దేవుడు అనుగ్రహించే సిరిసంపదలు
దేవుడు అనుగ్రహించే సిరిసంపదలు
దేవునికి నమ్మకంగా ఉంటే, ఆయన మీకు సిరిసంపదలు ఇస్తాడా? ఇస్తే ఇవ్వొచ్చు, కానీ మనం ఆశించే సంపదలు ఆయన ఇవ్వకపోవచ్చు. యేసుకు జన్మనిచ్చిన మరియ ఉదాహరణ తీసుకోండి. గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి, ఆమె దేవుని ‘దయకు ప్రాప్తురాలు’ అయ్యిందని, ఆమె దేవుని కుమారునికి జన్మనిస్తుందని చెప్పాడు. (లూకా 1:28, 30-32) అయితే, ఆమె ధనవంతురాలేమీ కాదు. యేసు పుట్టిన తర్వాత ఆమె ‘గువ్వల జతనో, రెండు పావురపు పిల్లలనో,’ బలి అర్పించింది. పేదవారు సాధారణంగా వాటినే యెహోవాకు బలిగా అర్పించేవారు.—లూకా 2:24; లేవీయకాండము 12:8.
మరియ బీదరాలైనంత మాత్రాన ఆమెను దేవుడు ఆశీర్వదించలేదని అనగలమా? అంతెందుకు, మరియ తన బంధువైన ఎలీసబెతును చూడ్డానికి వచ్చినప్పుడు “ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను— స్త్రీలలో నీవు [మరియ] ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును!” (లూకా 1:41, 42) దేవుని ప్రియకుమారునికి భూమ్మీద తల్లిగావుండే గొప్పగౌరవం మరియకు దక్కింది.
యేసు కూడా సంపన్నుడేమీ కాదు. ఆయన పేదరికంలో పుట్టిపెరిగాడు. అంతేకాకుండా ఆయన భూజీవితమంతా పేదరికంలోనే గడిచింది. శిష్యుడవ్వాలనుకున్న ఒకాయనతో యేసు, “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదు” అని అన్నాడు. (లూకా 9:57, 58) అయితే ఆయనెంతో త్యాగం చేసి భూమ్మీదికి రావడంవల్లే, ఆయన శిష్యులకు గొప్ప సంపదలు పొందే అవకాశం దొరికింది. అందుకే అపొస్తలుడైన పౌలు, యేసు గురించి రాస్తూ “మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను” అని అన్నాడు. (2 కొరింథీయులు 8:9) యేసు తన శిష్యులకు ఎలాంటి సంపదలు ఇచ్చాడు? మనకెలాంటి సంపదలు ఇస్తాడు?
ఎలాంటి సంపదలు?
సాధారణంగా, ఎక్కువ ఆస్తి ఉంటే అది విశ్వాసానికి అడ్డుగోడలా ఉంటుంది. ఎందుకంటే ఒక ధనవంతుడు దేవునికన్నా ఎక్కువగా తన ధనాన్నే నమ్ముకోవచ్చు. “ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం” అని యేసు అన్నాడు. (మార్కు 10:23) దీన్ని బట్టి చూస్తే యేసు తన అనుచరులకు ఇస్తానన్న సంపదలు వస్తుసంబంధమైన ఆస్తిపాస్తులు కావని అర్థమౌతుంది.
నిజం చెప్పాలంటే, మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లో చాలామంది పేదవారే. పుట్టుకతోనే కాళ్ళులేని ఒక వ్యక్తి భిక్షమడిగినప్పుడు, పేతురు అతనితో, “వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను; నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము” అని చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 3:6.
యాకోబు 2:5) అంతేకాకుండా “లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను” ఎక్కువమంది క్రైస్తవ సంఘంలోకి పిలవబడలేదని అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు.—1 కొరింథీయులు 1:26.
శిష్యుడైన యాకోబు మాటలను బట్టి కూడా క్రైస్తవ సంఘంలో ఎక్కువమంది పేదవారే ఉండేవారని తెలుస్తుంది. ఆయన “నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?” అని రాశాడు. (యేసు తన అనుచరులకు ఇచ్చిన సంపదలు వస్తుసంబంధమైన ఆస్తిపాస్తులు కానప్పుడు, మరి వాళ్లకు ఇంకెలాంటి సంపదలు ఇచ్చాడు? యేసు స్ముర్నలోని సంఘానికి రాస్తూ “నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే” అన్నాడు. (ప్రకటన 2:8, 9) స్ముర్నలోని సంఘంలో ఉన్న క్రైస్తవులు పేదవారే అయినప్పటికీ వారి దగ్గర వెండిబంగారాలకు మించిన సంపదలున్నాయి. వారు తమ విశ్వాసాన్ని బట్టి, దేవునికి చూపించిన యథార్థతను బట్టి ధనవంతులయ్యారు. ‘విశ్వాసం అందరిలో ఉండేది’ కాదు కాబట్టి, అది ఎంతో అమూల్యమైనది. (2 థెస్సలొనీకయులు 3:2 ఈజీ-టు-రీడ్ వర్షన్) నిజానికి విశ్వాసం లేని వారే దేవుని దృష్టిలో పేదవారు.—ప్రకటన 3:17, 18.
