కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ప్రార్థన ఆలకించేవాడు’

‘ప్రార్థన ఆలకించేవాడు’

దేవునికి దగ్గరవ్వండి

‘ప్రార్థన ఆలకించేవాడు’

1 దినవృత్తాంతములు 4:9, 10

యెహోవా తనంటే భయభక్తులు ఉన్నవాళ్లు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు వాళ్లు అడిగింది నిజంగా ఇస్తాడా? మనకు అంతగా తెలియని యబ్బేజు అనే ఒక వ్యక్తి గురించి బైబిల్లో ఉన్న వృత్తాంతాన్ని చదివితే యెహోవా నిజంగా ‘ప్రార్థన ఆలకించేవాడు’ అని తెలుస్తుంది. (కీర్తన 65:2) ఈ చిన్న వృత్తాంతం మనం ఊహించని చోట, అంటే మొదటి దినవృత్తాంతములు పుస్తకంలోని ప్రారంభ అధ్యాయాల్లో ఉన్న వంశక్రమాల మధ్యలో ఉంది. మనం మొదటి దినవృత్తాంతములు 4:9, 10 వచనాలు పరిశీలిద్దాం.

యబ్బేజు గురించి మనకు తెలిసిందంతా ఈ రెండు వచనాల్లోనే ఉంది. 9వ వచనం ప్రకారం, ‘వేదనపడి ఇతణ్ణి కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టింది.’ a ఆమె ఎందుకు అలాంటి పేరు పెట్టాలనుకుంది? ఆమె ఈ కుమారుణ్ణి సాధారణంగా కలిగే ప్రసవవేదన కంటే ఎక్కువ వేదనతో కన్నదా? బహుశా ఆమె, పుట్టిన బిడ్డను చూసి ఆనందించడానికి తన భర్త లేడని విలపిస్తున్న విధవరాలా? బైబిలు ఇవేవీ చెప్పడం లేదు. అయితే, ఆ తల్లి ముఖ్యంగా తన బిడ్డను చూసి గర్వపడే రోజు ఒకటి వస్తుంది. యబ్బేజు సహోదరులు నిజాయితీపరులే అయ్యుండొచ్చు, కానీ ‘యబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడు.’

యబ్బేజు తరచూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవాడు. ఆయన ఆశీర్వాదం ఇమ్మని అడుగుతూ దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఆయన అడిగిన మూడు విషయాలను చూస్తే ఆయనకు గట్టి విశ్వాసం ఉందని తెలుస్తుంది.

మొదటిగా యబ్బేజు, ‘నా సరిహద్దును విశాలపరచుము’ అని దేవుణ్ణి వేడుకున్నాడు. (10వ వచనం) ఘనత పొందిన ఈయన పొరుగువాళ్లది ఆశిస్తూ భూమిని బలవంతంగా తీసుకునే వ్యక్తి కాదు. ఆయన పట్టుదలతో అడుగుతున్నది తనకు ఎక్కువ భూమి కావాలని కాదుగానీ ప్రజల గురించి అయ్యుండవచ్చు. సత్యదేవుణ్ణి ఆరాధించే చాలామందికి సరిపోయేలా తన సరిహద్దును శాంతియుతంగా విశాలపర్చమని ఆయన అడిగి ఉండవచ్చు. b

రెండవదిగా, దేవుని “చేయి” తనతో ఉండాలని యబ్బేజు వేడుకున్నాడు. ఇక్కడ ప్రస్తావించబడిన దేవుని చేయి ఆయన ఉపయోగించే శక్తిని సూచిస్తుంది, ఆయన దాన్ని తన ఆరాధకులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తాడు. (1 దినవృత్తాంతములు 29:12) యబ్బేజు తాను అడుగుతున్న వాటిని దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. దేవుని మీద నమ్మకం ఉంచే వాళ్ల విషయంలో ఆయన హస్తం కురచకాదు, అంటే ఆయన వాళ్లకు తప్పకుండా సహాయం చేస్తాడు.—యెషయా 59:1.

మూడవదిగా, “నాకు కీడు రాకుండ దానిలో నుండి నన్ను తప్పించుము” అని యబ్బేజు ప్రార్థించాడు. ఆయన చేసిన ప్రార్థన మరో అనువాదంలో ఇలా ఉంది, ‘కీడు నన్ను బాధపెట్టకుండా దాని నుండి నన్ను కాపాడు.’ ‘కీడు నన్ను బాధపెట్టకుండా,’ అనే మాటలు కీడు నుండి తప్పించమని కాదుగానీ, తన చుట్టూ ఉన్న చెడుతనం మూలంగా కలుగుతున్న హాని వల్ల మరీ ఎక్కువగా దుఃఖించకుండా ఉండడానికి సహాయం చేయమని ఆయన ప్రార్థించి ఉండవచ్చని సూచిస్తున్నాయి.

యబ్బేజు చేసిన ప్రార్థన ద్వారా, సత్యారాధన అంటే ఆయనకెంత ఆసక్తి ఉందో, ప్రార్థన ఆలకించే దేవుని మీద ఆయనకెంత విశ్వాసం, నమ్మకం ఉన్నాయో తెలుస్తుంది. ఆయన చేసిన ప్రార్థనకు యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? ఈ చిన్న వృత్తాంతం, ‘దేవుడు ఆయన మనవి చేసినదానిని ఆయనకు దయచేశాడు’ అనే మాటలతో ముగుస్తుంది.

ప్రార్థన ఆలకించేవాడు మారలేదు. ఆయన తన ఆరాధకులు చేసే ప్రార్థనలు విని ఎంతో సంతోషిస్తాడు. ఆయన మీద విశ్వాసం, నమ్మకం ఉంచేవాళ్లు, ‘ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా మన మనవి ఆలకిస్తాడు’ అనే ధైర్యంతో ఉండవచ్చు.—1 యోహాను 5:14. (w10-E 10/01)

[అధస్సూచీలు]

a యబ్బేజు అనే పేరు, “బాధ” అనే భావమున్న మూలపదం నుండి వచ్చింది.

b పరిశుద్ధ లేఖనాల అర్థం వివరించడానికి యూదులు రాసిన వాటిని టార్గమ్‌లు అంటారు. వాటిలో యబ్బేజు మాటలు ఇలా ఉన్నాయి, “నాకు సంతానం ఇవ్వు, శిష్యులతో నా సరిహద్దులను విశాలపరచుము.”