యెఫ్తా కుమార్తెలా ఉండాలనుకున్నాను
యెఫ్తా కుమార్తెలా ఉండాలనుకున్నాను
జోయన్నా సోన్స్ చెప్పినది
నాకు 20 ఏళ్లు కూడా రాకముందే, యెఫ్తా కుమార్తెలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నా మనసులో ఏముందో, తర్వాత్తర్వాత చాలావరకు ఆమెలా ఎలా తయారయ్యానో చెబుతాను.
నే ను 1956లో, భారతదేశంలోని బొంబాయి (ఇప్పుడు ముంబయి) నగరంలో జరిగిన యెహోవాసాక్షుల సమావేశానికి మొదటిసారి హాజరయ్యాను. అది నా జీవితాన్నే మార్చేసింది. ఆ సమావేశంలో యెఫ్తా కుమార్తె గురించి ఇచ్చిన ఒక ప్రసంగం నన్నెంతో కదిలించింది.
మీరు యెఫ్తా కుమార్తె గురించి బైబిల్లో చదివేవుంటారు, ఆమె కౌమారప్రాయంలో ఉన్నప్పుడే జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. దానివల్ల యెఫ్తా, తాను యెహోవాకు చేసిన మొక్కుబడి తీర్చగలిగాడు. అప్పటినుండి ఆమె పెళ్లి చేసుకోకుండా జీవితాంతం యెహోవా గృహంలో లేదా గుడారంలో సేవ చేసింది.—న్యాయాధిపతులు 11:28-40.
ఆమెలా ఉండాలని నేనెంతగా కోరుకున్నానో మాటల్లో చెప్పలేను! కానీ ఆ రోజుల్లో, పెళ్లి చేసుకోకుండా ఉండడం మా సంస్కృతికి విరుద్ధం, అదే నాకు పెద్ద సమస్యగా తయారైంది.
నా కుటుంబం
మా నాన్న పేరు బెంజమిన్ సోన్స్, అమ్మ పేరు మార్సెలీనా సోన్స్. మేము ఆరుగురు పిల్లలం, నేను ఐదవదాన్ని. భారతదేశంలో పశ్చిమ తీరానవున్న ఉడుపి నగరంలో ఉండేవాళ్లం. మా మాతృభాష తుళు, దాదాపు ఇరవై లక్షలమంది ఆ భాష మాట్లాడతారు. ఉడుపిలోని చాలామందిలాగే మేము కూడా కన్నడ మాధ్యమంలో చదువుకున్నాం.
పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం చాలా ప్రాముఖ్యమని ఆ ప్రాంతంలోని ప్రజలు అనుకుంటారు. “పెళ్లి చేసుకోకుండా ఉండడం,” “ఒంటరితనం,” “ఇంటి మీద బెంగ” వంటి పదాలను తుళు భాషలో విన్నట్లు నాకు గుర్తులేదు. అలాంటివి ఉంటాయనే ఆలోచనే ప్రజలకు వచ్చేది కాదు. ఉదాహరణకు మా ఇంట్లోనే, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, మామయ్యలు, మేనత్త, పెద్దమ్మ, చిన్నమ్మ, వాళ్లవాళ్ల పిల్లలు (పన్నెండుమంది) అంతా కలిసి ఉండేవాళ్లం!
మా సంస్కృతిలో, పిల్లలను తల్లి కుటుంబానికి చెందినవాళ్లుగా చూస్తారు. ఆస్తిపాస్తులు తల్లినుండే పిల్లలకు వచ్చేవి, ఎక్కువ భాగం ఆడపిల్లలకే వచ్చేది. తుళు మాట్లాడే కొన్ని సమాజాల్లో, పెళ్లయిన తర్వాత కూడా కూతురు తన భర్తతో కలిసి తల్లి దగ్గరే ఉండేది.
కానీ, మా కుటుంబం క్రైస్తవ మతం పుచ్చుకోవడం వల్ల కొన్ని విషయాల్లో వేరుగా ఉండేది. ప్రతీరోజు సాయంత్రం మా తాతగారు కుటుంబంతో కలిసి ప్రార్థించేవారు, తుళు భాషలో బైబిలు చదివి వినిపించేవారు. అలా చదవడానికి మా తాతగారు, బాగా పాతబడిన తన బైబిలు తెరిచినప్పుడల్లా ఏదో నగల పెట్టెను తెరుస్తున్నట్లు అనిపించేది. అప్పుడు మాకు మహానందంగా ఉండేది! కీర్తన 23:1లోని మాటలు నాలో ఆసక్తి రేకెత్తించాయి. అక్కడిలా ఉంది: “యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు.” ‘ఈ యెహోవా ఎవరు? ఆయనను కాపరి అని ఎందుకు అన్నారు?’ అని ఆలోచించేదాన్ని.
