కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన లక్షణాలను వెల్లడిజేశాడు

యెహోవా తన లక్షణాలను వెల్లడిజేశాడు

దేవునికి దగ్గరవ్వండి

యెహోవా తన లక్షణాలను వెల్లడిజేశాడు

నిర్గమకాండము 34:6, 7

మీరు దేవుణ్ణి, అంటే ఆయన లక్షణాలను, వివిధ పరిస్థితుల్లో ఆయన వ్యవహరించే తీరును ఎలా వర్ణిస్తారు? మీరు దేవుణ్ణి తన గురించి చెప్పమని అడిగి, ఆయన తన లక్షణాలను తెలియజేయడాన్ని వినగల్గితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దేవుని ప్రవక్త మోషే సరిగ్గా అలాంటి అనుభవాన్నే చవిచూశాడు. సంతోషకరమైన విషయమేమిటంటే, ఆ అనుభవాన్ని రాసేందుకు దేవుడు ఆయనను ప్రేరేపించాడు.

మోషే సీనాయి పర్వతంమీద ఉన్నప్పుడు, ‘దయచేసి నీ మహిమను నాకు చూపించు’ అని దేవున్ని అడిగాడు. (నిర్గమకాండము 33:18) ఆ మరుసటి రోజు మోషే దేవుని మహిమను రెప్పపాటు చూశాడు. * మోషే ఆ అద్భుతమైన దర్శనంలో చూసినదాని గురించి ఎక్కువ వివరాలు ఇవ్వలేదు. కానీ, అంతకంటే ప్రాముఖ్యమైన దానిని అంటే దేవుడు చెప్పినదాన్ని ఆయన రాసిపెట్టాడు. అది నిర్గమకాండము 34:6, 7 వచనాల్లో ఉంది. ఈ వచనాలను పరిశీలిద్దాం.

యెహోవా మొట్టమొదటిగా తను “కనికరము, దయ” గల దేవుణ్ణని తెలియజేశాడు. (6వ వచనం) “కనికరం” అని అనువదించబడిన హెబ్రీ పదం, దేవుని “వాత్సల్యాన్ని” అంటే “ఒక తండ్రికి తన పిల్లలపట్ల ఉండేలాంటి వాత్సల్యాన్ని” సూచిస్తుందని ఒక బైబిలు పండితుడు చెప్పాడు. “దయ” అని అనువదించబడిన పదం, “అవసరంలోవున్న వ్యక్తికి సహాయం చేయడానికి ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా కదిలించబడడాన్ని వర్ణించే” క్రియాపదానికి సంబంధించినది. కాబట్టి, తమ పిల్లల అవసరాల విషయంలో ప్రేమతో శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రుల్లా తను తన ఆరాధకులపట్ల శ్రద్ధ తీసుకుంటాడన్న విషయం మనం తెలుసుకోవాలని యెహోవా ఆశిస్తున్నాడు.—కీర్తన 103:8, 13.

తర్వాత, తను “దీర్ఘశాంతము” గలవాడినని యెహోవా చెప్పాడు. (6వ వచనం) ఆయన భూమ్మీదున్న తన సేవకులమీద త్వరగా కోపం తెచ్చుకోడు. కానీ, ఆయన వాళ్లు అపరిపూర్ణతతో చేసే పొరపాట్లను క్షమిస్తూ తమ పాపభరిత నడవడిని మార్చుకోవడానికి వాళ్లకు సమయమిస్తూ వాళ్లపట్ల సహనం చూపిస్తున్నాడు.—2 పేతురు 3:9.

దేవుడు ఇంకా మాట్లాడుతూ, తను “విస్తారమైన కృపాసత్యములు” గలవాడినని చెప్పాడు. (6వ వచనం) కృప అనేది ఒక ఉత్తమ లక్షణం. యెహోవా ఈ లక్షణాన్ని చూపిస్తూ, తన సేవకులతో ఎన్నడూ తెగిపోని స్థిరమైన బంధాన్ని ఏర్పర్చుకుంటాడు. (ద్వితీయోపదేశకాండము 7:9) అంతేకాదు, యెహోవా సత్యానికి మూలం. ఆయన మోసం చేయడమనేది జరగని పని, అలాగే ఆయన మోసపోడు కూడా. ఆయన “సత్యదేవుడు” కాబట్టి, భవిష్యత్తు గురించి ఆయన చేసిన వాగ్దానాలతోసహా ఆయన చెప్పే ప్రతీవిషయాన్ని మనం పూర్తిగా నమ్మవచ్చు.—కీర్తన 31:5.

మనం తన గురించి మరో ప్రాముఖ్యమైన సత్యం తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన “దోషమును అపరాధమును పాపమును” క్షమించే దేవుడు. (7వ వచనం) ఆయన పశ్చాత్తాపపడుతున్న పాపులను ‘క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.’ (కీర్తన 86:5) అదేసమయంలో, ఆయన చెడుతనాన్ని ఎన్నడూ సహించడు. ‘దోషులను నిర్దోషులుగా ఎంతమాత్రం ఎంచను’ అని కూడా ఆయన వివరించాడు. (7వ వచనం) కావాలని పాపాలు చేసేవాళ్లను పరిశుద్ధుడూ, న్యాయవంతుడూ అయిన దేవుడు శిక్షించకుండా వదిలిపెట్టడు. అలాంటివాళ్లు ఏదోకరోజు తమ పాపాలకు మూల్యం చెల్లించాల్సిందే.

యెహోవా తన గురించి, తన వ్యక్తిత్వం గురించి, తన మార్గాల గురించి మనం తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు కాబట్టే ఆయన తన లక్షణాలను మనకు వివరించాడు. ఆయన అద్భుతమైన లక్షణాల గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలని మీకు అనిపించడం లేదా? (w09 5/1)

[అధస్సూచి]

^ పేరా 5 నిజానికి మోషే యెహోవాను చూడలేదు. ఎందుకంటే, దేవున్ని చూసి ఏ మానవుడూ బ్రతుకడు. (నిర్గమకాండము 33:20) యెహోవా మోషేకు ఒక దర్శనం ద్వారా తన మహిమను చూపించాడు, అప్పుడాయన ఒక దూతను తన ప్రతినిధిగా ఉపయోగించుకుని మోషేతో మాట్లాడాడు.