దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు
దేవునికి దగ్గరవ్వండి
దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు
మానవ న్యాయమూర్తులు అన్యాయంగా, కఠినంగా తీర్పుతీర్చవచ్చు, కానీ ‘న్యాయమును ప్రేమించే’ యెహోవా దేవుడు అలా తీర్పుతీర్చడు. (కీర్తన 37:28) ఆయన సహనం చూపిస్తాడు, అలాగని ఆయన చర్యతీసుకోకుండా ఉండడు. న్యాయం విషయంలో ఆయన నిక్కచ్చిగా ఉంటాడు. ఒక సందర్భంలో ప్రజలు గొడవపడి, తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఏమి చేశాడో సంఖ్యాకాండము 20వ అధ్యాయం వివరిస్తోంది.
అరణ్యంలో ఇశ్రాయేలీయుల ప్రయాణం ముగుస్తుందనగా వారికి నీటి కొరత ఏర్పడింది. a ప్రజలు మోషే, అహరోనులతో వాదిస్తూ ‘మేము, మా పశువులు ఇక్కడ చనిపోవాలని, ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరెందుకు తెచ్చారు?’ అంటూ గొడవపెట్టడం మొదలుపెట్టారు. (4వ వచనం) ఈ అరణ్యం “కాని చోటు” అని, అంటే అది ‘తాగడానికి నీళ్లు,’ ‘అంజూరలు, ద్రాక్షలు, దానిమ్మలు’ లేని పనికిమాలిన చోటు అని ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల క్రితం ఆ పండ్లనే ఇశ్రాయేలు వేగులవాళ్లు వాగ్దాన దేశం నుండి తీసుకొచ్చారు. (5వ వచనం; సంఖ్యాకాండము 13:23) నిజం చెప్పాలంటే ఆ అరణ్యం, ముందరి తరంలో సణిగినవాళ్లు ప్రవేశించడానికి నిరాకరించిన ఫలవంతమైన దేశంలా లేనందుకు వాళ్లు మోషే, అహరోనులను నిందించారు!
అలా నిందించినవారిని యెహోవా శిక్షించలేదు. బదులుగా ఆయన మూడు పనులు చేయమని మోషేకు చెప్పాడు. అవేమిటంటే, ఆయన తన కఱ్ఱ తీసుకుని, సమాజాన్ని పోగుచేసి, ‘వాళ్ల కళ్ల ఎదుట బండతో మాట్లాడాలి’ అప్పుడది వారికి నీళ్లిస్తుంది. (8వ వచనం) మోషే మొదటి రెండిటిని దేవుడు చెప్పినట్టే చేశాడు, కానీ మూడోది దేవుడు చెప్పినట్టు చేయలేదు. విశ్వాసం చూపిస్తూ బండతో మాట్లాడాల్సింది పోయి కోపంగా ప్రజలతో మాట్లాడుతూ, “ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా?” అని రుసరుసలాడాడు. (10వ వచనం; కీర్తన 106:32, 33) మోషే కఱ్ఱతో రెండుసార్లు బండను కొట్టినప్పుడు, ‘నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి.’—11వ వచనం.
ఆ విధంగా మోషే, అహరోనులు ఘోరమైన తప్పే చేశారు. ‘మీరు నా మాట వినకుండా నామీద తిరుగుబాటు చేశారని’ దేవుడు వాళ్లతో అన్నాడు. (సంఖ్యాకాండము 20:24) ఈ సందర్భంలో దేవుని ఆజ్ఞను మీరుతూ మోషే అహరోనులు, ప్రజలు తిరుగుబాటు చేశారని నిందించారు కానీ నిజానికి వారే తిరుగుబాటు చేశారు. మోషే అహరోనులు ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపించరని దేవుడు స్పష్టంగా తీర్పు చెప్పాడు. ఆ తీర్పు మరీ కఠినంగా ఉందా? లేదు. ఎందుకంటే దానికి చాలా కారణాలున్నాయి.
మొదటిది, దేవుడు ప్రజలతో మాట్లాడమని మోషేకు చెప్పలేదు, వాళ్లను ద్రోహులని తిట్టమని అసలే చెప్పలేదు. రెండవది, మోషే అహరోనులు దేవుణ్ణి మహిమపర్చలేదు. ‘మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు’ అని దేవుడు అన్నాడు. (12వ వచనం) ‘మేము ఈ బండలో నుండి మీకోసం నీళ్లు రప్పిస్తాము’ అన్నప్పుడు, దేవుడు కాదుగానీ తామే అద్భుతంగా ఆ నీళ్లను రప్పిస్తున్నట్టు మోషే మాట్లాడాడు. మూడవది, ఇలాంటి పొరపాటు చేసిన వాళ్లకు గతంలో కూడా దేవుడు ఇలాంటి తీర్పే తీర్చాడు. దేవుడు అంతకుముందు తిరుగుబాటు చేసిన ప్రజల్ని కనాను దేశంలోకి ప్రవేశించనివ్వలేదు కాబట్టి ఆయన మోషే, అహరోనులకు కూడా ఆ శిక్షే వేశాడు. (సంఖ్యాకాండము 14:22, 23) నాలుగవది, మోషే అహరోనులు ఇశ్రాయేలీయులకు నాయకులు. ఎక్కువ అధికారం ఉన్నవాళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది.—లూకా 12:48.
యెహోవా న్యాయంగా తీర్పుతీరుస్తాడు. యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి, ఆయన అన్యాయంగా తీర్పుతీర్చడు. అలాంటి న్యాయమూర్తిని మనం పూర్తిగా నమ్మాలి, గౌరవించాలి. (w09 09/01)
[అధస్సూచి]
a ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, దేవుడు అబ్రాహాముకు ఇస్తానని వాగ్దానం చేసిన కనానులోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పదిమంది వేగులవాళ్లు తీసుకొచ్చిన చెడ్డ సమాచారాన్ని విని ప్రజలు మోషే మీద సణిగారు. అందుకే యెహోవా ఆ తిరుగుబాటు చేసిన వాళ్లంతా చనిపోయే వరకు అంటే 40 సంవత్సరాలపాటు వాళ్లు అరణ్యంలోనే సంచరించేలా చేశాడు.