‘నా బోధలు పాటిస్తూ ఉండండి’
‘నా బోధలు పాటిస్తూ ఉండండి’
“మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు. అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది.”—యోహాను 8:31, 32.
ఆ మాటలకు అర్థం ఏంటి? యేసు బోధలు అత్యున్నత మూలం నుండి వచ్చాయి. యేసు ఇలా చెప్పాడు, “నేను ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపించిన తండ్రే నాకు ఆజ్ఞాపించాడు.” (యోహాను 12:49) యేసు తన పరలోక తండ్రైన యెహోవా దేవునికి ప్రార్థిస్తూ, “నీ వాక్యమే సత్యం” అన్నాడు. ఆయన బోధించేటప్పుడు చాలా తరచుగా దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. (యోహాను 17:17; మత్తయి 4:4, 7, 10) కాబట్టి, నిజ క్రైస్తవులు యేసు బోధల్ని పాటిస్తూ ఉంటారు, అంటే వాళ్లు దేవుని వాక్యమైన బైబిల్ని సత్యమని నమ్ముతారు. అలాగే తమ నమ్మకాలు, పనులు ఎప్పుడూ బైబిలుకు తగ్గట్లు ఉండేలా చూసుకుంటారు.
తొలి క్రైస్తవులు దాన్ని ఎలా పాటించారు? బైబిల్లో చాలా పుస్తకాలు రాసిన అపొస్తలుడైన పౌలుకు, దేవుని వాక్యంపట్ల యేసుకు ఉన్నలాంటి గౌరవమే ఉంది. ఆయన ఇలా రాశాడు: “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి … ప్రయోజనకరంగా ఉంటాయి.” (2 తిమోతి 3:16) తోటి క్రైస్తవులకు బోధించేవాళ్లు ‘నమ్మకమైన వాక్యాన్ని గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలి.’ (తీతు 1:7, 9) ‘క్రీస్తు బోధలకు కాకుండా, మనుషుల సంప్రదాయాలకూ ఈ లోకంలోని ప్రాథమిక విషయాలకూ అనుగుణంగా ఉన్న తత్త్వజ్ఞానానికి, మోసపూరితమైన వట్టి మాటలకు’ దూరంగా ఉండాలని తొలి క్రైస్తవులు ప్రోత్సహించబడ్డారు.—కొలొస్సయులు 2:8.
నేడు దాన్ని ఎవరు పాటిస్తున్నారు? 1965 లో తీసుకోబడి, కాటకిజమ్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్‌లో పేర్కొనబడిన ప్రకారం, వాటికన్‌కు చెందిన డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ ఆన్ డివైన్ రెవలేషన్ ఇలా చెప్తుంది: “వెల్లడిచేయబడిన వాటన్నిటి ఖచ్చితత్వం విషయంలో [క్యాథలిక్] చర్చి కేవలం పవిత్ర లేఖనాల మీదే ఆధారపడదు. కాబట్టి పవిత్ర సాంప్రదాయాలు, అలాగే పవిత్ర లేఖనాలు రెండిటినీ ఒకేలాంటి విశ్వసనీయతతో, పూజ్యభావంతో స్వీకరించాలి, గౌరవించాలి.” కెనడాలోని, టొరొంటోలో ఒక మత ప్రచారకురాలు ఇలా అడిగిందని మ్యాక్లీన్స్ పత్రిక ప్రచురించింది: ‘మనకు నిర్దేశం ఇవ్వడానికి రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మాటలు మనకెందుకు? ఇప్పుడు మనకే అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. వాటిని యేసుతో, లేఖనాలతో ముడిపెట్టడం వల్ల అవి అంతకంతకూ బలహీనమౌతున్నాయి.’
అయితే యెహోవాసాక్షుల గురించి, న్యూ క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “వాళ్లు తమ నమ్మకాలకు, ప్రవర్తనా నియమావళికి బైబిల్ని మాత్రమే ఆధారంగా చూస్తారు.” ఈమధ్య కెనడాలో ఒక యెహోవాసాక్షి తననుతాను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఒకతను కలగజేసుకొని, “మీరెవరో నాకు తెలుసు” అంటూ ఆమె దగ్గరున్న బైబిలు వైపు వేలు చూపించి, “ఇదే మీ గుర్తింపు చిహ్నం” అన్నాడు.