నా కళ్ళకున్న “పొరలు” వీడాయి
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల మా కుటుంబం, దాదాపు 900 కి.మీ. దూరంలో ఉన్న బొంబాయికి తరలివెళ్లింది. 1945లో ఇద్దరు యెహోవాసాక్షులు మా నాన్నను కలిసి, బైబిలు గురించి ఉన్న ఒక చిన్న పుస్తకం ఇచ్చారు. తడారిపోయిన నేల వర్షపు నీటిని పీల్చుకున్నంత ఆత్రంగా మా నాన్న దానిలోని సందేశాన్ని చదివేసి, కన్నడ భాష మాట్లాడేవాళ్లతో దాని గురించి చెప్పడం మొదలుపెట్టారు. 1950ల తొలి సంవత్సరాల్లో, ఒక చిన్న అధ్యయన గుంపు బొంబాయి నగరంలోని మొదటి కన్నడ భాషా సంఘంగా రూపొందింది.
ద్వితీయోపదేశకాండము 6:6, 7; 2 తిమోతి 3:14-17) ఒకరోజు నేను బైబిలు చదువుతున్నప్పుడు నా కళ్ళకున్న పొరలు వీడాయి. (అపొస్తలుల కార్యములు 9:18) యెహోవా తన ఆరాధకులను నడిపిస్తాడు, పోషిస్తాడు, కాపాడతాడు కాబట్టే ఆయనను కాపరితో పోల్చారని తెలుసుకున్నాను.—కీర్తన 23:1-6; 83:18.
అమ్మానాన్నలు మాకు శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేయడం, చక్కగా బోధించడం నేర్పించారు. ప్రతిరోజూ మాతో కలిసి ప్రార్థించడానికి, అధ్యయనం చేయడానికి చూసేవారు. (యెహోవా నా చేయి పట్టుకుని నడిపించాడు
1956వ సంవత్సరం, బొంబాయిలో జరిగిన ఆ మరపురాని సమావేశం తర్వాత కొంతకాలానికే నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఆరు నెలలు గడిచాక, మా అన్నయ్య ప్రభాకర్లాగే నేను కూడా పయినీరు సేవ అంటే పూర్తికాల సేవ మొదలుపెట్టాను. బైబిలు సత్యాలను ఇతరులకు చెప్పాలని నేనెంతో ఆరాటపడేదాన్ని, కానీ మొదలుపెట్టగానే నాలుక తడారిపోయి మాట పెగిలేది కాదు. గొంతులో వణుకు పుట్టి మాటలు తడబడేవి. ‘యెహోవా సహాయం లేకుండా ఈ పని చేయడం నా వల్ల కాదు!’ అనుకునేదాన్ని.
కెనడా నుండి వచ్చిన హోమర్ మకే, రూత్ మకే అనే మిషనరీ దంపతుల ద్వారా యెహోవా నాకు సహాయం చేశాడు. వాళ్లు 1947లో అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన యెహోవాసాక్షుల మిషనరీ పాఠశాలకు హాజరయ్యారు. నేను పరిచర్యలో తడబడుతూ మొదటి అడుగులు వేస్తున్న రోజుల్లో వాళ్లు నాకు తోడుగా ఉండి నా చెయ్యి పట్టుకుని నడిపించారు. ఇంటింటి పరిచర్యలో ఎలా మాట్లాడాలో రూత్ నాతో క్రమంగా ప్రాక్టీసు చేసేది. నా భయం పోగొట్టడానికి ఏమి చేయాలో ఆమెకు బాగా తెలుసు. వణుకుతున్న నా చేతుల్ని పట్టుకుని ఆమె, “బాధపడకమ్మా. తర్వాతి ఇంట్లో ప్రయత్నిద్దాం” అనేది. ఆ మాటలు నాకెంతో ధైర్యాన్నిచ్చాయి.
నాకన్నా వయసులో పెద్దది, బైబిలు బోధించడంలో అనుభవజ్ఞురాలు అయిన ఎలిజబెత్ చక్రనరైయణ్ అనే సహోదరి నాతో కలిసి పరిచర్య చేస్తుందని నాకు చెప్పారు. అది తెలియగానే నేను, ‘ఈ సహోదరి నాకన్నా చాలా పెద్దది కదా, తనతో ఎలా కలిసి ఉండగలను?’ అనుకున్నాను. కానీ నాకు కావాల్సిన సరైన తోడు ఆమేనని తర్వాత్తర్వాత తెలుసుకున్నాను.
