్ని మార్చేసింది. అక్కడ నేను థీయడోర్ (టెడ్) జారస్ అనే ఓ యువ సహోదరుణ్ణి కలిశాను. పరిచయమైన కాసేపటికే ఆయన నన్ను, “మీరు పయినీరా?” అని అడగడంతో నేను ఆశ్చర్యపోయి “కాదు” అని చెప్పాను. మా మాటలు వింటున్న నా స్నేహితురాలు లవొన్ మధ్యలో కలుగజేసుకుని ‘ఆమె పయినీరే’ అని చెప్పింది. దానికి టెడ్, ‘ఎవరికి బాగా తెలుసు, మీకా లేదా ఆమెకా?’ అని లవొన్ను అడిగాడు. అప్పుడు నేను, అంతకుముందు పయినీరింగ్ చేసేదాన్ననీ, సమావేశాల నుండి తిరిగివెళ్లగానే మళ్లీ మొదలుపెట్టాలని అనుకుంటున్నాననీ ఆయనకు చెప్పాను.
ఆధ్యాత్మిక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను
టెడ్ 1925లో అమెరికాలోని కెంటకీలో పుట్టాడు. తనకు 15 ఏళ్లప్పుడు యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాడు. తన కుటుంబంలో ఎవ్వరూ సత్యంలో లేకపోయినా, బాప్తిస్మం తీసుకున్న రెండేళ్లకు పయినీరు సేవ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి ఆయన దాదాపు 67 ఏళ్లపాటు పూర్తికాల సేవ చేశాడు.
ఆయనకు 20 ఏళ్లున్నప్పుడు అంటే 1946 జూలైలో, వాచ్‌టవర్ బైబిల్స్కూల్ ఆఫ్ గిలియడ్ 7వ తరగతికి హాజరయ్యాడు. ఆ తర్వాత ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో ప్రయాణ పర్యవేక్షకునిగా సేవ చేశాడు. అలా దాదాపు నాలుగేళ్లు సేవ చేసిన తర్వాత, ఆయన్ను ఆస్ట్రేలియా బ్రాంచి సేవకునిగా నియమించారు.
జర్మనీలోని న్యూరెమ్బర్గ్లో జరిగిన సమావేశానికి టెడ్ కూడా వచ్చాడు, అక్కడ మేమిద్దరం కలిసి సమయం గడిపాం. మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం. ఆయన మనస్ఫూర్తిగా యెహోవాను సేవించడమే లక్ష్యంగా పెట్టుకున్నందుకు నేను ఎంతో సంతోషించాను. టెడ్‌కు అంకిత భావం, దైవభక్తి ఎక్కువ, అందరితో దయగా, స్నేహంగా ఉంటాడు. తన గురించికన్నా ఇతరుల గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. సమావేశం అయిపోయాక, టెడ్ ఆస్ట్రేలియాకు, నేను కెనడాలోని వాంకోవర్‌కు వెళ్లిపోయాం. మేమిద్దరం దూరంగా ఉన్నా ఉత్తరాల ద్వారా మాట్లాడుకునేవాళ్లం.
ఆస్ట్రేలియాలో దాదాపు ఐదేళ్లు సేవ చేశాక టెడ్ అమెరికాకు తిరిగొచ్చాడు. ఆ తర్వాత పయినీరుగా వాంకోవర్‌కు వచ్చాడు. ఆయన మా కుటుంబ సభ్యులకు కూడా బాగా నచ్చాడు. మా అన్నయ్య మైఖేల్ నా విషయంలో చాలా శ్రద్ధ చూపించేవాడు. నన్ను ఎవరైనా ఇష్టపడుతుంటే, నేనెక్కడ తొందరపడి నిర్ణయం తీసుకుంటానేమో అని కంగారుపడేవాడు. కానీ ఆయనకు టెడ్ మాత్రం వెంటనే నచ్చాడు. అన్నయ్య నాతో, “మలీట, నీకో మంచి మనిషి దొరికాడు. ఆయన్ని బాగా చూసుకో, ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకు” అని అన్నాడు.
