కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒంటరి తల్లులకు చేయూతనివ్వండి

ఒంటరి తల్లులకు చేయూతనివ్వండి

ఒంటరి తల్లులకు చేయూతనివ్వండి

సాధారణంగా ఒంటరి తల్లులు a పనులన్నీ చేసుకోవడానికి కావాల్సినంత సమయం, ఓపిక లేక సతమతమవుతుంటారు. వాళ్లకు లెక్కలేనన్ని బాధ్యతలుంటాయి.

పిల్లల్ని పెంచి పెద్ద చేయడం చిన్న విషయం కాదు. ఉద్యోగం చేయడంతో పాటు, బయటి పనులు చూసుకోవాలి, ఇక ఇంటిపని వంటపని ఉండనే ఉంటుంది, దానికి తోడు పిల్లల ఆలనాపాలనా చూసుకోవాలి. వాళ్ల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి, వాళ్లు సరదాగా గడపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. పిల్లలు తమ సమస్యల్ని చెప్పుకున్నప్పుడు విని అవసరమైన సహాయం చేయాలి. వీటన్నిటితోపాటు, వీలైతే తమ కోసం కొంత సమయం కేటాయించుకోవాలి.

ఒంటరి తల్లులున్న కుటుంబాలు ఇప్పుడు సమాజంలో సర్వసాధారణమై, అంతకంతకూ ఎక్కువవుతున్నా అలాంటి కుటుంబాలు సులభంగా నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఒక ఒంటరి తల్లి నిజాయితీగా ఇలా ఒప్పుకుంటోంది, “నేను ఒంటరి తల్లిని అయ్యాక గానీ వాళ్ల కష్టాలేమిటో నాకు అర్థంకాలేదు.” ఒంటరి తల్లులకు చేయూతనివ్వడానికి మీరేమి చేయవచ్చు? మీరు వాళ్లను పట్టించుకోవాలా? వాళ్ల అవసరాలను ఎందుకు పట్టించుకోవాలో మూడు కారణాలను చూద్దాం.

ఎందుకు చేయూతనివ్వాలి?

చాలామంది ఒంటరి తల్లులు తమకు ఎవరైనా చేయూతనివ్వాలని కోరుకుంటారు. ఇద్దరు పిల్లలున్న 41 సంవత్సరాల ఒక విధవరాలు ఇలా చెబుతోంది, “కొన్నిసార్లు నాకు ఏమి చేయాలో తోచదు, నాకున్న ఎన్నో బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు అనిపిస్తుంది.” భర్త చనిపోతే, వదిలేసి వెళ్లిపోతే లేదా ఇతర కష్టపరిస్థితులు ఎదురైతే చాలామంది ఒంటరి తల్లులు ఎలా భావిస్తారో ఒక తల్లి ఇలా చెబుతోంది, “మేము సహాయం కోసం అర్థిస్తున్నాం, మాకు సహాయం నిజంగా చాలా అవసరం.”

చేయూతనిస్తే మీకు సంతోషం కలుగుతుంది. మీరెప్పుడైనా ఒక వ్యక్తి మోయలేనంత బరువు మోసుకెళ్తుంటే ఆ బరువు మోయడానికి ఆ వ్యక్తికి సహాయం చేశారా? అలాగైతే, మీరు ఆ వ్యక్తికి అవసరమైన సహాయం చేశారు కాబట్టి మీకెంతో సంతృప్తి కలిగివుంటుంది. ఒంటరి తల్లులకు కూడా ఒక్కరే నెరవేర్చలేనన్ని బాధ్యతలుంటాయి. మీరు వాళ్లకు సహాయం చేస్తే, ‘దిక్కులేని వాళ్లను అర్థంచేసుకొని వాళ్లకు చేయూతనిచ్చే వ్యక్తి సంతోషంగా ఉంటాడు’ అని కీర్తన 41:1, NW చెబుతున్నది నిజమని తెలుసుకుంటారు.

