అధ్యాయం 10
ఒక కుటుంబ సభ్యుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు
1, 2. యోబు యథార్థతను త్రుంచేందుకు సాతాను విషాదాన్ని మరియు అనారోగ్యాన్ని ఎలా ఉపయోగించాడు?
ధన్యతగల కుటుంబ జీవితాన్ని అనుభవించిన వారిలో యోబు అనే మనుష్యున్ని తప్పకుండా లెక్కించాలి. “తూర్పు దిక్కు జనులందరిలో . . . గొప్పవాడు” అని బైబిలు ఆయనను పిలుస్తుంది. ఆయనకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మొత్తం పదిమంది పిల్లలున్నారు. తన కుటుంబానికి సమృద్ధిగా ఏర్పాటు చేసేందుకు ఆయనవద్ద తగినంత సంపత్తివుంది. అత్యంత ప్రాముఖ్యంగా, ఆత్మీయ కార్యకలాపాల్లో ఆయన ఆధిపత్యం వహించాడు, యెహోవా ఎదుట తన పిల్లల స్థానం విషయమై శ్రద్ధ కలిగివున్నాడు. ఇదంతా కూడా సన్నిహిత, ప్రేమపూర్వక కుటుంబ బంధాలను కలిగివుండేందుకు దోహదపడింది.—యోబు 1:1-5.
2 యోబు పరిస్థితి, యెహోవా దేవుని ప్రధాన శత్రువైన సాతాను అవధానాన్ని తప్పించుకోలేక పోయింది. దేవుని సేవకుల యథార్థతను త్రుంచేయడానికి తదేకంగా మార్గాలను వెదుకుతున్న సాతాను, యోబు ఆనందమయ కుటుంబాన్ని నాశనం చేయడం ద్వారా ఆయనపై దాడి చేశాడు. తర్వాత, సాతాను “అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.” యోబు యథార్థతను త్రుంచేందుకు విషాదాన్ని మరియు అనారోగ్యాన్ని ఉపయోగించాలని సాతాను నిరీక్షించాడు.—యోబు 2:6, 7.
3. యోబు అనారోగ్యం యొక్క రోగలక్షణాలు ఏమిటి?
3 యోబు అనారోగ్యాన్ని గూర్చిన వైద్యపరమైన వివరణను బైబిలు ఇవ్వడం లేదు. అయితే, అది మనకు రోగలక్షణాలను చెబుతుంది. ఆయన శరీరం పురుగులతో కప్పబడింది, ఆయన చర్మంపై బొబ్బలు ఏర్పడి, కుళ్లిపోయాయి. ఆయన ఉచ్ఛ్వాసనిశ్వాసలు కంపుతోను, శరీరం దుర్గంధభరితంగాను తయారయ్యాయి. ఆయన నొప్పితో మెలికలు తిరిగాడు. (యోబు 7:5; 19:17; 30:17, 30) బాధతో యోబు బూడిదలో కూర్చుని ఒక చిల్ల పెంకుతో తన ఒళ్లు గోక్కున్నాడు. (యోబు 2:8) నిజంగా ఎంతో దయనీయమైన దృశ్యం!
4. ప్రతి కుటుంబానికి అప్పుడప్పుడూ ఏ అనుభవాలు కలుగుతాయి?
4 మీకు అంత తీవ్రమైన వ్యాధి వస్తే మీరెలా ప్రతిస్పందించి ఉండేవారు? సాతాను యోబుకు చేసినట్లు నేడు దేవుని సేవకులను మొత్తడు. అయినా, మానవ అపరిపూర్ణత, అనుదిన జీవితంలోని ఒత్తిడులు, మనం జీవించే పర్యావరణం క్షీణించడం దృష్ట్యా, కుటుంబ సభ్యులు అప్పుడప్పుడూ అనారోగ్యులు అవుతారని అపేక్షించడం మామూలే. మనం ఎన్ని నివారణా చర్యలు తీసుకున్నప్పటికీ, మనందరం జబ్బుకు గురి కాగలం. అయితే, యోబు అనుభవించినంత మేరకు చాలా కొద్దిమంది మాత్రమే అనుభవించాల్సి రావచ్చు. అనారోగ్యం మన కుటుంబాన్ని పీడించినప్పుడు, అది నిజంగా ఒక సవాలు వలె ఉండగలదు. ప్రతిక్షణం మానవులకు విరుద్ధంగా ఉన్న ఈ శత్రువును ఎదుర్కోడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో మనం చూద్దాం.—ప్రసంగి 9:11; 2 తిమోతి 3:16, 17.
మీరు దాని గురించి ఎలా భావిస్తారు?
5. తాత్కాలిక అనారోగ్యం కలిగిన సందర్భాలలో కుటుంబ సభ్యులు సాధారణంగా ఎలా ప్రతిస్పందిస్తారు?
5 జీవితంలోని సాధారణ క్రమం భంగమౌతే, దానికిగల కారణం ఏదైనప్పటికీ అది ఎల్లప్పుడూ కష్టమే, మరి ఈ భంగం దీర్ఘకాల వ్యాధి వలన ఏర్పడితే అది ప్రాముఖ్యంగా వాస్తవం. స్వల్పకాల జబ్బు కొరకు కూడా సర్దుబాట్లు, సవరణలు, త్యాగాలు అవసరమౌతాయి. అనారోగ్యంగా ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు ఆరోగ్యంగావున్న కుటుంబ సభ్యులు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండాల్సి రావచ్చు. వారు కొన్ని కలాపాలను వదులుకోవలసి రావచ్చు. అయినప్పటికీ, అనేక కుటుంబాల్లో చిన్న పిల్లలు కూడా అనారోగ్యంగా ఉన్న తోబుట్టువు లేక తల్లి/తండ్రి ఎడల దయను చూపవచ్చు. అయితే అప్పుడప్పుడూ వారు ఆలోచించే వారిగా ఉండాలని వారికి గుర్తుచేయాల్సి ఉంటుంది. (కొలొస్సయులు 3:12) తాత్కాలిక అనారోగ్యం విషయంలో, ఏమి అవసరమో అది చేసేందుకు కుటుంబం సాధారణంగా సిద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా, కుటుంబ సభ్యులలోని ప్రతిఒక్కరూ తాను అస్వస్థతకు గురౌతే అదే విధమైన పరిగణ లభిస్తుందని నిరీక్షిస్తారు.—మత్తయి 7:12.
6. కుటుంబంలోని ఒక సభ్యుడు తీవ్రమైన, దీర్ఘకాల అనారోగ్యానికి గురైతే ఏ ప్రతిస్పందనలను కొన్నిసార్లు చూడవచ్చు?
6 అయితే అనారోగ్యం మరీ గంభీరమైనది మరి కలిగిన భంగములు తీవ్రమైనవి మరియు సుదీర్ఘమైనవైతే ఎలా? ఉదాహరణకు, కుటుంబంలోని ఒకరికి పక్షవాతం వస్తే, అల్జైమర్ వ్యాధి వలన వికలాంగులౌతే, లేక ఇతర అనారోగ్యం ద్వారా బలహీనమౌతే ఎలా? లేక కుటుంబ సభ్యుడు స్కిట్సొఫ్రెనియా వంటి మానసిక జబ్బుచేత పీడింపబడితే? సాధారణమైన మొదటి ప్రతిస్పందన జాలి, అంటే ఒక ప్రియమైన వ్యక్తి అంత బాధను అనుభవించాల్సి వస్తుందన్న దుఃఖం. అయితే, జాలి తర్వాత ఇతర ప్రతిస్పందనలు కలుగవచ్చు. ఒక వ్యక్తి యొక్క అనారోగ్యం మూలంగా తాము ఎంతో ప్రభావితం చెందుతున్నామని తమ స్వేచ్ఛకు హద్దులు వస్తున్నాయని కుటుంబ సభ్యులు గమనించే కొలది వారికి విముఖతా భావం కలుగవచ్చు. వారిలా అనుకోవచ్చు: “ఇది నాకే ఎందుకు జరగాలి?”
7. యోబు అనారోగ్యానికి ఆయన భార్య ఎలా ప్రతిస్పందించింది, ఆమె స్పష్టంగా ఏమి మర్చిపోయింది?
