లోకాంతం గురించిన నిజాలు
లోకాంతం గురించిన నిజాలు
‘దయ్యాల ఆత్మలు బయలువెళ్లి, లోకమంతటా ఉన్న రాజులను హెబ్రీ భాషలో హార్‌మెగిద్దోననే చోటుకు పోగుచేశాయి.’—ప్రకటన 16:14-16.
“హార్‌మెగిద్దోను” అనేది ఓ స్థలం పేరు. అయితే నిజానికి అలాంటి పేరున్న స్థలమేదీ భూమ్మీద లేదనే చెప్పాలి.
మరైతే “హార్‌మెగిద్దోను” అంటే ఏమిటి? తరచూ దాన్ని యుద్ధం వంటి సంఘటనలతో ఎందుకు ముడిపెడతారు?
హార్‌మెగిద్దోను అనే చోట సమకూడారు
హార్‌మెగిద్దోను అనే హీబ్రూ పదానికి అక్షరార్థంగా “మెగిద్దో పర్వతం” అని అర్థం. మెగిద్దో అనే పేరున్న పర్వతమేదీ లేదుగానీ ఆ పేరుతో ఒక స్థలమైతే ఉంది. అది, ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం నివసించిన ప్రదేశానికి వాయవ్య దిశలో, ఒక ప్రధాన కూడలి దగ్గర ఉంది. అక్కడ ఎన్నో ముఖ్యమైన యుద్ధాలు జరిగాయి. అందుకే మెగిద్దో అనే పదాన్ని యుద్ధంతో ముడిపెడతారు. a
అయితే మెగిద్దోలో ఏయే యుద్ధాలు జరిగాయనే దాన్నిబట్టి కాదుగానీ అవి ఎందుకు జరిగాయనే దాన్నిబట్టే ఆ పేరు ప్రాముఖ్యత సంతరించుకుంది. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసి ఇచ్చిన దేశంలో అది కూడా ఉంది. (నిర్గమకాండము 33:1; యెహోషువ 12:7, 9-24) శత్రువుల నుండి కాపాడతానని ఆయన వాళ్లకు మాటిచ్చి, దాన్ని నిలబెట్టుకున్నాడు. (ద్వితీయోపదేశకాండము 6:18, 19) ఉదాహరణకు, కనాను రాజు యాబీను సైన్యాలతో కలిసి అతని సైన్యాధిపతియైన సీసెరా దాడి చేసినప్పుడు యెహోవా మెగిద్దో దగ్గర ఇశ్రాయేలీయులకు అద్భుతరీతిలో రక్షణ దయచేశాడు.—న్యాయాధిపతులు 4:14-16.
కాబట్టి “హార్‌మెగిద్దోను” అనే పదానికి గొప్ప సూచనార్థక ప్రాముఖ్యత ఉంది. అది రెండు శక్తివంతమైన సైన్యాలు ఒకదానితో ఒకటి తలపడే పోరును సూచిస్తోంది.
అతి త్వరలోనే, మానవ ప్రభుత్వాలు దేవుని ప్రజలను, వాళ్ల పనిని అణచివేసేందుకు సైన్యాలను సమకూర్చుకునేలా సాతాను, అతడి దయ్యాలు వాటిని ఉసిగొల్పుతాయని ప్రకటన గ్రంథంలోని ప్రవచనం చెబుతోంది. అప్పుడు దేవుడు వాళ్లను ఓడిస్తాడు, ఆ దాడిలో లక్షలాదిమంది చనిపోతారు.—ప్రకటన 19:11-18.
దేవునికి ‘వాత్సల్యం, దీర్ఘశాంతం, బహు కృప’ ఉన్నాయని బైబిలు చెబుతోంది, అలాంటి దేవుడు అంతమందిని ఎందుకు నాశనం చేస్తాడు? (నెహెమ్యా 9:17) దేవుడు అలా ఎందుకు చేస్తాడో అర్థంచేసుకోవాలంటే మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి. అవి, (1) అసలు ఆ యుద్ధాన్ని ఆరంభించేదెవరు? (2) దేవుడు ఎందుకు కలుగజేసుకుంటాడు? (3) దానివల్ల భూమికి, మనుష్యులకు సంబంధించి ఎలాంటి శాశ్వత పరిణామాలు చోటుచేసుకుంటాయి?
1. అసలు ఆ యుద్ధాన్ని ఆరంభించేదెవరు?
హార్‌మెగిద్దోను యుద్ధమనేది దేవుడు ఆవేశంతో తీసుకునే చర్య కాదుగానీ, అణచివేసేవారి నుండి మంచివాళ్లను కాపాడడానికి తీసుకునే చర్య. నిజానికి, ఆవేశంతో ప్రవర్తించేది ‘లోకమంతటా ఉన్న రాజులు’ అంటే ప్రపంచ నాయకులు. కానీ వాళ్లు ఎందుకు దాడిచేస్తారు? యెహోవా దేవుని ఆరాధకులను పూర్తిగా తుడిచిపెట్టాలనే దురుద్దేశంతో సాతానే ప్రభుత్వాల్ని, సైన్యాల్ని తన చేతుల్లో కీలుబొమ్మలుగా చేసుకుంటాడు.—ప్రకటన 16:13, 14; 19:17, 18.
