కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడం నుండి మనమేమి నేర్చుకుంటాము?

దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడం నుండి మనమేమి నేర్చుకుంటాము?

అధ్యాయం ఏడు

దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడం నుండి మనమేమి నేర్చుకుంటాము?

1, 2. (ఎ) ఏదెనులోని తిరుగుబాటుదారులను యెహోవా వెంటనే నాశనం చేసివుంటే, అది మనపై ఎలాంటి ప్రభావం చూపివుండేది? (బి) యెహోవా మన కోసం ఎలాంటి ప్రేమపూర్వక ఏర్పాట్లు చేశాడు?

 “నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి” అని పితరుడైన యాకోబు చెప్పాడు. (ఆదికాండము 47: 9) యోబు కూడా ఇలా అన్నాడు: మానవుడు “కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.” (యోబు 14: 1) మనం కూడా వారిలాగే కష్టాలను, అన్యాయాలను, విషాదాలను సహితం అనుభవించాము. అయినా మనం జన్మించడంలో దేవుడు చేసిన అన్యాయమేమీ లేదు. అవును, ఆదాము హవ్వలకు మొదట్లో ఉండిన పరిపూర్ణ మనస్సు, శరీరం, పరదైసు గృహం మనకు లేవు. కాని వారు తిరుగుబాటు చేసినవెంటనే యెహోవా వారిని హతమార్చివుంటే ఏమి జరిగివుండేది? ఎలాంటి అనారోగ్యం, దుఃఖం, మరణం, ఉండేవి కావు, అలాగే మానవజాతి కూడా ఉండేది కాదు. మనం జన్మించేవాళ్ళమే కాదు. ఆదాము హవ్వలకు కలిగే పిల్లలు వారసత్వంగా అపరిపూర్ణతను సంతరించుకుంటారని తెలిసినా దేవుడు కనికరంతో వారు పిల్లలు కనేందుకు సమయం అనుమతించాడు. ఆదాము పోగొట్టుకున్న దానిని అంటే పరదైసు భూమిపై నిత్యజీవితాన్ని మనం తిరిగి పొందేలా యెహోవా క్రీస్తు ద్వారా ఏర్పాటుచేశాడు.​—⁠యోహాను 10:10; రోమీయులు 5:12.

2 నూతనలోకంలో అనారోగ్యం, దుఃఖం, వేదన, మరణంతోపాటు దుష్టులు కూడా లేని పరదైసు పరిసరాల్లో నిత్యం జీవించడం కోసం ఎదురు చూడగలగడం మనకు ఎంత ప్రోత్సాహకరమైన విషయమో కదా! (సామెతలు 2:​21, 22; ప్రకటన 21:​4, 5) మన రక్షణ మనకూ యెహోవాకూ చాలా ప్రాముఖ్యమే అయినా దానిలో మరింత విశేషమైనది ఉందని బైబిలు నుండి మనం తెలుసుకుంటాము.

ఆయన గొప్ప నామము నిమిత్తం

 3. ఈ భూమికి, మానవాళికి సంబంధించిన యెహోవా సంకల్ప నెరవేర్పులో ఏమి చేరివుంది?

3 ఈ భూమికి, మానవాళికి సంబంధించి దేవుని సంకల్ప నెరవేర్పులో ఆయన నామము చేరివుంది. యెహోవా అనే ఆ పేరుకు “తానే కర్త అవుతాడు” అని అర్థం. కాబట్టి ఆయన నామము విశ్వ సర్వాధిపతిగా, సంకల్పకర్తగా, సత్యానికి దేవుడిగా ఆయన సత్కీర్తిని విశదపరుస్తుంది. యెహోవా స్థానాన్నిబట్టి, సమస్త విశ్వం శాంతి సంక్షేమాలతో ఉండాలంటే ఆయన నామమునకు, ఆయన నామమునకు సంబంధించిన వాటికి యోగ్యమైన సంపూర్ణ గౌరవం ఇవ్వాలి, అందరూ ఆయనకు విధేయత చూపించాలి.

 4. భూమికి సంబంధించి యెహోవా సంకల్పంలో ఏమి చేరివుంది?

