డబ్బుంటేనే సంతోషంగా ఉంటామా?
డబ్బుంటేనే సంతోషంగా ఉంటామా?
సానియా స్పెయిన్‌లో పుట్టి పెరిగింది. ఆమె చిన్నప్పుడు వాళ్ళమ్మతోపాటు యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లేది. అయితే ఆమె పెద్దయిన తర్వాత ఇంగ్లాండ్‌లోని లండన్‌కు మకాం మార్చింది. అక్కడ ఆమె ఆర్థిక లావాదేవీలు చూసుకునే వ్యాపారం చేయడం మొదలుపెట్టింది.
సానియాకు తన వృత్తంటే ప్రాణం. పెద్దపెద్ద పరిశ్రమల పెట్టుబడుల వ్యవహారాలు చూసుకుంటూ బాగా సంపాదించేది. అందరి నమ్మకాన్ని చూరగొనడం ఆమెకెంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. సానియా సాధారణంగా రోజుకు 18 గంటలు పనిచేసేది. కొన్నిసార్లు ఆమె కేవలం రెండుమూడు గంటలే నిద్రపోయేది. తన వృత్తే లోకంగా ఉండేది. అయితే ఒక్కసారిగా ఆమె జీవితం తలక్రిందులైంది. ఆమెకు పక్షవాతం వచ్చింది. బహుశ ఒత్తిడి కలిగించే జీవన శైలి వల్ల అలా జరిగివుండవచ్చు. అప్పుడామెకు కేవలం 30 ఏళ్లే.
సానియాకు ఒక పక్క పక్షవాతం వచ్చింది. డాక్టర్లు ఆమెకు ఇక మాట రాదనే అనుకున్నారు. దాంతో వాళ్లమ్మ ఆమెను చూసుకోవడానికి వెంటనే ఇంగ్లాండ్‌కు వచ్చింది. సానియా మళ్లీ నెమ్మదిగా నడవడం మొదలుపెట్టినప్పుడు ఓ రోజు వాళ్ళమ్మ “నేను సంఘ కూటాలకు వెళ్తున్నాను. నిన్ను ఒంటరిగా విడిచి వెళ్లడం కుదరదు కాబట్టి నువ్వు కూడా నాతో రావాలి” అంది. అలా సానియా వాళ్లమ్మతో వెళ్లింది. తర్వాత ఏం జరిగింది?
సానియా జరిగింది గుర్తుచేసుకుంటూ ఇలా అంది, “అక్కడ విన్న ప్రతీ మాట సత్యమని నాకు అర్థమయింది. అదెంతో బాగుంది! నేను మొదటిసారి రాజ్యమందిరానికి వెళ్లినప్పుడు చాలామంది నన్ను ఆప్యాయంగా పలకరించారు. వారిలో ఒకరు నాతో బైబిలు అధ్యయనం చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాను. నా పాత స్నేహితులు నన్ను చూడ్డానికి రావడం మానేశారు; కాని నా కొత్త స్నేహితులైతే నన్నెంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకున్నారు.”
సానియా మెల్లమెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె త్వరత్వరగా చక్కని బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకుని, సంవత్సరం తిరగకముందే బాప్తిస్మం తీసుకుంది. ఆమె కొత్త స్నేహితుల్లో చాలామంది క్రైస్తవ సేవకు ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఎంతో సంతోషంగా ఉండడం గమనించింది. ‘నేను కూడా వారిలాగే యెహోవా దేవుని సేవకు ఎక్కువ సమయమిస్తూ సంతోషంగా ఉండాలి’ అని సానియా అనుకుంది. ఇప్పుడు సానియా దేవుని సేవకు ఎక్కువ సమయం వెచ్చిస్తోంది.
సానియా ఏమి నేర్చుకుంది? “నేనెంత డబ్బు సంపాదిస్తున్నా నా పనిలో ఉన్న ఒత్తిడి, అభద్రతవల్ల చాలా ఆందోళనతో, అసంతోషంతో జీవించేదాన్ని. పరలోక తండ్రియైన యెహోవాతో మంచి సంబంధం కలిగివుండడమే జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనదని గ్రహించాను. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను” అని ఆమె అంటోంది.
“ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 తిమోతి 6:10) ఈ మాటలు తిరుగులేని సత్యాలని సానియా ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పగలదు. (w09 09/01)