న్యాయాన్ని ప్రేమించేవాడు
దేవునికి దగ్గరవ్వండి
న్యాయాన్ని ప్రేమించేవాడు
మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అన్యాయంగా లేదా క్రూరంగా బాధపెట్టారా? అలా చేసినవాళ్ళకు శిక్షపడడం లేదనీ, తప్పుచేశామనే పశ్చాత్తాపం కూడా వాళ్ళు చూపించడం లేదనీ మీకనిపించిందా? ముఖ్యంగా మనల్ని ప్రేమించి, మన గురించి శ్రద్ధ తీసుకుంటారని మనం ఆశిస్తున్నవాళ్ళే మనకు ఘోరంగా అన్యాయం చేస్తే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ‘దేవుడు అలా జరగడానికి ఎందుకు అనుమతిస్తున్నాడు?’ అని మీరనుకోవచ్చు. * వాస్తవమేమిటంటే యెహోవా దేవుడు అన్యాయాన్నంతటినీ అసహ్యించుకుంటాడు. ఇతరులకు బాధకలుగుతున్నా పట్టించుకోకుండా పదేపదే పాపం చేసేవాళ్ళు దేవుని తీర్పును తప్పించుకోలేరని ఆయన వాక్యమైన బైబిలు మనకు హామీ ఇస్తోంది. హెబ్రీయులు 10:26-31లో అపొస్తలుడైన పౌలు రాసిన మాటలను పరిశీలిద్దాం.
“మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు” అని పౌలు రాశాడు. (26వ వచనం) కావాలని పాపాలు చేసేవాళ్ళకు క్షమాపణ ఉండదు. ఎందుకు? మొదటి కారణమేమిటంటే, వాళ్ళు చేసిన ఆ పాపం, మన అపరిపూర్ణతను బట్టి కొన్నిసార్లు మనమందరం ఏదో ఒక బలహీన క్షణంలో చేసే పొరపాటులాంటిది కాదు. వాళ్ళు అలవాటుగా పాపాలు చేస్తారు. రెండవ కారణం, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తారు. పరిశుద్ధ బైబల్ ఈజీ-టు-రీడ్ వర్షన్ చెబుతున్నట్లుగా, వాళ్ళు ‘కావాలని పాపాలు చేస్తారు.’ చాలాకాలంపాటు అలవాటుగా పాపాలు చేయడం వల్ల చెడుతనం వాళ్ళలో భాగమైపోతుంది. మూడవ కారణమేమిటంటే, ఆ పాపాలు వాళ్ళు తెలియక చేసేవి కావు. దేవుడు కోరేవాటికి సంబంధించిన “సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము” వాళ్ళకుంది.
పశ్చాత్తాపపడకుండా ఘోరంగా పాపాలు చేసేవారి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? “పాపములకు బలి యికను ఉండదు” అని పౌలు చెప్పాడు. మనుష్యులందరికీ దేవుడు బహుమానంగా ఇచ్చిన క్రీస్తు బలి, అపరిపూర్ణతను బట్టి మనం చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. (1 యోహాను 2:1, 2) అయితే పశ్చాత్తాపపడకుండా అలవాటుగా పాపాలు చేసేవాళ్ళు ఈ అమూల్యమైన బహుమానమంటే తమకు లెక్కలేదని చూపిస్తారు. వాళ్ళు “దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి,” యేసు ‘రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నట్లు’ దేవుడు భావిస్తాడు. (29వ వచనం) వాళ్ళు తమ ప్రవర్తన ద్వారా తమకు యేసుపట్ల మర్యాదలేదని చూపిస్తారు, ఆయన రక్తాన్ని ‘నీచమైనదన్నట్లు’ లేదా అపరిపూర్ణ మానవ రక్తం కంటే ఏ మాత్రం విలువైనది కాదన్నట్లు ఎంచుతారు. (పవిత్ర గ్రంథము క్యాతలిక్ అనువాదము) కృతజ్ఞతలేని అలాంటివాళ్ళు క్రీస్తుబలి నుండి ప్రయోజనం పొందలేరు.
దుష్టులు తమకేమి జరుగుతుందని ఎదురుచూడవచ్చు? “పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును” అని న్యాయవంతుడైన దేవుడు మాటిచ్చాడు. (30వ వచనం) ఇతరులను బాధపెడుతూ అలవాటుగా తప్పుచేస్తున్న వాళ్ళందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుని నీతి సూత్రాలను పాటించనివాళ్ళెవ్వరూ శిక్ష తప్పించుకోలేరు. సాధారణంగా, వాళ్ళు తమ పాపాలకు పర్యవసానాలను అనుభవిస్తారు. (గలతీయులు 6:7) ప్రస్తుతం వాళ్ళు ఏ శిక్షా అనుభవించకపోయినప్పటికీ భవిష్యత్తులో ఈ భూమ్మీదున్న అన్యాయాన్ని దేవుడు తుడిచివేసేటప్పుడు వాళ్ళు ఆయనకు జవాబు చెప్పుకోవాలి. (సామెతలు 2:21, 22) “జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము” అని పౌలు హెచ్చరిస్తున్నాడు.—31వ వచనం.
యెహోవా దేవుడు కావాలని పాపాలు చేసేవాళ్ళను చూసీచూడనట్లు విడిచిపెట్టడని తెలుసుకోవడం, ముఖ్యంగా మనస్సాక్షి మొద్దుబారిన తప్పిదస్థుల వల్ల బాధించబడిన వారికి చాలా ఓదార్పును, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తప్పిదస్థులను శిక్షించడాన్ని మనం పూర్తి నమ్మకంతో దేవునికే విడిచిపెట్టవచ్చు, ఎందుకంటే ఆయన అన్యాయాన్నంతటినీ అసహ్యించుకుంటాడు. (w08 11/1)
[అధస్సూచి]
^ పేరా 4 దేవుడు బాధనెందుకు అనుమతిస్తున్నాడు అనే విషయంపై మరింత వివరణ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 106-114 పేజీలు చూడండి.