4 ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత, యెహోవా వారికొక పని అప్పగించాడు. వారు పరదైసు సరిహద్దులను విస్తరింపజేస్తూ సమస్త భూమిని లోబరచుకోవడమే కాక తమ సంతానముతో దానిని నింపడం తన సంకల్పమని ఆయన స్పష్టంచేశాడు. (ఆదికాండము 1:​28) వారు పాపం చేసినందువల్ల ఆ సంకల్పం నెరవేరదా? ఈ భూమికి, మానవాళికి సంబంధించి తన సంకల్పం నెరవేర్చలేకపోతే అది సర్వశక్తివంతుడైన యెహోవా నామానికి ఎంత అపకీర్తి తెస్తుందో కదా!

 5. (ఎ) మొదటి మానవులు మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తింటే, వాళ్ళెప్పుడు మరణిస్తారు? (బి) ఈ భూమికి సంబంధించి తన సంకల్పానికి ఆటంకం కలిగించకుండానే ఆదికాండము 2:17 లోని తన మాటను యెహోవా ఎలా నెరవేర్చాడు?

5 ఆదాము హవ్వలు అవిధేయులై మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తింటే, వారు తిను “దినమున” మరణిస్తారని యెహోవా వారిని హెచ్చరించాడు. (ఆదికాండము 2:​17) ఆయన చెప్పినట్లే, వారు పాపము చేసిన దినమునే యెహోవా వారిని జవాబుదారులను చేసి వారికి మరణశిక్ష విధించాడు. దేవుని దృష్టిలో ఆదాము హవ్వలు అదే రోజు మరణించారు. అయితే భూమికి సంబంధించి తన సంకల్పం నెరవేర్చడానికి, వారు భౌతికంగా చనిపోయేముందు ఒక కుటుంబాన్ని ఉనికిలోకి తెచ్చేందుకు యెహోవా వారిని అనుమతించాడు. దేవుడు 1,000 సంవత్సరాలను ఒక దినముగా దృష్టించగలడు కాబట్టి, ఆదాము జీవితం 930 సంవత్సరాలకు ముగిసినప్పుడు, అది ఒక్క “దినము”లోనే జరిగింది. (2 పేతురు 3: 8; ఆదికాండము 5:​3-5) ఆ విధంగా, శిక్ష అమలుపరిచే విషయంలో యెహోవా సత్యసంధత నిరూపించబడింది, అంతేకాక వారు మరణించినప్పుడు ఈ భూమికి సంబంధించి ఆయన సంకల్పానికి ఆటంకం కలుగలేదు. కాని కొంతకాలం వరకు దుష్టులతోసహా అపరిపూర్ణ ప్రజలు జీవించడానికి అనుమతించబడ్డారు.

6, 7. (ఎ) నిర్గమకాండము 9:15, 16 ప్రకారం యెహోవా దుష్టులను కొంతకాలంపాటు ఎందుకు అనుమతిస్తాడు? (బి) ఫరో విషయంలో యెహోవా శక్తి ఎలా ప్రదర్శించబడింది, ఆయన నామము ఎలా తెలియజేయబడింది? (సి) ప్రస్తుత దుష్ట విధానం అంతమైనప్పుడు దాని ఫలితమెలా ఉంటుంది?

6 మోషే కాలంలో ఐగుప్తు పరిపాలకునితో యెహోవా చెప్పిన మాటలు, దేవుడు దుష్టత్వం కొనసాగేందుకు అనుమతించడానికిగల కారణాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. ఇశ్రాయేలు కుమారులు ఐగుప్తును విడిచి వెళ్ళకుండా ఫరో అడ్డగించినప్పుడు, యెహోవా వెంటనే అతణ్ణి మొత్తలేదు. యెహోవా శక్తిని మహాద్భుతమైన రీతిలో ప్రదర్శిస్తూ ఆ దేశంపైకి పది తెగుళ్ళు తీసుకురాబడ్డాయి. ఏడవ తెగులు గురించి హెచ్చరించేటప్పుడు, తాను ఫరోను అతని ప్రజలను భూమిపై లేకుండా అతిసులభంగా నాశనం చేయగలనని యెహోవా ఫరోతో చెప్పాడు. నిజానికి “నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని” అని యెహోవా అన్నాడు.​—⁠నిర్గమకాండము 9:​15, 16.