“నిజానికి మనమెప్పుడూ ఒంటరివాళ్లం కాదు”
మొదట్లో మా ఇద్దర్నీ, బొంబాయికి తూర్పున దాదాపు 400 కి.మీ. దూరంలో ఉన్న చారిత్రక నగరమైన ఔరంగాబాద్‌లో సేవ చేయమని చెప్పారు. దాదాపు 10 లక్షలమంది ఉన్న ఆ నగరంలో మేమిద్దరమే యెహోవాసాక్షులమని అక్కడకు వెళ్లగానే అర్థమైంది. అంతేకాదు, అక్కడి ప్రజలతో మాట్లాడడానికి నేను మరాఠీ నేర్చుకోవాల్సి వచ్చింది.
కొన్నిసార్లు నేను ఒంటరితనం వల్ల బాధపడుతూ తల్లిలేని బిడ్డలా ఏడ్చేసేదాన్ని. కానీ ఎలిజబెత్ నాకు అమ్మలా ధైర్యం చెబుతూ ఇలా అనేది: “కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నామని మనకు అనిపిస్తుంది, కానీ నిజానికి మనమెప్పుడూ ఒంటరివాళ్లం కాదు. స్నేహితులకు, కుటుంబానికి దూరంగా ఉన్నా యెహోవా ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు. ఆయనను స్నేహితునిగా చేసుకో, నీ ఒంటరితనం ఇట్టే ఎగిరిపోతుంది.” ఆ సలహాను నేను ఇప్పటికీ మరచిపోలేదు.
మా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ప్రతీరోజు దాదాపు 20 కి.మీ. నడిచేవాళ్లం. ఎండ, చలి, దుమ్ము, బురద ఇవేవీ పట్టించుకునేవాళ్లం కాదు. ఎండాకాలంలో ఉష్ణోగ్రత సాధారణంగా 40°C వరకూ చేరుకుంటుంది. వర్షాకాలంలోనైతే అక్కడక్కడ కొన్ని నెలలపాటు బురదబురదగా ఉండేది. కానీ, అక్కడి వాతావరణంతోకన్నా ప్రజల సంస్కృతితో వ్యవహరించడం మాకు చాలా కష్టంగా ఉండేది.
అక్కడి ఆడవాళ్లు, బంధువులైతే తప్ప మగవాళ్లతో మాట్లాడరు. ఇక బోధించడమైతే చాలా అరుదు. కాబట్టి వాళ్లు మమ్మల్ని ఎగతాళి చేసేవారు, నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. మొదటి ఆరు నెలల్లో, వారపు బైబిలు కూటాలను మేమిద్దరమే జరుపుకునేవాళ్లం. కొంతకాలానికి, ఆసక్తివున్నవాళ్లు కూడా రావడం మొదలుపెట్టారు. త్వరలోనే, ఒక చిన్న గుంపు ఏర్పడింది. వాళ్లలో కొందరు మాతో కలిసి పరిచర్య కూడా చేసేవారు.
“నీ నైపుణ్యాలకు పదునుపెడుతూ ఉండు”
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత, తిరిగి బొంబాయిలో సేవచేయమని మమ్మల్ని పంపించారు. నన్నేమో మా నాన్నకు సహాయం చేయమన్నారు, ఎలిజబెత్ మాత్రం పరిచర్య కొనసాగించింది. అప్పట్లో ఆయనొక్కరే బైబిలు ప్రచురణలను కన్నడ భాషలోకి అనువదించేవారు. ఆయనకు సంఘంలో చాలా బాధ్యతలు ఉండేవి కాబట్టి నేను సహాయం చేయడానికి వెళ్లినందుకు ఆయన సంతోషించారు.
1966లో, మా అమ్మానాన్నలు మా సొంత ఊరు ఉడుపికి తిరిగివెళ్లాలనుకున్నారు. బొంబాయి నుండి బయల్దేరుతున్నప్పుడు మా నాన్న నాతో ఇలా అన్నారు: “నీ నైపుణ్యాలకు పదునుపెడుతూ ఉండమ్మా. సరళంగా, స్పష్టంగా అనువదించు. మితిమీరిన ఆత్మవిశ్వాసం చూపించకు, వినయంగా ఉండు. యెహోవా మీద నమ్మకం పెట్టుకో.” అది ఆయన నాకిచ్చిన చివరి సలహా, ఎందుకంటే ఉడుపికి తిరిగివెళ్లిన కొంతకాలానికే ఆయన చనిపోయారు. అనువదించేటప్పుడు ఆ సలహా పాటించడానికి నేను ఈ రోజు వరకూ కృషి చేస్తున్నాను.
“నీకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదా?”
భారతీయ సంస్కృతిలో, తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ల పెళ్లిళ్ల కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తారు. కాబట్టి, “నీకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదా? ముసలిదానివైనప్పుడు నిన్నెవరు చూసుకుంటారు? నీకెవరు తోడుంటారు?” అని ఎప్పుడూ నన్ను అడిగేవాళ్లు.
కొన్నిసార్లు, అలాంటి మాటల వల్ల నాకు ఊపిరాడనట్లు అనిపించేది. నలుగుర్లో ఉన్నప్పుడు నా బాధను మనసులోనే దాచుకున్నా కాస్త ఏకాంతం దొరగ్గానే యెహోవా దగ్గర నా మనసులోని బాధను కుమ్మరించేదాన్ని. నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకు ఆయన నన్ను తక్కువగా చూడడం లేదని గుర్తుచేసుకుని ఊరట పొందేదాన్ని. మనస్ఫూర్తిగా ఆయనను సేవించాలనే నా నిర్ణయాన్ని బలపర్చుకోవడానికి నేను యెఫ్తా కుమార్తె గురించి, యేసు గురించి ఆలోచించేదాన్ని. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండా, దేవుడు చెప్పింది చేయడంలో నిమగ్నమయ్యారు.—యోహాను 4:34.
యెహోవా ఇచ్చిన బహుమతి
ఎలిజబెత్‌తో నాకున్న అనుబంధం 50 ఏళ్లపాటు కొనసాగింది. తను 2005లో చనిపోయింది, అప్పుడు తనకు 98 ఏళ్లు. చివరి సంవత్సరాల్లో, చూపు మందగించడం వల్ల బైబిలు చదవలేకపోయేది, కాబట్టి ప్రతీరోజు ఎక్కువ సమయం దేవునికి ప్రార్థన చేస్తూ గడిపేది. కొన్నిసార్లు ఆమె గదిలో నుండి వస్తున్న మాటలు విని తను ఎవరితోనో లేఖనాన్ని చర్చిస్తోందని అనుకునేదాన్ని, తీరా చూస్తే తను యెహోవాతో మాట్లాడుతుండేది. ఆమె ఎప్పుడూ ఆయనను చూస్తున్నట్లు, ఆయన సన్నిధిలో ఉన్నట్లు జీవించింది. యెఫ్తా కుమార్తెలా దేవుని సేవలో ఎల్లప్పుడూ స్థిరంగా కొనసాగాలంటే అలా ఉండడం చాలా అవసరమని నేను నేర్చుకున్నాను. నా యౌవనంలోనూ నా కష్టాలన్నిటిలోనూ మార్గదర్శిగా ఉండడానికి నాకన్నా ఎక్కువ వయసు, పరిణతి ఉన్న సహోదరిని ఇచ్చినందుకు యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని.—ప్రసంగి 4:9, 10.
యెఫ్తా కుమార్తెలా యెహోవా సేవచేస్తూ ఎన్ని ఆశీర్వాదాలు పొందానో మాటల్లో చెప్పలేను! పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల, బైబిలు ఉపదేశాన్ని పాటించడం వల్ల ఇప్పటివరకూ నా జీవితం చాలా అద్భుతంగా, సంతృప్తికరంగా సాగింది. అంతేకాదు, ఎల్లప్పుడు ‘సక్రమంగా నడుచుకుంటూ, మనస్ఫూర్తిగా నన్ను నేను ప్రభువుకు అర్పించుకున్నాను.’—1 కొరింథీయులు 7:35, పరిశుద్ధ గ్రంథం: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్. (w11-E 12/01)
[28వ పేజీలోని చిత్రం]
1950లలో బొంబాయిలో బహిరంగ ప్రసంగం ఇస్తున్న మా నాన్న
[28వ పేజీలోని చిత్రం]
చనిపోవడానికి కొంతకాలం ముందు ఎలిజబెత్
[29వ పేజీలోని చిత్రం]
1960వ సంవత్సరం బొంబాయిలో ఒక బైబిలు ప్రసంగం కోసం ప్రచారం చేస్తూ
[29వ పేజీలోని చిత్రం]
అనువాద కార్యాలయంలో తోటి సభ్యులతో