వాళ్లకు చేయూతనిస్తే దేవుడు సంతోషిస్తాడు. యాకోబు 1:27 ఇలా చెబుతోంది, ‘తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము, నిష్కళంకము అయిన భక్తి ఏదంటే—దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వాళ్ల ఇబ్బందుల్లో పరామర్శించడం.’ ఒంటరి తల్లుల మీద శ్రద్ధ చూపించడం కూడా అందులో ఒక భాగమే. b హెబ్రీయులు 13:16 ఇలా చెబుతోంది, ‘ఉపకారం, ధర్మం చేయడం మర్చిపోకండి, అలాంటి యాగాలు దేవునికి ఇష్టం.’

ఒంటరి తల్లుల మీద శ్రద్ధ చూపించడానికి ఉన్న ఈ మూడు కారణాలను మనస్సులో ఉంచుకొని, వాళ్లకు చేయూతనివ్వాలంటే ఏమి చేస్తే బావుంటుందో, వాళ్లకు ఎలా చేయూతనిస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం.

వాళ్ల అవసరాలను గుర్తించండి

“మీకేమైనా సహాయం అవసరమైతే నాకు చెప్పండి” అని ఒక ఒంటరి తల్లిని అడిగితే బావుంటుందని మీకు అనిపించవచ్చు. నిజానికి, మీరు అడిగినా కొంతమంది తమ అవసరాలేమిటో చెప్పకపోవచ్చు. ముందే చూసినట్లు, ‘వాళ్లను అర్థంచేసుకొని వాళ్లకు చేయూతనివ్వండి’ అని కీర్తన 41:1 చెబుతోంది. ఇక్కడ ఉపయోగించబడిన హెబ్రీ పదానికి, “అర్థం చేసుకోవడానికి కష్టంగావున్న తలంపులన్నిటినీ ఒక క్రమపద్ధతిలో పెట్టుకుని జ్ఞానయుక్తంగా వ్యవహరించడం” అనే అర్థం ఉండవచ్చని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది.

కాబట్టి, ఒంటరి తల్లులకు ఎలా చేయూతనిస్తే బావుంటుందో తెలుసుకోవాలంటే వాళ్లకు ఎలాంటి సమస్యలుంటాయనే దానిగురించి బాగా ఆలోచించాలి. వాళ్ల పరిస్థితులను పైపైన కాకుండా బాగా గమనించండి. ‘నేను ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే, నాకెలాంటి సహాయం అవసరమౌతుంది?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజమే, మీరెంత ప్రయత్నించినా ఒంటరి తల్లిగా ఉండడమంటే ఏమిటో ఆ స్థితిలో ఉంటే తప్ప అర్థంచేసుకోలేరని చాలామంది ఒంటరి తల్లులు అంటారు. అయినా, వాళ్ల పరిస్థితుల్ని అర్థంచేసుకోవడానికి చేయగలిగినదంతా చేస్తే, మీరు ‘వాళ్లను అర్థంచేసుకొని వాళ్లకు’ మరింత బాగా ‘చేయూతనివ్వగలుగుతారు.’

పరిపూర్ణ ఆదర్శవంతుడైన దేవుడు చేసినట్లే చేయండి

ఒంటరి తల్లుల మీద శ్రద్ధ తీసుకునే విషయానికొస్తే, యెహోవా దేవుడు వాళ్లను చూసుకున్నంత ప్రేమగా, చక్కగా ఎవరూ చూసుకోలేదు. విధవరాళ్ల మీద, తండ్రిలేని కుమారుల మీద, ఒంటరి తల్లుల మీద యెహోవా దేవుడు చూపించే శ్రద్ధ గురించి చాలా లేఖనాలు మాట్లాడుతున్నాయి. అలాంటి దీనుల అవసరాలను దేవుడు ఎలా తీర్చాడో పరిశీలిస్తే, వాళ్లకు నిజంగా అవసరమైన సహాయం చేయడం ఎలాగో మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం నాలుగు ప్రాముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.

వాళ్లు చెప్పేది వినండి

ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో, తాను ‘నిశ్చయంగా’ కష్టాల్లో ఉన్నవాళ్ల ‘మొర వింటాను’ అని యెహోవా చెప్పాడు. (నిర్గమకాండము 22:22, 23) మనం ఆయన చేసినట్లే ఎలా చేయవచ్చు? సాధారణంగా ఒంటరి తల్లులు తమతో మాట్లాడడానికి పెద్దవాళ్లు ఎవ్వరూ లేక ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తారు. “పిల్లలు నిద్రపోయిన తర్వాత, కొన్నిసార్లు దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేసేదాన్ని, అప్పుడప్పుడు ఒంటరితనాన్ని భరించడం చాలా కష్టమయ్యేది” అని ఒక ఒంటరి తల్లి ఏడుస్తూ చెప్పింది. ఒంటరి తల్లులు తమ బాధల్ని చెప్పుకోవడానికి వీలుగా వాళ్ల ‘మొర’ వినడానికి మీరు సిద్ధంగా ఉంటారా? సరైన పరిస్థితుల్లో వాళ్లు చెప్పేది వింటే, పిల్లలను పెంచే విషయంలో తాము ఎదుర్కొనే సమస్యల్ని తట్టుకోవడానికి వాళ్లకెంతో సహాయం చేయగలుగుతాం.

వాళ్లను ప్రోత్సహిస్తూ మాట్లాడండి

ఆరాధన చేసేటప్పుడు ఇశ్రాయేలీయులు పాడాల్సిన పరిశుద్ధ పాటలను లేదా కీర్తనలను యెహోవా రాయించాడు. యెహోవా తమకు “తండ్రి,” “న్యాయకర్త” అనీ ఆయన తమకు ఉపశమనం కలిగిస్తాడనీ గుర్తుచేసే దైవప్రేరేపిత మాటలను పాడుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల్లోని విధవరాళ్లు, తండ్రిలేని కుమారులు ఎంత ప్రోత్సాహాన్ని పొందివుంటారో ఆలోచించండి. (కీర్తన 68:5; 146:9) మనం కూడా ఒంటరి తల్లులను ప్రోత్సహిస్తూ మాట్లాడితే వాళ్లు ఆ మాటలను చాలా సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. “మీరు నిజంగా మీ అబ్బాయిలిద్దర్నీ చక్కగా పెంచుతున్నారు. మీరు వేరేవాళ్లకు ఆదర్శంగా ఉన్నారు” అని ఒక అనుభవంగల తండ్రి 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలను రూత్‌ అనే ఒక ఒంటరి తల్లి ఎంతో ఇష్టంగా గుర్తుచేసుకుంటోంది. “ఆయన మాటలు నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చాయి” అని రూత్‌ చెప్పింది. నిజానికి, “దయగల మాటలు” హృదయాన్ని ‘సంతోషపెడతాయి.’ అంతేకాదు, అలాంటి మాటలవల్ల ఒంటరి తల్లులు ఎంతో ప్రోత్సాహం పొందుతారు. (సామెతలు 12:25) ఒంటరి తల్లులను నిజాయితీగా మెచ్చుకునే విషయం ఏదైనా ఉందేమో ఆలోచించండి.

అవసరమైనప్పుడు వస్తుపరంగా సహాయం చేయండి

యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో విధవరాళ్లు, తండ్రి లేని కుమారులు గౌరవప్రదంగా ఆహారాన్ని పొందే ఏర్పాటు గురించి చెప్పబడింది. అలాంటి ఏర్పాట్లవల్ల, ఈ దీనులు ‘తిని తృప్తి పొందడానికి’ సరిపోయేంత ఆహారం ఉండేది. (ద్వితీయోపదేశకాండము 24:19-21; 26:12, 13) కొన్నిసార్లు ఒంటరి తల్లులున్న కుటుంబాలు వస్తుపరమైన అవసరాలను తీర్చుకోలేని స్థితిలో ఉండవచ్చు. అప్పుడు మనం వివేచన ఉపయోగించి, గౌరవప్రదమైన రీతిలో వాళ్లకు వస్తుపరంగా సహాయం చేయవచ్చు. మీరు వాళ్లకు ఏవైనా ఆహారపదార్థాలు లేదా సరుకులు తీసుకువెళ్లి ఇవ్వగలరా? ఒంటరి తల్లులకు లేదా వాళ్ల పిల్లలకు సరిపోయే బట్టలేమైనా మీ దగ్గర ఉన్నాయా? ఒంటరి తల్లులు తమ కుటుంబాలకు అవసరమైన వాటిని కొనుక్కోవడానికి మీరు కొంత డబ్బు ఇవ్వగలరా?

