సర్వత్రా వ్యాపించివున్న నమ్మకం
సర్వత్రా వ్యాపించివున్న నమ్మకం
“నరకంలో కాలుతున్నట్లు నాకు పీడకలలు వచ్చేవి. నన్ను మంటల్లో పడేసినట్లు కల వచ్చి ఉలిక్కిపడి అరుస్తూ లేచేదాన్ని. పాపం చేయకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నించేదాన్నని వేరే చెప్పనక్కర్లేదు.”—ఆర్లీన్.
నరకం అంటే పాపులను హింసించే స్థలమని మీరనుకుంటున్నారా? చాలామంది అలాగే అనుకుంటారు. ఉదాహరణకు, దేవునికి దూరమైనవాళ్ళు “నరకంలో నిత్యం మానసిక ఆందోళనకు” గురవుతారని స్కాట్లాండుకు చెందిన మతనాయకుల్లో మూడోవంతు మంది నమ్ముతున్నారని స్కాట్లాండులోవున్న సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒక పండితుడు 2005లో కనుగొన్నాడు. నరకంలో శారీరకంగా హింసించబడతారని ఐదోవంతు మంది నమ్ముతున్నారు.
చాలా దేశాల్లో, అనేకమంది నరకం ఉందని నమ్ముతారు. ఉదాహరణకు, అమెరికాలో 2007లో ప్రజాభిప్రాయసేకరణ కోసం చేసిన సర్వేలో దాదాపు 70 శాతం మంది నరకం ఉందని నమ్ముతున్నట్లు తేలింది. మతానికి సంబంధించిన విషయాల గురించి అంతగా పట్టించుకోని దేశాల్లో కూడా ప్రజలు నరకం ఉందని నమ్ముతున్నారు. కెనడాలో 2004లో ప్రజాభిప్రాయసేకరణ కోసం చేసిన సర్వేలో 42 శాతం మంది నరకం ఉందని నమ్ముతున్నట్లు తేలింది. గ్రేట్ బ్రిటన్లో 32 శాతం మంది ఖచ్చితంగా నరకం ఉందని నమ్ముతున్నారు.
మతనాయకులు ఏమి బోధిస్తున్నారు?
చాలామంది మతనాయకులు నరకం అంటే భయంకరంగా హింసించే కొలిమిలాంటి నిజమైన స్థలం అని బోధించడం మానేశారు. బదులుగా వారు 1994లో ప్రచురించబడిన కేటకిజమ్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అనే గ్రంథంలో వ్యక్తం చేయబడినలాంటి తలంపునే సమర్థిస్తారు. “దేవునికి శాశ్వతంగా దూరమైపోవడమే నరకంలో విధించబడే ముఖ్యమైన శిక్ష” అని ఆ అధికారిక గ్రంథం చెబుతోంది.
అయినప్పటికీ నరకమంటే మనసును లేదా శరీరాన్ని బాధించే స్థలం అనే నమ్మకం ఇప్పటికీ ఉంది. ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాళ్ళు బైబిలు అలా బోధిస్తోందని చెబుతారు. “అది బైబిల్లోవున్న వాస్తవమే” అని సదరన్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ అధ్యక్షుడైన ఆర్. ఆల్బర్ట్ మోహ్లర్ చెబుతున్నాడు.
మీరేమి నమ్ముతున్నారనేది ఎందుకు ప్రాముఖ్యం?
నరకం ఒకవేళ నిజంగానే హింసించే స్థలమైతే మీరు దానికి భయపడాలి. ఒకవేళ ఈ బోధ నిజం కాకపోతే ఈ సిద్ధాంతాన్ని బోధించే మత నాయకులు తమను నమ్మేవాళ్ళను అయోమయంలో పడేసి, వాళ్ళు అనవసరంగా ఆందోళనపడేలా చేస్తున్నారు. దానికితోడు, దేవునికి చెడ్డపేరు వచ్చేలా చేస్తున్నారు.
ఈ విషయంలో దేవుని వాక్యమైన బైబిలు ఏమి చెబుతోంది? తర్వాతి ఆర్టికల్లు, (1) చనిపోయినవారికి ఏమవుతుంది? (2) నరకం గురించి యేసు ఏమి బోధించాడు? (3) నరకాన్ని గురించిన సత్యాన్ని తెలుసుకోవడం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే మూడు ప్రశ్నలకు సమాధానమివ్వడానికి క్యాథలిక్, ప్రొటస్టెంట్ బైబిళ్ళను ఉపయోగిస్తాయి. (w08 11/1)