కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూదమాడడాన్ని బైబిలు ఖండిస్తోందా?

జూదమాడడాన్ని బైబిలు ఖండిస్తోందా?

జూదమాడడాన్ని బైబిలు ఖండిస్తోందా?

జూదమంటే అందమైనవాళ్లు, గొప్పవాళ్లు, తెలివైనవాళ్లు—ముఖ్యంగా కసినోల్లో—కాలక్షేపం కోసం ఆడే ఆట అన్నట్లు ప్రజాదరణ పొందిన సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూపిస్తుంటాయి. చూసేవాళ్లు మాత్రం అది కేవలం కల్పితమని సాధారణంగా అర్థంచేసుకుంటారు.

అయితే, వాస్తవంలో లాటరీ టిక్కెట్లు, ఆటలపై బెట్టింగ్‌ (పందెం కాయడం), ఇంటర్నెట్‌లో ఆడే జూదం జూదగాళ్ల దృష్టిని ఆకర్షించడానికి కసినోలతో పోటీ పడుతున్నాయి. జూదమాడడం “మంచిది కాదనే ప్రపంచమంతా పరిగణిస్తోంది, అది కార్చిచ్చులా వ్యాపించింది” అని ఇంటర్నెట్‌ గాంబ్లింగ్‌ అనే పుస్తకం చెబుతోంది. ఉదాహరణకు ఈ రోజుల్లో పోకర్‌ను (ఒకరకం పేకాట) టీవీల్లో, ఇంటర్నెట్‌లో చాలా సాధారణ ఆటలా చూపిస్తున్నారు. ఇటీవల అమెరికాలో పోకర్‌ ఆడేవాళ్లు 18 నెలల్లో రెండింతలు అయినట్టు నిపుణులు అంచనా వేశారని ఒక వార్తాపత్రిక చెబుతోంది.

జూదమంటే డబ్బు ఖచ్చితంగా తిరిగి వస్తుందని చెప్పలేని దానిమీద డబ్బు పందెం కాయడమని వర్ణించబడింది. ఆ డబ్బు జూదమాడేవాళ్లదే అయినంతవరకు, వాళ్లు దానికి అలవాటు పడనంత వరకు అది ఆడటంలో తప్పేమీ లేదని చాలామంది అంటారు. నిజానికి, “ఒక వ్యక్తి తన బాధ్యతను విస్మరిస్తే తప్ప” జూదం “ఆడటం పాపం కాదు” అని న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. అయితే, దాన్ని సమర్థించడానికి ఎలాంటి లేఖనాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు క్రైస్తవులు ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి? బైబిలు జూదాన్ని సమర్థిస్తోందా, ఖండిస్తోందా?

జూదమాడడం గురించి పరిశుద్ధ లేఖనాలు నేరుగా ప్రస్తావించడం లేదని మనం గమనించాలి. అలాగని మనకు దాని విషయంలో ఎలాంటి నిర్దేశం లేదని కాదు. ప్రతీ పని గురించి లేదా ప్రతీ పరిస్థితి గురించి నిబంధనలు పెట్టే బదులు, ‘[యెహోవా] చిత్తమేమిటో గ్రహించండి’ అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (ఎఫెసీయులు 5:17) ‘గ్రహించడం’ అని అనువదించబడిన గ్రీకు పదం ఏదైనా ఒక విషయానికి సంబంధించిన అన్ని అంశాలను, “మానసిక ప్రక్రియ” ద్వారా అంటే “ఒక విషయం గురించి బాగా ఆలోచించి సంపాదించుకున్న జ్ఞానం” ద్వారా ఒక దగ్గరకు చేర్చడాన్ని సూచిస్తుందని ఇ. డబ్ల్యు. బుల్లింగర్‌ అనే ఒక బైబిలు పండితుడు చెబుతున్నాడు. కాబట్టి, జూదానికి సంబంధించి బైబిల్లో ఉన్న సూత్రాలను ఒక దగ్గరకు చేర్చి వాటి గురించి ఆలోచించడం ద్వారా క్రైస్తవులు ఈ విషయంలో దేవుని ఉద్దేశమేమిటో తెలుసుకోవచ్చు. ఈ కింది చర్చలో ఉపయోగించబడిన లేఖనాలను చదువుతున్నప్పుడు మీరిలా ప్రశ్నించుకోవచ్చు, ‘ఈ లేఖనం జూదమాడడాన్ని సమర్థిస్తోందా? ఈ విషయంలో దేవుని ఉద్దేశం గురించి ఆయన వాక్యం ఏమి చెబుతోంది?’