7 యోబు భార్యకు కూడా అలాగే అనిపించి ఉండవచ్చు. తన పిల్లలను ఆమె ఇదివరకే పోగొట్టుకుందని జ్ఞాపకం ఉంచుకోండి. ఆ సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరిగే కొలది ఆమె ఎక్కువ దుఃఖాన్ని అనుభవించిందనడంలో సందేహం లేదు. తుదకు, ఒకప్పుడు ఎంతో చురుకుగా, దృఢంగా ఉండిన తన భర్త ఒక బాధాకరమైన, అసహ్యమైన వ్యాధిని అనుభవించడం ఆమె చూస్తుండగా, అన్ని విషాదాల మరుగున ఉండిపోయిన ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని అంటే దేవునితో తనకు తన భర్తకుగల సంబంధాన్ని ఆమె మరచినట్లు అనిపిస్తుంది. బైబిలు ఇలా చెబుతుంది: “[యోబు] భార్య వచ్చి—నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.”—యోబు 2:9.
8. కుటుంబంలోని ఒక సభ్యుడు చాలా అనారోగ్యంగా ఉంటే, కుటుంబంలోని ఇతర సభ్యులు సరైన దృష్టికోణాన్ని కలిగి ఉండేందుకు ఏ లేఖనాలు సహాయపడతాయి?
8 వేరే ఇతరుల అనారోగ్యం వలన తమ జీవితం పూర్తిగా మారిపోతే, అనేకులు విసుగు చెందుతారు, కోపగించుకుంటారు కూడా. అయితే, పరిస్థితినిబట్టి తర్కించే క్రైస్తవుడు, తన ప్రేమ యొక్క యథార్థతను ప్రదర్శించేందుకు అది తనకు అవకాశాన్ని అందిస్తుందని చివరకు గుర్తించాలి. నిజమైన ప్రేమ “దీర్ఘకాలము సహించును, దయ చూపించును . . . [మరియు] స్వప్రయోజనమును విచారించుకొనదు . . . అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.” (1 కొరింథీయులు 13:4-7) కాబట్టి, ప్రతికూల భావాలు మనపై ఆధిపత్యం చేసేందుకు అనుమతించే బదులు, వాటిని అదుపులో ఉంచుకునేందుకు మనకు వీలైనదంతా చేయడం ప్రాముఖ్యం.—సామెతలు 3:21.
9. ఒక సభ్యుడు తీవ్ర అస్యస్థతకు గురైతే ఎటువంటి హామీలు ఆ కుటుంబానికి ఆత్మీయంగా మరియు భావోద్రేకంగా సహాయపడగలవు?
9 కుటుంబంలోని ఒక సభ్యుడు తీవ్రంగా అస్వస్థుడైతే కుటుంబం యొక్క ఆత్మీయ మరియు భావోద్రేక యోగక్షేమాన్ని కాపాడేందుకు ఏమి చేయడం అవసరం? ప్రతి అస్వస్థతకు తనదైన ప్రత్యేక శ్రద్ధ మరియు చికిత్స అవసరమౌతాయి, కాబట్టి ఈ ప్రచురణలో ఏదైనా వైద్య లేక గృహ వైద్య ప్రక్రియను సిఫారసు చేయడం సరైనదిగా ఉండదు. అయినప్పటికీ, ఆత్మీయ రీతిలో, యెహోవా “క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు.” (కీర్తన 145:14) రాజైన దావీదు ఇలా వ్రాశాడు: “బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును . . . రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును.” (కీర్తన 41:1-3) తన సేవకులు భావోద్రేకంగా తమ పరిధులకు మించి కష్టపెట్టబడినప్పటికీ యెహోవా వారిని ఆత్మీయంగా సజీవంగా ఉంచుతాడు. (2 కొరింథీయులు 4:7) ఎవరి కుటుంబంలో అయితే తీవ్రమైన అనారోగ్యాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారో, అలాంటి కుటుంబాలకు చెందిన సభ్యులు అనేకమంది, కీర్తనల గ్రంథకర్త ఈ మాటలను పునరుద్ఘాటిస్తున్నారు: “యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.”—కీర్తన 119:107.
స్వస్థతనిచ్చే స్ఫూర్తి
10, 11. (ఎ) ఒక కుటుంబం అనారోగ్యాన్ని విజయవంతంగా తాళుకోవాలంటే ఏది ఆవశ్యకం? (బి) తన భర్త అనారోగ్యాన్ని ఒక స్త్రీ ఎలా ఎదుర్కొన్నది?
10 “నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?” అని ఒక బైబిలు సామెత అంటోంది. (సామెతలు 18:14) ఉద్వేగం ఒక కుటుంబ స్ఫూర్తిని అలాగే ఒక “నరుని ఆత్మ”ను బాధించగలదు. అయిననూ “ప్రశాంతమైన మనస్సు శరీరమునకు జీవము.” (సామెతలు 14:30, NW) ఒక కుటుంబం తీవ్రమైన అనారోగ్యాన్ని విజయవంతంగా తాళుకుంటుందా లేదా అనేది చాలా మేరకు దాని సభ్యుల దృక్పథం లేక స్ఫూర్తిపై ఆధారపడి ఉంటుంది.—సామెతలు 17:22 పోల్చండి.
11 ఒక క్రైస్తవ స్త్రీ, తమ వివాహమైన కేవలం ఆరు సంవత్సరాలకే తన భర్త గుండెపోటు మూలంగా వైకల్యం పొందడాన్ని భరించాల్సి వచ్చింది. “నా భర్త మాట్లాడే సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నది, ఆయనతో సంభాషించడం దాదాపు అసాధ్యమయ్యింది. ఆయన చెప్పేందుకు ప్రయాసపడుతున్న విషయాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం వలన కలిగే మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉండేది” అని ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ భర్త అనుభవించి ఉండిన దుఃఖాన్ని మరియు రిక్తతను కూడా ఊహించండి. ఆ భార్యాభర్తలు ఏమి చేశారు? వారు క్రైస్తవ సంఘానికి చాలా దూరంలో జీవిస్తున్నప్పటికీ, సంస్థకు చెందిన ఇటీవలి సమాచారాన్నంతా తెలుసుకుని ఉండటం ద్వారా అలాగే కావలికోట మరియు తేజరిల్లు! ద్వారా లభించే ఆత్మీయ ఆహారం యొక్క ఎడతెగని సరఫరా ద్వారా ఆత్మీయంగా దృఢంగా ఉండేందుకు ఆమె తనకు వీలైనదంతా చేసింది. నాల్గు సంవత్సరాల తర్వాత ఆమె భర్త మరణించేంత వరకూ ఆమె తన ప్రియమైన భర్త ఎడల శ్రద్ధ వహించేందుకు ఇది సహాయం చేసింది.
12. యోబు విషయంలో చూసినట్లు, అస్వస్థుడైన వ్యక్తి కొన్నిసార్లు ఏ విషయాన్ని అందించవచ్చు?
12 యోబు విషయంలో ఆయనే అంటే బాధను అనుభవిస్తున్న తనే దృఢంగా ఉన్నాడు. “మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా” అని ఆయన తన భార్యను అడిగాడు. (యోబు 2:10) గనుక శిష్యుడైన యాకోబు, సహనము మరియు ఓరిమికి గణనీయమైన మాదిరిగా యోబును ఉదహరించడంలో ఏ ఆశ్చర్యమూ లేదు! యాకోబు 5:11, NWనందు మనమిలా చదువుతాం: “మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి మరియు యెహోవా అనుగ్రహించిన ప్రతిఫలమును చూచితిరి, ఆలాగుననే యెహోవా జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.” అదే విధంగా నేడు, అనేక సందర్భాల్లో రోగియైన కుటుంబ సభ్యుని ధైర్యవంతమైన దృక్పథం, కుటుంబంలోని ఇతరులు అనుకూలమైన దృక్పథాన్ని కలిగివుండేందుకు సహాయం చేసింది.
13. తీవ్రమైన అనారోగ్యాన్ని అనుభవిస్తున్న కుటుంబం ఏ విధంగా పోల్చుకోకూడదు?
