కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నవాళ్లు వాళ్లకేమి అవసరం? మీరెలా సహాయం చేయవచ్చు?

జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నవాళ్లు వాళ్లకేమి అవసరం? మీరెలా సహాయం చేయవచ్చు?

జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నవాళ్లు వాళ్లకేమి అవసరం? మీరెలా సహాయం చేయవచ్చు?

లలిత తన చిన్న ఇంట్లో, సరైన వెలుతురు కూడా లేని వంటగదిలో ఏదో ఆలోచించుకుంటూ బల్ల మీద పాత్రలు తెచ్చి పెడుతోంది. ఎంతైనా, బ్రతకడం కోసం ఆమె ఏదో ఒకటి తినాలి! అయితే ఇంతలో, తను ఇద్దరి కోసం ప్లేట్లు పెట్టానని చూసుకుంది . . . వెంటనే భోరున ఏడవడం మొదలుపెట్టింది. అలవాటుగా ఆమె టేబుల్‌ మీద రెండు ప్లేట్లు పెట్టేసింది. ఆమె ప్రియమైన భర్త చనిపోయి రెండేళ్ళు అవుతోంది.”

వివాహ భాగస్వామిని పోగొట్టుకుంటే కలిగే వేదన ఎలా ఉంటుందో, అనుభవిస్తే గానీ తెలియదు. ఆ చేదు నిజాన్ని అంగీకరించడానికి చాలాకాలం పడుతుంది. 72 ఏళ్ళ ప్రమీల తన భర్త హఠాత్తుగా చనిపోవడాన్ని నమ్మలేకపోయింది. “ఆయన చనిపోయాడన్నది నిజం కాదనిపించింది. ఆయన మళ్లీ నా కళ్లముందు తిరగడనే విషయం జీర్ణించుకోలేకపోయాను” అని ఆమె అంటోంది.

ఏవో కారణాల వల్ల కాలో చెయ్యో పోగొట్టుకున్నవాళ్లకు, కొన్నిసార్లు అది ఇంకా ఉన్నట్లే “అనిపిస్తుంది.” అలాగే జీవిత భాగస్వామిని కోల్పోయి తీవ్ర బాధలో ఉన్నవాళ్లకు కూడా తాము పోగొట్టుకున్నవాళ్లు గుంపుగావున్న ప్రజల్లో “కనిపించినట్లు” అనిపిస్తుంది. అలాగే కొన్నిసార్లు వాళ్లు, చనిపోయిన తమ జీవిత భాగస్వామి తమ పక్కన ఉన్నారనే భ్రమలో వాళ్లతో మామూలుగా ఏదో మాట్లాడుతుంటారు.

ఎవరికైనా అలాంటి కష్టం వచ్చినప్పుడు వాళ్లకు ఎలా సహాయం చేయాలో స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సాధారణంగా తెలియదు. జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్లెవరైనా మీకు తెలుసా? అయితే వాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చు? వాళ్లు దుఃఖంలో ఉన్నప్పుడు సహాయం చేయాలంటే మీకు ఏ విషయాలు తెలిసివుండాలి? వాళ్లు మళ్లీ సంతోషంగా జీవించాలంటే మీరెలా సహాయం చేయవచ్చు?

ఏమి చేయకూడదు?

తమ జీవిత భాగస్వామిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తమ ప్రియమైనవాళ్లను చూసి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతో బాధపడతారు. అందుకే వీళ్లు, తమవాళ్ల మేలుకోరి వాళ్లు ఆ దుఃఖంలో ఎక్కువకాలం ఉండిపోకుండా చూడాలని ప్రయత్నిస్తారు. వివాహ జతను కోల్పోయిన 700 మందిని సర్వే చేసిన ఒక పరిశోధకుడు ఇలా రాశాడు, “ఇంతకాలం దుఃఖించడమే ‘సరైనది’ అని చెప్పలేం.” కాబట్టి వాళ్ల దుఃఖానికి అడ్డుకట్ట వేయాలని చూసే బదులు, వాళ్లను తమ బాధ వెళ్ళగక్కనివ్వండి.—ఆదికాండము 37:34, 35; యోబు 10:1.

అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లలో సహాయం చేయడం మంచిదే అయినా దానికి సంబంధించిన పనులన్నీ మీరే చేయాలని అనుకోవద్దు. భార్యను పోగొట్టుకున్న 49 ఏళ్ళ ప్రతాప్‌ ఇలా అంటున్నాడు, “సహాయం చేయడానికి వచ్చినవాళ్ళు ముఖ్యమైన విషయాల్లో నన్నే నిర్ణయాలు తీసుకోనివ్వడం నాకు నచ్చింది. ఎందుకంటే నా భార్య అంత్యక్రియలు నా ఇష్టప్రకారం జరగడం నాకెంతో ప్రాముఖ్యం. నా భార్యను గౌరవించడానికి నేను చేయగలిగిన చివరి పని అదేనని నేననుకున్నాను.”

కొంచెం సహాయం చేస్తే ఎవరైనా ఇష్టపడతారు. భర్తను కోల్పోయిన 68 ఏళ్ళ కాంతం ఇలా అంటోంది, “నేను సరిగా ఆలోచించే స్థితిలో లేను కాబట్టి అంత్యక్రియల ఏర్పాట్లు చూడడం, సంతకాలు పెట్టడం వంటి పనులన్నిటినీ చేయడం నాకు కష్టమనిపించింది. అలాంటి పనులలో నా కొడుకు, కోడలు నిజంగా చాలా సహాయం చేశారు.”

అంతేకాకుండా, చనిపోయిన ప్రియమైనవాళ్ల గురించి మాట్లాడడానికి సంకోచించకండి. ముందు చెప్పుకున్న ప్రమీల ఇలా అంటోంది, “నా స్నేహితులు నాకు చాలా సహాయం చేశారు. కానీ చాలామంది నా భర్త రాజేష్‌ గురించి మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించారు. రాజేష్‌ అనే ఒక వ్యక్తి ఎప్పుడూ లేడన్నట్లే వాళ్లు ప్రవర్తించారు, అది నాకు కాస్త బాధ అనిపించింది.” వివాహ భాగస్వామిని కోల్పోయినవాళ్లు కొంతకాలానికి, తమ వివాహ భాగస్వామి గురించి వేరేవాళ్లతో మాట్లాడడానికి ఇష్టపడవచ్చు. బ్రతికున్నప్పుడు వాళ్లు చేసిన ఏదైనా సహాయం లేక వాళ్ల విషయంలో జరిగిన ఏదైనా సరదా సంఘటన మీకు గుర్తున్నాయా? గుర్తుంటే వాళ్లను పోగొట్టుకున్న భాగస్వామికి దాని గురించి చెప్పడానికి భయపడకండి. వాళ్లు వినడానికి ఇష్టపడుతుంటే, చనిపోయిన వ్యక్తిలో మీకు నచ్చిన గుణాల గురించి లేదా వాళ్లు లేని లోటు మీకు ఏ విషయంలో బాగా తెలుస్తుందనే దాని గురించి చెప్పండి. ఇలా చేస్తే, దుఃఖిస్తున్న భాగస్వామికి ఇతరులు కూడా తన బాధలో పాలుపంచుకుంటున్నారనే ఓదార్పు కలుగవచ్చు.—రోమీయులు 12:15, 16.

మీరు సహాయం చేయడానికి వెళ్లినప్పుడు, దుఃఖంలో ఉన్నవాళ్లను సలహాలతో ఉక్కిరిబిక్కిరి చేయకండి. త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోమని వాళ్లను తొందర పెట్టకండి. a ‘జీవితంలో అత్యంత బాధాకరమైన మార్పు జరిగే ఈ సమయంలో దుఃఖంలోవున్న వ్యక్తికి నేనెలా సహాయం చేయగలను?’ అని ఒకసారి మనసుపెట్టి ఆలోచించండి.

ఏమి చేయవచ్చు?

సాధారణంగా, తమ ప్రియమైన భాగస్వామిని పోగొట్టుకున్న వాళ్లు, ఆ తర్వాత కొంతకాలంపాటు ఎవరైనా అవసరమైన సహాయం చేస్తే సంతోషిస్తారు. చూడడానికి వచ్చిన బంధువులకు భోజనం, వసతి ఏర్పాటు చేయగలరా? లేదా దుఃఖంలోవున్న వ్యక్తి దగ్గరే ఉండి ఓదార్చగలరా?

