ప్రవచనం 6. ప్రపంచవ్యాప్త ప్రకటనా పని
ప్రవచనం 6. ప్రపంచవ్యాప్త ప్రకటనా పని
“ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది.”—మత్తయి 24:14.
● వయాటియా పసిఫిక్ సముద్రంలోని ఒక చిన్న ద్వీపంలో జీవిస్తుంది. అక్కడ జనాభా చాలా తక్కువ ఉంటుంది. కానీ యెహోవాసాక్షులు అక్కడికి కూడా వెళ్లి వయాటియాకు, ఆమె చుట్టుపక్కల వాళ్లకు ప్రకటించారు. ఎందుకు? ఎందుకంటే, ప్రజలు ఎంత మారుమూల ప్రాంతంలో జీవిస్తున్నా వాళ్లకు మంచివార్త ప్రకటించాలని యెహోవాసాక్షులు కోరుకుంటారు.
కొన్ని వాస్తవాలు: యెహోవాసాక్షులు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను భూమంతటా ప్రకటిస్తున్నారు. ఒక్క 2010లోనే, వాళ్లు 236 దేశాల్లో 160 కోట్ల కన్నా ఎక్కువ గంటలు ప్రకటనా పనికి వెచ్చించారు. అంటే, ఒక్కో యెహోవాసాక్షి ప్రతీరోజు సగటున 30 నిమిషాలు ప్రకటనా పనిలో గడిపారు. అంతేకాదు, పదేళ్ల వ్యవధిలో 2,000 కోట్ల బైబిలు ఆధారిత ప్రచురణలను తయారుచేసి, పంచిపెట్టారు.
కొంతమంది ఏమంటారు? కొన్ని వేల సంవత్సరాల పాటు చాలామంది బైబిలు సందేశాన్ని ప్రకటించారు.
అది నిజమేనా? బైబిలు సందేశాన్ని చాలామంది ప్రకటించారన్నది వాస్తవమే. అయితే, వాళ్లు కొంతకాలం పాటే, అలాగే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రకటించారు. కానీ యెహోవాసాక్షులు ఒక క్రమపద్ధతిలో కోట్లాది ప్రజలకు మంచివార్త ప్రకటిస్తున్నారు. కొన్ని శక్తివంతమైన, క్రూరమైన ప్రభుత్వాలు, సంస్థలు ప్రకటనా పనిని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించినా, యెహోవాసాక్షులు మాత్రం ప్రకటనా పనిని ఆపలేదు. (మార్కు 13:13) అంతేకాదు, ప్రకటిస్తున్నందుకు యెహోవాసాక్షులు డబ్బులు తీసుకోరు. వాళ్లు స్వచ్ఛందంగా తమ సమయాన్ని వెచ్చించి, ప్రచురణలను ఉచితంగా ఇస్తారు. వాళ్లు చేసే ప్రకటనా పనంతా స్వచ్ఛంద విరాళాల సహాయంతోనే జరుగుతోంది.
మీరేమంటారు? “రాజ్య సువార్త” భూమంతటా ప్రకటించబడుతోందా? బైబిలు ముందే చెప్పిన ఈ మాటలు నెరవేరుతున్నాయంటే, అతిత్వరలో మంచి రోజులు రాబోతున్నాయని దానర్థమా?
[9వ పేజీలోని బ్లర్బ్]
“యెహోవా అనుమతించిన వరకు దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలందరికీ దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ఉత్సాహంగా ప్రకటిస్తాం.”—2010 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం.