మా పాఠకుల ప్రశ్న . . .
యెహోవాసాక్షుల్లో స్త్రీలు ప్రకటిస్తారా?
అవును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల్లో లక్షలమంది స్త్రీలు ప్రకటిస్తారు. వాళ్లు ఒక పెద్ద సమూహంగా దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తున్నారు. వాళ్ల గురించి కీర్తన 68:11 ముందే ఇలా చెప్పింది: “యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు; మంచివార్తను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు.”
అయితే యెహోవాసాక్షుల్లోని స్త్రీలు చేసే పరిచర్య, ఇతర మతాల్లో మతపెద్దలుగా ఉన్న స్త్రీలు చేసే పరిచర్య ఒకటి కాదు. రెండిటికీ మధ్య చాలా తేడా ఉంది. ఏయే విధాల్లో అవి రెండు వేరుగా ఉన్నాయి?
వాళ్ల శ్రోతలు వేరు. ఇతర మతాల్లో, ముఖ్యంగా చర్చీల్లో మతపెద్దలుగా సేవచేసే స్త్రీలు తమ సంఘంలోని వాళ్లమీద నాయకత్వం వహిస్తారు, వాళ్ల శ్రోతలు ముఖ్యంగా అందులోని సభ్యులే. కానీ యెహోవాసాక్షుల్లోని స్త్రీలు ముఖ్యంగా ప్రకటించేది సంఘ సభ్యులుకాని బయటివాళ్లకు. అంటే, ఇంటింటి పరిచర్యలో, ఇతర చోట్లలో కలిసే సాధారణ ప్రజలే వాళ్ల శ్రోతలు.
యెహోవాసాక్షుల్లోని ప్రకటించే స్త్రీలకు, ఇతర మతాల్లోని వాళ్లకు మధ్య ఇంకో తేడా ఏంటంటే, సంఘంలో వాళ్లు చేసే పనులు వేరుగా ఉంటాయి. చర్చీల్లో మతపెద్దలుగా సేవచేసే స్త్రీలు, తమ సంఘ సభ్యుల మీద నాయకత్వం వహిస్తూ, వాళ్లకు తమ చర్చి సిద్ధాంతాలు బోధిస్తారు. కానీ యెహోవాసాక్షుల్లో అలా కాదు, బాప్తిస్మం పొందిన పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు సంఘంలో బోధించరు. బోధించడానికి నియమించబడిన పురుషులు మాత్రమే సంఘంలో బోధిస్తారు.—1 తిమోతి 3:2; యాకోబు 3:1.
సంఘంలో పర్యవేక్షించే బాధ్యత కేవలం పురుషులకే ఇచ్చారని మనం బైబిల్లో చదువుతాం. తోటి పర్యవేక్షకుడైన తీతుకు ఉత్తరం రాసినప్పుడు అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ఒక్కో నగరానికి వెళ్తూ పెద్దల్ని నియమించాలని నిన్ను క్రేతులో ఉంచి వచ్చాను.” అలా నియమించబడే వ్యక్తి మీద “ఏ నిందా ఉండకూడదు, అతనికి ఒకే భార్య ఉండాలి” అని కూడా పౌలు చెప్పాడు. (తీతు 1:5, 6) తిమోతికి రాసిన ఉత్తరంలో కూడా పౌలు అలాంటి నిర్దేశాలనే ఇచ్చాడు. “ఒక వ్యక్తి పర్యవేక్షకుడు అవ్వడానికి కృషిచేస్తుంటే, అతను మంచిపని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కాబట్టి, పర్యవేక్షకుడు ఎలా ఉండాలంటే: అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతనికి ఒకే భార్య ఉండాలి, ... బోధించే సామర్థ్యం ఉండాలి” అని పౌలు రాశాడు.—1 తిమోతి 3:1, 2.
సంఘంలో పర్యవేక్షించే బాధ్యతను పురుషులకు మాత్రమే ఎందుకు పరిమితం చేశారు? పౌలు ఇలా చెప్పాడు: “బోధించడానికి గానీ పురుషుని మీద అధికారం చెలాయించడానికి గానీ స్త్రీకి నేను అనుమతి ఇవ్వను; ఆమె మౌనంగా ఉండాలి. ఎందుకంటే ముందు ఆదాము సృష్టించబడ్డాడు, ఆ తర్వాతే హవ్వ సృష్టించబడింది.” (1 తిమోతి 2:12, 13) కాబట్టి, దేవుడు స్త్రీపురుషుల్ని సృష్టించిన క్రమాన్ని చూస్తే, బోధించే-పర్యవేక్షించే బాధ్యతను దేవుడు పురుషులకు ఎందుకు అప్పగించాడో తెలుస్తుంది.
యెహోవా దేవుని పరిచారకులు తమ నాయకుడైన యేసుక్రీస్తు ఆదర్శాన్ని పాటిస్తారు. యేసు పరిచర్య గురించి లూకా అనే శిష్యుడు ఇలా రాశాడు: “ఆయన దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ ఒక నగరం నుండి ఇంకో నగరానికి, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ప్రయాణించాడు.” తర్వాత, అదే పని చేయమని యేసు తన అనుచరుల్ని పంపించాడు. వాళ్లు, “ఆ ప్రాంతంలోని గ్రామాలన్నిట్లో తిరుగుతూ ప్రతీచోట మంచివార్త ప్రకటిస్తూ” వెళ్లారు.—లూకా 8:1; 9:2-6.
ఈ రోజుల్లో యెహోవా దేవుని పరిచారకులందరూ, అంటే స్త్రీలు-పురుషులు యేసు చెప్పిన ఈ పనిని ఉత్సాహంగా చేస్తారు: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”—మత్తయి 24:14.