దేవుడు ఎలాంటి ప్రార్థనలు వింటాడని ఆయన చెప్పాడు?
యేసు నుండి మనం నేర్చుకోగల అంశాలు
దేవుడు ఎలాంటి ప్రార్థనలు వింటాడని ఆయన చెప్పాడు?
యేసు సాధారణంగా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించేవాడు, తన శిష్యులు కూడా అలాగే చేయాలని చెప్పాడు. ‘ఆయన ఒక చోట ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు—ప్రభువా, మాకు ప్రార్థనచేయడం నేర్పించమని ఆయనను అడిగాడు. అందుకాయన—మీరు ప్రార్థన చేసేటప్పుడు—తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, అని పలుకమని వారితో చెప్పాడు’ అని బైబిలు చెబుతోంది. (లూకా 5:16; 11:1, 2, 4) తన తండ్రియైన యెహోవాకు మాత్రమే ప్రార్థించాలని యేసు చెప్పాడు. ఆయనే మన సృష్టికర్త. ‘ప్రార్థన ఆలకించేవాడు’ కూడా ఆయనే.—కీర్తన 65:2.
ఎలా ప్రార్థించినా దేవుడు వింటాడా?
కంఠతాపట్టి పదేపదే వల్లించే ప్రార్థనలు దేవునికి నచ్చవు. ‘ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యర్థమైన మాటలు’ వల్లించొద్దని యేసు చెప్పాడు. (మత్తయి 6:7) మన పరలోక తండ్రితో మనం మనసు విప్పి మాట్లాడాలి. మతాచారాలను నిష్ఠగా పాటించే అహంకారి ప్రార్థనలకన్నా, మారాలని మనస్ఫూర్తిగా కోరుకునే పాపి ప్రార్థనలనే దేవుడు ఎక్కువ ఇష్టపడతాడని యేసు ఒకసారి తన శిష్యులకు స్పష్టం చేశాడు. (లూకా 18:10-14) కాబట్టి దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం వినయంగా ఆయన చెప్పింది చేయడానికి ప్రయత్నించాలి. యేసు, ‘తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నాను. ఆయనకు ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడు చేస్తాను’ అని చెప్పాడు. (యోహాను 8:28, 29) ‘నా ఇష్టంకాదు, నీ చిత్తమే సిద్ధించాలి’ అని యేసు ప్రార్థించాడు.—లూకా 22:42.
మనం దేనికోసం ప్రార్థించాలి?
దేవుని పేరుమీద అపవాదు వేయబడింది. కాబట్టి, యేసు ఇలా చెప్పాడు: ‘మీరిలా ప్రార్థనచేయండి,—పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యం వచ్చుగాక; నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమ్మీద కూడా నెరవేరును గాక.’ (మత్తయి 6:9, 10) మనం దేవుని రాజ్యం రావాలని ప్రార్థించాలి, ఎందుకంటే దేవుడు ఆ రాజ్యం ద్వారానే పరలోకంలోనూ భూమిపైనా తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. మనం మన ‘అనుదినాహారం’ కోసం ప్రార్థించొచ్చని యేసు చెప్పాడు. మనం మన ఉద్యోగం, ఇల్లు, బట్టలు, ఆరోగ్య విషయాలు, ఇతర చింతల గురించి కూడా యెహోవాకు ప్రార్థించొచ్చు. అంతేగాక, మన పాపాలు క్షమించమని కూడా ప్రార్థించాలని యేసు చెప్పాడు.—లూకా 11:3, 4.
మనం ఇతరుల కోసం ప్రార్థించాలా?
యేసు ఇతరుల కోసం ప్రార్థించాడు. ‘ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు చిన్నపిల్లలను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు’ అని బైబిలు చెబుతుంది. (మత్తయి 19:13) యేసు అపొస్తలుడైన పేతురుతో, ‘నీ నమ్మకం తప్పిపోకూడదని నేను నీకోసం వేడుకున్నాను’ అని చెప్పాడు. (లూకా 22:32) ఇతరుల కోసం, చివరికి తమను హింసించేవారి కోసం, తమను అవమానించేవారి కోసం కూడా ప్రార్థించమని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు.—మత్తయి 5:44; లూకా 6:28.
మనం ప్రార్థించడం ఎప్పటికీ ఎందుకు మానకూడదు?
యేసు ప్రార్థించడానికి సమయాన్ని కేటాయించాడు. అంతేగాక, ‘విసుకక నిత్యము ప్రార్థన చేస్తుండాలి’ అని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు. (లూకా 18:1) మనల్ని బాధించే విషయాల గురించి పదేపదే ఆయనకు విన్నవించుకుని మనకు ఆయనపైనున్న నమ్మకాన్ని చూపించమని యెహోవా మనల్ని కోరుతున్నాడు. “అడుగుడి [‘అడుగుతూ ఉండండి,’ NW] మీ కియ్యబడును” అని యేసు చెప్పాడు. అంటే, తనను తండ్రిగా ప్రేమించి గౌరవించేవారు పదేపదే అడిగితేగానీ యెహోవా వారికి జవాబివ్వడని కాదు. బదులుగా, యేసు ఇలా చెప్పాడు, ‘మీరు చెడ్డవారైనా, మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని తెలుసు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు.’—లూకా 11:5-13. (w09 2/1)
ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? * అనే పుస్తకంలోని 17వ అధ్యాయం చూడండి.
[అధస్సూచి]
^ పేరా 12 యెహోవాసాక్షుల ప్రచురణ.