కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు
నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం
స్టీవెన్ a: “జూలీ వివాహేతర సంబంధం పెట్టుకుంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఆమె మీద నాకున్న నమ్మకమంతా పోయింది. ఆమెను క్షమించడం ఎంత కష్టమైందో మాటల్లో చెప్పలేను.”
జూలీ: “స్టీవెన్‌కు నామీద ఎందుకు నమ్మకం లేకుండా పోయిందో నేను అర్థం చేసుకోగలను. నేను చేసిన తప్పువల్ల ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో ఆయనకు తెలిసేలా చేయడానికి నాకు చాలా సంవత్సరాలే పట్టింది.”
వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్తకు లేదా భార్యకు విడాకులు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ బైబిలు ప్రకారం, నిర్దోషియైన భార్యకు లేదా భర్తకు ఉంటుంది. b (మత్తయి 19:9) పైన ప్రస్తావించిన స్టీవెన్ విడాకులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. స్టీవెన్, జూలీ తమ వివాహ బంధాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే, వివాహ బంధాన్ని కాపాడుకోవాలంటే ఇద్దరూ కలిసి జీవించడం మాత్రమే సరిపోదని వాళ్ళకు కొద్దికాలానికే అర్థమైంది. ఎందుకు సరిపోదు? వాళ్ళ మాటలను గమనిస్తే, జూలీ మరొకరితో సంబంధం పెట్టుకోవడం వల్ల వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం దెబ్బతిందని అర్థమౌతుంది. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండడం ప్రాముఖ్యం కాబట్టి వాళ్ళు దాని కోసం ఎంతో కృషి చేయాలి.
నమ్మకద్రోహం లాంటి పెద్ద సమస్య తలెత్తిన తర్వాత మీరు, మీ వివాహ భాగస్వామి వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తుంటే మీకు చాలా కష్టమైన పరిస్థితే ఉంటుంది. ముఖ్యంగా ఆ విషయం మీకు తెలిసిన కొత్తలోనైతే ఇంకా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ఆ సమస్యను అధిగమించవచ్చు! మీరు నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవచ్చు? బైబిల్లో ఉన్న జ్ఞానం మీకు సహాయం చేస్తుంది. ఈ కింద ఉన్న నాలుగు సలహాలను పరిశీలించండి.
1 ఒకరిపట్ల ఒకరు నిజాయితీగా ఉండండి.
‘అబద్ధమాడడం మానేసి సత్యమే మాట్లాడాలి’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఎఫెసీయులు 4:25) అబద్ధాలు చెప్పడం, పూర్తి నిజాలు చెప్పకపోవడం, మూతిముడుచుకొని కూర్చోవడం లాంటివి నమ్మకం దెబ్బతినేలా చేస్తాయి. కాబట్టి మీరు దాపరికం లేకుండా మనసువిప్పి మాట్లాడుకోవాలి.
మొదట్లో మీకు, మీ భాగస్వామికి, నమ్మకద్రోహం గురించి మాట్లాడుకోవడం చాలా కష్టంగా అనిపించవచ్చు. అయితే, జరిగిన దాని గురించి ఎప్పటికైనా దాపరికం లేకుండా మాట్లాడుకోవడం అవసరం. కూలంకషంగా అన్ని వివరాలు చర్చించుకోకపోయినా, ఆ విషయం గురించి అసలే మాట్లాడకుండా ఉండడం జ్ఞానయుక్తం కాదు. పైన ప్రస్తావించిన జూలీ, “మొదట్లో ఆ విషయం గురించి మాట్లాడడానికి నాకు చాలా సిగ్గుగా, అసహ్యంగా అనిపించేది. నేను తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించేదాన్ని. ఇక ఆ విషయం గురించి ప్రస్తావించకూడదని, దాన్ని మర్చిపోవాలని అనుకునేదాన్ని” అని చెప్పింది. ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్య సమస్యలు తలెత్తాయి. ఎందుకలా జరిగింది? “జూలీ నాతో ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇష్టపడేది కాదు కాబట్టి నా అనుమానం అలాగే ఉండిపోయింది” అని స్టీవెన్ చెబుతున్నాడు. గతాన్ని గుర్తుచేసుకుంటూ జూలీ ఇలా అంగీకరిస్తోంది, “నేను దాని గురించి నా భర్తతో మాట్లాడకపోవడం వల్ల గాయం అలాగే ఉండిపోయింది.”