13 కుటుంబ సభ్యులు మొదట్లో వాస్తవాలను ఎదుర్కొనడం కష్టతరంగా ఉండటం అసాధారణమేమీ కాదని, కుటుంబంలో అనారోగ్యాన్ని ఎదుర్కొన్న అనేకులు అంగీకరిస్తారు. వారు పరిస్థితిని ఎలా దృష్టిస్తారనేది కూడా అత్యంత ప్రాముఖ్యమని వారు సూచిస్తున్నారు. గృహ కార్యనిర్వహణలో మార్పులు మరియు సవరణలు మొదట్లో కష్టంగా ఉండవచ్చు. అయితే ఒక వ్యక్తి వాస్తవంగా ప్రయత్నిస్తే, అతను క్రొత్త పరిస్థితికి అలవాటుపడగలడు. అలా అలవాటుపడేటప్పుడు, తమ కుటుంబంలో అనారోగ్యులు లేని వారితో మన పరిస్థితులను పోల్చుకుని, వారి జీవితం సులభంగా ఉంది మరి ‘ఇది న్యాయంకాదు’ అని భావించకుండా ఉండటం ప్రాముఖ్యం! వాస్తవానికి, ఇతరులు ఏ భారాలను భరిస్తున్నారో ఎవరికీ తెలియదు. క్రైస్తవులు అందరూ యేసు యొక్క ఈ మాటల్లో ఆదరణను పొందుతారు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”—మత్తయి 11:28.
ప్రధాన విషయాలను ఎంపిక చేసుకోవడం
14. ప్రధానమైన వాటిని సరైన రీతిలో ఎలా ఏర్పర్చుకోవచ్చు?
14 తీవ్రమైన అనారోగ్యం ఉన్న పరిస్థితుల్లో, ప్రేరేపిత మాటలను జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా ఒక కుటుంబం ప్రయోజనం పొందగలదు: “ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.” (సామెతలు 15:22) కుటుంబ సభ్యులు కూడుకుని, అనారోగ్యం కలిగించిన పరిస్థితిని గూర్చి చర్చించుకోగలరా? అలా ప్రార్థనాపూర్వకంగా చేయడం మరియు నడిపింపు కొరకు దేవుని వాక్యం వైపు తిరగడం సరైనదిగా ఉంటుంది. (కీర్తన 25:4) అలాంటి చర్చలో దేనిని పరిగణించాల్సి ఉంటుంది? వైద్యపరమైన, ఆర్థిక మరియు కుటుంబ నిర్ణయాలను తీసుకోవాలి. ప్రాథమికంగా ఎవరు శ్రద్ధవహిస్తారు? ఆ శ్రద్ధకు మద్దతు ఇచ్చేందుకు కుటుంబం ఏమి చేయగలదు? చేయబడిన ఏర్పాట్లు కుటుంబంలోని ప్రతి సభ్యుడిని ఎలా ప్రభావితం చేస్తాయి? ప్రాథమికంగా శ్రద్ధవహించే వారి ఆత్మీయ మరియు ఇతర అవసరతల ఎడల ఎలా శ్రద్ధ వహించవచ్చు?
15. తీవ్రమైన అనారోగ్యానికి గురైన కుటుంబాలకు యెహోవా ఏ మద్దతును అందిస్తున్నాడు?
15 యెహోవా నడిపింపు కొరకు తీవ్రంగా ప్రార్థించడం, ఆయన వాక్యాన్ని గురించి ధ్యానించడం మరియు బైబిలు సూచిస్తున్న మార్గాన్ని ధైర్యంగా అనుసరించడం తరచూ మనం అపేక్షించిన దానికంటే ఎక్కువ దీవెనలను తెస్తుంది. అస్వస్థతతో ఉన్న కుటుంబ సభ్యుని వ్యాధి ప్రతిసారీ తాత్కాలికంగా మెరుగుపడకపోవచ్చు. అయితే ఎల్లప్పుడు యెహోవాపై ఆధారపడటం ఏ పరిస్థితిలోనైనా మన మంచికే దారితీస్తుంది. (కీర్తన 55:22) కీర్తనల గ్రంథకర్త ఇలా వ్రాశాడు: “యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.”—కీర్తన 94:18, 19; కీర్తన 63:6-8 కూడా చూడండి.
పిల్లలకు సహాయం చేయడం
16, 17. తోబుట్టువు యొక్క అనారోగ్యాన్ని గురించి చిన్న పిల్లలతో చర్చించేటప్పుడు ఏ అంశాలను చెప్పవచ్చు?
16 తీవ్రమైన అనారోగ్యం కుటుంబంలోని పిల్లలకు సమస్యలను కలుగజేయగలదు. తలెత్తిన అవసరతలను మరియు సహాయం చేసేందుకు వారేమి చేయగలరో దాన్ని అర్థం చేసుకునేందుకు తలిదండ్రులు పిల్లలకు సహాయపడటం ప్రాముఖ్యం. జబ్బు చేసినది పిల్లవానికైతే, అనారోగ్యంగా ఉన్న వానికి ఇవ్వబడుతున్న అదనపు అవధానం మరియు శ్రద్ధ యొక్క భావం ఇతర పిల్లలను తక్కువ ప్రేమిస్తున్నారని కాదని తోబుట్టువులు అర్థం చేసుకునేందుకు సహాయపడాలి. విముఖత లేక విరోధం పెరిగేందుకు అనుమతించే బదులు, అనారోగ్యం వలన ఏర్పడిన పరిస్థితితో వ్యవహరించేందుకు వారు సహకరిస్తుండగా ఇతర పిల్లలు ఒకరి ఎడల ఒకరు సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకోడానికి మరియు యథార్థమైన అనురాగాన్ని పెంచుకోడానికి తలిదండ్రులు సహాయపడవచ్చు.
17 చిన్న పిల్లలు, వైద్య పరిస్థితులను గురించిన సుదీర్ఘ లేక సంక్లిష్ట వివరణలకు బదులు ప్రేమ చూపించమని తలిదండ్రులు కోరితేనే ఎక్కువ త్వరగా ప్రతిస్పందిస్తారు. కాబట్టి, అనారోగ్యంగా ఉన్న కుటుంబ సభ్యునికి ఏమి సంభవిస్తుందో దాన్ని గురించి వారికి కొంత తెలియజేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు మామూలుగా లేక సులభంగా చేయగల అనేక పనులను అనారోగ్యంగా ఉన్న పిల్లలు చేయడం ఎందుకు సాధ్యం కాదో వారు అర్థం చేసుకోడానికి వీలు కలిగిస్తే, వారు ఎక్కువ ‘సహోదర ప్రేమను’ మరియు ‘సున్నితమైన దయను’ కలిగి ఉండే అవకాశం ఉంది.—1 పేతురు 3:8.
18. అనారోగ్యం తెచ్చిపెట్టిన సమస్యలను అర్థం చేసుకోడానికి పెద్ద పిల్లలకు ఎలా సహాయపడవచ్చు, అది వారికి ఎలా ప్రయోజనకరంగా ఉండగలదు?
18 కష్టతరమైన పరిస్థితి ఉందని మరి దాని గురించి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కొంత త్యాగం చేయాల్సి ఉందని పెద్ద పిల్లలు అర్థం చేసుకోడానికి వారికి సహాయపడాలి. వైద్యుని ఫీజు మరియు వైద్య ఖర్చులు చెల్లించగా, తలిదండ్రులు ఇతర పిల్లలకు తాము అనుకున్నంత మేరకు అన్నీ అందించడం సాధ్యం కాకపోవచ్చు. పిల్లలు అందుకు విసుగు చెంది తమకు ఏదో లభించడం లేదని భావిస్తారా? లేక వారు పరిస్థితిని అర్థం చేసుకుని అవసరమైన త్యాగాలను చేసేందుకు సుముఖంగా ఉంటారా? విషయాన్ని ఎలా చర్చిస్తారు మరియు కుటుంబంలో ఎలాంటి స్ఫూర్తి వ్యాపించి ఉంది అనే దానిపై అది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి, అనేక కుటుంబాల్లో కుటుంబ సభ్యుని అనారోగ్యం, పిల్లలు పౌలు ఇచ్చిన ఈ సలహాను అనుసరించేలా వారికి తర్ఫీదునిచ్చేందుకు సహాయపడింది: “కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”—ఫిలిప్పీయులు 2:3, 4.
