మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచాలంటే ఏంచేయాలి?
పిల్లలు చక్కగా పెరగాలంటే ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకోవడం చాలా ముఖ్యం. (కొలొస్సయులు 3:14, 19) యెహోవా దేవుడు తన కుమారున్ని మెచ్చుకున్నాడు. మంచి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలాగే ప్రేమిస్తారు, మెచ్చుకుంటారు.—మత్తయి 3:17 చదవండి.
తన సేవకులు చెప్పేవాటిని మన పరలోక తండ్రి వింటాడు, వాళ్ల భావాల్ని, ఆలోచనల్ని పట్టించుకుంటాడు. తల్లిదండ్రులు కూడా దేవునిలానే పిల్లలు చెప్పేవాటిని వినాలి. (యాకోబు 1:19) తల్లిదండ్రులు పిల్లల భావాలను అర్థం చేసుకోవాలి. పిల్లలు చెప్పేవి, చేసేవి కొన్నిసార్లు చిరాకు తెప్పించినా వాళ్లను అర్థం చేసుకోవాలి.—సంఖ్యాకాండము 11:11, 15 చదవండి.
మీ పిల్లల్ని బాధ్యతగల వాళ్లుగా ఎలా పెంచవచ్చు?
ఏమి చేయాలి, ఏమి చేయకూడదో చెప్పే హక్కు తల్లిదండ్రులుగా మీకు ఉంది. (ఎఫెసీయులు 6:1) దేవుడు కూడా ఏమిచేయాలో, ఏమి చేయకూడదో చెబుతూ పిల్లలపై ప్రేమ చూపించాడు. మాట వినకపోతే ఏమి జరుగుతుందో కూడా వివరించాడు. మీరూ అలానే చేయండి. (ఆదికాండము 3:3) చెప్పిన మాట వినమని బలవంతపెట్టే బదులు, సరైనది చేస్తూ ఎలా సంతోషంగా ఉండవచ్చో దేవుడు నేర్పిస్తాడు.—యెషయా 48:18, 19 చదవండి.
మీ పిల్లలకు దేవున్ని ప్రేమించడం నేర్పించండి. దానివల్ల మీరు పక్కన లేనప్పుడు కూడా వాళ్లు చక్కగా నడుచుకుంటారు. దేవుడు అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటూ మనకు నేర్పిస్తున్నాడు. మీరూ అలాగే అన్ని విషయాల్లో ఆదర్శంగా ఉంటూ మీ పిల్లలకు నేర్పించండి.—ద్వితీయోపదేశకాండము 6:5-7; ఎఫెసీయులు 4:32; 5:1 చదవండి. (w15-E 06/01)