జీవితంలో దుఃఖం, ఒంటరితనం ఎదురైనప్పుడు స్త్రీలు, పురుషులు వేర్వేరుగా స్పందిస్తారని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో భార్య చనిపోయిన భర్తల్లో సగం కంటే ఎక్కువమంది ఒకటిన్నర సంవత్సరం గడవక ముందే మళ్ళీ పెళ్ళి చేసుకుంటారు, కానీ భర్త చనిపోయిన భార్యల విషయంలో చాలా అరుదుగా అలా జరుగుతుంది. ఎందుకీ తేడా?

సాధారణంగా ప్రజలు నమ్మేదానికి విరుద్ధంగా, మళ్ళీ పెళ్ళి చేసుకునే మగవాళ్లందరూ కేవలం తమ లైంగిక అవసరాలు తీర్చుకోవడానికే అలా చేసుకోరు. భర్తలు సాధారణంగా తమ భార్యలకే అన్ని విషయాలు చెప్పుకుంటారు, కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత ఒంటరితనాన్ని భరించలేకనే మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ భర్తను కోల్పోయిన భార్యలైతే, కొన్నిసార్లు తమ స్నేహితులు తమను మర్చిపోయినా ఏదో విధంగా తమ భావాలను వేరేవాళ్లతో పంచుకొని ఓదార్పు పొందగలుగుతారు. కాబట్టి భార్య చనిపోయిన భర్తలు తమ జీవితంలోకి వచ్చే మరో స్త్రీతో అంత త్వరగా కొత్త బంధానికి అలవాటుపడడం కష్టమే అయినా ఒంటరితనం నుండి బయటపడాలంటే మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఒక్కటే మార్గమని ఎందుకు అనుకుంటారో దీన్నిబట్టి చెప్పవచ్చు. ఇలాంటి తేడా ఉంది కాబట్టే స్త్రీలు ఒంటరితనాన్ని చక్కగా అధిగమించే అవకాశం ఉంది.

వివాహ భాగస్వామిని పోగొట్టుకున్న మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మగవాళ్లైనా ఆడవాళ్లైనా, ఒంటరితనం వల్ల వాళ్లకు కలిగే బాధ తగ్గాలంటే మీరేమి చేయవచ్చు? వసుంధర అనే 49 ఏళ్ళ విధవరాలు ఇలా చెప్తోంది, “చాలామంది సహాయం చేయాలనుకుంటారు గానీ చొరవ తీసుకోరు. ‘ఏదైనా అవసరముంటే చెప్పండి చేస్తాను’ అని తరచూ అంటారు. కానీ కొందరు నా దగ్గరకు వచ్చి, ‘బజారుకు వెళ్తున్నాను, మీరూ వస్తారా?’ అని అడిగినప్పుడు నాకు సంతోషం అనిపించేది.” క్యాన్సర్‌ వల్ల తన భార్యను కోల్పోయిన ప్రతాప్‌, తమతో బయటకు రమ్మని ఎవరైనా పిలిస్తే ఎందుకు ఇష్టపడతాడో వివరిస్తున్నాడు, “కొన్నిసార్లు, ప్రజలను కలవాలని, మన పరిస్థితి గురించి వాళ్లతో మాట్లాడాలని అనిపించదు. కానీ ఏదైనా ఒక సాయంత్రం ఎవరితోనైనా సమయం గడిపితే ఎంతో బావుంటుంది, అంతగా ఒంటరితనం అనిపించదు. ప్రజలు మనపై నిజంగా శ్రద్ధ చూపిస్తున్నారని మనకు అర్థమవుతుంది, అది మన పరిస్థితిని తేలికపరుస్తుంది.” b

అవతలివాళ్ల బాధను అర్థంచేసుకున్నారని ముఖ్యంగా ఎప్పుడు చూపించాలి?

