కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారి విశ్వాసాన్ని అనుసరించండి

‘అతను మృతినొందినా, మాట్లాడుతున్నాడు’

‘అతను మృతినొందినా, మాట్లాడుతున్నాడు’

పర్వత మైదానంలో ప్రశాంతంగా మేత మేస్తున్న గొర్రెల మందవైపు హేబెలు ఓసారి చూశాడు. మందకు అల్లంత దూరంలో కనబడుతున్న వెలుగుపై అతని చూపు పడివుంటుంది. ఏదెను తోటలోకి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడానికి అక్కడ ఓ ఖడ్గజ్వాల అనుక్షణం తిరుగుతూ ఉంటుందని అతనికి తెలుసు. తన తల్లిదండ్రులు ఒకప్పుడు ఆ తోటలోనే నివసించేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లకుగానీ వాళ్ల పిల్లలకుగానీ అందులోకి ప్రవేశం లేదు. ఆ సంధ్య వేళ పిల్లగాలులకు హేబెలు తల వెంట్రుకలు ఎగిరిపడుతుండగా, అతను ఆకాశానికేసి చూస్తూ సృష్టికర్త గురించి ఆలోచిస్తున్నట్టు ఊహించుకోండి. మనిషికి దేవునికి మధ్య ఏర్పడిన దూరం ఏనాటికైనా కరుగుతుందా? అలా జరగాలన్నదే అతని కోరిక.

నేడు హేబెలు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం మీకు వినిపిస్తోందా? అది అసాధ్యమని మీరు అంటారేమో. అవును, ఆదాము రెండో కుమారుడైన ఈ హేబెలు చనిపోయి దాదాపు 60 శతాబ్దాలు గడిచిపోయాయి. ఈపాటికి ఆయన ఎముకలు కూడా పూర్తిగా మట్టిలో కలిసిపోయివుంటాయి. ‘చనిపోయినవాళ్లు ఏమీ ఎరుగరు’ అని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 9:5, 10) పైగా హేబెలు మాట్లాడిన ఒక్క ముక్క కూడా బైబిల్లో లేదు. మరి ఆయన మనతో ఎలా మాట్లాడగలడు?

హేబెలు గురించి పౌలు దేవుని ప్రేరణతో ఇలా రాశాడు, ‘అతను మృతినొందినా మాట్లాడుతున్నాడు.’ (హెబ్రీయులు 11:4) ఎలా? విశ్వాసం ద్వారా. ఈ విలక్షణమైన లక్షణాన్ని అలవర్చుకున్న మొట్టమొదటి మనిషి హేబెలే. ఆయన చూపించిన విశ్వాసం ఎంత గొప్పదంటే అది ఈనాటికీ సజీవంగా ఉంది, విశ్వాసానికి సాటిలేని ప్రమాణంగా నిలిచింది. ఆయన విశ్వాసం గురించి నేర్చుకుని, ఆయనను ఆదర్శంగా తీసుకుంటే, హేబెలు మన కళ్లముందే ఉండి మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది.

హేబెలు గురించి బైబిలు చెప్పేది చాలా తక్కువే అయినా ఆయన గురించి, ఆయన విశ్వాసం గురించి ఎంతో నేర్చుకోవచ్చు. దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రపంచం పసితనంలో ఉన్నప్పుడు పెరిగిన హేబెలు

హేబెలు మానవ చరిత్ర తొలినాళ్లలో పుట్టాడు. చాలా ఏళ్ల తర్వాత యేసు మాట్లాడుతూ హేబెలును ‘లోకం పుట్టుకతో’ ముడిపెట్టాడు. (లూకా 11:50, 51) యేసు ఇక్కడ లోకం అని అన్నప్పుడు, పాపం నుండి విముక్తి పొందబోయే వారి గురించి మాట్లాడుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడున్న మనుషుల్లో హేబెలు నాలుగవవాడైనా, దేవుని దృష్టిలో విమోచనకు అర్హులైన వాళ్లలో హేబెలే మొదటివాడని అనిపిస్తోంది. a అంటే హేబెలు పెరిగింది మంచి వాతావరణంలో కాదని అర్థమౌతోంది.

మానవ కుటుంబం మొదలైన కొంతకాలానికే విషాద పరిస్థితులు అలుముకున్నాయి. హేబెలు తల్లిదండ్రులైన ఆదాము, హవ్వలు అందంగా, బలంగా ఉండివుంటారు. కానీ ఏం లాభం వాళ్లు తమ జీవితంలో ఒక ఘోరమైన తప్పు చేశారు, ఆ విషయం వాళ్లకీ తెలుసు. ఒకప్పుడు వాళ్లు పరిపూర్ణులు, నిరంతరం జీవించే సదావకాశం కూడా వాళ్లకుండేది. కానీ, వాళ్లు యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేశారు, దాంతో ఆయన వాళ్లను సుందరమైన ఏదెను తోటలో నుండి బయటకు పంపించేశాడు. వాళ్లు అన్నిటికన్నా, చివరకు తమ పిల్లల అవసరాల కన్నా కూడా తమ కోరికలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. వాళ్లు పరిపూర్ణతను, నిరంతరం జీవించే అవకాశాన్ని చేజార్చుకున్నారు.—ఆదికాండము 2:15–3:24.

ఏదెను తోట నుండి వచ్చేశాక ఆదాముహవ్వల జీవితం దుర్భరంగా మారింది. అయినా, వాళ్లకు మొదటి బిడ్డ కయీను పుట్టినప్పుడు హవ్వ ఇలా అంది, “యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాను.” ఒక స్త్రీకి “సంతానం” కలుగుతుందని, ఆ సంతానం ఆదాముహవ్వలను మోసగించిన దుష్టుణ్ణి నాశనం చేస్తుందని ఏదెను తోటలో యెహోవా చేసిన వాగ్దానం ఆమె మనసులో ఉన్నట్టు ఆ మాటలను బట్టి తెలుస్తోంది. (ఆదికాండము 3:15; 4:1) ఆ స్త్రీ తనేనని, ఆ “సంతానం” కయీనేనని హవ్వ అనుకుందా?

ఒకవేళ అలా అనుకునివుంటే, ఆమె పొరబడినట్టే. దానికితోడు, ఆదాముహవ్వలు కయీను మనసులో కూడా అవే ఆలోచనలు నూరిపోసివుంటే, ఎందుకూ పనికిరాని అహాన్ని అతనిలో పెంచిపోషించినట్టే. కొంతకాలానికి హవ్వకు ఇంకో బిడ్డ పుట్టాడు. కానీ ఈ బిడ్డ గురించి వాళ్లు గొప్పగా అనుకున్న దాఖలాలు బైబిల్లో ఎక్కడా లేవు. ఈ బిడ్డకు హేబెలు అని పేరు పెట్టారు, ఆ పేరుకు “వదిలే ఊపిరి” లేదా “వ్యర్థం” అనే అర్థాలు ఉండివుండవచ్చు. (ఆదికాండము 4:2) కయీను మీద పెట్టుకున్నన్ని ఆశలు హేబెలు మీద పెట్టుకోకపోవడం వల్లే ఆ పేరు పెట్టివుంటారా? మనకైతే తెలీదు.

ఏదేమైనా ఆదాముహవ్వల నుండి నేటి తల్లిదండ్రులు పాఠం నేర్చుకోవాలి. మీ మాటలతో, చేతలతో మీ పిల్లల మనసుల్లో గర్వం, అధికార దాహం, స్వార్థం వంటి లక్షణాల్ని నూరిపోస్తున్నారా? లేదా యెహోవా దేవుణ్ణి ప్రేమించమని, ఆయనతో స్నేహం చేయమని బోధిస్తున్నారా? విచారకరమైన విషయమేమిటంటే, మొదటి తల్లిదండ్రులు తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేదు. అయినాసరే వాళ్ల పిల్లలందరికీ మంచి భవిష్యత్తు పొందే అవకాశం ఉంది.

హేబెలు విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నాడు?

ఆదాము ఎదిగే తన పిల్లలిద్దరికీ కుటుంబ పోషణ కోసం పనులు నేర్పించివుంటాడు. కయీను వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు, హేబెలు గొర్రెలు కాయడం మొదలుపెట్టాడు.

అయితే, హేబెలు ప్రాముఖ్యమైన మరో పని కూడా చేశాడు. ఆయన విశ్వాసం అనే మంచి లక్షణాన్ని వృద్ధి చేసుకున్నాడని చాలాకాలం తర్వాత పౌలు రాశాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో విశ్వాసం విషయంలో హేబెలుకు ఆదర్శంగా ఎవరూ లేరు. మరైతే, యెహోవా దేవునిపై విశ్వాసాన్ని ఆయన ఎలా పెంచుకున్నాడు? దేవునిపై బలమైన విశ్వాసాన్ని పెంచుకోవడానికి హేబెలుకు సహాయపడిన మూడు విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.

యెహోవా సృష్టి.

యెహోవా దేవుని శాపం వల్ల నేలమీద ముండ్ల తుప్పలు, గచ్చపొదలు మొలిచి వ్యవసాయం కష్టతరంగా మారిన మాట నిజమే. అయినా, హేబెలు ఇంట్లో వాళ్లందరూ బ్రతకడానికి కావాల్సిన ఆహారాన్ని భూమి సమృద్ధిగా ఉత్పత్తి చేస్తూనే ఉంది. అదీగాక పక్షులు, చేపలతో సహా ఏ జంతువునీ దేవుడు శపించలేదు. అలాగే పర్వతాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, ఆకాశం, మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేవీ కూడా దేవుని శాపానికి గురికాలేదు. హేబెలు ఎటుచూసినా, సమస్తాన్ని సృష్టించిన యెహోవా దేవుని అపారమైన ప్రేమకు, జ్ఞానానికి, మంచితనానికి రుజువులే కనిపించాయి. (రోమీయులు 1:20) సృష్టి కార్యాల గురించి, దేవుని లక్షణాల గురించి ఆలోచించినప్పుడు ఆయన విశ్వాసం బలపడింది.

యెహోవా దేవుని గురించి ఆలోచించడానికి హేబెలు సమయం వెచ్చించాడు. ఆయన గొర్రెలను కాస్తున్నట్లు ఊహించుకోండి. కాపరులు ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. గొర్రెల కోసం పచ్చని గడ్డి, మంచినీరు, సేదదీరే నీడ ఉండే ప్రదేశాలను వెదుకుతూ ఆ సాధు జంతువులను కొండల మీద, లోయల్లోనూ, నదుల గుండా ఆయన నడిపించేవాడు. దేవుడు సృష్టించిన ప్రాణులన్నిటిలోకన్నా గొర్రెలు నిస్సహాయమైనవి. వాటిని చూస్తే, మనిషి కాపుదల, నడిపింపు లేకపోతే అవి మనుగడ సాగించలేవేమో అనిపిస్తుంది. అది గమనించిన హేబెలు తనకు కూడా, మనుషుల కంటే తెలివైన, శక్తివంతుడైనవాని నడిపింపు, కాపుదల, శ్రద్ధ అవసరమని గ్రహించాడా? ఆయన ప్రార్థనలో తప్పకుండా అలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసి ఉంటాడు, దానివల్ల ఆయన విశ్వాసం మరింతగా పెరిగి ఉంటుంది.

ప్రేమగల సృష్టికర్త మీద విశ్వాముంచడానికి బలమైన ఆధారాన్ని హేబెలు సృష్టిలో చూశాడు

యెహోవా వాగ్దానాలు.

దేవుడు తమను ఏదెను తోట నుండి వెళ్లగొట్టడానికి దారితీసిన సంఘటనలను ఆదాముహవ్వలు తమ పిల్లలకు చెప్పివుంటారు. దాంతో హేబెలుకు ధ్యానించడానికి బోలెడంత సమాచారం దొరికింది.

నేల శాపానికి గురౌతుందని యెహోవా చెప్పాడు. ముండ్ల తుప్పలను, గచ్చపొదలను చూసిన హేబెలుకు యెహోవా చెప్పిన మాట నెరవేరిందని అర్థమైంది. హవ్వ వేదనతో గర్భం ధరించి, పిల్లలను కంటుందని కూడా యెహోవా చెప్పాడు. తనకు తమ్ముళ్లూ, చెల్లెళ్లూ పుట్టినప్పుడు ఆ మాట కూడా నిజమేనని హేబెలుకు తెలిసింది. హవ్వ తన భర్త ప్రేమను, శ్రద్ధను అతిగా కోరుకుంటుందనీ, ఆదాము ఆమెపై ఆధిపత్యం చెలాయిస్తాడని యెహోవాకు ముందే తెలుసు. తన తల్లిదండ్రుల విషయంలో అలా జరగడం హేబెలు చూశాడు. ఇలా ప్రతీ విషయంలోనూ, యెహోవా చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరడం హేబెలు చూశాడు. ఏదెను తోటలో మొదలైన తప్పులన్నిటినీ సరిదిద్దే “సంతానం” గురించి దేవుడు చేసిన వాగ్దానంపై హేబెలు విశ్వాసముంచడానికి అవన్నీ తిరుగులేని కారణాలుగా నిలిచాయి.—ఆదికాండము 3:15-19.

యెహోవా సేవకులు.

విశ్వాసం విషయంలో ఆదర్శవంతులైన మనుషులెవరూ హేబెలుకు కనిపించలేదు, అయితే ఆ కాలంలో భూమ్మీద ఉన్న తెలివైన ప్రాణులు మనుష్యులు మాత్రమే కాదు. ఆదాముహవ్వలను ఏదెను తోట నుండి వెళ్లగొట్టిన తర్వాత వాళ్లుగానీ, వాళ్ల పిల్లలుగానీ ఆ అందమైన ఉద్యానవనంలోకి రాకుండా యెహోవా ఓ కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాడు. ఎప్పుడూ తిరుగుతూ ఉండే ఖడ్గజ్వాలతోపాటు, దేవదూతల్లో ఉన్నత శ్రేణికి చెందిన కెరూబులను ఆ తోట ముఖద్వారం దగ్గర కాపలాగా యెహోవా నియమించాడు.—ఆదికాండము 3:24.

చిన్నవాడైన హేబెలు ఆ కెరూబులను చూస్తున్నట్లు ఊహించుకోండి. మనుష్యరూపంలో ఉన్న ఆ దేవదూతలు హేబెలు కళ్లకు అత్యంత బలాఢ్యుల్లా కనిపించారు. నిరంతరం జ్వలిస్తూ, తిరుగుతూ ఉన్న ఆ ఖడ్గం ఆయనలో ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది. హేబెలు పెరిగి పెద్దవాడౌతున్నప్పుడు, ఆ కెరూబులు విసుగు చెంది తమ పనిని వదిలి పెట్టడడం ఎప్పుడైనా చూశాడా? లేదు. తెలివైన, శక్తివంతమైన ఆ ప్రాణులు రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నా నమ్మకంగా తమ విధిని నిర్వర్తిస్తూనే ఉన్నాయి. అది చూసిన హేబెలుకు యెహోవాను యథార్థంగా, స్థిరంగా సేవించేవాళ్లు ఉన్నారని అర్థమైంది. యెహోవా పట్ల తన కుటుంబంలో ఎవరికీ లేని విశ్వసనీయత, విధేయత వంటి లక్షణాలను హేబెలు ఆ కెరూబుల్లో చూశాడు. ఆ దూతల ఆదర్శం అతని విశ్వాసాన్ని తప్పక బలపర్చివుంటుంది.

హేబెలు తాను జీవించినంతకాలం, కెరూబులు నమ్మకంగా, విధేయతతో యెహోవా సేవ చేయడం గమనించాడు

యెహోవా దేవుడు తన సృష్టి, తన వాగ్దానాలు, తన నమ్మకమైన సేవకుల ప్రవర్తన ద్వారా తన గురించి ఎన్నో విషయాలు వెల్లడి చేశాడు. వాటిని ధ్యానించడం వల్ల హేబెలు విశ్వాసం చాలా బలపడింది. ఆయన ఆదర్శం మనకెంతో నేర్పిస్తుంది కదా! ప్రత్యేకించి యువతీయువకులకు, ఇంట్లోవాళ్లు ఎలా ఉన్నా తాము మాత్రం యెహోవా పట్ల నిజమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చనే భరోసాను అది ఇస్తుంది. విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మనందరికీ లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. సృష్టిలో మన చుట్టూ ఉన్న ఎన్నో అద్భుతాలు, మన దగ్గరున్న పూర్తి బైబిలు, విశ్వాసం విషయంలో అనేకమంది ఉదాహరణలు ఆ కోవలోకే వస్తాయి.

హేబెలు అర్పణ ఎందుకు శ్రేష్ఠమైనది?