నేడు కొన్ని దేశాలు వాక్ స్వాతంత్ర్యానికి, మత స్వాతంత్ర్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను చూస్తే, ప్రభుత్వాలు మత ఉద్యమాలను అదుపుచేయడం లేదా పూర్తిగా అణగదొక్కడం జరిగే పని కాదని అనిపించవచ్చు. కానీ మతాలపై అలాంటి దాడులు గతంలో జరిగాయి, నేడూ జరుగుతున్నాయి. b అయితే, ఇప్పటివరకు జరిగిన దాడులకు, హార్‌మెగిద్దోనులో జరగబోయే దాడికి మధ్య కనీసం రెండు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మొదటిది, ఈ దాడి ప్రపంచమంతటా జరుగుతుంది. రెండవది, యెహోవా దేవుడు ముందెన్నడూ తీసుకోనంత తీవ్రమైన చర్య తీసుకుంటాడు. (యిర్మీయా 25:32, 33) ఆ చర్యను బైబిలు ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరిగే యుద్ధం’ అని అంటోంది.
2. దేవుడు ఎందుకు కలుగజేసుకుంటాడు?
తన ఆరాధకులు అందరితో సమాధానంగా ఉండాలని, శత్రువులను ప్రేమించాలని యెహోవా కోరుతున్నాడు. (మీకా 4:1-3; మత్తయి 5:43, 44; 26:52) కాబట్టి ఆ క్రూరమైన దాడి జరిగినప్పుడు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్లు ఆయుధాలు చేపట్టరు. అప్పుడు, దేవుడే గనుక జోక్యం చేసుకోకపోతే, భూమ్మీద దేవుని సేవకులనేవాళ్లే లేకుండాపోతారు. దానివల్ల యెహోవా దేవుని పేరుకు అపకీర్తి వస్తుంది. యెహోవా ప్రేమలేనివాడని, అన్యాయస్థుడని, శక్తిలేనివాడని ఆయనమీద నింద పడుతుంది. అలా జరగడం అసంభవం!—కీర్తన 37:28, 29.
ఎవరినీ నాశనం చేయడం దేవునికి ఇష్టంలేదు. అందుకే తాను చేయబోయే దాని గురించి అందరికీ ముందే హెచ్చరిక ఇస్తున్నాడు. (2 పేతురు 3:9) గతంలో శత్రువులు తన ప్రజల మీద దాడి చేసినప్పుడు వాళ్లమీద ప్రతీకారం తీర్చుకున్నానని బైబిలు ద్వారా దేవుడు అందరికీ గుర్తు చేస్తున్నాడు. (2 రాజులు 19:35) అంతేకాదు, భవిష్యత్తులో సాతాను, వాడి చేతిలో కీలుబొమ్మల్లా ఉన్న సంస్థలు దేవుని ప్రజలమీద దాడి చేసినప్పుడు యెహోవా మళ్లీ కలుగజేసుకొని వాటికి వ్యతిరేకంగా తన శక్తిని ప్రదర్శిస్తాడని కూడా బైబిలు హెచ్చరిస్తోంది. నిజానికి, యెహోవా దుష్టులను నాశనం చేస్తాడని దేవుని వాక్యం చాలాకాలం క్రితమే చెప్పింది. (సామెతలు 2:21, 22; 2 థెస్సలొనీకయులు 1:6-9) ఆ సమయంలో, తాము సర్వశక్తిగల దేవునితోనే పోరాడుతున్నామని విరోధులకు తేటతెల్లమౌతుంది.—యెహెజ్కేలు 38:21-23.
3. ఆ యుద్ధం వల్ల ఎలాంటి శాశ్వత పరిణామాలు చోటుచేసుకుంటాయి?
హార్‌మెగిద్దోను యుద్ధం వల్ల లక్షలాదిమంది రక్షించబడతారు. నిజానికి, భూమ్మీద శాంతిసమాధానాలు ఉండే కాలానికి ఆ యుద్ధం నాంది పలుకుతుంది.—ప్రకటన 21:3, 4.
ఈ యుద్ధంలో ‘ఎవరూ లెక్కించలేని ఒక గొప్ప సమూహం’ తప్పించుకుంటుందని బైబిలు చెబుతోంది. (ప్రకటన 7:9, 14) యెహోవా పర్యవేక్షణలో వాళ్లు, ఆయన మొదట ఉద్దేశించినట్లు భూమిని అందమైన తోటగా మార్చడానికి సహకరిస్తారు.
దేవుని ప్రజలమీద ఆ దాడి ఎప్పుడు జరుగుతుందో మనం తెలుసుకునే అవకాశముందా? (w12-E 02/01)
[అధస్సూచీలు]
a స్థలాన్ని యుద్ధంతో ముడిపెట్టడం సాధారణ విషయమే. ఉదాహరణకు, అణుబాంబు వల్ల ధ్వంసమైన హిరోషిమా అనే జపాను నగరం పేరు వినగానే, అణుయుద్ధం వల్ల పొంచివున్న ముప్పు గుర్తుకొస్తుంది.
b ఆయా మత గుంపులను, జాతుల వాళ్లను సమూలంగా నాశనం చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో ‘నాజీ మారణహోమం’ ఒకటి. 1917-1991 మధ్యకాలంలో, రష్యా పరిపాలనలో కొన్ని మత గుంపులు తీవ్రమైన అణచివేతకు గురయ్యాయి.
[6వ పేజీలోని చిత్రం]
గతంలో యెహోవా దేవుడు, శత్రువులను ఓడించి తన ప్రజలను కాపాడాడు
[7వ పేజీలోని చిత్రం]
హార్‌మెగిద్దోను యుద్ధంలో కూడా యెహోవా తన ప్రజలను కాపాడతాడు