తన కుటుంబ సభ్యుల్లో ఎక్కువమంది తిరిగి రోజువారీ పనుల్లో పడిపోయిన తర్వాతే తనకు ఓదార్పు ఎక్కువ అవసరమైందని వసుంధర గమనించింది. ఆమె ఇలా చెప్తోంది, “జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న కొన్నిరోజుల వరకు స్నేహితులు, కుటుంబ సభ్యులు మనతోనే ఉంటారు. కానీ కొంతకాలానికి, వాళ్ళు తమ తమ పనుల్లో మునిగిపోతారు. కానీ జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న వాళ్లకు మాత్రం జీవితం మళ్లీ మామూలుగా మారదు.” నిజమైన స్నేహితులు అలాంటి పరిస్థితి వస్తుందని గ్రహించి అందుబాటులో ఉంటూ, సహాయం చేస్తూనేవుంటారు.

జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్లు ప్రాముఖ్యంగా తమ పెళ్ళిరోజు లేదా భాగస్వామి చనిపోయినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఎవరైనా తమతో ఉంటే బావుంటుందని అనుకోవచ్చు. ముందు ప్రస్తావించబడిన కాంతం, ఎదిగిన తన కొడుకు ప్రతీ సంవత్సరం పెళ్ళిరోజున తనకు ఒంటరితనం, బాధ తెలీకుండా చేస్తాడని చెప్తోంది. “నా కొడుకు ప్రకాశ్‌ ప్రతీ సంవత్సరం ఆ రోజున నన్ను బయటకు తీసుకువెళ్తాడు. మేమిద్దరం కలిసి భోజనం చేస్తాం. ఆ రోజంతా ప్రకాశ్‌ నాతోనే గడుపుతాడు” అని ఆమె చెప్తోంది. వివాహ భాగస్వామిని కోల్పోయిన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మరింతగా బాధపడే ఇలాంటి సందర్భాలను మీరు ఎందుకు గుర్తుంచుకోకూడదు? వాళ్లు ఎక్కువగా బాధపడే అలాంటి రోజుల్లో మీరు గానీ వేరే ఎవరైనాగానీ వాళ్లతో ఉండేలా ఏర్పాటు చేయవచ్చు.—సామెతలు 17:17.

వివాహ భాగస్వామిని కోల్పోయిన వేరేవాళ్లే తమకు ఓదార్పుకరంగా ఉండగలరని కొంతమంది గ్రహించారు. ఎనిమిది సంవత్సరాల క్రితం భర్తను పోగొట్టుకున్న వాసంతి, మరో విధవరాలితో స్నేహం చేయడం వల్ల పొందిన ప్రయోజనం గురించి ఇలా చెప్తోంది, “ఆమె ధైర్యంగా నిలబడడం చూసి నాలో చాలా మార్పు వచ్చింది, ఆమెను చూసి నేను కూడా ధైర్యంగా ముందుకు సాగగలిగాను.”

జీవిత భాగస్వామిని కోల్పోయినవాళ్లు ఆ దుఃఖం నుండి తేరుకున్న తర్వాత, ఇతరులను ప్రోత్సహించగలుగుతారు, వాళ్లకు జీవితం మీద ఆశ చిగురింపజేయగలుగుతారు. బైబిల్లో ప్రస్తావించబడిన యౌవనస్థురాలైన రూతు, ఆమె అత్త నయోమి అనే ఇద్దరు విధవరాళ్ళు ఒకరికొకరు ఆసరాగా ఉంటూ ప్రయోజనం పొందారు. ఈ ఇద్దరు స్త్రీలు ఒకరి పట్ల ఒకరు చూపించుకున్న శ్రద్ధ, వాళ్లు దుఃఖం నుండి తేరుకోవడానికి, వాళ్లకు ఎదురైన కష్టాన్ని తాళుకోవడానికి ఎలా సహాయం చేసిందో బైబిలు మనస్సును కదిలించేలా వివరిస్తోంది.—రూతు 1:15-17; 3:1; 4:14, 15.