7 యెహోవా ఇశ్రాయేలీయులను విడిపించినప్పుడు, ఆయన నామము నిజంగానే నలుదిశలా వ్యాపించింది. (యెహోషువ 2:​1, 9-11) నేటికి అంటే దాదాపు 3,500 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఆనాడు చేసింది మరువబడలేదు. యెహోవా అనే వ్యక్తిగత నామము మాత్రమే కాక ఆ నామము ధరించిన వ్యక్తి గురించిన సత్యము కూడా ప్రకటించబడింది. తన వాగ్దానాలను నెరవేర్చి తన సేవకుల పక్షాన చర్యలు తీసుకునే దేవుడిగా యెహోవా ప్రతిష్ఠను అది రుజువుచేసింది. (యెహోషువ 23:​14) ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన సంకల్పాన్ని ఏదీ అడ్డగించలేదని అది ప్రదర్శించింది. (యెషయా 14:​24, 27) కాబట్టి ఆయన త్వరలోనే సాతాను దుష్ట విధానమంతటిని నాశనం చేయడం ద్వారా తన నమ్మకమైన సేవకుల పక్షాన చర్య తీసుకుంటాడని మనం దృఢనమ్మకంతో ఉండవచ్చు. అప్పుడు ప్రదర్శించబడే సర్వశక్తి, అది యెహోవా నామానికి తీసుకువచ్చే ఘనత ఎన్నటికి మరువబడదు. దానివలన కలిగే ప్రయోజనాలకు అంతముండదు!​—⁠యెహెజ్కేలు 38:​23; ప్రకటన 19: 1, 2.

‘ఆహా దేవుని బుద్ధి బాహుళ్యము ఎంతో గంభీరము!’

 8. ఏ అంశాలను పరిగణించమని పౌలు మనకు ఉద్బోధిస్తున్నాడు?

8 అపొస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన ఉత్తరంలో ఈ ప్రశ్న లేవదీశాడు: “దేవునియందు అన్యాయము కలదా?” “అట్లనరాదు” అని ఆయనే ఖచ్చితంగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఆయన దేవుని కనికరం గురించి నొక్కిచెప్పి, ఫరో కొంతకాలంపాటు జీవించేందుకు అనుమతించడం విషయంలో యెహోవా చెప్పిన మాటలను ప్రస్తావించాడు. మానవులమైన మనం కుమ్మరి చేతిలోని మట్టిముద్దలాంటివారమని కూడా పౌలు తెలియజేశాడు. ఆ తర్వాత ఆయన ఇలా వ్యాఖ్యానించాడు: “దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?”​—⁠రోమీయులు 9:​14-24.

 9. (ఎ) ‘నాశనానికి సిద్ధంచేయబడిన ఉగ్రతాపాత్రమైన ఘటములు’ ఎవరు? (బి) యెహోవా తన వ్యతిరేకుల విషయంలో ఎందుకు గొప్ప దీర్ఘశాంతం చూపించాడు, చివరకు ఆయనను ప్రేమించేవారికి అదెలా ప్రయోజనకరంగా ఉంటుంది?

9 ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పటి నుండి, యెహోవాను ఆయన నియమాలను వ్యతిరేకించినవారెవరైనా ‘నాశనానికి సిద్ధంచేయబడిన ఉగ్రతాపాత్రమైన ఘటములుగా’ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు యెహోవా దీర్ఘశాంతం చూపాడు. దుష్టులు ఆయన మార్గాలను పరిహసించారు, ఆయన సేవకులను హింసించారు, చివరికి ఆయన కుమారుణ్ణి హతమార్చారు. అయినా, యెహోవా ఎంతో నిగ్రహం చూపిస్తూ, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంవల్ల, తన నుండి వేరైన మానవ పరిపాలనవల్ల కలిగే వినాశకర ఫలితాలను సమస్త సృష్టి సంపూర్ణంగా గ్రహించేందుకు తగినంత సమయం అనుమతించాడు. అదే సమయంలో, విధేయులైన మానవాళి విడుదలవడానికి, ‘అపవాది క్రియలను లయపరచడానికి’ యేసు మరణం మార్గం తెరచింది.​—⁠1 యోహాను 3: 8; హెబ్రీయులు 2:​14, 15.