వైద్య చికిత్సనెలా దృష్టించాలి
19, 20. (ఎ) కుటుంబ సభ్యుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు కుటుంబ యజమానులు ఏ బాధ్యతను వహించాల్సి ఉంటుంది? (బి) బైబిలు వైద్య పాఠ్యపుస్తకం కాకపోయినప్పటికీ, అనారోగ్యంతో వ్యవహరించడంలో నడిపింపును ఏ విధంగా అందిస్తుంది?
19 వైద్య చికిత్స దేవుని చట్టానికి విరుద్ధంగా వెళ్లనంత మేరకు సమతూకంగల క్రైస్తవులు దాన్ని ఆక్షేపించరు. తమ కుటుంబంలోని ఒక సభ్యుడు అస్వస్థుడైతే, బాధితుని కష్టాన్ని తొలగించేందుకు వారు సహాయాన్ని వెదకుతారు. అయిననూ, పరిగణలోకి తీసుకోవలసిన, విభిన్నమైన వృత్తిపర అభిప్రాయాలు ఉండవచ్చు. దానికి తోడు, ఇటీవలి సంవత్సరాలలో క్రొత్త వ్యాధులు మరియు రుగ్మతలు తలెత్తాయి, వాటిలో అనేకానికి ఒక సాధారణమైన అంగీకృత చికిత్సా విధానమంటూ ఏమీ లేదు. కచ్చితమైన వ్యాధి నిర్ధారణను పొందడం కూడా కొన్నిసార్లు కష్టం కావచ్చు. అప్పుడు ఒక క్రైస్తవుడు ఏమి చేయాలి?
20 ఒక బైబిలు రచయిత వైద్యుడు అయినప్పటికీ, అపొస్తలుడైన పౌలు తన స్నేహితుడైన తిమోతికి సహాయకరమైన వైద్య సలహాను అందించినప్పటికీ, లేఖనాలు నైతిక మరియు ఆత్మీయ నడిపింపునిస్తాయి, అంతేగాని బైబిలు ఒక వైద్య పాఠ్యపుస్తకం కాదు. (కొలొస్సయులు 4:14; 1 తిమోతి 5:23) కాబట్టి, వైద్య చికిత్స విషయాల్లో, క్రైస్తవ కుటుంబ యజమానులు తమ స్వంత సహేతుకమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. బహుశా వారు ఒకటి కంటే ఎక్కువ వృత్తిపరమైన అభిప్రాయాలను పొందడం అవసరమని భావించవచ్చు. (సామెతలు 18:17 పోల్చండి.) రోగియైన తమ కుటుంబ సభ్యునికి లభ్యమయ్యే అతి శ్రేష్ఠమైన సహాయం వారికి కావాలి, మరి అత్యధికులు దీన్ని సాధారణ వైద్యులనుండే పొందాలనుకుంటారు. ప్రత్యామ్నాయ ఆరోగ్య చికిత్సా విధానమంటే కొందరికి నమ్మకం ఉండవచ్చు. అది కూడా వ్యక్తిగత నిర్ణయమే. అయినప్పటికీ, ఆరోగ్య సమస్యలతో వ్యవహరించేటప్పుడు, ‘దేవుని వాక్యం తమ పాదములకు దీపంగా తమ త్రోవకు వెలుగుగా’ ఉంచుకోవడాన్ని క్రైస్తవులు మానుకోరు. (కీర్తన 119:105) బైబిలులో ఇవ్వబడిన నడిపింపు సూత్రాలను అనుసరించడంలో వారు కొనసాగుతారు. (యెషయా 55:8, 9) అలా, అభిచార సంబంధమైన వైద్య నిపుణతలను వారు త్యజిస్తారు మరియు బైబిలు సూత్రాలను ఉల్లంఘించే చికిత్సలను వారు నివారిస్తారు.—కీర్తన 36:9; అపొస్తలుల కార్యములు 15:28, 29; ప్రకటన 21:8.