విశ్వాసం వల్ల కలిగే సంపదలు
విశ్వాసం విలువైనదని ఎందుకు చెప్పవచ్చు? దేవుని మీద విశ్వాసం ఉన్నవారు ‘ఆయన అనుగ్రహైశ్వర్యం, సహనం, దీర్ఘశాంతం’ వల్ల ప్రయోజనం పొందుతారు. (రోమీయులు 2:4) వారు యేసు విమోచన క్రయధన బలిపై విశ్వాసం ఉంచుతారు, కాబట్టి వారి “అపరాధములకు క్షమాపణ” కూడా లభిస్తుంది. (ఎఫెసీయులు 1:7) అంతేకాక వారికి, విశ్వాసం కనబర్చేవారికి “క్రీస్తు వాక్యము” వల్ల లభించే జ్ఞానం ఉంటుంది. (కొలొస్సయులు 3:16) వారు దేవునికి విశ్వాసంతో ప్రార్థిస్తారు కాబట్టి, “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము” వారి హృదయాలను, మనసులను కాపాడి సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది.—ఫిలిప్పీయులు 4:7.
ఈ ప్రయోజనాలన్నింటితో పాటు దేవునిపై నమ్మకం ఉంచేవారికి నిత్యం జీవించే అద్భుతమైన అవకాశం కూడా ఉంటుంది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యేసుక్రీస్తు చెప్పినట్లు మనకు బాగా తెలుసు. (యోహాను 3:16) ఆ అమూల్యమైన భవిష్యత్తు మనకు ఉండాలంటే తండ్రి గురించి, కుమారుని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు కూడా “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని చెప్పాడు.—యోహాను 17:3.
దేవుడిచ్చే ఆశీర్వాదాల వల్ల ఆయనతో మంచి సంబంధం ఏర్పడడంతో పాటు మన శరీరానికి, మనసుకు మేలు కలుగుతుంది. బ్రెజిల్ దేశంలో ఉంటున్న డాలీడియో ఉదాహరణ చూడండి. దేవుని సంకల్పం గురించి తెలుసుకోక ముందు ఆయన విపరీతంగా తాగేవాడు. దీనివల్ల ఆయన కుటుంబ పరిస్థితి అద్వానంగా మారింది. ఆయన ఆర్థిక పరిస్థితి కూడా గాల్లో దీపంలా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టి, ఎన్నో మార్పులు చేసుకున్నాడు.
డాలీడియో తాను బైబిలు నుండి నేర్చుకున్న విషయాలను బట్టి, చెడు వ్యసనాలను మానుకోగలిగాడు. ఆయన ఎంతగా మారిపోయాడంటే ఆయనిలా అంటున్నాడు: “ఒక్కప్పుడు నేను ఎప్పుడూ బార్‌లకు వెళ్లేవాడిని, కానీ ఇప్పుడు సువార్త చెప్పడానికి ఇంటింటికి వెళ్తున్నాను.” ఇప్పుడాయన ఎక్కువ సమయం దేవుని సేవలోనే గడుపుతున్నాడు. దానివల్ల ఆయన ఆరోగ్యమే కాదు, ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడింది. “నేను ఒకప్పుడు తాగుడు కోసం ఖర్చుపెట్టిన డబ్బును ఇప్పుడు వేరేవారికి సహాయం చేయడానికి లేదా నాకు అవసరమైనవి కొనుక్కోవడానికి వాడుతున్నాను” అని డాలీడియో చెప్పాడు. ఆయన తనలాగే దేవుని ఆలోచనల ప్రకారం నడుచుకునే వారితో సమయం గడపడం వల్ల చాలామంది నిజమైన స్నేహితుల్ని కూడా సంపాదించుకున్నాడు. దేవుని గురించి తెలుసుకోకముందు కనీసం ఊహకయినా అందని మనశ్శాంతిని, సంతృప్తిని డాలీడియో ఇప్పుడు అనుభవిస్తున్నాడు.