నేను టెడ్‌ను చాలా ఇష్టపడ్డాను, మేము 1956 డిసెంబరు 10న పెళ్లి చేసుకున్నాం. ఇద్దరం కలిసి వాంకోవర్‌లో, ఆ తర్వాత కాలిఫోర్నియాలో పయినీర్లుగా సేవ చేశాం. ఆ తర్వాత మమ్మల్ని మిస్సోరి, అర్కన్సాస్ రాష్ట్రాలకు ప్రాంతీయ సేవ కోసం పంపించారు. అలా మేము దాదాపు 18 ఏళ్లపాటు అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ప్రయాణ సేవ చేశాం. అప్పుడు మేము ఒక్కోవారం ఒక్కో ఇంట్లో ఉండేవాళ్లం. ప్రయాణ సేవలో అలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నా, పరిచర్యలో మాకు ఎదురైన ఎన్నో మంచి అనుభవాల వల్ల, తోటి సహోదరసహోదరీల సహవాసం వల్ల ఆ సేవలో ఆనందంగా కొనసాగాం.
టెడ్‌లో నాకు బాగా నచ్చేది ఏమిటంటే, యెహోవాతో తనకున్న సంబంధాన్ని ఆయనెప్పుడూ తేలిగ్గా తీసుకోలేదు. విశ్వంలోనే అత్యంత గొప్ప వ్యక్తికి పవిత్ర సేవ చేయడాన్ని ఆయన చాలా విలువైనదిగా ఎంచాడు. కలిసి బైబిలు చదవడం, అధ్యయనం చేయడం అంటే మాకు చాలా ఇష్టం. రోజూ రాత్రి పడుకోబోయే ముందు, మా మంచం పక్కన మేమిద్దరం కలిసి మోకాళ్ల మీద ప్రార్థన చేసుకునేవాళ్లం. ఆ తర్వాత మళ్లీ ఎవరికివాళ్లం ప్రార్థన చేసుకునేవాళ్లం. అప్పుడప్పుడు టెడ్ మంచం
మీద నుంచి లేచి మళ్లీ మోకాళ్ల మీద చాలాసేపు ప్రార్థించేవాడు. దాన్నిబట్టి ఆయన ఏదో ముఖ్యమైన విషయం గురించి ఆందోళన పడుతున్నాడని నాకు అర్థమయ్యేది. ఆయన ప్రతీ విషయం గురించి అది చిన్నదైనా, పెద్దదైనా యెహోవాకు ప్రార్థించడం నాకు చాలా నచ్చేది.పెళ్లైన కొన్నేళ్లకు టెడ్ ఓ రోజు, తాను జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించబోతున్నానని నాకు చెప్పాడు. ‘నేను అలా చేయడం యెహోవా చిత్తమని నిర్ధారించుకోవడానికి తీవ్రంగా ప్రార్థించాను’ అని ఆయన నాతో అన్నాడు. ఆయన పరలోకానికి వెళ్తాడని తెలిసినప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. క్రీస్తు సహోదరుల్లో ఒకరికి మద్దతివ్వడాన్ని నేను గొప్ప గౌరవంగా భావించాను.—మత్త. 25:35-40.
ఓ కొత్త నియామకం
టెడ్‌ను 1974లో యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా నియమించినప్పుడు మాకు చాలా ఆశ్చర్యమనిపించింది. కొంతకాలానికి మమ్మల్ని బ్రూక్లిన్ బెతెల్‌లో సేవ చేయడానికి రమ్మని ఆహ్వానించారు. అక్కడ టెడ్ పరిపాలక సభ సభ్యునిగా తన బాధ్యతలు నిర్వహించేవాడు, నేను గదులు శుభ్రం చేసేదాన్ని లేదా హెయిర్ సెలూన్లో పని చేసేదాన్ని.