కోలుకోవడానికి సమయం పడుతుంది

జీవిత భాగస్వామిని కోల్పోయినవాళ్లు మళ్ళీ మామూలుగా జీవించాలంటే, మరణించిన తమ ప్రియమైనవాళ్ల జ్ఞాపకాలను దాచుకుంటూనే, తమ స్వంత బాగోగులను కూడా చూసుకోవాలి. ‘ఏడ్చుటకు సమయం కలదు’ అని జ్ఞానవంతుడైన సొలొమోను రాజు అన్నాడు. అంతేగాక, ‘బాగుచేయుటకు సమయం కలదు’ అని కూడా ఆయన చెప్పాడు. అంటే కోలుకోవడానికి సమయం పడుతుందని అర్థం.—ప్రసంగి 3:3, 4.

పైన ప్రస్తావించబడిన ప్రతాప్‌, జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న తర్వాత వాళ్ల జ్ఞాపకాల నుండి బయటపడి ముందుకు సాగడం ఎంత కష్టంగా ఉంటుందో వివరిస్తున్నాడు. “నేను, నా భార్యా ఒకదాన్నొకటి అల్లుకొని పెరిగిన మొక్కల్లా ఉండేవాళ్ళం. కానీ వాటిలో ఒక మొక్క చనిపోయి, తొలగించబడితే రెండవది అందవికారంగా కనిపిస్తుంది. ఒంటరిగా జీవించడం నాకెలాగో అనిపించింది” అని ఆయన చెప్పాడు. చనిపోయిన వివాహ భాగస్వామికి కట్టుబడివుండాలని, కొంతమంది గతాన్ని మర్చిపోవడానికి ఇష్టపడరు. మరి కొంతమంది తాము సంతోషంగా ఉంటే తమ వివాహ భాగస్వామికి ద్రోహం చేసినట్లు అవుతుందని భయపడతారు. అందుకే వాళ్లు బయటకు వెళ్ళడానికి, వేరేవాళ్లతో కలవడానికి ఇష్టపడరు. జీవిత భాగస్వామిని కోల్పోయినవాళ్లు మెల్లగా కోలుకోవడానికి, దుఃఖం నుండి బయటపడడానికి ఎలా సహాయం చేయవచ్చు?

మొదటిగా, వాళ్లు తమ మనసులో ఉన్నది చెప్పుకోవడానికి సహాయం చేయవచ్చు. ఆరు సంవత్సరాల క్రితం భార్యను కోల్పోయిన విశాల్‌ ఇలా అంటున్నాడు, “నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్లు, ఆ సమయంలో నా మనసులో మెదిలిన పాత విషయాల గురించి చెప్తున్నప్పుడు ప్రశాంతంగా వింటే నేనెంతో ఇష్టపడతాను. నాతో సమయం గడపడం అన్నిసార్లూ అంత సరదాగా ఉండదని నాకు తెలుసు, అయినా వాళ్లు నా బాధను అర్థంచేసుకోవడం నాకెంతో నచ్చింది.” పరిణతి గల ఒక స్నేహితుడు ఎప్పుడూ చొరవ తీసుకుని, ‘మీ మనసు కుదుటపడిందా?’ అని అడిగి తెలుసుకోవడం ప్రతాప్‌ మనసుకు హత్తుకుంది. “ఆయన నిజాయితీగా, దయతో మాట్లాడడం నాకెంతో సంతోషాన్నిచ్చేది, అందుకే నేను చాలాసార్లు ఆ సమయంలో నాకెలా అనిపిస్తుందో ఆయనతో చెప్పేవాణ్ణి” అని ప్రతాప్‌ అంటున్నాడు.—సామెతలు 18:24.

ఫలానా విషయంలో అలా చేయకుండా ఉండాల్సిందనే ఆలోచన, పొరపాటు చేశామనే బాధ లేదా కోపం మనసును కలచివేస్తాయి. జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నవాళ్లు, అలాంటి వేర్వేరు భావాలు వ్యక్తం చేయడం ద్వారా తమ జీవితంలో మారిన పరిస్థితులను తాళుకోవడానికి సిద్ధపడతారు. ఉదాహరణకు దావీదు రాజు, తనకు అత్యంత సన్నిహితుడైన యెహోవా దేవుని ఎదుట తన బాధను కుమ్మరించినప్పుడు, ఆయన “లేచి” తన బిడ్డ చనిపోయాడనే చేదు నిజాన్ని అంగీకరించడానికి కావలసిన బలాన్ని పొందాడు.—2 సమూయేలు 12:19-23.