జరిగిన నమ్మకద్రోహం గురించి మాట్లాడడం బాధాకరంగానే ఉంటుంది. ప్రకాష్ తన సెక్రటరీతో సంబంధం పెట్టుకోవడం గురించి మాట్లాడుతూ ఆయన భార్య దీపిక ఇలా అంటోంది, “నా మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలేవి. అసలు ఇదెలా జరిగింది? ఎందుకు జరిగింది? వాళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారు? ఎప్పుడూ అవే ఆలోచనలు నా మనసును తొలిచేసేవి, నాకు పిచ్చెక్కిపోయేది, వారాలు గడిచే కొద్దీ మరిన్ని ప్రశ్నలు తలెత్తేవి.” ప్రకాష్ ఇలా అంటున్నాడు, “నిజమే, కొన్నిసార్లు మా సంభాషణలు చిలికి చిలికి గాలివానగా మారేవి. కానీ తర్వాత మేమిద్దరం ఒకరినొకరం క్షమాపణలు అడిగేవాళ్ళం. అలా నిజాయితీగా మాట్లాడుకోవడం వల్ల మేమిద్దరం దగ్గరయ్యాం.”
అలాంటి సంభాషణ వల్ల ఇద్దరికీ ఎక్కువ బాధ కలుగకుండా ఉండాలంటే ఏమి చేయవచ్చు? మీ సంభాషణల ముఖ్యోద్దేశం, మీ భాగస్వామిని శిక్షించడం కాదుగానీ జరిగిన దాని నుండి పాఠాలు నేర్చుకొని, మీ వివాహ బంధాన్ని బలపర్చుకోవడమేనని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, శ్రావణ్ అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఆయన, ఆయన భార్య మమత తమ మధ్యవున్న బంధాన్ని పరిశీలించుకున్నారు. శ్రావణ్ ఇలా చెబుతున్నాడు, “నేను నా పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోయి ఉండేవాణ్ణని గ్రహించాను. అంతేగాక ఇతరుల్ని మెప్పించడం గురించి, వాళ్ళ కోరికలు తీర్చడం గురించి నేను ఎక్కువగా ఆలోచించేవాణ్ణి. వాళ్ళకే ఎక్కువ సమయం కేటాయిస్తూ వాళ్ళపైనే ఎక్కువ శ్రద్ధ చూపించేవాణ్ణి. అందువల్ల నా భార్యతో ఎక్కువ సమయం గడపలేకపోయేవాణ్ణి.” ఈ గ్రహింపు వల్ల శ్రావణ్, మమత ఇద్దరూ కొన్ని మార్పులు చేసుకున్నారు, దాంతో వాళ్ళు తమ వివాహ బంధాన్ని బలపర్చుకోగలిగారు.
ఇలా చేసి చూడండి: నమ్మకద్రోహానికి పాల్పడింది మీరే అయితే, సాకులు చెప్పడం లేదా మీ భాగస్వామిని నిందించడం మానేయండి. మీ చర్యలకు, దానివల్ల కలిగిన మనస్తాపానికి మీరే బాధ్యత వహించండి. ఒకవేళ మీరు నమ్మకద్రోహానికి గురైవుంటే, మీ భాగస్వామిపై అరవకండి, దూషించకండి. అప్పుడే మీ భాగస్వామి మీతో అరమరికలు లేకుండా మాట్లాడగలుగుతారు.—ఎఫెసీయులు 4:32.
2 కలిసికట్టుగా పనిచేయండి.
“ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు” అని బైబిలు చెబుతోంది. ఎందుకు మేలు? ఎందుకంటే “ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచిఫలము కలుగును . . . వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును.” (ప్రసంగి 4:9, 10) ముఖ్యంగా, మీరు నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కృషి చేస్తుంటే ఈ సూత్రం చక్కగా అన్వయిస్తుంది.
మీరిద్దరూ కలిసి పనిచేస్తే తిరిగి నమ్మకాన్ని సంపాదించుకోవచ్చు. అయినప్పటికీ, మీ వివాహ బంధాన్ని కాపాడుకోవాలని మీరిద్దరూ నిశ్చయించుకోవాలి. పరిస్థితిని ఒంటరిగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే మరిన్ని సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. సమస్యను ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాలని గ్రహించాలి.
స్టీవెన్, జూలీ ఆ విషయాన్ని గ్రహించారు. జూలీ ఇలా అంటోంది, “దానికి చాలాకాలం పట్టింది. కానీ మా బంధాన్ని దృఢపర్చుకోవడానికి మేమిద్దరం కలిసి పనిచేశాం. మళ్ళీ ఎన్నడూ అలాంటి మనోవేదన ఆయనకు కలిగించకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఆయనకు ఎంతో బాధ కలిగినా మా వివాహ బంధం విచ్ఛిన్నమై పోకుండా కాపాడాలని ఆయన నిశ్చయించుకున్నారు. ప్రతీరోజు నేను నా నిజాయితీని నిరూపించుకునే అవకాశాల కోసం చూసేదాన్ని, ఆయన నా పట్ల ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. అందుకే నేను ఆయనకు ఎప్పటికీ రుణపడివుంటాను.”
ఇలా చేసి చూడండి: మీ వివాహ బంధంలో నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించుకోండి.
3 పాత అలవాట్లు విడిచిపెట్టి కొత్త అలవాట్లు పెంపొందించుకోండి.
వివాహేతర సంబంధం పెట్టుకోవడం గురించి హెచ్చరించిన తర్వాత యేసు ఇలా అన్నాడు, “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి మత్తయి 5:27-29) మీరు నమ్మకద్రోహానికి పాల్పడిన వ్యక్తి అయితే మీ వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు ‘పెరికి పారేయాల్సిన’ చర్యలు లేదా వైఖరులు ఏమైనా ఉన్నాయేమో ఆలోచించగలరా?
పారవేయుము.” (మీరు సంబంధం పెట్టుకున్న వ్యక్తితో మీకు ఇక ఎలాంటి సంప్రదింపులూ ఉండకుండా చూసుకోండి. c (సామెతలు 6:32; 1 కొరింథీయులు 15:33) పైన ప్రస్తావించిన ప్రకాష్ తాను సంబంధం పెట్టుకున్న స్త్రీకి దూరంగా ఉండాలని షిఫ్టు మార్చుకున్నాడు, అలాగే తన సెల్‌ఫోను నెంబరు కూడా మార్చేశాడు. అయినా, ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. ప్రకాష్ తన భార్య నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆ ఉద్యోగాన్నే వదిలేశాడు. తన సెల్‌ఫోను వాడడం మానేసి తన భార్య ఫోను వాడడం మొదలుపెట్టాడు. అంత ఇబ్బందిపడినందుకు తగిన ప్రతిఫలం దొరికిందా? ఆయన భార్య దీపిక ఇలా చెబుతోంది, “అది జరిగి ఆరు సంవత్సరాలవుతోంది, ఇప్పటికీ ఆమె మళ్ళీ నా భర్తను కలవడానికి ప్రయత్నిస్తుందేమోనని అప్పుడప్పుడూ భయపడుతుంటాను. కానీ ఆయన మాత్రం మళ్ళీ అలాంటి శోధనకు లొంగిపోరని నాకు పూర్తి నమ్మకం ఉంది.”
మీరు నమ్మకద్రోహానికి పాల్పడిన వాళ్ళయితే, మీరు మీ వ్యక్తిత్వంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీకు పరాయి వాళ్ళతో సరసాలాడే అలవాటు ఉండవచ్చు లేదా పరాయి వాళ్ళతో శృంగారంలో పాల్గొంటున్నట్లు కలలుకనే అలవాటు ఉండవచ్చు. అలాగైతే, ‘ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించండి.’ పాత అలవాట్లు విడిచిపెట్టి, మీ వివాహ భాగస్వామికి మీమీద నమ్మకాన్ని బలపర్చే కొత్త అలవాట్లు పెంపొందించుకోండి. (కొలొస్సయులు 3:9, 10) మీరు పెరిగిన తీరు వల్ల ప్రేమను వ్యక్తపర్చడం మీకు కష్టంగా ఉందా? మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా మీ భాగస్వామిపై మీ ప్రేమను ధారాళంగా వ్యక్తం చేయండి, ఆయనకు లేదా ఆమెకు పూర్తి భరోసా ఇవ్వండి. స్టీవెన్ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “జూలీ తన చేతి స్పర్శతో తన ప్రేమను వ్యక్తం చేస్తుంది, అంతేగాక, పదే పదే ‘ఐ లవ్ యూ’ చెప్పేది.”
కొంతకాలం వరకు మీరు రోజంతటిలో ఏమేమి చేశారో అన్నీ చెప్పడం మంచిది. పైన ప్రస్తావించిన మమత ఇలా అంటోంది, “రోజంతటిలో ఏమేమి జరిగాయో అవన్నీ ఆయన నాకు ప్రతీరోజు పూసగుచ్చినట్లు చెప్పేవారు. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేవారు, దానివల్ల ఆయన నా దగ్గర ఏమీ దాచడం లేదని నాకు అర్థమైంది.”
ఇలా చేసి చూడండి: నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఏమి చేస్తే బావుంటుందో ఒకరినొకరు ప్రశ్నించుకోండి. అవన్నీ ఒకచోట రాసుకొని, వాటిని ఆచరణలో పెట్టండి. అంతేగాక, మీ రోజువారీ పనుల్లో ఇద్దరూ కలిసి ఆనందించగల కొన్ని కార్యకలాపాలు కూడా ఉండేలా చూసుకోండి.
4 సాధారణ జీవితం ఎప్పుడు మొదలుపెట్టాలో తెలుసుకోండి.
పరిస్థితి అంతా సర్దుకుందిలే అన్నట్లు వెంటనే సాధారణ జీవితం మొదలుపెట్టడానికి ప్రయత్నించకండి. “తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును” అని సామెతలు 21:5 హెచ్చరిస్తోంది. నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి సమయం పడుతుంది, బహుశా సంవత్సరాలు కూడా పట్టవచ్చు.
ఒకవేళ మీరు నమ్మకద్రోహానికి గురైన భాగస్వామి అయితే, మీ భాగస్వామిని పూర్తిగా క్షమించడానికి సమయం తీసుకోండి. మమత ఇలా గుర్తుచేసుకుంటోంది, “తప్పుచేసిన తమ భర్తల్ని క్షమించడం భార్యలకు ఎందుకంత కష్టమౌతుంది అనుకునేదాన్ని. భార్యలు ఎందుకు అంతకాలం పాటు కోపంగా ఉండిపోతారో నాకు అర్థమయ్యేది కాదు. అయితే, నా భర్త తప్పు చేసిన తర్వాతే, క్షమించడం ఎందుకంత కష్టమో నాకు తెలిసివచ్చింది.” క్షమించడానికి, నమ్మకాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి సమయం పడుతుంది.
అలాగే, ‘బాగుచేయుటకు సమయం కలదు’ అని ప్రసంగి 3:1-3 చెబుతోంది. మీ భాగస్వామితో మీ భావాలేవీ చెప్పుకోకుండా ఉంటే బావుంటుందని మొదట్లో మీకనిపించవచ్చు. కానీ ఎప్పటికీ అలాగే ఉండిపోతే మీరు మీ భాగస్వామి మీద నమ్మకాన్ని తిరిగి పెంపొందించుకోలేరు. పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటే మీ భాగస్వామిని క్షమించండి, మీ హృదయాంతరాళాల్లోని భావాల్ని, ఆలోచనల్ని మీ భాగస్వామికి తెలియజేయడం ద్వారా మీరు క్షమించారని చూపించండి. అలాగే, మీ భాగస్వామి సంతోషాలను, చింతలను మీతో పంచుకొమ్మని ప్రోత్సహించండి.
మీకు మరింత మనస్తాపం కలిగించే విషయాల గురించి ఆలోచించకండి. మనస్తాపాన్ని పోగొట్టుకోవడానికి కృషి చేయండి. (ఎఫెసీయులు 4:32) దేవుని ఉదాహరణ గురించి ఆలోచించడం సహాయకరంగా ఉంటుంది. ప్రాచీన ఇశ్రాయేలీయులు తనను ఆరాధించడం మానేసినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయన మోసపోయిన వివాహ భాగస్వామితో తననుతాను పోల్చుకున్నాడు. (యిర్మీయా 3:8, 9; 9:2) కానీ ఆయన ‘ఎల్లప్పుడూ కోపంగా ఉండిపోలేదు.’ (యిర్మీయా ) ఆయన ప్రజలు నిజంగా పశ్చాత్తాపపడి ఆయన దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళను క్షమించాడు. 3:12
చివరికి, మీ వివాహ బంధంలో అవసరమైన మార్పులు చేసుకున్నామని మీకిద్దరికీ అనిపించిన తర్వాత మీ సంసారం సాఫీగా సాగుతుందనే నమ్మకం మీకు ఏర్పడుతుంది. ఆ తర్వాత మీరిద్దరూ కలిసి కేవలం మీ వివాహ బంధాన్ని కాపాడుకోవడం పైనే కాకుండా ఇతర లక్ష్యాలను చేరుకోవడంపై కూడా మనసు పెట్టవచ్చు. అంతేగాక, మీరెంత ప్రగతి సాధించారో అప్పుడప్పుడూ పరిశీలించుకుంటూ ఉండండి. సాధించిన ప్రగతి చూసి సరిపెట్టేసుకోకండి. చిన్న చిన్న సమస్యల్ని అధిగమిస్తూ ఒకరికొకరు కట్టుబడి ఉండండి.—గలతీయులు 6:9.
ఇలా చేసి చూడండి: మొదట్లో మీ వివాహ బంధం ఎలా ఉండేదో అలా కొనసాగించేందుకు ప్రయత్నించే బదులు కొత్తగా మరింత దృఢమైన బంధాన్ని ఏర్పర్చుకోవడం గురించి ఆలోచించండి.
మీరు విజయం సాధించవచ్చు!
విజయం సాధిస్తామో లేదో అని సందేహంగా ఉన్నప్పుడు, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడేనని గుర్తుంచుకోండి. (మత్తయి 19:4-6) కాబట్టి, ఆయన సహాయంతో మీరు విజయం సాధించవచ్చు! పైన ప్రస్తావించిన దంపతులందరూ బైబిల్లోవున్న జ్ఞానయుక్తమైన సలహాను పాటించి, తమ వివాహ బంధాన్ని కాపాడుకున్నారు.
స్టీవెన్ జూలీల కాపురంలో చిచ్చురగిలి ఇప్పటికి 20 సంవత్సరాల పైనే అయింది. ఆ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకున్నారో వివరిస్తూ స్టీవెన్ ఇలా అంటున్నాడు, “యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టిన తర్వాతే మేము ఎక్కువ మార్పులు చేసుకున్నాం. మేము పొందిన సహాయం వెలకట్టలేనిది. దానివల్లే మేము ఆ కల్లోలభరిత పరిస్థితులను దాటుకొని రాగలిగాం.” జూలీ ఇలా అంటోంది, “భయంకరమైన ఆ పరిస్థితిని దాటుకొని రాగలిగామంటే అది యెహోవా ఆశీర్వాదమేనని నా నమ్మకం. కలిసి బైబిలు అధ్యయనం చేసి, ఎంతో కృషి చేసిన తర్వాత భార్యాభర్తలుగా ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం.” (w12-E 05/01)
a అసలు పేర్లు కావు.
b ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం కోసం తేజరిల్లు! (ఆంగ్లం) ఏప్రిల్ 22, 1999 సంచిక 6వ పేజీ, తేజరిల్లు! సెప్టెంబరు 8, 1995 సంచిక 10, 11 పేజీలు చూడండి.
c ఒకవేళ కొంతకాలం పాటు మీరు ఆ వ్యక్తితో (పని స్థలం వంటి చోట్ల) సంప్రదింపులు పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాకపోతే వాటిని అవసరమైనంత మేరకు పరిమితం చేయండి. ఇతరుల సమక్షంలో మాత్రమే ఆ వ్యక్తిని కలవండి, ఆ విషయం మీ భాగస్వామికి ముందే చెప్పండి.
ఇలా ప్రశ్నించుకోండి . . .
-
నా భాగస్వామి నమ్మకద్రోహానికి పాల్పడినా నేను మా వివాహ బంధాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకోవడానికి కారణాలు ఏమిటి?
-
నా వివాహ భాగస్వామిలో ఇప్పుడు ఎలాంటి మంచి లక్షణాలు ఉన్నాయి?
-
పెళ్ళికి ముందు నేను తనపై చిన్న విషయాల్లో కూడా ఎలా ప్రేమ చూపించాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఎలా చూపించవచ్చు?