ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా?
ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా?
ప్రతీకారం తీర్చుకుంటే మనసు చల్లబడుతుందని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే, మనకేదైనా హాని జరిగితే లేదా బాధ కలిగితే కోపం రావడం సహజమే అని వారి ఉద్దేశం. తప్పొప్పులను గురించిన జ్ఞానం మనకు పుట్టుకతోనే వస్తుంది కాబట్టి, అన్యాయం జరిగితే దాన్ని ఎవరో ఒకరు సరిదిద్దాలని మనకనిపిస్తుంది. అయితే, ఎలా సరిదిద్దాలనేదే ప్రశ్న.
ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు అనుకోవడానికి చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు, చెంపదెబ్బ కొట్టడం, తోయడం, అవమానించడం, తిట్టడం, దాడి చేయడం, దోచుకోవడం వంటివి జరిగినప్పుడు అలా అనుకుంటారు. వీటిలో ఏదైనా లేదా మరొక విధమైన పరిస్థితి ఏదైనా మీకు ఎదురైతే మీకేమనిపిస్తుంది? నేడు చాలామంది, “వాళ్లకు తగిన శాస్తిచేయాలి” అనే ఆలోచిస్తున్నట్లుగా ఉంది.
అమెరికాలో, జూనియర్ హైస్కూల్ విద్యార్థులు తమను క్రమశిక్షణలో పెట్టిన టీచర్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి తమను తిట్టారనో, కొట్టారనో ఆరోపిస్తూ తప్పుడు కేసులు పెట్టారు. “అలా ఒక్కసారి ఆరోపణకు గురైతే చాలు ఆ టీచర్ గౌరవం మంట కలిసిపోతుంది” అని న్యూ ఓర్లీన్స్‌లోని టీచర్స్ యూనియన్ అధ్యక్షురాలు బ్రెండే మిషెల్ చెబుతోంది. ఆ ఆరోపణ తప్పని నిరూపించబడిన తర్వాత కూడా, ఆ చెడ్డపేరు అలాగే ఉండిపోతుంది.
ఉద్యోగ స్థలాల్లో నిరాశకు గురైన ఉద్యోగులు చాలామంది యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు కంపెనీ కంప్యూటర్ నెట్‌వర్క్‌లోని ప్రాముఖ్యమైన సమాచారాన్ని లేకుండా చేస్తారు లేదా అర్థంకాకుండా చేస్తారు. మరికొందరు కంపెనీ రహస్యాలను దొంగిలించి వాటిని అమ్ముకుంటారు లేదా ఇతరులకు చేరవేస్తారు. ఉద్యోగులు తమ పగ తీర్చుకునేందుకు ఎలక్ట్రానిక్ ఫైళ్లను దొంగిలించడమే కాక, “కంపెనీ వస్తువుల్ని మాయం చేయడంలాంటి పాత పద్ధతి కూడా కొనసాగిస్తూనే ఉన్నారు” అని ది న్యూయార్క్ టైమ్స్ నివేదిస్తోంది. అలాంటి వారిని ఆపడానికి చాలా కంపెనీలు, ఒక సెక్యూరిటి అధికారిని నియమిస్తున్నాయి. ఆ అధికారి, తొలగించబడిన ఉద్యోగి వెంటే అతను పనిచేసే స్థలం దగ్గరకు వెళ్లి, అతను తన వస్తువులన్నీ తీసుకునే వరకు ఆగి అతనితోపాటు కంపెనీ గేటువరకు వెళ్తాడు.