టెడ్, తన నియామకంలో భాగంగా వేర్వేరు బ్రాంచీలను సందర్శించేవాడు. ముఖ్యంగా ఆయనకు ప్రకటనా పనిపై నిషేధం ఉన్న దేశాలను అంటే సోవియట్ యూనియన్ అధికారం కిందవున్న తూర్పు యూరప్ దేశాల వంటివాటిని సందర్శించడమంటే ఇష్టం. ఒకసారి మేము సెలవు తీసుకుని స్వీడన్ వెళ్లాం. అప్పుడు ఆయన నాతో “మలీట, పోలండ్‌లో ప్రకటనా పనిపై నిషేధం ఉంది, అక్కడికి వెళ్లి సహోదరులకు సహాయం చేయాలనుంది” అని అన్నాడు. దాంతో మేము వీసాలు సంపాదించి, పోలండ్ వెళ్లాం. అక్కడ మన పనిని చూసుకుంటున్న కొంతమంది సహోదరులను టెడ్ కలిశాడు. తమ మాటల్ని ఎవ్వరూ వినకూడదని వాళ్లు చాలా దూరం నడిచి వెళ్లి మాట్లాడుకున్నారు. వాళ్లు నాలుగు రోజులపాటు బాగా చర్చించుకున్నారు. తోటి సహోదరసహోదరీలకు సహాయం చేసినందుకు టెడ్ పొందిన సంతృప్తిని చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఆ తర్వాత మళ్లీ మేము 1977 నవంబరులో పోలండ్ వెళ్లాం. సహోదరులు ఎఫ్. డబ్ల్యూ. ఫ్రాంజ్, డానియల్ సిడ్లిక్, టెడ్ పరిపాలక సభ తరఫున మొదటిసారి ఆ దేశాన్ని సందర్శించారు. అప్పటికి ఇంకా అక్కడ మన పనిపై నిషేధం ఉన్నా, వాళ్లు స్థానిక పర్యవేక్షకులతో, పయినీర్లతో, వేర్వేరు నగరాల్లో ఎంతోకాలంగా సత్యంలో ఉన్న సహోదరులతో మాట్లాడగలిగారు.
ఆ తర్వాతి సంవత్సరం టెడ్, సహోదరుడు మిల్టన్ హెన్షల్ పోలండ్ వెళ్లినప్పుడు మనల్ని, మన కార్యకలాపాల్ని అంతగా వ్యతిరేకించని అధికారుల్ని కలిసి మాట్లాడారు. దాంతో 1982లో పోలండ్ ప్రభుత్వం, ఒకరోజు సమావేశాలను జరుపుకోవడానికి అనుమతినిచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం పెద్ద సమావేశాలు జరిగాయి, వాటిలో చాలావాటిని అద్దె హాళ్లలో నిర్వహించారు. మన పనిపై నిషేధం ఉన్నా 1985లో పోలండ్ ప్రభుత్వం, నాలుగు సమావేశాలను పెద్దపెద్ద స్టేడియాల్లో జరుపుకోవడానికి అనుమతించింది. మరింత పెద్ద సమావేశాల కోసం ఏర్పాట్లు జరుగుతుండగా 1989 మే నెలలో, పోలండ్‌లోని యెహోవాసాక్షులకు అధికారిక గుర్తింపు వచ్చింది. టెడ్‌కు ఎంతో సంతోషాన్నిచ్చిన సందర్భం అది.
టెడ్ అనారోగ్యం
మేము 2007లో దక్షిణాఫ్రికా బ్రాంచి డెడికేషన్‌కు వెళ్తుండగా, ఇంగ్లండ్‌లో టెడ్‌కు బి.పి. ఎక్కువైంది. దాంతో మా ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని డాక్టరు సలహా ఇచ్చాడు. టెడ్ కోలుకున్నాక మేము అమెరికాకు తిరిగొచ్చాం. కానీ కొన్ని వారాల తర్వాత ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శరీరంలోని కుడి భాగం చచ్చుబడిపోయింది.
