చనిపోయినవారికి ఏమవుతుంది?
చనిపోయినవారికి ఏమవుతుంది?
“చెడ్డవాళ్ళ ఆత్మలతో సహా ఆత్మలన్నీ చావులేనివే . . . అవన్నీ ఆరని మంటల్లో అంతులేకుండా కాలుతూ ఎప్పటికీ చావవు కాబట్టి వాటి బాధ ఎప్పటికీ [తీరదు].”—అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్, సా.శ. రెండు, మూడు శతాబ్దాల్లో జీవించిన రచయిత.
క్లెమెంట్‌లాగే నరకమంటే హింసించబడే స్థలమనే బోధను ప్రచారం చేసేవాళ్ళు, ఆత్మకు అంటే మనిషికి చావులేదని అనుకుంటారు. బైబిలు అదే బోధిస్తోందా? ఈ క్రింది ప్రశ్నలకు దేవుని వాక్యం ఏమని జవాబిస్తుందో చూడండి.
మొదటి మానవుడైన ఆదాము చావులేనివాడా? ఆదామును సృష్టించిన వెంటనే దేవుడాయనకు ఇలా ఆజ్ఞాపించాడు, “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆదికాండము 2:16, 17) ఆదాము చావులేనివాడు కాదు.
పాపం చేసిన ఆదాముకు చివరికి ఏమయ్యింది? దేవుడు ఆయనకు వేసిన శిక్ష నరకంలో ఎల్లకాలం హింసించబడడం కాదు. బదులుగా దేవుడిచ్చిన తీర్పు పవిత్ర గ్రంథము క్యాథలిక్ అనువాదములో ఇలావుంది, “పుట్టిన మట్టిలో కలిసిపోవువరకు నీవు నొసటిచెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకుందువు. నీవు మట్టినుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు.” (ఇటాలిక్కులు మావి; ఆదికాండము 3:19) దేవుడిచ్చిన తీర్పు, ఆదాములోని ఏదైనా ఒక భాగం చనిపోకుండా ఉంటుందని సూచించడంలేదు.
మనుషుల్లో ఎవరైనా చావులేనివారు ఉన్నారా? మనుషులు ఎవరూ చావులేనివారు కాదు. ప్రసంగి 3:20లో బైబిలు ఇలా చెబుతోంది, “సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.” అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించెను. పాపముద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవజాతి అంతటికిని మరణము వ్యాపించెను. ఏలయన మానవులందరును పాపము కట్టుకొనిరి.” (రోమీయులు 5:12, పవిత్ర గ్రంథము క్యాతలిక్ అనువాదము) మనుషులందరూ పాపులే, అందుకే మనుషులందరూ మరణిస్తున్నారు.
చనిపోయినవారికి ఏమైనా తెలుస్తుందా? దేవుని వాక్యం ఇలా చెబుతోంది, “సజీవులకు తాము చస్తామని తెలుసు. చచ్చినవారికి ఏమీ తెలియదు.” (ప్రసంగి 9:5, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) చనిపోయినప్పుడు మనిషికి ఏమవుతుందో చెబుతూ బైబిలు ఇలా అంటోంది, “వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.” (కీర్తన 146:4) చనిపోయినవారికి ‘ఏమీ తెలియకపోతే,’ వారి ‘సంకల్పములు నశిస్తే’, నరకంలో తాము హింసించబడుతున్నామని వాళ్ళకెలా తెలుస్తుంది?
యేసుక్రీస్తు, మరణాన్ని ఏదో విధంగా స్పృహలో ఉండడంతో పోల్చలేదు గానీ నిద్రతో పోల్చాడు. * (యోహాను 11:11-14) అయితే నరకం వేడిగా ఉంటుందనీ, పాపుల్ని నరకాగ్నిలో పడేస్తారనీ యేసు బోధించాడని చాలామంది వాదిస్తారు. నరకం గురించి యేసు నిజంగా ఏమి బోధించాడో మనం పరిశీలిద్దాం. (w08 11/1)
[అధస్సూచి]
^ పేరా 8 మరింత వివరణ కోసం 16, 17 పేజీల్లోవున్న “యేసునుండి మనం నేర్చుకోగల అంశాలు—చనిపోయినవారికి ఏ నిరీక్షణ ఉందని ఆయన చెప్పాడు?” అనే ఆర్టికల్ చూడండి.