రాజ్యపరిపాలనలో వంద ఏళ్లు!
‘సమాధానకర్తయగు దేవుడు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక.’—హెబ్రీ. 13:20, 21.
1. దేవుని రాజ్యం గురించి ప్రకటించడమంటే యేసుకు ఇష్టమని ఎలా చెప్పవచ్చు?
దేవుని రాజ్యం గురించి మాట్లాడడమంటే యేసుకు చాలా ఇష్టం. ఆయన భూమ్మీదున్నప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా దేవుని రాజ్యం గురించే మాట్లాడాడు. పరిచర్య చేస్తున్నప్పుడు, 100 కన్నా ఎక్కువసార్లు రాజ్యం గురించి ప్రస్తావించాడు. అవును, దేవుని రాజ్యం యేసుకు చాలా ముఖ్యమైన విషయం.—మత్తయి 12:34 చదవండి.
2. మత్తయి 28:19, 20 లో ఉన్న ఆజ్ఞను యేసు ఎంతమందికి ఇచ్చివుంటాడు? అలాగని ఎందుకు చెప్పవచ్చు? (అధస్సూచి చూడండి.)
2 యేసు పునరుత్థానమైన వెంటనే, 500 కన్నా ఎక్కువమంది ఉన్న ఓ గుంపును కలిశాడు. (1 కొరిం. 15:6) ఆయన బహుశా ఆ సమయంలోనే, ‘సమస్త జనులకు’ సువార్త ప్రకటించమనే ఆజ్ఞ ఇచ్చివుంటాడు. అయితే అది అంత తేలికైన పని కాదు. a ఆ ప్రకటనా పని చాలాకాలం పాటు, అంటే “యుగసమాప్తి వరకు” కొనసాగుతుందని యేసు చెప్పాడు. మీరు ప్రకటనా పనిలో పాల్గొంటున్నప్పుడు ఆ ప్రవచన నెరవేర్పులో భాగం వహిస్తున్నారు.—మత్త. 28:19, 20.
3. సువార్త ప్రకటించడానికి మనకు ఏ మూడు విషయాలు సహాయం చేశాయి?
3 ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత యేసు తన అనుచరులతో ఇలా అన్నాడు, ‘నేను మీతో కూడ ఉన్నాను.’ (మత్త. 28:20) కాబట్టి ప్రకటనాపనిని నిర్దేశిస్తానని, ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి సహాయం చేస్తానని యేసు వాళ్లకు మాటిచ్చాడు. అంతేకాదు, యెహోవా కూడా మనకు తోడుగా ఉన్నాడు, ప్రకటించడానికి అవసరమైన ‘ప్రతి మంచి విషయాన్ని’ ఆయన మనకిచ్చాడు. (హెబ్రీ. 13:20, 21) అలాంటి మంచి విషయాల్లో మూడింటి గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిద్దాం. అవి, (1) ప్రకటనా పనిలో మనం ఉపయోగించిన పరికరాలు, (2) పద్ధతులు, (3) మనం పొందిన శిక్షణ. ముందుగా, మనం గత 100 ఏళ్లలో ప్రకటనా పనిలో ఉపయోగించిన పరికరాల గురించి చూద్దాం.
ప్రకటనా పనిలో సహాయపడిన పరికరాలు
4. ప్రకటనా పనిలో మనం ఎందుకు రకరకాల పరికరాలను ఉపయోగించాం?
4 యేసు రాజ్యసందేశాన్ని వివిధ రకాల నేలల్లో విత్తిన విత్తనాలతో పోల్చాడు. (మత్త. 13:18, 19) నేలను సిద్ధం చేయడానికి ఓ రైతు రకరకాల పనిముట్లను ఉపయోగిస్తాడు. అదేవిధంగా మనం ప్రకటనా పనిలో ఉపయోగించడానికి మన రాజైన యేసు ఎన్నో పరికరాలు ఇచ్చాడు. అవి రాజ్యసందేశాన్ని అంగీకరించేలా లక్షలమంది హృదయాల్ని సిద్ధం చేశాయి. వాటిలో కొన్నిటిని కొంతకాలంపాటు ఉపయోగించాం, మరికొన్నిటిని ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నాం. అయితే ఆ పరికరాలన్నీ పరిచర్యలో మన నైపుణ్యాలను పెంచుకోవడానికి సహాయం చేశాయి.