వాళ్లతో సమయం గడపండి

ఇశ్రాయేలీయులు తమ వార్షిక పండుగల్లో విధవరాళ్లను, తండ్రి లేని కుమారులను చేర్చుకోవాలని యెహోవా ఆజ్ఞాపించాడు. అలా తోటి ఇశ్రాయేలీయులతో చక్కగా సమయం గడిపే అవకాశం వాళ్లకు దొరికేది. నిజానికి వాళ్లు ‘నిశ్చయంగా సంతోషించాలి’ అని దేవుడు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 16:10-15) అదేవిధంగా, ‘ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇచ్చుకోండి’ అని మనకు కూడా ఉపదేశించబడింది. దానివల్ల తోటిక్త్రెస్తవులతో సంతోషంగా సమయం గడపడం వీలవుతుంది. (1 పేతురు 4:9) కాబట్టి, తల్లి మాత్రమే ఉన్న కుటుంబాన్ని భోజనానికి పిలవొచ్చేమో ఆలోచించండి. అది పెద్ద విందు భోజనంగా ఉండాల్సిన అవసరం లేదు. ‘అవసరమైనవి కొన్నే లేదా ఒక్కటే’ అని యేసు తన స్నేహితులతో సమయం గడపడానికి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు చెప్పాడు.—లూకా 10:41.

మీరిచ్చే చేయూతకు కృతజ్ఞత కలిగివుంటారు

ముగ్గురు పిల్లలను పెంచిన క్యాథ్లీన్‌ అనే ఒక ఒంటరి తల్లి “దేనిని ఆశించవద్దు, కానీ ప్రతీదానికి కృతజ్ఞత కలిగివుండండి” అనే మంచి సలహాను ఎప్పుడూ మర్చిపోనని చెప్పింది. క్యాథ్లీన్‌లాగే చాలామంది ఒంటరి తల్లులు తమ పిల్లలను పెంచాల్సిన బాధ్యత తమకుందని గుర్తిస్తారు. కాబట్టి తాము చేయాల్సిన పనుల్ని ఇతరులు తమకు చేసి పెట్టాలని వాళ్లు అనుకోరు. అయితే, తమకు ఎవరైనా చేయూతనిచ్చినప్పుడు వాళ్ల పట్ల తప్పకుండా కృతజ్ఞత కలిగివుంటారు. మీరు చేసే “ఉపకారానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు” అనే నమ్మకంతో మీరు ఒంటరి తల్లుల మీద శ్రద్ధ చూపిస్తే వాళ్ల సంక్షేమానికి దోహదపడతారు. అంతేకాదు, మీకు కూడా సంతోషం కలుగుతుంది.—సామెతలు 19:17, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం. (w10-E 12/01)

[అధస్సూచీలు]

a ఈ ఆర్టికల్‌లో ముఖ్యంగా ఒంటరి తల్లుల గురించే చెబుతున్నా, ఇందులో ఉన్న సూత్రాలు ఒంటరి తండ్రులకు కూడా వర్తిస్తాయి.

b బైబిల్లో “ఒంటరి తల్లులు” అని లేకపోయినా, “విధవరాలు,” ‘తండ్రిలేని కుమారులు’ అన్న పదాలు చాలాసార్లు ఉన్నాయి. దీన్నిబట్టి బైబిలు కాలాల్లో ఒంటరి తల్లులు ఎక్కువగానే ఉండేవాళ్లని తెలుస్తోంది.—యెషయా 1:17.

[32వ పేజీలోని చిత్రం]

మీరు తల్లి మాత్రమే ఉన్న కుటుంబాన్ని భోజనానికి పిలిచి ఎంత కాలమైంది? త్వరలో పిలవగలరేమో ఆలోచించండి