10. గత 1,900 సంవత్సరాలుగా యెహోవా దుష్టులను ఎందుకు సహించాడు?

10 యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత 1,900 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో యెహోవా ఆ “ఉగ్రతాపాత్రమైన ఘటములను” నాశనం చేయకుండా మరింత సహనం చూపించాడు. ఎందుకు? ఒక కారణమేమిటంటే, తన పరలోక రాజ్యంలో యేసుక్రీస్తుతో సహపరిపాలకులుగా ఉండే వారిని ఆయన సిద్ధం చేస్తున్నాడు. వారు మొత్తం 1,44,000 మంది, అపొస్తలుడైన పౌలు చెప్పిన “కరుణాపాత్ర ఘటములు” వారే. మొదటిగా ఈ పరలోక తరగతిలో భాగంగా ఉండేందుకు యూదుల నుండి ఆయా వ్యక్తులు ఆహ్వానించబడ్డారు. ఆ తర్వాత, దేవుడు అన్య జనాంగాల ప్రజలను ఆహ్వానించాడు. యెహోవా వారిలో ఎవరిని తనను సేవించుమని బలవంతపెట్టలేదు. కాని తన ప్రేమపూర్వక ఏర్పాట్లకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిస్పందించిన వారిలో కొందరికి పరలోక రాజ్యంలో తన కుమారునితోపాటు సహపరిపాలకులుగా ఉండే ఆధిక్యతనిచ్చాడు. ఆ పరలోక తరగతిని సిద్ధంచేయడం ఇప్పుడు దాదాపు పూర్తయ్యింది.​—⁠లూకా 22:​29; ప్రకటన 14:​1-4.

11. (ఎ) యెహోవా దీర్ఘశాంతం నుండి ఇప్పుడు ఏ గుంపు ప్రయోజనం పొందుతోంది? (బి) మృతులు ఎలా ప్రయోజనం పొందుతారు?

11 అయితే భూనివాసుల విషయమేమిటి? యెహోవా దీర్ఘశాంతం, అన్ని దేశాలనుండి ఒక “గొప్పసమూహము” సమకూర్చబడడాన్ని కూడా సాధ్యం చేసింది. వారి సంఖ్య ఇప్పుడు లక్షల్లో ఉంది. ఈ భూలోక తరగతికి ఈ విధానాంతంలో రక్షించబడి, భూపరదైసుపై నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష ఉంటుందని యెహోవా వాగ్దానం చేశాడు. (ప్రకటన 7:​9, 10; కీర్తన 37:​29; యోహాను 10:​16) దేవుని నిర్ణీత కాలంలో ఎంతోమంది మృతులు పునరుత్థానం చేయబడతారు, పరలోక రాజ్యానికి చెందిన భూలోక పౌరులుగా ఉండే అవకాశం వారికి ఇవ్వబడుతుంది. దేవుని వాక్యం అపొస్తలుల కార్యములు 24:15 లో ఇలా ప్రవచిస్తోంది: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.’​—⁠యోహాను 5:​28, 29.

12. (ఎ) యెహోవా దుష్టత్వాన్ని సహించడం నుండి మనం ఆయన గురించి ఏమి నేర్చుకున్నాము? (బి) యెహోవా ఈ విషయాలతో వ్యవహరించిన విధానం గురించి మీరెలా భావిస్తున్నారు?