సాధారణంగా సన్నిహితంగావుండే వారిమీదే అంటే స్నేహితులు, సహవాసులు, కుటుంబ సభ్యుల మీదే పగతీర్చుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. కఠినంగా మాట్లాడినందుకో అనాలోచితంగా ప్రవర్తించినందుకో కలిగిన బాధవల్లే చెల్లుకు చెల్లు తీర్చుకోవాలనుకుంటారు. ఒక
స్నేహితుడు కఠినంగా మాట్లాడితే, మీరు కూడా అంతే కఠినంగా జవాబిస్తారా? కుటుంబ సభ్యులెవరైనా మిమ్మల్ని బాధపెడితే, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం చూస్తారా? సన్నిహితంగావుండే వ్యక్తి మనకు బాధకలిగించినప్పుడు అలా ప్రతీకారం తీర్చుకునేలా ప్రవర్తించడం ఎంతో సులభం.ప్రతీకారానికి పర్యవసానాలు ఘోరంగా ఉంటాయి
చాలా సందర్భాల్లో ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించేవారు తమకు కలిగిన బాధను తగ్గించుకోవాలనే అలా చేస్తారు. ఉదాహరణకు చాలాకాలం క్రితం, హెబ్రీయుల పూర్వీకుడైన యాకోబు కుమారులకు, కనానీయుడైన షెకెము తమ చెల్లెలు దీనాను చెరిచాడని తెలిసినప్పుడు, వారు ‘సంతాపం పొంది, మిగుల కోపం’ తెచ్చుకున్నారని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 34:1-7) తమ చెల్లెలుకు చేసిన దానికి ప్రతీకారంగా యాకోబు కుమారుల్లో ఇద్దరు షెకెముపై, అతని కుటుంబంపై కుట్రపన్నారు. షిమ్యోను, లేవీ కుయుక్తితో కనానులో ప్రవేశించి, షెకెముతో సహా ఆ ఊరిలో ఉన్న మగవాళ్లనందరిని చంపారు.—ఆదికాండము 34:13-27.
అంత రక్తపాతం జరిగిన తర్వాతైనా వివాదం ముగిసిందా? తన కుమారులు చేసిన పని యాకోబుకు తెలిసినప్పుడు, ఆయన వారినిలా గద్దించాడు: ‘మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసుల్లో అసహ్యునిగా చేసారు. వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు; నేను, నా ఇంటివారు నాశనమౌతాం.’ (ఆదికాండము 34:30) వారి ప్రతీకార చర్యలవల్ల వివాదం పరిష్కారమయ్యే బదులు ముప్పు ఏర్పడింది; ఎందుకంటే యాకోబు కుటుంబం కోపంతో ఉన్న తమ పొరుగువారు ప్రతిదాడి చేస్తారనే భయంతో జాగ్రత్తపడాల్సి వచ్చింది. బహుశా అలాంటి దాడి జరగకూడదనే ఆ చోటు విడిచిపెట్టి కుటుంబంతో బేతేలుకు వెళ్లమని దేవుడు యాకోబును ఆదేశించాడు.—ఆదికాండము 35:1, 5.
దీనాపై అత్యాచారం జరగడం వల్ల ఏర్పడిన పరిస్థితులు ఓ ప్రాముఖ్యమైన పాఠాన్ని నొక్కిచెబుతున్నాయి. సాధారణంగా ఒకరు పగ తీర్చుకున్నప్పుడు అవతలి వాళ్లు కూడా ప్రతీకారం తీర్చుకుంటారు, అందువల్ల అది ఒకసారితో ఆగదు గానీ పరంపరలా అలాగే కొనసాగుతుంది.
హింసాత్మక చర్యల పరంపర
మనకు హాని చేసినవారికి తగిన శాస్తి చేయడం గురించే ఆలోచిస్తూ మన శక్తిని ఉపయోగించడం హానికరం. ఫర్గివ్నెస్—హౌ టు మేక్ పీస్ విత్ యువర్ పాస్ట్ ఆండ్ గెట్ ఆన్ విత్ యువర్ లైఫ్ (క్షమాపణ—గత విషయాలను మనసులో పెట్టుకోకుండా జీవితంలో ఎలా సామెతలు 14:30.
ముందుకు సాగవచ్చు) అనే పుస్తకం ఇలా అంటోంది: “కోపం మిమ్మల్ని కబళిస్తుంది. గతంలో మీకు కలిగిన బాధ గురించి ఆలోచిస్తూ, మీకు హానిచేసినవారిని మనసులో తిట్టుకుంటూ, ప్రతీకారం తీర్చుకోవాలని పన్నాగాలు పన్నుతూవుంటే అది మీ సమయాన్ని, శక్తిని హరించివేస్తుంది.” బైబిలు స్పష్టంగా వర్ణిస్తున్నట్లుగా, “మత్సరము ఎముకలకు కుళ్లు.”—నిజానికి, ఒక వ్యక్తి మనసు నిండా ద్వేషం, పగప్రతీకారాలే ఉంటే అతనెలా సంతోషంగా ఉండగలడు? “‘ప్రతీకారం తీర్చుకుంటే మనసు చల్లబడుతుందని’ మీరనుకుంటే, చాలాకాలంగా పగపెట్టుకున్నవారి ముఖాలు ఒక్కసారి చూడండి” అని ఓ వ్యాఖ్యాత అన్నాడు.
జాతిపరమైన, మతపరమైన ఉద్రిక్తతలు అధికంగావున్న అనేక ప్రాంతాల్లో ఏమి జరుగుతోందో పరిశీలించండి. ఒక హత్య మరో హత్యకు దారితీస్తుంది, అది విద్వేషాల, మరణాల ఆరని అగ్నికి ఆజ్యం పోస్తుంది. ఉదాహరణకు, ఉగ్రవాదుల బాంబు దాడిలో 18 మంది యౌవనులు చనిపోయినప్పుడు, రోదిస్తున్న ఓ మహిళ “వాళ్లకు వెయ్యింతలు శాస్తి చేయాలి” అని బిగ్గరగా అరిచింది. ఈ విధంగా క్రూరత్వం మరింత పెరిగి ఇంకా ఎక్కువమంది పోరాటానికి తెగబడేలా చేస్తుంది.
“కంటికి కన్ను”
కొందరు తమ ప్రతీకార స్వభావాన్ని సమర్థించుకోవడానికి “‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని బైబిలు చెప్పడం లేదా?” అని అడుగుతారు. (లేవీయకాండము 24:20) “కంటికి కన్ను” అనే నియమం ప్రతీకారం తీర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ అది ప్రతీకార చర్యల్ని లేదా అనాలోచిత క్రియల్ని నిరోధించడానికే ఇవ్వబడింది. అదెలా?
ఎవరైనా ఒక ఇశ్రాయేలీయుడు తోటి ఇశ్రాయేలీయునిపై దాడిచేసి అతని కన్ను పోగొడితే, న్యాయమైన శిక్ష విధించాలని ధర్మశాస్త్రం వివరించింది. అయితే, దాడిచేసిన వ్యక్తికి గాయపడిన వ్యక్తి గానీ, అతని కుటుంబ సభ్యులు గానీ ఆ శిక్ష విధించకూడదు. ఆయన ఆ సమస్యను పరిష్కరించడానికి విషయాన్ని నియమిత అధికారులకు అంటే నియమిత న్యాయాధిపతులకు నివేదించాలి. వేరొకరిపై ఉద్దేశపూర్వకంగా దాడిచేసిన నేరస్థునికి లేదా దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన నేరస్థునికి అలాంటి శిక్షే విధించడం ప్రతీకారాన్ని నిరోధించే శక్తిమంతమైన పాఠంగా పనిచేసింది. అది మాత్రమే కాదు, దానిలో ఇంకా చాలావుంది.
పైన ప్రస్తావించబడిన ప్రతిచర్యను ఆదేశించడానికి ముందు, యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఇలా చెప్పాడు: ‘నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, కీడుకు ప్రతికీడు చేయకూడదు, కోపము ఉంచుకొనకూడదు.’ (లేవీయకాండము 19:17, 18) మొత్తం ధర్మశాస్త్రాన్ని మనసులో ఉంచుకొని ఆలోచిస్తే ‘కంటికి కన్ను పంటికి పన్ను’ అనే నియమాన్ని అర్థంచేసుకోగలుగుతాం. యేసు ఈ ధర్మశాస్త్రాన్నంతటినీ రెండు ఆజ్ఞలకు కుదిస్తూ ఇలా అన్నాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [యెహోవాను] ప్రేమింపవలెను,” “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” (మత్తయి 22:37-40) కాబట్టి, నిజ క్రైస్తవులు తమకు అన్యాయం జరిగినప్పుడు ఎలా స్పందించాలి?
సమాధానంగా నడుచుకోండి
బైబిలు, యెహోవాను “సమాధానకర్తయగు దేవుడు” అని వర్ణిస్తూ, ఆయన ఆరాధకులు “సమాధానమును వెదకి దాని వెంటాడవలెను” అని ప్రోత్సహిస్తోంది. (హెబ్రీయులు 13:20; 1 పేతురు 3:11) కానీ, అలా సమాధానాన్ని వెదకడం నిజంగా పనిచేస్తుందా?