5. సాక్ష్యపు కార్డులు అంటే ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించేవాళ్లు?
5 ప్రచారకులు 1933లో సాక్ష్యపు కార్డులను ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రకటనా పని మొదలుపెట్టడానికి చాలామందికి ఈ చిన్న కార్డు సహాయం చేసింది. సాక్ష్యపు కార్డుపై క్లుప్తంగా, స్పష్టంగా రాసివున్న బైబిలు సందేశం ఉండేది. కొన్నిసార్లు వేరే సందేశంతో కొత్త కార్డులను తయారుచేసేవాళ్లు. 10 ఏళ్ల వయసులో ఆ సాక్ష్యపు కార్డును మొదటిసారిగా ఉపయోగించిన ఎర్లన్మైయర్ అనే సహోదరుడు ఇలా చెప్పాడు, “మేము మొదట, ‘దయచేసి ఈ కార్డు చదువుతారా’ అని అడిగేవాళ్లం. గృహస్థుడు ఆ కార్డు చదివిన తర్వాత ప్రచురణలు ఇచ్చి వెళ్లిపోయేవాళ్లం.”
6. సాక్ష్యపు కార్డులను ఉపయోగించడం ద్వారా ప్రచారకులు ఎలా ప్రయోజనం పొందారు?
6 ఈ సాక్ష్యపు కార్డులు ప్రచారకులకు చాలా రకాలుగా సహాయం చేశాయి. ఉదాహరణకు, ప్రకటించాలనే కోరిక ఉన్నా కొంతమంది పరిచర్యకు వెళ్లాలంటే భయపడేవాళ్లు, వాళ్లకు ఏమి మాట్లాడాలో తెలిసేది కాదు. మరికొంతమంది ప్రచారకులు మాత్రం చాలా ధైర్యంగా ఉండేవాళ్లు, వాళ్లకు తెలిసిందంతా కొద్ది నిమిషాల్లోనే ఇంటివాళ్లకు చెప్పేసేవాళ్లు. కానీ వాళ్లు అంత నేర్పుగా ప్రకటించగలిగేవాళ్లు కాదు. అయితే సాక్ష్యపు కార్డులను ఉపయోగించడం ద్వారా ప్రచారకులందరూ రాజ్య సందేశాన్ని స్పష్టంగా, సరళంగా ప్రకటించగలిగారు.
7. సాక్ష్యపు కార్డులను ఉపయోగించడంలో ఏ సవాళ్లు ఉండేవి?
7 అయితే సాక్ష్యపు కార్డులను ఉపయోగించడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రేస్ ఈస్టెప్ అనే సహోదరి ఇలా చెప్పింది, ‘ఈ కార్డు ఇచ్చి చదవమని చెప్పినప్పుడు కొంతమంది గృహస్థులు “ఈ కార్డులో ఏముందో మీరే చెప్పవచ్చుగా” అనేవాళ్లు.’ అంతేకాదు, కొంతమంది గృహస్థులకు చదువురాదు. ఇంకొంతమందైతే కార్డు తీసేసుకుని ఇంట్లోకి వెళ్లిపోయేవాళ్లు. మరికొంతమంది మన సందేశం నచ్చక ఆ కార్డును చించేసేవాళ్లు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రచారకులు సాక్ష్యపు కార్డులను ఉపయోగిస్తూ తమ పొరుగువాళ్లకు ప్రకటించగలిగారు, రాజ్య సువార్తికులుగా గుర్తింపు పొందారు.
8. పోర్టబుల్ ఫోనోగ్రాఫ్లను ఎలా ఉపయోగించేవాళ్లు? (ప్రారంభ చిత్రం చూడండి.)
8 మనం 1930 తర్వాత ఉపయోగించిన మరో పరికరం పోర్టబుల్ ఫోనోగ్రాఫ్. కొంతమంది సాక్షులు దాన్ని అహరోను అని పిలిచేవాళ్లు, ఎందుకంటే వాళ్లకు బదులు అదే సువార్త ప్రకటించేది. (నిర్గమకాండము 4:14-16 చదవండి.) గృహస్థుడు వినడానికి ఒప్పుకుంటే, ప్రచారకులు ఫోనోగ్రాఫ్లో ఓ చిన్న బైబిలు ప్రసంగాన్ని వినిపించి, కొన్ని ప్రచురణల్ని ఇచ్చేవాళ్లు. కొన్నిసార్లు ప్రసంగాన్ని ప్లే చేస్తున్నప్పుడు కుటుంబంలోని వాళ్లందరూ వచ్చి వినేవాళ్లు. 1934లో వాచ్‌టవర్ సంస్థ, పరిచర్యలో ఉపయోగించడం కోసం పోర్టబుల్ ఫోనోగ్రాఫ్లను తయారు చేయడం మొదలుపెట్టింది. ప్రజలకు ఫోనోగ్రాఫ్ ద్వారా వినిపించడానికి సహోదరులు 92 వివిధ ప్రసంగాలను అందుబాటులో ఉంచారు.
9. ఫోనోగ్రాఫ్‌ను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
9 హిలరీ గొస్లన్ అనే ఒకాయన ఆ ప్రసంగాల్లో ఒకదాన్ని విన్నాడు. విన్న తర్వాత ఫోనోగ్రాఫ్ ఓ వారంపాటు తనకు కావాలని అడిగి తీసుకుని తన పొరుగువాళ్లకు బైబిలు ప్రసంగాల్ని వినిపించాడు. దానివల్ల చాలామంది సత్యం తెలుసుకుని బాప్తిస్మం తీసుకున్నారు. అంతేకాదు, గొస్లన్ వాళ్ల ఇద్దరు కూతుళ్లు కూడా ఆ తర్వాత గిలియడ్ పాఠశాలకు హాజరై మిషనరీలుగా సేవచేశారు. సాక్ష్యపు కార్డుల్లాగే ఈ ఫోనోగ్రాఫ్లు కూడా ప్రకటనా పనిని మొదలుపెట్టడానికి చాలామంది ప్రచారకులకు సహాయం చేశాయి. ఆ తర్వాతి కాలంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ద్వారా యెహోవా తన సేవకులకు శిక్షణనిచ్చి, పరిచర్య ఎలా చేయాలో నేర్పించాడు.
సాధ్యమైన ప్రతీ పద్ధతిని ఉపయోగించి ప్రకటిస్తున్నాం
10, 11. సువార్త ప్రకటించడానికి వార్తాపత్రికలు, రేడియో ఎలా ఉపయోగపడ్డాయి? అవి సమర్థవంతమైన పద్ధతులని ఎందుకు చెప్పవచ్చు?
10 రాజైన యేసుక్రీస్తు నడిపింపు కింద, దేవుని ప్రజలు వీలైనంత ఎక్కువ మందికి ప్రకటించడానికి రకరకాల పద్ధతుల్ని ఉపయోగించారు. ముఖ్యంగా, ప్రచారకులు తక్కువమంది ఉన్న కాలంలో ఆ పద్ధతులు చాలా ఉపయోగపడ్డాయి. (మత్తయి 9:37 చదవండి.) ఉదాహరణకు, వార్తాపత్రికల ద్వారా మనం సువార్త ప్రకటించాం. సహోదరుడు ఛార్లెస్ తేజ్ రస్సెల్ ప్రతీవారం ఓ బైబిలు ప్రసంగాన్ని రాసి ఓ వార్తా సంస్థకు పంపించేవాడు. వాళ్లు ఆ ప్రసంగాన్ని కెనడా, యూరప్, అమెరికాలోని వార్తాపత్రికల్లో ప్రచురించేవాళ్లు. సహోదరుడు రస్సెల్ ఇచ్చిన ప్రసంగాలు 1913 కల్లా 2,000 వార్తాపత్రికల్లో వచ్చాయి, వాటిని దాదాపు కోటి యాభై లక్షలమంది ప్రజలు చదివేవాళ్లు!
11 సువార్తను ప్రకటించడానికి రేడియో కూడా చక్కగా ఉపయోగపడింది. 1922, ఏప్రిల్ 16న సహోదరుడు రూథర్‌ఫర్డ్ రేడియోలో ప్రసంగించినప్పుడు దాదాపు 50,000 మంది విన్నారు. ఆ తర్వాత కొంతకాలానికే మనం డబ్ల్యూ.బి.బి.ఆర్. అనే సొంత రేడియో స్టేషన్‌ను మొదలుపెట్టాం. దాంట్లో మొదటి కార్యక్రమం 1924, ఫిబ్రవరి 24న ప్రసారమైంది. వాచ్ టవర్ డిసెంబరు 1, 1924 సంచిక ఇలా చెప్పింది, “సువార్త ప్రకటించడానికి ఇప్పటివరకు ఉపయోగించిన పద్ధతులన్నిటిలో రేడియో చాలా చౌక పద్ధతి, చక్కని పద్ధతి.” వార్తాపత్రికల్లాగే రేడియో కూడా, ప్రచారకులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువమందికి సువార్త చేరవేయడానికి సహాయం చేసింది.
12. (ఎ) బహిరంగ సాక్ష్యంలో మీకు ఏ పద్ధతి అంటే ఇష్టం? (బి) బహిరంగ సాక్ష్యమివ్వడంలో మీకున్న భయాల్ని ఎలా అధిగమించవచ్చు?
12 ప్రజలకు ప్రకటించడానికి మనం ఉపయోగిస్తున్న మరో పద్ధతి బహిరంగ సాక్ష్యం. బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, పార్కింగ్ స్థలాల్లో, మెయిన్ సెంటర్లలో, మార్కెట్లలో ప్రజలకు ప్రకటించడానికి మనం ఎంతో కృషిచేస్తున్నాం. బహిరంగ సాక్ష్యం ఇవ్వడానికి మీరు భయపడుతున్నారా? అయితే సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. మనిరా అనే ఓ ప్రయాణ పర్యవేక్షకుడు చెప్పిన ఈ మాటల్ని గమనించండి, “పరిచర్యలో వచ్చే ప్రతీ కొత్త పద్ధతిని, యెహోవాను సేవించేందుకు, ఆయనమీద మా నమ్మకాన్ని చూపించేందుకు ఓ మార్గంగా, మా యథార్థతకు ఓ పరీక్షగా భావించేవాళ్లం. యెహోవా అడిగే ఏ పద్ధతిలోనైనా ఆయన్ను సేవించడానికి మేము సిద్ధమేనని నిరూపించుకోవడానికి ప్రయత్నించేవాళ్లం.” మనం కూడా మన భయాల్ని అధిగమించి కొత్త పద్ధతుల్లో సువార్త ప్రకటించినప్పుడు యెహోవాపై మన నమ్మకాన్ని బలపర్చుకుంటాం, మరింత సమర్థవంతంగా ప్రకటించగలుగుతాం.—2 కొరింథీయులు 12:9, 10 చదవండి.
13. మన వెబ్‌సైట్‌ను ఉపయోగించి ప్రకటించడం ఎందుకు ఓ చక్కని పద్ధతి? దాన్ని ఉపయోగించి ప్రకటిస్తున్నప్పుడు మీకెలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?
13 చాలామంది ప్రచారకులు మన jw.org వెబ్సైట్ గురించి సంతోషంగా ప్రజలకు చెప్తున్నారు. ఆ వెబ్సైట్లో 700 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న బైబిలు సాహిత్యాన్ని చదవవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతీరోజు 16 లక్షలకన్నా ఎక్కువమంది మన వెబ్సైట్ చూస్తున్నారు. ఒకప్పుడు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు రేడియో ద్వారా సువార్త విన్నారు. ఇప్పుడు ఆ పని మన వెబ్సైట్ చేస్తుంది.
ప్రచారకులు శిక్షణ పొందుతున్నారు
14. ప్రచారకులకు ఎలాంటి శిక్షణ అవసరమైంది? అందుకు ఏ పాఠశాల వాళ్లకు సహాయం చేసింది?
14 మనం ఇప్పటివరకూ చర్చించిన పరికరాలు, పద్ధతులు పరిచర్యలో చాలా చక్కగా ఉపయోగపడ్డాయి. అయితే ప్రకటించాలంటే ప్రచారకులకు శిక్షణ కూడా అవసరం. ఉదాహరణకు, కొంతమంది గృహస్థులు ఫోనోగ్రాఫ్లో విన్న విషయాలకు అభ్యంతరం చెప్పేవాళ్లు. మరికొంతమంది ఎంతో ఆసక్తి చూపించి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకునేవాళ్లు. కాబట్టి అభ్యంతరం చెప్పేవాళ్లతో ఎలా నేర్పుగా మాట్లాడాలో, ఆసక్తి చూపించినవాళ్లకు సమర్థవంతంగా ఎలా బోధించాలో ప్రచారకులు నేర్చుకోవాలి. ఈ విషయంలో ప్రచారకులకు శిక్షణ అవసరమని పరిశుద్ధాత్మ నడిపింపుతో సహోదరుడు నార్ గుర్తించాడు. దాంతో 1943లో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మొదలైంది. సమర్థవంతంగా బోధించడానికి ప్రచారకులందరికీ ఈ పాఠశాల సహాయం చేసింది.
15. (ఎ) పాఠశాలలో ప్రసంగిస్తున్నప్పుడు కొంతమంది సహోదరసహోదరీలకు ఎలాంటి అనుభవం ఎదురైంది? (బి) కీర్తన 32:8లో ఉన్న యెహోవా వాగ్దానం మీ విషయంలో ఎలా నెరవేరింది?
15 చాలామంది సహోదరులకు ప్రేక్షకుల ముందు నిలబడి ప్రసంగాలిచ్చే అలవాటు లేదు. రామూ అనే ఓ సహోదరుడు 1944లో తాను మొదటిసారి ప్రసంగం ఇస్తున్నప్పుడు ఏమి జరిగిందో గుర్తుచేసుకున్నాడు. బైబిల్లో ఉన్న దొయేగు అనే వ్యక్తి గురించి ఆయన ప్రసంగం ఇవ్వాలి. ఆయన ఇలా చెప్పాడు, ‘నా కాళ్లు చేతులు వణుకుతున్నాయి, నా దవడలు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. నేను స్టేజీమీద నుండి ప్రసంగించడం అదే మొదటిసారి, కానీ నేను ప్రసంగం ఆపలేదు.’ కొంచెం కష్టంగా ఉన్నా పిల్లలుకూడా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ప్రసంగాలిచ్చేవాళ్లు. ఓ చిన్న పిల్లవాడు తన మొదటి ప్రసంగాన్ని ఇస్తున్నప్పుడు ఏమి జరిగిందో సహోదరుడు మనిరా గుర్తుచేసుకుంటున్నాడు, “ఆ అబ్బాయికి ఎంత భయం వేసిందంటే వెంటనే ఏడ్వడం మొదలుపెట్టాడు. కానీ ఎలాగైనా ప్రసంగాన్ని ఇవ్వాలన్న పట్టుదలతో ఏడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించాడు.” బహుశా మీరు కూడా ప్రసంగాలివ్వాలన్నా, కామెంట్స్ చెప్పాలన్నా భయపడుతుండవచ్చు, మీకు సామర్థ్యం లేదని అనిపించవచ్చు. అలాంటప్పుడు, మీ భయాల్ని అధిగమించడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మొదలైన కొత్తలో ప్రసంగాలివ్వడానికి భయపడ్డ సహోదరసహోదరీలకు సహాయం చేసినట్లే యెహోవా మీకు కూడా సహాయం చేస్తాడు.—కీర్తన 32:8 చదవండి.
16. గిలియడ్ పాఠశాల ఉద్దేశం ఏమిటి?
16 గిలియడ్ పాఠశాల ద్వారా కూడా దేవుని సంస్థ చక్కని శిక్షణ అందిస్తోంది. సువార్త ప్రకటించాలనే కోరికను మరింతగా బలపర్చడం ఆ పాఠశాల ఉద్దేశం. 1943 లో ఆ పాఠశాల మొదలైనప్పటి నుండి 8,500 మంది సహోదరసహోదరీలు ఆ పాఠశాల ద్వారా చక్కని శిక్షణ పొంది, 170 దేశాల్లో సేవచేస్తున్నారు. 2011 నుండి ప్రత్యేక పయినీర్లు, ప్రయాణ పర్యవేక్షకులు, బెతెల్ కుటుంబ సభ్యులు, గిలియడ్‌కు హాజరుకాని మిషనరీలు ఆ పాఠశాల ద్వారా శిక్షణ పొందుతున్నారు.
17. గిలియడ్ పాఠశాల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
17 గిలియడ్ పాఠశాల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? జపాన్‌లో ఏమి జరిగిందో పరిశీలించండి. 1949 ఆగస్టులో ఆ దేశంలో 10 మంది ప్రచారకులు కూడా లేరు. ఆ సంవత్సరం చివరికల్లా 13 మంది మిషనరీలు అక్కడి ప్రచారకులతో కలిసి ప్రకటనా పని చేయడం మొదలుపెట్టారు. జపాన్‌లో ఇప్పుడు దాదాపు 2,16,000 మంది ప్రచారకులున్నారు, వాళ్లలో దాదాపు సగంమంది పయినీర్లే!
18. మనకు శిక్షణ ఇచ్చేందుకు ఏ ఇతర పాఠశాలలు కూడా ఉన్నాయి?
18 మనం ఇతర పాఠశాలల ద్వారా కూడా శిక్షణ పొందుతున్నాం. అవి, రాజ్య పరిచర్య పాఠశాల, పయినీరు సేవా పాఠశాల, రాజ్య సువార్తికుల కోసం పాఠశాల, ప్రయాణ పర్యవేక్షకులకు వాళ్ల భార్యలకు పాఠశాల, బ్రాంచి కమిటీ సభ్యులకు వాళ్ల భార్యలకు పాఠశాల. ఈ పాఠశాలలు సహోదరసహోదరీలకు చక్కగా శిక్షణనిస్తూ వాళ్ల విశ్వాసాన్ని బలపర్చాయి. వీటన్నిటినీ చూస్తే రాజైన యేసు తన ప్రజలకు శిక్షణనిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.
19. ప్రకటనా పని గురించి సహోదరుడు రస్సెల్ ఏమని నమ్మాడు? అది ఎలా నిజమైంది?
19 దేవుని రాజ్యం ఇప్పటికే 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ వంద సంవత్సరాల్లో, రాజైన యేసుక్రీస్తు ప్రకటనా పనిని నిర్దేశిస్తూనే ఉన్నాడు. సువార్త ప్రపంచ నలుమూలలకూ చేరుతుందని 1916లోనే సహోదరుడు రస్సెల్ బలంగా నమ్మాడు. ఆయనిలా చెప్పాడు, “ప్రకటనా పని చాలా వేగంగా జరుగుతోంది, అది ఇంకా ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే రాజ్య సువార్త ప్రపంచవ్యాప్తంగా జరగాల్సివుంది.” (ఎ. హెచ్. మాక్మిలన్ రాసిన ఫెయిత్ ఆన్ ద మార్చ్, 69వ పేజీ) ఆ మాటలు నిజమవ్వడాన్ని మనం కళ్లారా చూస్తున్నాం. తన చిత్తం చేయడానికి కావాల్సిన ప్రతీదాన్ని మనకు ఇస్తున్నందుకు ‘సమాధానకర్త’ అయిన యెహోవాకు మనం రుణపడివున్నాం.
a ఆ 500 మందిలో చాలామంది క్రైస్తవులుగా మారివుంటారని చెప్పవచ్చు. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు వాళ్లను ‘ఐదు వందల సహోదరులు’ అని పిలిచాడు. వాళ్లగురించి ఆయనింకా ఇలా అన్నాడు, “వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచి యున్నారు, కొందరు నిద్రించిరి.” కాబట్టి యేసు ఇచ్చిన ఆజ్ఞను విన్న ఆ గుంపులోని చాలామంది పౌలుకు, ఇతర క్రైస్తవులకు తెలుసని అర్థమౌతోంది.