కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి దగ్గరవ్వండి

‘ఇదిగో! సమస్తాన్నీ నూతనం చేస్తున్నాను’

‘ఇదిగో! సమస్తాన్నీ నూతనం చేస్తున్నాను’

మీరూ మీ కుటుంబమూ మంచి ఆరోగ్యంతో కలకాలం జీవించాలని మీరు కోరుకుంటున్నారా? బాధ, వేదన, మరణం లేని లోకంలో జీవించాలని ఆశపడుతున్నారా? అలాంటి లోకం కేవలం ఒక కలకాదు. త్వరలోనే నీతియుక్తమైన కొత్త లోకం నిజంగా వస్తుంది, ఎందుకంటే అది రావాలనేది యెహోవా దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఎలా నెరవేరుతుందని ప్రకటన 21:3-5 చెబుతుందో గమనించండి.—చదవండి.

“[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” (ప్రకటన 21:4) ఆయన ఎలాంటి ‘బాష్పబిందువులను’ లేదా కన్నీళ్లను తుడిచివేస్తాడు? అవి ఆనందబాష్పాలో, సహజంగా మన కంటిని కాపాడే కన్నీళ్లో కాదు. దేవుడు తుడిచివేసేది బాధ, దుఃఖం వల్ల వచ్చే కన్నీళ్లను. ఆయన మన కన్నీళ్లను ఏదో పైపైన తుడిచివేయడు కానీ వాటికి కారణమయ్యే బాధను, దుఃఖాన్ని తీసేసి కన్నీళ్లు రాకుండా చేస్తాడు.

“మరణము ఇక ఉండదు.” (ప్రకటన 21:4) ఇప్పటివరకు చెప్పలేనన్ని కన్నీళ్లకు కారణమైన శత్రువు మరణమే. యెహోవా తనకు లోబడే మనుషులను మరణపు కోరల్లో నుండి విముక్తిచేస్తాడు. ఎలా? మరణానికి అసలు కారణాన్ని అంటే ఆదాము నుండి మనకు వారసత్వంగా వచ్చిన పాపాన్ని దేవుడు కూకటివేళ్లతోసహా పెకిలిస్తాడు. (రోమీయులు 5:12) యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా యెహోవా దేవుడు తనకు విధేయులైన వాళ్లను పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాడు. a ఆ తర్వాత, చివరి శత్రువైన మరణానికి మనుగడే లేకుండా చేస్తాడు. (1 కొరింథీయులు 15:26) దేవునికి నమ్మకంగా ఉన్న ప్రజలు, ఆయన మొదట ఉద్దేశించినట్లే సంపూర్ణ ఆరోగ్యంతో ఎల్లకాలం జీవిస్తారు.

“వేదన . . . ఇక ఉండదు.” (ప్రకటన 21:4) ఎలాంటి వేదన ఇక ఉండదు? పాపం, అపరిపూర్ణత కోట్లాది ప్రజలకు తీవ్రమైన మానసిక, భావోద్వేగ, శారీరక వేదన కలిగించి వాళ్ల జీవితాలను దుర్భరం చేశాయి. అలాంటి వేదన ఇక ఉండదు.

కన్నీళ్లు, మరణం, వేదన లేని జీవితం త్వరలోనే నిజంగా రాబోతుంది. ‘కానీ ఎక్కడికి?’ అని మీరు అనవచ్చు. ‘దేవుడు చెప్పింది బహుశా పరలోకంలో జీవితం గురించా?’ కాదు. ఎందుకు కాదో పరిశీలించండి. “దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది” అనే మాటలతో ఆ వాగ్దానం మొదలౌతుంది, మరి మనుషులు ఉండేది భూమ్మీదే కదా. (ప్రకటన 21:3) పైగా ఆ వాగ్దానం, ‘మరణం ఇక ఉండని’ లోకం గురించి, అంటే ఒకప్పుడు మరణం ఉండి ఆ తర్వాత లేకుండా పోయే లోకం గురించి చెబుతుంది. మరణమనేది అసలు పరలోకంలో ఎప్పుడూ లేదు కానీ భూమ్మీద ఎప్పటినుండో ఉంది. అంటే, మంచి జీవితం గురించి దేవుడు చేసిన వాగ్దానం నెరవేరేది ఈ భూమ్మీదే అనడంలో సందేహమే లేదు.

బాధ, దుఃఖం వల్ల ప్రవహించిన కన్నీటి వరదను దేవుడు పూర్తిగా ఎండిపోజేస్తాడు

నీతియుక్తమైన కొత్త లోకం గురించిన తన వాగ్దానాన్ని మనం నమ్మాలని యెహోవా కోరుకుంటున్నాడు. రాబోయే ఆశీర్వాదాల గురించి చెప్పిన వెంటనే ఆయన తన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని హామీ ఇస్తూ ఇలా అన్నాడు: “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను . . . ఈ మాటలు నమ్మకమును నిజమునైయున్నవి.” (ప్రకటన 21:5) దేవుని వాగ్దానం అద్భుతరీతిలో నెరవేరడం చూసే సంతోషవంతులైన ఆయన ఆరాధకుల్లో మీరూ, మీ ఆత్మీయులూ ఉండాలంటే ఇంకా ఏమి చేయాలో తెలుసుకోండి. (w13-E 12/01)

జనవరి–మార్చి నెలల్లో ఈ బైబిలు భాగం చదవండి:

ఆదికాండము 1నిర్గమకాండము 6 అధ్యాయాలు

a క్రీస్తు విమోచన క్రయధన బలి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 5వ అధ్యాయం చూడండి.