కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1 బైబిలుపై నమ్మకాన్ని పెంపొందించుకోండి

1 బైబిలుపై నమ్మకాన్ని పెంపొందించుకోండి

1 బైబిలుపై నమ్మకాన్ని పెంపొందించుకోండి

‘లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపించబడ్డాయి. నీతిని బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి ఉపయోగపడతాయి.’ —2 తిమోతి 3:16, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ఆటంకం: మనుషులు తమ సొంత జ్ఞానంతో బైబిలును రాశారని చాలామంది అంటారు. బైబిలు తెలియజేస్తున్న చారిత్రక విషయాలు ఖచ్చితమైనవి కాదని కొంతమంది అంటారు. బైబిల్లోని ఉపదేశాలు మనకేమి ఉపయోగపడవని, మన కాలానికి సరిపోవని ఇంకొంతమంది అంటారు.

దాన్నెలా అధిగమించవచ్చు? బైబిలు ఏమి చెప్తుందో స్వయంగా ఎప్పుడూ పరిశీలించనివాళ్లే బైబిలును నమ్మరు, దానిలోని విషయాలు ప్రయోజనకరమైనవని ఒప్పుకోరు. వాళ్లు వేరేవాళ్లు చెప్పిన మాటలనే వల్లిస్తుంటారు. అయితే, బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: ‘బుద్ధిహీనులు ఏది వింటే అదే నమ్ముతారు. కానీ జ్ఞానం గలవాళ్లు ప్రతీదాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తారు.’—సామెతలు 14:15, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

వేరేవాళ్లు చెప్పింది గుడ్డిగా నమ్మే బదులు, బెరయ (ఇప్పుడు గ్రీసు ఉత్తరప్రాంతం) అనే ప్రాంతంలో నివసించిన మొదటి శతాబ్దపు క్రైస్తవులను ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్లు వేరేవాళ్లు చెప్పినదాన్ని గుడ్డిగా నమ్మలేదు. అయితే వారికి, తాము విన్నది ‘సత్యమో కాదో అని ప్రతిరోజూ లేఖనాలు పరిశోధించేవారు’ అనే మంచి పేరు ఉంది. (అపొస్తలుల కార్యములు 17:11, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) బైబిలు దేవుడు ప్రేరేపించి రాయించిన గ్రంథం అని నమ్మడానికి రెండు కారణాలను ఇప్పుడు చూద్దాం.

బైబిలు తెలియజేస్తున్న చారిత్రక విషయాలు ఖచ్చితమైనవి. బైబిల్లో ప్రస్తావించబడిన ప్రజల, ప్రాంతాల పేర్లు కల్పితాలు అని సంశయవాదులు ఎన్నో సంవత్సరాలుగా వాదించారు, ఇప్పటికీ వాదిస్తూనే ఉన్నారు. కానీ, వాళ్లు అన్న మాటలు నిజం కావని, బైబిల్లో నమోదు చేయబడిన విషయాలు ఖచ్చితమైనవని ఎన్నోసార్లు నిరూపించబడింది.

ఉదాహరణకు, యెషయా 20:1లో పేర్కొనబడిన అష్షూరు రాజైన సర్గోను అసలు నిజంగా జీవించాడా అంటూ పండితులు ఒకప్పుడు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, 1840లలో పురావస్తు శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో ఈ రాజు నివసించిన భవనం బయటపడింది. ఇప్పుడు అందరికీ బాగా తెలిసిన అష్షూరు రాజుల్లో సర్గోను రాజు ఒకడు.

యేసుకు మరణ శిక్ష విధించిన రోమా అధికారి పొంతి పిలాతు అసలు నిజంగా జీవించాడా అని విమర్శకులు ప్రశ్నించారు. (మత్తయి 27:1, 22-24) కానీ పిలాతు పేరు, ఆయన అధికారహోదా రాసివున్న ఒక రాతిపలక 1961లో ఇశ్రాయేలులోని కైసరయ నగరం సమీపాన దొరికింది.

బైబిల్లో పేర్కొన్న చారిత్రక విషయాల ఖచ్చితత్వం గురించి యు. ఎస్‌. న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్టు 1999, అక్టోబరు 25 సంచిక ఇలా నివేదించింది: “బైబిల్లోని పాత, కొత్త నిబంధనల్లోవున్న చారిత్రక విషయాలు అంటే ఇశ్రాయేలీయుల పూర్వీకుల వివరాలు, వాళ్లు ఐగుప్తు నుండి విడుదలై వెళ్లడం, దావీదు పరిపాలన, యేసు జీవితం, ఆయన జీవించిన కాలంలోని పరిస్థితులు వంటి ఎన్నో విషయాలు వాస్తవాలని ఆధునిక పురావస్తుశాఖ అసాధారణమైన రీతుల్లో ధృవీకరించింది.” బైబిలును నమ్మాలంటే పురావస్తుశాఖ కనుగొన్న విషయాలపై ఆధారపడనవసరం లేదు. కానీ, దేవుడు ప్రేరేపించిన గ్రంథంలో పైన చెప్పినలాంటి చారిత్రక ఖచ్చితత్వం ఉండాలనైతే మీరు ఆశిస్తారు.

బైబిల్లో ఉన్న చక్కని సూత్రాలు ప్రజలందరికీ వారి అనుదిన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. సూక్ష్మక్రిముల గురించి, రోగాలను వ్యాప్తిచేయడంలో వాటిపాత్ర గురించి కనుక్కోవడానికి ఎన్నో సంవత్సరాల ముందే బైబిలు చక్కని ఆరోగ్య సూత్రాలను ఇచ్చింది. అవి నేటికీ ఎంతో ఉపయోగపడతాయి. (లేవీయకాండము 11:32-40; ద్వితీయోపదేశకాండము 23:12, 13) కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ఎలా మెలగాలనే విషయంలో బైబిలు ఇస్తున్న సలహాలను పాటించేవారు ఎంతో సంతోషంగా ఉంటారు. (ఎఫెసీయులు 5:28–6:4) బైబిలు ప్రమాణాలను పాటించే వ్యక్తి మరింత బాధ్యతగల ఉద్యోగిగా లేదా బాగా అర్థం చేసుకునే యజమానిగా ఉండగలుగుతాడు. (ఎఫెసీయులు 4:27, 28; 6:5-9) అంతేకాదు, బైబిలు సూత్రాలను పాటిస్తే ఎంతో మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. (సామెతలు 14:30; ఎఫెసీయులు 4:31, 32; కొలొస్సయులు 3:8-10) అలాంటి ఉపయోగకరమైన సలహాలనే మన సృష్టికర్త ఇవ్వాలని మనం ఆశిస్తాం.

ప్రతిఫలం ఏమిటి? బైబిల్లోవున్న విషయాలు బుద్ధిహీనులకు కూడా జ్ఞానాన్నిస్తాయి. (కీర్తన 19:7) అంతేకాదు, ఒకసారి మనం బైబిలు మీద నమ్మకాన్ని పెంపొందించుకుంటే, బలమైన విశ్వాసం పొందడానికి అవసరమైన రెండవ చర్య తీసుకోవడానికి మరే పుస్తకం సహాయం చేయనంతగా అది మనకు సహాయం చేస్తుంది. (w09 5/1)

మరింత వివరణ కోసం బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? * పుస్తకంలోని “బైబిలు—దేవుడిచ్చిన గ్రంథం” అనే 2వ అధ్యాయాన్ని చూడండి.

[అధస్సూచి]

^ పేరా 12 యెహోవాసాక్షులు ప్రచురించారు.