21, 22. ఒక బైబిలు సూత్రంపై ఆసియానందలి ఒక స్త్రీ ఎలా తర్కించింది, ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె విషయంలో సరైనదిగా ఎలా నిరూపించబడింది?
21 ఆసియాలోని ఒక యౌవన స్త్రీ ఉదాహరణను గమనించండి. యెహోవాసాక్షులతో బైబిలును పఠించడం మూలంగా బైబిలు గురించి కొంత నేర్చుకోవడం ప్రారంభించిన కొద్ది కాలానికి, ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప ఎదగక మునుపే జన్మించింది గనుక ఆ బిడ్డ కేవలం మూడున్నర పౌండ్ల బరువే ఉంది. ఆ పాప తీవ్రమైన అంగవికలత కలిగివుంటుందని ఆ బిడ్డ ఎన్నటికీ నడువలేదని వైద్యుడు ఆమెకు చెప్పినప్పుడు ఆ స్త్రీ గుండె పగిలిపోయింది. ఆ పాపను ఏదైనా ఆశ్రమానికి ఇచ్చేయమని అతను ఆమెకు సలహానిచ్చాడు. ఆమె భర్త ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయాడు. ఆమె ఎవరి నడిపింపు కోరాలి?
22 ఆమె ఇలా చెబుతుంది: “‘కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే’ అని నేను బైబిలులో చదవడం నాకు జ్ఞాపకముంది.” (కీర్తన 127:3) ఆమె ఈ ‘స్వాస్థ్యమును’ ఇంటికి తీసుకెళ్లి ఆ పాప ఎడల శ్రద్ధవహించాలని నిర్ణయించుకుంది. మొదట్లో పరిస్థితి కష్టతరంగా ఉండేది, అయితే యెహోవాసాక్షుల ప్రాంతీయ సంఘంలోని క్రైస్తవ స్నేహితుల సహాయంతో ఆ స్త్రీ విషయాలను చక్కదిద్దుకుని అవసరమైన ప్రత్యేక మద్దతుతో తన పాపను పెంచగల్గింది. పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ పాప రాజ్య మందిరంలోని కూటాలకు వెళ్తుంది మరియు అక్కడున్న యౌవనులతో పాటు ఆనందిస్తుంది. ఆ తల్లి ఇలా వ్యాఖ్యానిస్తుంది: “సరైనది చేసేందుకు బైబిలు సూత్రాలు నన్ను పురికొల్పినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. సరైన మనస్సాక్షిని కలిగివుండేందుకు, నా మిగిలిన జీవితం అంతా నాతోపాటు ఉండిపోయే దుఃఖాన్ని తెచ్చుకోకుండా బైబిలు నాకు సహాయం చేసింది.”
23. అనారోగ్యులకు, వారి ఎడల శ్రద్ధవహించే వారికి బైబిలు ఏ ఆదరణనిస్తుంది?
23 అనారోగ్యం మనతో ఎల్లకాలం ఉండదు. ‘నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనని’ ఒక కాలాన్ని ప్రవక్త అయిన యెషయా ముందే సూచించాడు. (యెషయా 33:24) ఆ వాగ్దానం త్వరలో రాబోతున్న నూతన విధానంలో నెరవేర్చబడుతుంది. అయితే, అప్పటి వరకు అనారోగ్యం మరియు మరణం మనతోపాటు ఉంటాయి. సంతోషకరంగా, దేవుని వాక్యం మనకు నడిపింపును మరియు సహాయాన్ని అందిస్తుంది. బైబిలు అందించే మూల ప్రవర్తనా నియమాలు నిత్యం నిలుస్తాయి అవి ఎప్పుడూ మారుతూ ఉండే అపరిపూర్ణ మానవ అభిప్రాయాలన్నిటికంటే ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి, జ్ఞానియైన వ్యక్తి ఇలా వ్రాసిన కీర్తనల గ్రంథకర్తతో ఏకీభవిస్తాడు: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. . . . యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. . . . వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.”—కీర్తన 19:7, 9, 11.