అదృష్టం అనే ఉరి

జూదమాడడం అంటే ఖచ్చితంగా తిరిగి వస్తుందని చెప్పలేని దానిమీద పందెం కాయడం కాబట్టి, ఆ విషయంలో ప్రజలు ఎక్కువగా అదృష్టం మీద అంటే యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను అదుపు చేస్తుందని విశ్వసించబడుతున్న నిగూఢమైన శక్తి మీద నమ్మకముంచుతారు. ప్రాముఖ్యంగా డబ్బు పందెం కాసినప్పుడు అలా చేస్తుంటారు. ఉదాహరణకు, లాటరీ టిక్కెట్లు కొనేటప్పుడు మంచివని నమ్మే అంకెలను ఎంపిక చేసుకోవడం, మూఢ నమ్మకాలున్న మేఝోంగ్‌ ఆటగాళ్లు కొన్ని పదాలను పలకకపోవడం, పాచికలు వేసేముందు వాటి మీద గాలి ఊదడం లాంటివి చేస్తుంటారు. ఎందుకలా చేస్తారు? జూదగాళ్లు తరచూ అదృష్టం ఫలితాన్ని మారుస్తుందని లేదా కనీసం, మార్చవచ్చని నమ్ముతారు.

అదృష్టాన్ని నమ్ముకోవడం హానిరహితమైనదేనా? ప్రాచీన ఇశ్రాయేలులోని కొంతమంది అలాగే అనుకున్నారు. అదృష్టం వల్ల సంపన్నులమవుతామని వాళ్లు నమ్మారు. ఈ విషయంలో యెహోవా దేవుని ఉద్దేశమేమిటి? దేవుడు తన ప్రవక్తయైన యెషయా ద్వారా వాళ్లతో ఇలా చెప్పాడు, ‘మీరు యెహోవాను విసర్జించి, నా పరిశుద్ధ పర్వతాన్ని మర్చిపోయి అదృష్టానికి బల్లను సిద్ధపర్చేవాళ్లు, అదృష్టదేవికి పానీయార్పణం అర్పించేవాళ్లు.’ (యెషయా 65:11, అధస్సూచి) దేవుని దృష్టిలో అదృష్టాన్ని నమ్మడం విగ్రహారాధన లాంటిదే, ఇది దేవుడు ఆమోదించే ఆరాధనకు పూర్తి విరుద్ధమైనది. అదృష్టాన్ని నమ్మితే సత్యదేవుణ్ణి కాకుండా ఏదో ఒక కల్పిత శక్తిని నమ్మినట్టు అవుతుంది. ఈ విషయంలో దేవుని ఉద్దేశం ఇప్పటికీ మారలేదని చెప్పొచ్చు.

గెలుచుకునే డబ్బు ఎక్కడి నుండి వస్తుంది?

జూదగాళ్లు ఇంటర్నెట్‌ ద్వారా పందెం కాసినా, లాటరీ టికెట్‌ కొన్నా, ఆటల మీద బెట్టింగ్‌ చేసినా, కసినోలో జూదమాడినా తాము పందెం కాసి గెలుచుకోవాలనుకుంటున్నది ఎక్కడ నుండి వస్తుందనే విషయాన్ని తరచూ అంతగా పట్టించుకోరు. జూదమాడడానికి, చట్టబద్ధమైన వ్యాపార లావాదేవీలకు లేదా కొనుగోలుకు తేడా ఉంది, ఎందుకంటే జూదమాడే వ్యక్తి గెలుచుకోవాలనుకునే డబ్బు నిజానికి వేరేవాళ్లు పోగొట్టుకునే డబ్బు. a “ఎవరైనా ఒకరు లాటరీ తగిలి కోటీశ్వరులయ్యారంటే నిజానికి అలా అయ్యేది ఎంతోమంది పోగొట్టుకున్న డబ్బుతోనే!” అని కెనడాలోవున్న సెంటర్‌ ఫర్‌ అడిక్షన్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ చెబుతోంది. ఈ విషయంలో దేవుని ఉద్దేశమేమిటో అర్థంచేసుకోవడానికి క్రైస్తవులకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞల్లో చివరిది ఇలా ఉంది, ‘నీ పొరుగువాని భార్యనైనా అతని దాసుణ్ణయినా అతని దాసినైనా అతని యెద్దునైనా అతని గాడిదనైనా నీ పొరుగువాని దేన్నయినా ఆశింపకూడదు.’ (నిర్గమకాండము 20:17) తోటి వ్యక్తికి చెందిన వాటిని అంటే ఆయన వస్తుసంపదలను, ఆస్తిని, డబ్బును ఆశించడం గంభీరమైన పాపం, అది మరొకరి భార్యను ఆశించకూడదనే ఆజ్ఞతో పాటు పేర్కొనబడింది. శతాబ్దాల తర్వాత, “ఆశింపవద్దు” అని చెప్తూ అపొస్తలుడైన పౌలు అదే ఆజ్ఞను క్రైస్తవులకు మళ్లీ ఇచ్చాడు. (రోమీయులు 7:7) క్రైస్తవులు ఇతరులు పోగొట్టుకునేదాన్ని తాము పొందాలనుకుంటే, తనది కాని దాన్ని ఆశించడమనే తప్పు చేసినట్టు అవుతుందా?

“[చాలామంది జూదగాళ్లు] తాము అంగీకరించినా, అంగీకరించకపోయినా, జూదమాడడం మొదలుపెట్టడానికి ముందే తాము పందెంలో పెట్టాలనుకున్న దాన్ని, అది కేవలం కొన్ని డాలర్లయినా సరే, చాలా పెద్ద మొత్తంగా మార్చుకోవాలని రహస్యంగా కలలు కంటారు” అని జె. ఫిలిప్‌ వోగెల్‌ అనే విలేకరి రాశాడు. అలాంటి జూదగాళ్లు ఏమాత్రం కష్టపడకుండా తక్కువ కాలంలో ధనవంతులైపోవాలని కలలు కంటారు. క్రైస్తవులు ‘అక్కరగల వాళ్ళకు పంచిపెట్టడానికి వీలుగా, తమ చేతులతో మంచి పనిచేస్తూ కష్టపడాలి’ అని బైబిలు ఇస్తున్న సలహాకు అది పూర్తి విరుద్ధమని స్పష్టంగా తెలుస్తుంది. (ఎఫెసీయులు 4:27, 28) అపొస్తలుడైన పౌలు నిర్దిష్టంగా ఇలా చెప్పాడు, ‘ఎవరైనా పనిచేయడానికి ఇష్టపడకపోతే వాళ్లు భోజనం చేయకూడదు.’ అంతేకాకుండా ‘సొంతగా సంపాదించుకున్న ఆహారం భుజించాలి’ అని కూడా ఆయన చెప్పాడు. (2 థెస్సలొనీకయులు 3:10, 12) కానీ, జూదమాడడాన్ని సరైన పనిగా పరిగణించవచ్చా?

జూదమాడడం ఎంతో కష్టమే కావచ్చు, అయినా దాని ద్వారా వచ్చే డబ్బు గెలుచుకున్నదే, అది ఏదైనా పనిచేసినందుకో ఏవైనా సేవలు అందించినందుకో ప్రతిఫలంగా వచ్చిన లేదా సంపాదించుకున్న డబ్బు కాదు. జూదంలో గెలవడం ఎక్కువగా అదృష్టం మీద, ఎప్పుడో ఒకసారి పరిస్థితి మారుతుందనే ఆశమీద ఆధారపడివుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, జూదగాళ్లు తమ చేతుల నుండి ఏమీ పెట్టకుండానే ఏదైనా పొందడానికి ప్రయత్నిస్తారు. అయితే, నిజమైన క్రైస్తవులు నిజాయితీగా పనిచేసి డబ్బు సంపాదించుకోవాలనే ఆదేశం పొందారు. ‘అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తమ కష్టార్జితంతో సుఖపడటం కంటే నరునికి మేలైనదేదీ లేదు’ అని జ్ఞానవంతుడైన సొలొమోను రాజు రాశాడు. ఆ తర్వాత ఆయనింకా ఇలా రాశాడు, ‘ఇది దేవుని వల్ల కలుగుతుంది.’ (ప్రసంగి 2:24) దేవుని సేవకులు కల్పితాల మీద ఆశలు పెట్టుకోరు, డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాల కోసం వెదకరు గానీ సంతోషంగా ఉండడానికి, ఆశీర్వాదాలు పొందడానికి దేవుని మీద ఆధారపడతారు.

తప్పించుకోవాల్సిన “వల”

జూదమాడేవాళ్లు ఒకవేళ జూదంలో గెలిచినా ఆ గెలుపు వల్ల వచ్చే తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే కాదుగానీ దానివల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాల గురించి కూడా ఆలోచించడం మంచిది. “మొదట్లో పేరాశతో దక్కించుకొన్న ఆస్తికి చిట్టచివరకు దీవెనలు కలుగవు” అని సామెతలు 20:21 (పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) చెబుతోంది. ఎంతోమంది లాటరీ గెలుచుకునేవాళ్లు, జూదమాడే వాళ్లు తాము గెలుచుకున్న ధనంవల్ల తమకు సంతోషం కలగడం లేదని తెలుసుకుని విచారపడ్డారు లేదా బాధపడ్డారు. ‘అస్థిరమైన ధనం మీద నమ్మకముంచకుండా, సుఖంగా అనుభవించడానికి సమస్తాన్ని మనకు ధారాళంగా దయ చేసే దేవుని మీద’ నమ్మకముంచమని బైబిలిస్తున్న ఉపదేశాన్ని పాటించడం ఎంతో మంచిది.—1 తిమోతి 6:17.

మనం తప్పించుకోవాల్సిన “వల” మరొకటి ఉంది. ‘ధనాకాంక్ష గలవాళ్లు శోధనకు లోనై, మానవులను శిథిలం చేసి నశింపజేసే అపాయకరమైన, మూర్ఖమైన వాంఛల వలలో చిక్కుకుంటారు’ అని దేవుని వాక్యం చెబుతోంది. (1 తిమోతి 6:9, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఎవరైనా లేదా ఏదైనా చిక్కుకుపోయేలా చేయడానికి తగిన విధంగా వలను తయారుచేస్తారు. కొంచెం డబ్బు మాత్రమే పందెం కాయాలని లేదా కొన్నిసార్లు మాత్రమే జూదమాడి చూడాలని నిశ్చయించుకున్న ఎంతోమంది జూదమనే వలలో చిక్కుకుని ఆ వ్యసనం నుండి బయటపడలేకపోతున్నారు. దానిలో చిక్కుకున్న వాళ్లు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, తమవాళ్ల మనసుల్ని బాధపెట్టారు, కుటుంబాలను నాశనం చేసుకున్నారు.

జూదమాడడానికి సంబంధించిన ఎన్నో లేఖనాలను పరిశీలించిన తర్వాత ఈ విషయంలో దేవుని ఉద్దేశమేమిటో మీరు గ్రహించారా? అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు, ‘ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమం, అనుకూలం, సంపూర్ణం అయిన దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకునేలా మీ మనస్సు మారి నూతనమవడం వల్ల రూపాంతరం పొందండి.’ (రోమీయులు 12:2) క్రైస్తవుల జీవితాన్ని ప్రజాభిప్రాయం కాదుగానీ దేవుని చిత్తం నిర్దేశించాలి. చెడు పరిణామాలకు దారితీసే జూదమనే వలలో చిక్కుకోకుండా మనం ఆనందంగా జీవించాలని ‘సంతోషంగల దేవుడైన’ యెహోవా కోరుకుంటున్నాడు.—1 తిమోతి 1:11, NW. (w11-E 03/01)

[అధస్సూచి]

a స్టాకు మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి, జూదమాడడానికి ఉన్న తేడా గురించి అక్టోబరు 8, 2000, తేజరిల్లు! (ఆంగ్లం) సంచిక, 25-27 పేజీల్లో వివరంగా ఉంది. దీనిని యెహోవాసాక్షులు ప్రచురిస్తున్నారు.

[32వ పేజీలోని బ్లర్బ్‌]

దేవుని సేవకులు నిజాయితీగా పనిచేసి డబ్బు సంపాదించుకుంటారు

[31వ పేజీలోని బాక్సు]

గెలిస్తే కలిగే ఉత్తేజం

జూదమాడడం ఒక అలవాటుగా మారి, సులువుగా అదొక వ్యసనంగా మారుతుందా? గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు జూదగాళ్లలో కలిగే ప్రతిస్పందనను అధ్యయనం చేసిన తర్వాత డా. హాన్స్‌ బ్రయిటర్‌ ఇలా పేర్కొన్నాడు, “జూదగాళ్ల మీద చేసిన ఒక ప్రయోగంలో, డబ్బు ప్రతిఫలంగా పొందినప్పుడు వాళ్ల మెదళ్లలో కలిగిన మార్పులు, కొకైన్‌కు అలవాటుపడిన వ్యక్తి కొకైన్‌ ఉపయోగించినప్పుడు ఆ వ్యక్తి మెదడులో కలిగే మార్పులు దాదాపు ఒకేలా ఉన్నాయి.”

[31వ పేజీలోని చిత్రం]

జూదగాళ్లు గెలుచుకోవాలని ఆశపడేది ఎవరి డబ్బు?