మొదట్లో కష్టమే అయినా, జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న వాళ్లు కొంతకాలానికి తిరిగి మామూలు జీవితాన్ని ప్రారంభించాలి. మీరు రోజూ చేసుకునే కొన్ని పనుల్లో వాళ్లను కూడా కలుపుకోవచ్చు, అంటే బజారుకు వెళ్తున్నప్పుడో లేదా సాయంకాలం నడవడానికి వెళ్తున్నప్పుడో వాళ్లను మీతోపాటు తీసుకువెళ్లవచ్చు. ఏదైనా పనిలో సహాయం చేయమని వాళ్లను అడగవచ్చు. అలా చేయడం ద్వారా కూడా నలుగురిలో కలవడానికి వాళ్లకు సహాయపడవచ్చు. ఉదాహరణకు, ఆమె పిల్లల్ని చూసుకోగలిగితే లేదా ఏదైనా వంటకాలు నేర్పించగలిగితే ఆ విషయాల్లో ఆమె సహాయం తీసుకోవచ్చు. ఇంటికి మరమ్మత్తులు అవసరమైతే ఆ పనిలో ఆయన సహాయం చేయగలడేమో అడగవచ్చు. ఇలాంటి విషయాల్లో వాళ్ల సహాయం కోరడం, వాళ్లకు ఉత్సాహాన్ని ఇవ్వడమే గాక తమ జీవితం ఎందుకూ పనికిరాదని వాళ్లుపడే బాధను పోగొడుతుంది.

తమ వాళ్లను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న వాళ్లు తమ మనసులో ఉన్నది వేరే వాళ్లతో పంచుకోవడం మళ్లీ మొదలుపెట్టినప్పుడు, వాళ్లలో జీవితాన్ని తిరిగి ఆస్వాదించాలన్న కోరిక మెల్లమెల్లగా కలుగవచ్చు. అంతేకాక, వాళ్లు కొత్త లక్ష్యాలను కూడా పెట్టుకోగలుగుతారు. భర్తను పోగొట్టుకున్న 44 ఏళ్ల మమత విషయంలో అదే జరిగింది. ఆమె ఒక తల్లి కూడా. ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది, “మళ్లీ మామూలుగా అన్ని పనులు చేసుకోవడం చాలా కష్టమైంది! రోజువారీ పనులు చక్కబెట్టుకోవడం, ఖర్చులు చూసుకోవడం, ముగ్గురు పిల్లలను పెంచడం ఎంతో కష్టమైంది.” అయితే, సమయం గడిచేకొద్దీ మమత అన్ని పనులు పద్ధతి ప్రకారం చేసుకోవడం, తాను అనుకున్నదాన్ని పిల్లలతో చక్కగా చెప్పడం నేర్చుకుంది. అంతేకాకుండా, ఆమె తన దగ్గరి స్నేహితుల సహాయం తీసుకోవడం కూడా నేర్చుకుంది.

“జీవితమనే బహుమానం దాని విలువను కోల్పోదు”

స్నేహితులు, కుటుంబ సభ్యులు సరైన విధంగా సహాయం చేయాలంటే పరిస్థితిని బాగా అర్థంచేసుకోవాలి. వివాహ భాగస్వామిని పోగొట్టుకున్న వాళ్ల మానసిక స్థితి కొన్ని నెలలపాటు లేదా సంవత్సరాలపాటు మారుతూ ఉంటుంది. వాళ్లు కొంతకాలం పాటు కాస్త ప్రశాంతంగా ఉంటే, మరికొంత కాలం తీవ్రంగా కృంగిపోయి ఉంటారు. ఖచ్చితంగా, వాళ్ల “మనోవ్యాధి” లేదా మానసిక వేదన చాలా తీవ్రంగా ఉండవచ్చు.—1 రాజులు 8:38, 39.