టెడ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది, మొదట్లో ఆఫీసుకు కూడా వెళ్లలేకపోయేవాడు. అయితే మామూలుగానే మాట్లాడగలుగుతున్నందుకు మేము సంతోషించాం. శరీరం సహకరించకపోయినా ఎప్పటిలా తన పనుల్ని చేసుకోవడానికి ప్రయత్నించేవాడు, ప్రతీవారం జరిగే పరిపాలక సభ మీటింగ్‌లో కూడా ఫోన్ ద్వారా పాల్గొనేవాడు.
బెతెల్‌లో ఆయనకు చక్కని ఫిజియోథెరఫీ చేశారు, దానికి టెడ్ ఎంతో కృతజ్ఞత చూపించేవాడు. మెల్లగా ఆయన కాలు, చేయి పనిచేయడం మొదలుపెట్టాయి. దాంతో తన బాధ్యతల్లో కొన్నిటిని సొంతంగా చేసుకోగలిగాడు. ఎన్ని ఇబ్బందులున్నా టెడ్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు.
మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన 2010, జూన్ 9, బుధవారం రోజున చనిపోయాడు. ఆయన భూజీవితం ఏదోక రోజు ముగుస్తుందని తెలిసినా, ఆయన దూరమైనందుకు నాకు ఎంత బాధగా ఉందో మాటల్లో చెప్పలేను. ఆయన నాకు ఎప్పుడూ గుర్తొస్తుంటాడు. అయినా నేనింతకాలం టెడ్‌కు తోడుగా ఉన్నందుకు యెహోవాకు రోజూ కృతజ్ఞతలు చెప్తుంటాను. మేమిద్దరం కలిసి 53 కన్నా ఎక్కువ సంవత్సరాలు ఆనందంగా పూర్తికాల సేవ చేశాం. నా పరలోక తండ్రికి మరింత దగ్గరవ్వడానికి టెడ్ నాకు సహాయం చేసినందుకు కూడా యెహోవాకు కృతజ్ఞతలు చెప్తుంటాను. టెడ్ ఇప్పుడు తన కొత్త నియామకంలో ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని పొందుతున్నాడని ఉంటాడని నాకు తెలుసు.
కొత్త సవాళ్లు
టెడ్‌తో ఎన్నో సంవత్సరాలు బిజీగా, సంతోషంగా గడిపాక ఇప్పుడు ఒంటరి జీవితానికి అలవాటుపడడం కొంచెం కష్టంగా ఉంది. బెతెల్ చూడడానికి వచ్చేవాళ్లను, మా రాజ్యమందిరానికి వచ్చే కొత్తవాళ్లను కలవడమంటే నాకూ టెడ్కూ చాలా ఇష్టం. కానీ టెడ్ ఇప్పుడు నాతో లేడు, పైగా నేను ఇంతకుముందు ఉన్నంత బలంగా కూడా లేను. దాంతో ఎక్కువమందిని కలవలేకపోతున్నాను. అయినా, బెతెల్‌లో అలాగే సంఘంలో తోటి సహోదరసహోదరీలతో ఇప్పటికీ సంతోషంగా సమయం గడుపుతున్నాను. బెతెల్ సేవ నాకిప్పుడు కాస్త కష్టంగా ఉన్నా, ఈ విధంగా యెహోవా సేవ చేయగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు, ప్రకటనా పనిపై నాకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నేను అలిసిపోతున్నా, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా వీధి సాక్ష్యంలో పాల్గొంటూ, బైబిలు అధ్యయనాలు చేస్తూ ఎంతో సంతృప్తి పొందుతున్నాను.
లోకంలో జరుగుతున్న ఘోరాల్ని చూసినప్పుడు, అంత మంచి భర్తతో కలిసి యెహోవా సేవ చేయగలిగినందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. యెహోవా ఆశీర్వాదాలు నిజంగా నా జీవితాన్ని సుసంపన్నం చేశాయి.—సామె. 10:22.