హేబెలు తనకు యెహోవా మీద విశ్వాసం పెరిగే కొద్దీ దాన్ని ఎలాగైనా చేతల్లో చూపించాలనుకున్నాడు. అయితే విశ్వాన్నే సృష్టించిన దేవునికి ఓ మామూలు మనిషి ఏమి ఇవ్వగలడు? మానవుడి సహాయంగానీ బహుమానాలుగానీ దేవునికి అస్సలు అవసరం లేదు. కాలం గడుస్తుండగా, హేబెలుకు ఒక గొప్ప సత్యం అర్థమైంది అదేంటంటే, మంచి మనసుతో తనకున్న వాటిలో శ్రేష్ఠమైనది ఏది ఇచ్చినా, ప్రేమగల పరలోక తండ్రి ఎంతో సంతోషిస్తాడు.

అందుకే, హేబెలు తన మందలో నుండి కొన్ని గొర్రెలను అర్పించాలనుకున్నాడు. అత్యంత శ్రేష్ఠమైన, తొలిచూలు గొర్రెలను ఎంపిక చేసి వాటి శరీరంలోని మంచి భాగాలను అర్పించాడు. ఓపక్క కయీను కూడా యెహోవా ఆశీర్వాదం, అనుగ్రహం కోసం తన పంటలో కొంత భాగాన్ని అర్పించాడు. కానీ అతడు మంచి మనసుతో అర్పించలేదు. వాళ్లు తమ అర్పణలను దేవునికి అందించినప్పుడు వాళ్లిద్దరి ఉద్దేశాల్లో తేడా స్పష్టంగా కనబడింది.

హేబెలు విశ్వాసంతో బలి అర్పించాడు; కయీను అలా చేయలేదు

ఆదాము కుమారులిద్దరూ బహుశా బలిపీఠం మీద, నిప్పుతో తమ అర్పణలను అర్పించివుంటారు. అప్పట్లో భూమ్మీద యెహోవా ప్రతినిధులుగా ఉన్న కెరూబుల కనుచూపుమేరలో వాటిని అర్పించివుంటారు. మరి యెహోవా స్పందించాడా? ‘యెహోవా హేబెలును, అతని అర్పణను లక్ష్యపెట్టాడు’ అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 4:4) ఆ అర్పణ తనకు నచ్చిందని యెహోవా ఎలా చూపించాడో బైబిలు చెప్పట్లేదు. ఇంతకీ హేబెలు అర్పణ ఆయనకు ఎందుకు నచ్చింది?

ఆ అర్పణలో విశేషమేమైనా ఉందా? హేబెలు, జీవించే శ్వాసించే ఒక జంతువుని తీసుకుని దాని అమూల్యమైన రక్తాన్ని చిందించి అర్పించాడు. అలాంటి అర్పణకు ఎంతో విలువుంటుందని ఆయన గ్రహించాడా? హేబెలు జీవించిన చాలా శతాబ్దాల తర్వాత, దేవుడు నిర్దోషమైన గొర్రెపిల్లను బలి ఇచ్చే ఏర్పాటు చేశాడు. నిష్కళంకమైన రక్తాన్ని ధారపోసే “దేవుని గొర్రెపిల్ల” అయిన తన పరిపూర్ణ కుమారుని బలికి సూచనగా ఆయన దాన్ని ఉపయోగించాడు. (యోహాను 1:29; నిర్గమకాండము 12:5-7) అయితే హేబెలుకు దాదాపు ఇవన్నీ తెలిసివుండకపోవచ్చు.

కానీ మనకు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు, హేబెలు తన దగ్గర ఉన్నవాటిలో శ్రేష్ఠమైన వాటిని అర్పించాడు. యెహోవా ఈ అర్పణను మాత్రమే కాదు, హేబెలును కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే యెహోవా మీద ప్రేమతో, నిజమైన విశ్వాసంతో హేబెలు దాన్ని అర్పించాడు.

కానీ కయీను అలా కాదు. యెహోవా ‘కయీనును, అతని అర్పణను లక్ష్యపెట్టలేదు.’ (ఆదికాండము 4:5) అంటే కయీను అర్పణలో లోపం ఉందని కాదు, చాలాకాలం తర్వాత దేవుడు ధర్మశాస్త్రంలో పంటను కూడా అర్పణగా ఇవ్వవచ్చని చెప్పాడు. (లేవీయకాండము 6:14, 15) అయితే కయీను “క్రియలు చెడ్డవి” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 3:12) ఈ రోజుల్లో జీవిస్తున్న చాలామందిలాగే కయీను కూడా పైకి భక్తిగా ఉంటే చాలనుకున్నాడు. అతనికి దేవుని మీద నిజమైన విశ్వాసం, ప్రేమ లేవని అతని పనుల్లో తేటతెల్లమైంది.

యెహోవా అనుగ్రహం తనకు దక్కలేదని తెలుసుకున్న కయీను హేబెలును చూసి నేర్చుకున్నాడా? లేదు. పైగా తన తమ్ముడి మీద ద్వేషం పెంచుకున్నాడు. కయీను హృదయంలో ఏముందో పసిగట్టిన యెహోవా అతనికి ఓర్పుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కయీను అలాగే ఉంటే గంభీరమైన పాపంలో చిక్కుకుంటాడని, తన దారి మార్చుకుంటేనే “తలెత్తుకొనే” పరిస్థితి ఉంటుందని యెహోవా హెచ్చరించాడు.—ఆదికాండము 4:6, 7.

కయీను దేవుని మాట వినలేదు. అమాయకుడైన తన తమ్ముడికి మాయమాటలు చెప్పి పొలానికి తీసుకువెళ్లాడు. అక్కడ కయీను హేబెలు మీద దాడి చేసి అతన్ని చంపేశాడు. (ఆదికాండము 4:8) ఒక విధంగా హేబెలే మొట్టమొదటి హతసాక్షి, అంటే మత హింసకు బలైన మొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఆయన చనిపోయాడు, కానీ ఆయన కథ అక్కడితో అయిపోలేదు.

ఒకరకంగా చెప్పాలంటే, హేబెలు రక్తం ప్రతీకారం లేదా న్యాయం కోసం యెహోవా దేవునికి మొరపెట్టింది. దేవుడు నేరస్తుడైన కయీనును శిక్షించి న్యాయం జరిగేలా చూశాడు. (ఆదికాండము 4:9-12) అంతకంటే ముఖ్యంగా, హేబెలు విశ్వాసానికి సంబంధించిన వృత్తాంతం నేడు మనతో మాట్లాడుతోంది. ఆయన దాదాపు వందేళ్లు బ్రతికుంటాడు, ఆ రోజుల్లోని మానవుల ఆయుష్షుతో పోలిస్తే అది చాలా తక్కువే. అయినా ఆ కొన్నాళ్లలోనే దేవుణ్ణి సంతోషపెట్టేలా ఆయన జీవించాడు. పరలోక తండ్రి అయిన యెహోవా ప్రేమ, అనుగ్రహం తనకు ఉన్నాయనే భరోసాతోనే ఆయన కన్నుమూసాడు. (హెబ్రీయులు 11:4) అంతులేని యెహోవా జ్ఞాపకాల్లో ఆయన భద్రంగా ఉన్నాడనీ, రమణీయమైన భూపరదైసులో జీవించేలా దేవుడు ఆయనను మళ్లీ బ్రతికిస్తాడనీ మనం గట్టిగా నమ్మవచ్చు. (యోహాను 5:28, 29) అక్కడ మీరాయనను కలుసుకుంటారా? హేబెలు చెప్పేది విని, ఆయనకున్న గొప్ప విశ్వాసాన్ని అనుసరించాలని దృఢంగా నిశ్చయించుకుంటే మీరు కలుసుకోవచ్చు. ▪ (w13-E 01/01)

a మానవ తొలి సంతానం పుట్టుకతో ‘లోకం పుట్టడం’ ఆరంభమైంది. అయితే మొదట పుట్టింది కయీను కదా అలాంటప్పుడు యేసు, ‘లోకము పుట్టుకను’ హేబెలుతో ఎందుకు ముడిపెట్టాడు? కయీను తీసుకున్న నిర్ణయాలను, చేసిన పనులను చూస్తే అతడు యెహోవా దేవుని మీద కావాలనే తిరుగుబాటు చేశాడని అర్థమౌతుంది. తన తల్లిదండ్రుల్లాగే కయీను కూడా పునరుత్థానం అయ్యేవాళ్లలో, పాపవిముక్తి పొందేవాళ్లలో బహుశా ఉండకపోవచ్చు.