అలా కృంగిపోయి ఉన్న సమయాల్లోనే, వాళ్లు తమ చుట్టూ జరుగుతున్న దాన్ని మర్చిపోయి అందరికీ దూరమైపోకుండా వాళ్లకు కొంత ప్రోత్సాహం అవసరం కావచ్చు. తమ వివాహ భాగస్వామిని పోగొట్టుకున్న చాలామంది అలాంటి ప్రోత్సాహం వల్ల తమ జీవితాల్ని మళ్లీ కొత్త ఆశలతో మొదలుపెట్టగలిగారు. భార్యను పోగొట్టుకున్న 60 ఏళ్ల రమేష్‌, ఇప్పుడు ఆఫ్రికాలో పూర్తికాల సువార్తికునిగా పనిచేస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు, “జీవిత భాగస్వామి దూరమైపోయినప్పుడు గుండె పగిలేంత బాధ కలిగినా, జీవితమనే బహుమానం దాని విలువను కోల్పోదు.”

వివాహ భాగస్వామిని కోల్పోయిన తర్వాత జీవితం ఎంతో మారిపోతుంది. అయినప్పటికీ, మరణం వల్ల తమ ప్రియమైన వాళ్లను పోగొట్టుకున్నవాళ్లు ఇతరుల కోసం ఎంతో చేయవచ్చు.—ప్రసంగి 11:7, 8. (w10-E 05/01)

[అధస్సూచీలు]

a 12వ పేజీలోని “ తీపి గుర్తులా, కోలుకోవడానికి అవరోధాలా?” అనే బాక్సు చూడండి.

b తమ వాళ్లను పోగొట్టుకున్న బాధలో ఉన్నవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే బ్రోషుర్‌లోని 20-25 పేజీలు చూడండి.

[11వ పేజీలోని బ్లర్బ్‌]

నిజమైన స్నేహితులు అందుబాటులో ఉంటూ, ఎప్పుడూ సహాయం చేస్తుంటారు

[12వ పేజీలోని బాక్సు/ చిత్రం]

 తీపి గుర్తులా, కోలుకోవడానికి అవరోధాలా?

“నేను నా భర్త వస్తువుల్లో చాలా వాటిని దాచుకున్నాను. రోజులు గడుస్తుండగా అవి, మేము కలిసి సంతోషంగా గడిపిన సమయాల్ని మరింతగా జ్ఞాపకం చేస్తున్నాయని గమనించాను. ఆయనకు సంబంధించిన వేటినీ నేను వెంటనే దూరం చేసుకోవాలనుకోలేదు, ఎందుకంటే కాలంతోపాటు మన ఆలోచనలు చాలామట్టుకు మారవచ్చు” అని కేవలం కొన్ని సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయిన వసుంధర చెప్తోంది.

ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువకాలం క్రితం తన భార్యను పోగొట్టుకున్న రమేష్‌ మరో విధంగా చెప్తున్నాడు. “నాకైతే, నా భార్యను జ్ఞాపకం ఉంచుకోవడానికి నా చుట్టూ ఆమె వస్తువులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆమె వస్తువులను వేరేవాళ్లకు ఇచ్చేయడం వల్ల వాస్తవాన్ని అంగీకరించగలిగానని, దుఃఖాన్ని త్వరగా అధిగమించగలిగానని నాకు అనిపిస్తుంది.”

వీళ్లిద్దరి మాటలను బట్టి, చనిపోయిన తన భాగస్వామి వస్తువులను ఏమిచేయాలనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి, వాళ్లను అర్థం చేసుకునే స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ విషయంలో తమ అభిప్రాయాల్ని వాళ్ల మీద రుద్దడానికి ప్రయత్నించరు.—గలతీయులు 6:2, 5.

[9వ పేజీలోని చిత్రాలు]

మీ సహాయాన్ని ఎక్కువగా ఇష్టపడే ప్రత్యేక సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

[9వ పేజీలోని చిత్రం]

వాళ్లను మీతోపాటు బయటకు రమ్మని పిలవడం మర్చిపోవద్దు

[10వ పేజీలోని చిత్రాలు]

వివాహ భాగస్వామిని పోగొట్టుకున్నవాళ్లను, మీరు ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు లేదా సరదాగా బయటికి వెళ్లినప్పుడు మీతోపాటు కలుపుకోండి