12 దీనంతటిలో అన్యాయమేమైనా ఉందా? లేదు, ఎందుకంటే దుష్టులను లేదా “ఉగ్రతాపాత్రమైన ఘటములను” ఇప్పటివరకూ నాశనం చేయకుండా ఉండడం ద్వారా దేవుడు తన సంకల్పానికి అనుగుణంగా ఇతరులకు కనికరం చూపిస్తున్నాడు. ఆయన ఎంత కనికరం, ప్రేమగలవాడో అది చూపిస్తుంది. అంతేకాక యెహోవా సంకల్పం వెల్లడవుతుండగా గమనించేందుకు సమయం లభించినందువల్ల మనం ఆయన గురించి ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నాము. వెల్లడిచేయబడిన ఆయన వ్యక్తిత్వంలోని విభిన్న అంశాలను అంటే ఆయన న్యాయము, కరుణ, దీర్ఘశాంతం, జ్ఞాన బాహుళ్యతను బట్టి మనం ఆశ్చర్యపోతాం. విశ్వ సర్వాధిపత్యానికి అంటే తన పరిపాలనా హక్కుకు సంబంధించిన వివాదాంశం విషయంలో యెహోవా జ్ఞానయుక్తంగా వ్యవహరించిన విధానం, ఆయన పరిపాలనే శ్రేష్ఠమైనదనే వాస్తవానికి నిరంతరం ఒక ప్రమాణంగా నిలుస్తుంది. అపొస్తలుడైన పౌలుతోపాటు మనం కూడా ఇలా అంటాం: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.”​—⁠రోమీయులు 11:​33.

మన భక్తిని చూపే అవకాశం

13. మనం వ్యక్తిగతంగా బాధలనుభవించినప్పుడు మనకెలాంటి అవకాశముంటుంది, దానికి జ్ఞానయుక్తంగా ప్రతిస్పందించేందుకు మనకేది సహాయం చేస్తుంది?

13 దేవుని సేవకుల్లో అనేకులు వ్యక్తిగతంగా బాధలనుభవించే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు దుష్టులను నాశనంచేసి, ప్రవచించబడినట్లు మానవజాతిని ఇంకా పునరుద్ధరించలేదు కాబట్టి వారి బాధలు కొనసాగుతూనే ఉన్నాయి. అది మనలను దుఃఖపరచాలా? లేక మనం అలాంటి పరిస్థితులను అపవాది అబద్ధికుడని నిరూపించే అవకాశాలుగా దృష్టించగలమా? ఈ విన్నపాన్ని మనసులో ఉంచుకోవడం ద్వారా అలా చేయడానికి మనం బలపరచబడవచ్చు: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామెతలు 27:​11) యెహోవాను నిందించే సాతాను, ప్రజలు వస్తుపరంగా నష్టపోయినా లేక శారీరకంగా బాధలనుభవించినా దేవుణ్ణి దూషించడమే కాక ఆయనను శపిస్తారని ఆరోపించాడు. (యోబు 1:​9-11; 2:​4, 5) కష్టాలెదురైనా దేవునికి విశ్వసనీయంగా ఉండడం ద్వారా మన విషయంలో సాతాను ఆరోపణ నిజం కాదని నిరూపించినప్పుడు మనం యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తాము.

14. శ్రమలు అనుభవించినప్పుడు మనం యెహోవాపై ఆధారపడితే, మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశముంది?

14 శ్రమలనుభవించినప్పుడు మనం యెహోవాపై ఆధారపడితే, మనం అమూల్యమైన లక్షణాలను వృద్ధిచేసుకోవచ్చు. ఉదాహరణకు యేసు అనుభవించిన శ్రమల ఫలితంగా, ఆయన తనకు అంతకుముందెన్నడూ తెలియని ‘విధేయతను నేర్చుకొన్నాడు.’ మనం కూడా మనకు వచ్చే శ్రమలనుండి నేర్చుకోవచ్చు, అంటే వాటివల్ల మనం దీర్ఘశాంతం, సహనం, యెహోవా నీతి మార్గాలపట్ల ప్రగాఢమైన కృతజ్ఞతను పెంపొందించుకోవచ్చు.​—⁠హెబ్రీయులు 5:​8, 9; 12:​11; యాకోబు 1:​2-4.

15. మనం కష్టాలను ఓపికతో సహిస్తుండగా, ఇతరులు ఎలా ప్రయోజనం పొందవచ్చు?

15 మనమేమి చేస్తామో ఇతరులు గమనిస్తారు. నీతిపట్ల మనకున్న ప్రేమ కారణంగా మనమనుభవించే దాన్నిబట్టి, కొంతకాలానికి వారిలో కొందరు నేడు నిజ క్రైస్తవులెవరో గ్రహించవచ్చు. మనతో ఆరాధనలో ఐక్యమవడం ద్వారా వారు నిత్యజీవపు ఆశీర్వాదాలు పొందవచ్చు. (మత్తయి 25:​34-36, 40, 46) ప్రజలకు అలాంటి అవకాశం ఉండాలని యెహోవా, ఆయన కుమారుడు కోరుకుంటున్నారు.