యేసు భూమ్మీద పరిచర్య చేస్తున్న కాలంలో వ్యతిరేకులు ఆయనపై ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి హింసించారు, సన్నిహిత సహవాసి ఆయనను అప్పగించాడు, చివరకు ఆయన అనుచరులే ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. (మత్తయి 26:48-50; 27:27-31) ఆయనెలా స్పందించాడు? అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.”—1 పేతురు 2:23.
1 పేతురు 2:21) అన్యాయాన్ని సహించడంతోపాటు అన్ని విషయాల్లో యేసును అనుకరించాలని క్రైస్తవులు ప్రోత్సహించబడుతున్నారు. యేసు, కొండమీది ప్రసంగంలో దీనిగురించి మాట్లాడుతూ, “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి” అని చెప్పాడు.—మత్తయి 5:44, 45.
పేతురు ఇంకా ఇలా వివరించాడు, “క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (క్రీస్తు ప్రేమను అనుకరించేవారు తమకు హాని జరిగినప్పుడు లేదా హాని జరిగిందని అనుకున్నప్పుడు ఏమిచేస్తారు? “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును” అని సామెతలు 19:11 చెబుతోంది. “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము” అనే సలహాను కూడా వారు పాటిస్తారు. (రోమీయులు 12:21) నేడు లోకంలో ఎక్కువగా కనిపించే ప్రతీకార స్వభావానికి ఇదెంత భిన్నమో కదా! క్రైస్తవ ప్రేమ పగను చల్లార్చి, ‘తప్పులు క్షమిస్తుంది,’ ఎందుకంటే ప్రేమ “అపకారమును మనస్సులో ఉంచుకొనదు.”—1 కొరింథీయులు 13:5.
అంటే మనపై ఎవరైనా దౌర్జన్యంచేస్తే లేదా బెదిరిస్తే మౌనంగా తలొగ్గాలా? అలా ఏంకాదు! “మేలు చేత కీడును జయించుము” అని పౌలు చెప్పినప్పుడు క్రైస్తవుడు తాను ప్రాణాలు అర్పించవలసిందేనని అనుకోవాలని ఆయన ఉద్దేశం కాదు. బదులుగా, మనపై దాడి జరిగినప్పుడు మనల్ని మనం కాపాడుకునే హక్కు మనకుంది. మీపై లేదా మీ ఆస్తిపై దాడి జరిగితే మీరు పోలీసులను పిలవచ్చు. ఉద్యోగ స్థలంలో లేదా పాఠశాలలో ఏదైనా సమస్య ఎదురైతే మనం ప్రభుత్వాధికారుల సహాయం కోరవచ్చు.—రోమీయులు 13:3, 4.
అయితే ప్రస్తుత ప్రపంచంలో సరైన న్యాయం లభించడం కష్టమని గుర్తుంచుకోవాలి. నిజానికి చాలామంది న్యాయంకోసం తమ జీవితమంతా పోరాడినా వారి ఆశలు అడియాశలే అయ్యాయి.
ప్రజలు ఐకమత్యంగా ఉండకుండా ఒకరిపై ఒకరు ప్రతీకారంతో, ద్వేషంతో రగిలిపోతుండాలని సాతాను కోరుకుంటున్నాడు. (1 యోహాను 3:7, 8) అయితే బైబిల్లోని ఈ మాటలను గుర్తుపెట్టుకోవడం ఎంతో ఉత్తమం: “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు [యెహోవా] చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.” (రోమీయులు 12:19) విషయాన్ని యెహోవాకు వదిలేసినప్పుడు మనం బాధ, కోపం, దౌర్జన్యం నుండి విముక్తులమౌతాం.—సామెతలు 3:3-6. (w09 09/01)
[12వ పేజీలోని బ్లర్బ్]
“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [యెహోవాను] ప్రేమింపవలెను,” “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను”
[13వ పేజీలోని చిత్రాలు]
ప్రేమ “అపకారమును మనస్సులో ఉంచుకొనదు.”—1 కొరింథీయులు 13:5