యెహోవా దేవుని మీద విశ్వాసముంచి జీవితాన్ని చక్కగా మార్చుకున్న వారిలో రెనాటో ఒకరు. ఆయన ఉదాహరణ కూడా చూద్దాం. ఆయన ముఖంలో ఇప్పుడు కనిపించే సంతోషాన్ని, చిరునవ్వును చూసినప్పుడు, ఆయనకు జీవితంలో జరగకూడని అన్యాయం జరిగిందని అసలు ఊహించలేం. ఆయన పుట్టినప్పుడే వాళ్లమ్మ ఆయన్ని వదిలేసింది. కనీసం బొడ్డుతాడయినా ఆరకముందే ఆయనను సంచిలో పెట్టి ఓ బెంచి క్రింద వదిలేస్తే, పాపం ఆయనకు ఒళ్లంతా గీరుకుపోయింది. అప్పుడు అటుగా వెళ్తున్న ఇద్దరు స్త్రీలు బెంచి క్రిందున్న సంచిలో ఏదో కదలడం చూసి ఎవరో పిల్లి పిల్లను వదిలేసి ఉంటారని అనుకున్నారు. కానీ ఆ సంచిలో పసిబిడ్డ ఉండడం చూసి వారు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆ ఇద్దరు ఆడవాళ్లలో ఒకామె యెహోవాసాక్షి. ఆమె ఆ బిడ్డ గురించి రీటా అనే మరో సాక్షికి చెప్పింది. అప్పటికే రీటాకు చాలాసార్లు గర్భంలోనే బిడ్డ చనిపోవడంతో ఆమెకు మగపిల్లలు లేరు, ఒక కూతురు మాత్రమే ఉంది. తనకు ఒక మగబిడ్డ ఉంటే బాగుంటుందని ఎంతో కోరుకుంది. అందుకే ఆమె రెనాటోను దత్తత తీసుకుంది.
రెనాటో చిన్నగా ఉన్నప్పుడే, ఆమె తాను అతని సొంత తల్లిని కాదని చెప్పింది. కానీ ఆమె రెనాటోను ఎంతో వాత్సల్యంతో పెంచి పెద్దచేసి బైబిలు సూత్రాలు నేర్పించడానికి ఎంతో కృషి చేసింది. పెద్ద కీర్తన 27:10.
వాడయ్యాక ఆయనకు బైబిలు మీద ఆసక్తి కలిగింది. అద్భుతంగా తనను కాపాడినందుకు కూడా ఆయనకు దేవుని మీద కృతజ్ఞత పెరిగింది. “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును” అని కీర్తనకర్త దావీదు రాసిన మాటలను చదివిన ప్రతీసారి రెనాటో కళ్లలో నీళ్లు తిరుగుతాయి.—యెహోవా తన కోసం చేసిదానంతటికి కృతజ్ఞతగా రెనాటో 2002లో బాప్తిస్మం తీసుకుని, ఆ మరుసటి సంవత్సరం నుండి క్రైస్తవ పరిచర్యలో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. రెనాటోకు ఇప్పటికీ తన కన్న తల్లిదండ్రులెవరో తెలియదు, బహుశ ఇక ఎప్పటికీ తెలియకపోవచ్చు కూడా. అయినా కన్నతండ్రిలా ఆప్యాయంగా చూసుకునే యెహోవా గురించి తెలుసుకోవడం, ఆయనపై విశ్వాసముంచడం తనకు లభించిన అత్యంత అమూల్యమైన బహుమతి అని రెనాటో అంటున్నాడు.
మీ జీవితం సుసంపన్నం అయ్యేలా దేవునితో దగ్గరి సంబంధాన్ని ఏర్పర్చుకుని, ఆయన ప్రేమను పొందాలని మీరూ కోరుకుంటుండవచ్చు. యెహోవా దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో అలాంటి సంబంధాన్ని ఏర్పర్చుకునే అవకాశం బీదగొప్ప అని తేడా లేకుండా అందరికి ఉంది. అది వస్తుసంబంధమైన ఆస్తిపాస్తులను ఇవ్వకపోవచ్చు కాని, ఈ లోకంలో ఉన్న డబ్బంతా ఇవ్వలేని మనశ్శాంతిని, సంతృప్తిని ఇస్తుంది. సామెతలు 10:22 (ఈజీ-టు-రీడ్ వర్షన్) లోని మాటలు ముమ్మాటికి నిజం. అక్కడ ఇలా ఉంది: ‘యెహోవా దీవెన ఐశ్వర్యం ఇస్తుంది. ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.’
యెహోవా దేవుడు తన దగ్గరకు వచ్చే వారి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అందుకే ఆయన “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును” అని అంటున్నాడు. (యెషయా 48:18) ఆయన మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో తన దగ్గరికి వచ్చేవారికి, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును” అని మాటిస్తున్నాడు.—సామెతలు 22:4. (w09 09/01)
[6వ పేజీలోని బ్లర్బ్]
దేవునిపై విశ్వాసం ఉంచితే మనశ్శాంతితో, సంతృప్తిగా, సంతోషంగా ఉంటాం
[5వ పేజీలోని చిత్రం]
భూమ్మీది యేసు కుటుంబ సభ్యులు పేదవారే అయినప్పటికీ దేవుడు వారినెంతో ఆశీర్వదించాడు