16. వ్యక్తిగత కష్టాలపట్ల మన దృక్పథం ఐక్యతకు ఎలా సంబంధం కలిగివుంది?

16 మనం క్లిష్ట పరిస్థితులను కూడా యెహోవాపట్ల మన భక్తిని ప్రదర్శించడానికి, ఆయన చిత్తం నెరవేర్చడంలో భాగం వహించడానికి అవకాశాలుగా దృష్టించడం ఎంత ప్రశంసనీయమో కదా! మనమలా చేయడం, మనం నిజంగానే దేవునితోను, క్రీస్తుతోను ఐక్యమవడానికి ముందుకు సాగుతున్నామని నిరూపిస్తుంది. నిజ క్రైస్తవులందరి తరఫున యేసు యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు [తన సన్నిహిత శిష్యుల కొరకు] మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.”​—⁠యోహాను 17:​20, 21.

17. మనం యెహోవాకు విశ్వసనీయంగా ఉంటే ఏ నిశ్చయతతో ఉండవచ్చు?

17 మనం యెహోవాకు విశ్వసనీయంగా ఉంటే ఆయన మనలను ఉదారంగా ఆశీర్వదిస్తాడు. ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.” (1 కొరింథీయులు 15:​58) అది ఇంకా ఇలా తెలియజేస్తోంది: “తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.” (హెబ్రీయులు 6:​10) యాకోబు 5: 11 ఇలా పేర్కొంటోంది: “సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన [యెహోవా] ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.” యోబుకు కలిగిన ప్రతిఫలమేమిటి? “యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.” (యోబు 42:​10-16) అవును యెహోవా ‘తనను వెదకువారికి ఫలము దయచేయువాడు.’ (హెబ్రీయులు 11: 6) మనం నిరీక్షించే భూపరదైసుపై నిరంతర జీవితం ఎంత గొప్ప ప్రతిఫలమో కదా!

18. మనకేవైనా బాధాకరమైన జ్ఞాపకాలుంటే చివరికి వాటికేమవుతుంది?

18 వేలాది సంవత్సరాలుగా మానవ కుటుంబానికి కలిగిన హానినంతటిని దేవుని రాజ్య పరిపాలన నిర్మూలిస్తుంది. ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు మనసుకు రానంత గొప్పగా అప్పుడు మనం సంతోషాన్ని అనుభవిస్తాం. గతంలో మనమనుభవించిన బాధల చెడు జ్ఞాపకాలేవి మనలను కలవరపెట్టవు. నూతనలోకంలోని ప్రజల దైనందిన జీవితాలను నింపే ప్రోత్సాహకర ఆలోచనలు, నిర్మాణాత్మక కార్యకలాపాలు క్రమక్రమంగా బాధాకర జ్ఞాపకాలన్నింటిని తుడిచివేస్తాయి. యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును [మానవాళిపై ఒక క్రొత్త పరలోక రాజ్య ప్రభుత్వాన్ని] క్రొత్త భూమిని [నీతియుక్తమైన మానవ సమాజాన్ని] సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి.” అవును యెహోవా నూతనలోకంలో నీతిమంతులు ఇలా చెప్పగలుగుతారు: “భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు.”​—⁠యెషయా 14: 7; 65:​17, 18.

పునఃసమీక్షా చర్చ

• యెహోవా దుష్టత్వాన్ని అనుమతిస్తూనే, తన నామముపట్ల సరియైన విధంగా ప్రగాఢ గౌరవం ఎలా చూపించాడు?

• “ఉగ్రతాపాత్రమైన ఘటముల” విషయంలో దేవుడు చూపిన సహనం, ఆయన కరుణ మనవరకు చేరడాన్ని ఎలా సాధ్యపరచింది?

• వ్యక్తిగతంగా బాధలనుభవించే పరిస్థితుల్లో మనమేమి చూడడానికి కృషిచేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[67వ పేజీలోని చిత్రాలు]

“యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను”