కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 9

తల్లి లేక తండ్రి మాత్రమేగల కుటుంబాలు విజయవంతం కాగలవు!

తల్లి లేక తండ్రి మాత్రమేగల కుటుంబాలు విజయవంతం కాగలవు!

1-3. ఒంటరి తల్లి/తండ్రిగల కుటుంబాల సంఖ్య పెరిగేందుకు ఏది కారణమైంది, అందులో ఇమిడివున్న వారు ఎలా ప్రభావితం చెందుతారు?

 తండ్రి లేక తల్లి మాత్రమేగల కుటుంబాలు, అమెరికాలో “అతి త్వరగా పెరుగుతున్న కుటుంబ విధానంగా” పిలువబడుతున్నాయి. అనేక ఇతర దేశాల్లోని పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. విడాకులు, వదిలేయడం, విడిపోవడం మరియు అక్రమ సంతానం రికార్డు స్థాయిలో పెరిగిపోవడం లక్షలాదిమంది తలిదండ్రులు మరియు పిల్లలపై తీవ్ర పరిణామాలను కలిగివున్నాయి.

2 “నేను 28 సంవత్సరాల విధవరాలిని, నాకు ఇద్దరు పిల్లలున్నారు. నేను నా పిల్లలను తండ్రి లేకుండా పెంచాలని ఇష్టపడటం లేదు గనుక నేనెంతో కృంగిపోయి ఉన్నాను. నా గురించి ఎవరికీ ఏ పట్టింపూ లేదన్నట్టు అనిపిస్తుంది. నేను తరచూ ఏడ్వడాన్ని నా పిల్లలు చూస్తారు, అది వాళ్లను ప్రభావితం చేస్తుంది” అని ఒక ఒంటరి తల్లి వ్రాసింది. కోపం, దోషినన్న భావన, ఒంటరితనం వంటి భావాలతో పోరాడటంతోపాటు, అత్యధికులైన ఒంటరి తలిదండ్రులు ఉద్యోగం చేసి ఇంట్లోని పనులను చేయవలసిన సవాలును ఎదుర్కొంటారు. ఒకరు ఇలా అన్నారు: “ఒంటరి తల్లి/తండ్రిగా ఉండటం, బంతులు ఎగురవేస్తూ ఏదీ పడకుండా లాఘవంగా పట్టుకునే వాడిలా ఉంటుంది. ఆరు నెలల అభ్యాసం తర్వాత, మీరు తుదకు నాలుగు బంతులు ఎగురవేస్తూ పట్టుకోవడంలో సమర్థులౌతారు. అయితే మీరు దాన్ని చేసేందుకు సమర్థులైన అనతికాలంలోనే, ఎవరో మీ వైపుకు మరో క్రొత్త బంతిని విసురుతారు!”

3 తల్లి లేక తండ్రి మాత్రమేగల కుటుంబాలలోని యౌవనస్థులకు తరచూ తమవైన స్వంత పోరాటాలు ఉంటాయి. తమ తలిదండ్రులలో ఒకరు హఠాత్తుగా విడిచివెళ్లడం లేక మరణించడంతో వారు తీవ్రమైన భావోద్రేకాలను ఎదుర్కొనవలసి రావచ్చు. తలిదండ్రులలో ఒకరు లేకపోవడం అనేకమంది యౌవనులపై నిర్దిష్టంగా ప్రతికూల ప్రభావాన్ని కలిగివున్నట్లు అనిపిస్తుంది.

4. ఒంటరి తల్లి/తండ్రిగల కుటుంబాల ఎడల యెహోవాకు శ్రద్ధవుందని మనకెలా తెలుసు?

4 బైబిలు కాలాల్లో తండ్రి లేక తల్లి మాత్రమేగల కుటుంబాలు ఉనికిలో ఉన్నాయి. ‘తండ్రిలేని వారిని’ మరియు “విధవరాండ్ర”ను గురించి లేఖనాలు పదే పదే ప్రస్తావిస్తున్నాయి. (నిర్గమకాండము 22:22; ద్వితీయోపదేశకాండము 24:19-21; యోబు 31:16-22) వారి వ్యధ ఎడల యెహోవా దేవునికి ఉదాసీనత లేదు. “తండ్రి లేని వారికి తండ్రి . . . విధవరాండ్రకు న్యాయకర్త” అని కీర్తనల గ్రంథకర్త దేవున్ని పిలిచాడు. (కీర్తన 68:5) నేడు తండ్రి లేక తల్లి మాత్రమేగల కుటుంబాల ఎడల యెహోవాకు అదే శ్రద్ధ కచ్చితంగా ఉంది! వాస్తవానికి, వారు విజయవంతులయ్యేందుకు సహాయపడగల సూత్రాలను ఆయన వాక్యం అందిస్తోంది.

ఇంటిపనిని చేయడంలో సిద్ధహస్తులవ్వడం

5. ఒంటరి తల్లి/తండ్రి మొదట ఏ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది?

5 గృహసంబంధమైన పనులను చూసుకునే విషయం గురించి ఆలోచించండి. “అనేక సందర్భాలలో, ఉదాహరణకు మీ కారులో మోటరు సంబంధ సమస్యలు మొదలై, అవి ఎందుకు వస్తున్నాయో మీకు తెలియనప్పుడు మీకు తోడుగా భర్త ఉంటే బాగుండేదని మీరు భావిస్తారని” విడాకులు తీసుకున్న ఒక స్త్రీ చెబుతుంది. అదే విధంగా, ఇటీవలనే విడాకులు తీసుకున్న లేక మరణమందు భార్యను కోల్పోయిన పురుషులు కూడా, ఇంట్లో వారు చేయవలసిన అనేక పనులను చూసి భయభీతి చెందవచ్చు. ఇంట్లో గందరగోళం పిల్లల అస్థిరత మరియు అభద్రతా భావాలను మరింత అధికం చేస్తుంది.

పిల్లలారా, మీ ఒంటరి తల్లి/తండ్రితో సహకరించండి

6, 7. (ఎ) సామెతలలోని “గుణవతియైన భార్య” ఏ చక్కని మాదిరిని ఉంచింది? (బి) ఇంట్లోని బాధ్యతల విషయంలో శ్రద్ధకలిగి ఉండటం, ఒంటరి తల్లి/తండ్రిగల గృహాల్లో ఎలా సహాయపడుతుంది?

6 ఏది సహాయం చేయగలదు? సామెతలు 31:10-31 నందు వర్ణింపబడిన “గుణవతియైన భార్య” ఉంచిన మాదిరిని గమనించండి. ఆమె నెరవేర్చే పనుల పట్టిక చాలా గణనీయంగా ఉంది. క్రయవిక్రయాలు, కుట్టుపని, వంట చేయడం, ఆస్తి కొనడం, పొలంపని చేయడం మరియు వ్యాపారాన్ని నడపడం వంటివి అందులో ఉన్నాయి. ఆమె రహస్యం ఏమిటి? ఆమె పరిశ్రమించేది, అలా తన పనులు చేసుకునేందుకు ఆమె చాలా రాత్రి వరకూ మెలుకువతో ఉండి, తెల్లవారుతుండగానే నిద్ర లేచేది. ఆమె కొన్ని పనులను ఇతరులకు అప్పగిస్తూ మిగతా వాటిని చేసేందుకు తన చేతులను ఉపయోగిస్తూ ఆమె పనిని చక్కగా సంస్థీకరించుకుంది. అందువల్ల, ఆమె పొగడ్తలను అందుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు!

7 మీరు ఒంటరి తల్లి/తండ్రి అయితే, ఇంట్లో మీకున్న బాధ్యతల విషయంలో కర్తవ్య నిష్ఠగల వారిగా ఉండండి. అలాంటి పనిలో సంతృప్తిని కనుగొనండి ఎందుకంటే అది మీ పిల్లలకు సంతోషాన్నివ్వడంలో ఎంతో దోహదపడుతుంది. అయితే సరైన రీతిలో పథకం వేసుకోవడం మరియు సంస్థీకరించుకోవడం ఆవశ్యకం. బైబిలు ఇలా చెబుతుంది: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు.” (సామెతలు 21:5) ఒక ఒంటరి తండ్రి ఇలా ఒప్పుకున్నాడు: “నాకు ఆకలేసేంత వరకూ నేను భోజనాన్ని గురించి ఆలోచించకుండా ఉంటాను.” అయితే త్వరత్వరగా సిద్ధం చేసిన వాటికంటే ముందే పథకం వేసుకుని వండే వంట పోషణనిచ్చేదిగా, రుచికరంగా ఉంటుంది. మీరు మీ చేతులను సరిక్రొత్త రీతుల్లో ఉపయోగించడాన్ని నేర్చుకోవలసి ఉండవచ్చు. తెలివైన స్నేహితులను, ఎలా-చేయాలో తెల్పే పుస్తకాలను, సహాయకరమైన వృత్తిపని వారిని అడిగి తెలుసుకోవడం ద్వారా, కొందరు ఒంటరి తల్లులు పెయింట్‌ వేసే పని, ప్లమింగ్‌ పని మరియు చిన్న చిన్న వాహన మరమ్మత్తు పనులను చేయగలిగారు.

8. ఒంటరి తల్లి/తండ్రిగల పిల్లలు ఇంట్లో ఎలా సహాయపడగలరు?

8 సహాయం చేయమని పిల్లలను అడగడం సబబుగా ఉంటుందా? ఒక ఒంటరి తల్లి ఇలా తర్కించింది: “పిల్లలకు జీవితాన్ని సులభతరం చేయడం ద్వారా మీరు వారి తండ్రిలేని కొరతను తీర్చాలని అనుకుంటారు.” దాన్ని అర్థం చేసుకోవచ్చు అయితే అది ప్రతిసారి పిల్లలకు క్షేమకరంగా ఉండకపోవచ్చు. బైబిలు కాలాల్లోవుండిన, దైవభయంగల యౌవనులకు సరైన పనులు కొన్ని అప్పగింపబడేవి. (ఆదికాండము 37:2; పరమగీతము 1:6) మీ పిల్లలకు మరీ భారంగా ఉండేలా చేయకుండా జాగ్రతపడుతూ, అంట్లు తోమడం, తమ గదిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి పనులను వారికి అప్పగిస్తే మీరు జ్ఞానవంతంగా ప్రవర్తించిన వారౌతారు. ఇంటి పనులను కొన్నింటిని కలిసి ఎందుకు చేయకూడదు? ఇది ఎంతో ఆనందకరంగా ఉండగలదు.

జీవనోపాధి సంపాదించడమనే సవాలు

9. ఒంటరి తల్లులు తరచూ ఆర్థిక కష్టాలను ఎందుకు ఎదుర్కొంటారు?

9 తమ ఆర్థిక అవసరతలను తీర్చుకోవడం చాలామంది ఒంటరి తల్లి/తండ్రులకు కష్టంగా ఉంటుంది, ప్రాముఖ్యంగా యౌవనులైన అవివాహిత తల్లులకు ఎంతో కష్టతరమైన సమయం అది. a ప్రజా సంక్షేమ ఏర్పాట్లు అందుబాటులో ఉన్న దేశాల్లో, వారు దాన్ని ఉపయోగించుకోవడం జ్ఞానవంతమే, కనీసం వారు ఉద్యోగాన్ని సంపాదించుకునేంత వరకైనా అలా చేయవచ్చు. క్రైస్తవులు అవసరమైనప్పుడు అలాంటి సదుపాయాలను వినియోగించుకోవడాన్ని బైబిలు అనుమతిస్తుంది. (రోమీయులు 13:1, 6) విధవరాండ్రు మరియు విడాకులు తీసుకున్న వారు ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటారు. అనేక సంవత్సరాలు గృహంలోనేవున్న తర్వాత అనేకులు మళ్లీ ఉద్యోగాలు చేయవలసి వచ్చినప్పుడు, తరచూ చాలా తక్కువ జీతం వచ్చే ఉద్యోగాలనే కనుగొన్నారు. ఉద్యోగ-తర్ఫీదు కార్యక్రమాలు లేక కొంత కాలం పాఠశాల కోర్సులను చేపట్టడం ద్వారా కొందరు తమ పరిస్థితిని మెరుగుపర్చుకోగలరు.

10. తాను లోకరీత్యా ఉద్యోగాన్ని ఎందుకు చేయాలో ఒక ఒంటరి తల్లి తన పిల్లలకు ఎలా వివరించగలదు?

10 మీరు ఉద్యోగాన్ని వెదకినప్పుడు మీ పిల్లలు అసంతోషంగా ఉంటే ఆశ్చర్యపడకండి, దోషినని కూడా భావించకండి. బదులుగా, మీరు ఎందుకు పని చేయాలో వారికి వివరించండి, మీరు వారికొరకు సంరక్షణను ఏర్పాటు చేయాలని యెహోవా అపేక్షిస్తున్నాడని వారు అర్థం చేసుకునేందుకు వారికి సహాయపడండి. (1 తిమోతి 5:8) తగిన కాలానికి, చాలామంది పిల్లలు సర్దుకుపోతారు. అయితే, మీ బిజీ పట్టిక అనుమతించే కొలది వారితో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. అలాంటి ప్రేమపూర్వక అవధానం, కుటుంబం అనుభవించే ఎలాంటి ఆర్థిక పరిమితులవలన వచ్చే ప్రభావాన్నైనా తగ్గించేందుకు కూడా సహాయపడగలదు.—సామెతలు 15:16, 17.

ఎవరి ఎడల ఎవరు శ్రద్ధవహిస్తున్నారు?

“విధవరాండ్ర”ను మరియు ‘తండ్రి లేని వారిని’ సంఘం అలక్ష్యం చేయదు

11, 12. ఒంటరి తల్లి/తండ్రి ఏ హద్దులను కాపాడుకోవాలి, వారు దాన్నెలా చేయగలరు?

11 ఒంటరి తల్లి/తండ్రి తమ పిల్లలతో ప్రాముఖ్యంగా సన్నిహితంగా ఉండటం సహజమే, అయినప్పటికీ తలిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉండే, దేవుడు నియమించిన హద్దులను ఛేదించకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, తన కుమారుడు ఇంటి యజమాని బాధ్యతను చేపట్టాలని ఒకవేళ ఒక ఒంటరి తల్లి అపేక్షిస్తే లేక తన కుమార్తెను ఒక ఆంతరంగిక స్నేహితురాలివలె వ్యవహరించి, ఆ అమ్మాయికి తన వ్యక్తిగత సమస్యలను చెప్పి భారాన్ని కలిగిస్తే గంభీరమైన కష్టాలు తలెత్తవచ్చు. అలా చేయడం సరైనది కాదు, వారికి ఒత్తిడిని తెస్తుంది మరియు బహుశా పిల్లలకు గందరగోళాన్ని కలిగించవచ్చు.

12 తల్లి/తండ్రిగా పిల్లల ఎడల సంరక్షణ చూపాల్సింది తామని, సంరక్షణాపని పిల్లలది కాదని వారికి హామీ ఇవ్వండి. (2 కొరింథీయులు 12:14 పోల్చండి.) కొన్నిసార్లు, మీకు కొన్ని సలహాలు లేక మద్దతు అవసరం కావచ్చు. క్రైస్తవ పెద్దలనుండి లేక బహుశా పరిపక్వత చెందిన క్రైస్తవ స్త్రీలనుండి వాటిని కోరండి, కానీ మీ చిన్న పిల్లలనుండి కాదు.—తీతు 2:3.

క్రమశిక్షణను నియంత్రించండి

13. క్రమశిక్షణ విషయంలో ఒక ఒంటరి తల్లి ఎలా సమస్యను ఎదుర్కోవచ్చు?

13 క్రమశిక్షణనిచ్చే వానిగా పురుషుని పరిగణించడం అంత కష్టంగా ఉండకపోవచ్చు, అయితే ఈ విషయంలో ఒక స్త్రీకి సమస్యలు ఉండవచ్చు. ఒక ఒంటరి తల్లి ఇలా చెబుతుంది: “నా కుమారులు ఎదిగిన మగవారిలా ఉంటారు, వారి స్వరాలు గంభీరంగా ఉంటాయి. ఆ పోలికనుబట్టి నేను అసమర్థురాలను లేక బలహీనురాలను కానని భావించేలా చేయడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది.” అంతేకాకుండా, మీ ప్రియమైన జత మరణం విషయమై మీరు ఇంకా దుఃఖిస్తుండవచ్చు లేక వివాహం విచ్ఛిన్నం అయినందుకు దోషినని భావిస్తుండవచ్చు లేక కోపంగా ఉండవచ్చు. ఒకవేళ పిల్లల పర్యవేక్షణా బాధ్యతను పంచుకుని ఉంటే, మీ పిల్లవాడు మీ మునుపటి జతతో ఉండేందుకు సుముఖత చూపుతాడేమో అని మీరు భయపడవచ్చు. సమతూకమైన క్రమశిక్షణను అందించడాన్ని అలాంటి పరిస్థితులు కష్టతరం చేయగలవు.

14. ఒంటరి తల్లి/తండ్రి క్రమశిక్షణ విషయంలో సమతూకమైన దృక్పథాన్ని ఎలా కలిగివుండగలరు?

14 “అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 29:15) కుటుంబ నియమాలను స్థాపించి వాటిని అమలు చేయడంలో మీకు యెహోవా దేవుని అండ ఉంది, కాబట్టి దోషినన్న భావనకు, పరితాపానికి లేక భయానికి లొంగిపోకండి. (సామెతలు 1:8) బైబిలు సూత్రాల విషయంలో ఎన్నడూ రాజీపడకండి. (సామెతలు 13:24) సహేతుకంగా, ఎప్పుడూ సమరూపంగా మరియు స్ధిరంగా ఉండేందుకు ప్రయత్నించండి. తగిన సమయానికి, అనేకమంది పిల్లలు ప్రతిస్పందిస్తారు. అయినప్పటికీ, మీరు మీ పిల్లల భావాలను పరిగణలోకి తీసుకోవాలని ఇష్టపడవచ్చు. ఒక ఒంటరి తండ్రి ఇలా చెబుతున్నాడు: “వారు తమ తల్లిని పోగొట్టుకుని గాయపడివున్నారు గనుక నేనిచ్చే క్రమశిక్షణకు అవగాహనను జత చేయాల్సి ఉండినది. అవకాశం లభించిన ప్రతిసారీ నేను వాళ్లతో మాట్లాడతాను. మేము రాత్రి భోజనం సిద్ధం చేసే సమయం మాకు ‘ఆప్యాయకరమైన సమయంగా’ ఉంటుంది. వారు అప్పుడే వాస్తవంగా నాతో వాళ్ల విషయాలు చెప్పుకుంటారు.”

15. విడాకులు తీసుకున్న తల్లి/తండ్రి, తన పూర్వపు జత గురించి మాట్లాడేటప్పుడు దేనిని నివారించాలి?

15 మీరు విడాకులు తీసుకుంటే, మీ పూర్వపు జత గౌరవాన్ని తగ్గించడం ద్వారా ఎలాంటి మంచినీ సాధించలేరు. తలిదండ్రుల కీచులాటలు పిల్లలకు బాధాకరమైనవి, అవి మీ ఇద్దరి ఎడల వారికుండే గౌరవాన్ని తుదకు బలహీనం చేయవచ్చు. కాబట్టి, “నీవూ అచ్చం మీ నాన్నలాంటి వాడివేరా!” వంటి నొప్పించే వ్యాఖ్యానాలను చేయడం మానుకోండి. మీ పూర్వపు జత మీకు ఎంతో బాధ కలిగించివుండవచ్చు, అయినా అతను లేక ఆమె ఇంకా మీ పిల్లవాని తల్లి/తండ్రి. మీ పిల్లవానికి మీ ఇరువురి ప్రేమ, అవధానం మరియు క్రమశిక్షణ అవసరం. b

16. ఒంటరి తల్లి/తండ్రిగల ఇంట్లో ఏ ఆత్మీయ ఏర్పాట్లు క్రమశిక్షణలో ఒక క్రమమైన భాగమవ్వాలి?

16 మునుపటి అధ్యాయాల్లో చర్చించబడినట్లు, క్రమశిక్షణ అంటే శిక్షించడం మాత్రమే కాక అందులో తర్ఫీదునివ్వడం మరియు ఉపదేశించడం కూడా ఇమిడివున్నాయి. ఆత్మీయ తర్ఫీదు యొక్క చక్కని కార్యక్రమం ద్వారా అనేక సమస్యలను తొలగించవచ్చు. (ఫిలిప్పీయులు 3:16) క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవ్వడం ఆవశ్యకం. (హెబ్రీయులు 10:24, 25) వారపు కుటుంబ బైబిలు పఠనాన్ని కలిగివుండటం కూడా అంతే ఆవశ్యకం. అలాంటి పఠనాన్ని క్రమంగా నిర్వహించడం సులభం కాదన్నది వాస్తవమే. కర్తవ్య నిష్టగల ఒక తల్లి ఇలా చెబుతుంది: “దినమంతా పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది. అయితే ఆ పని చేయవలసిన అవసరత ఉందని తెలుసు గనుక నా కూతురుతో పఠనాన్ని చేసేందుకు నన్ను నేను మానసికంగా సిద్ధపర్చుకుంటాను. మా కుటుంబ పఠనం అంటే దానికెంతో ఇష్టం!”

17. పౌలు సహవాసియైన తిమోతి చక్కని పెంపకం నుండి మనం ఏమి నేర్చుకోగలం?

17 అపొస్తలుడైన పౌలు సహవాసియైన తిమోతికి బైబిలు సూత్రాలలో తర్ఫీదు అతని తల్లి మరియు అమ్మమ్మ ద్వారా ఇవ్వబడినదనే దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి, అయితే అతని తండ్రి ఇవ్వలేదన్నది స్పష్టం. అయిననూ, తిమోతి ఎంత మాదిరికరమైన క్రైస్తవుడయ్యాడు! (అపొస్తలుల కార్యములు 16:1, 2; 2 తిమోతి 1:5; 3:14, 15) మీరు “ప్రభువు [“యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను” మీ పిల్లలను పెంచేందుకు కృషి చేస్తుండగా, మీరు కూడా అదే విధంగా అనుకూలమైన ఫలితాల కొరకు నిరీక్షించవచ్చు.—ఎఫెసీయులు 6:4.

ఒంటరితనానికి విరుద్ధంగా పోరాటాన్ని గెలవడం

18, 19. (ఎ) ఒంటరి తల్లి/తండ్రి విషయంలో ఒంటరితనం ఎలా కష్టతరమౌతుంది? (బి) శారీరక కోరికలను అదుపు చేసుకునేందుకు సహాయపడే ఏ సలహా ఇవ్వబడింది?

18 ఒక ఒంటరి తల్లి ఇలా నిట్టూర్చింది: “నేను ఇంటికి వచ్చి ఆ నాలుగు గోడలను చూసినప్పుడు, ప్రాముఖ్యంగా పిల్లలు పడుకున్న తర్వాత ఒంటరితనం నిజంగా నన్ను కమ్మేస్తుంది.” అవును, ఒక ఒంటరి తల్లి/తండ్రి తరచూ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఒంటరితనమే. వివాహం యొక్క ఆప్యాయతా సహవాసాన్ని మరియు సన్నిహితత్వాన్ని కోరుకోవడం సహజమే. అయితే ఒక వ్యక్తి ఈ సమస్యను ఎలాగైనా తీర్చుకోవాలని ప్రయత్నించాలా? అపొస్తలుడైన పౌలు కాలంలో, కొందరు యౌవన విధవరాండ్రు “క్రీస్తుకు బదులుగా తమ మధ్య లైంగికేచ్ఛలను అనుమతించారు.” (1 తిమోతి 5:11, 12, NW) శారీరక కోరికలు ఆత్మీయ ఆసక్తులను కనుమరుగు చేసేందుకు అనుమతించడం హానికరంగా ఉంటుంది.—1 తిమోతి 5:6.

19 ఒక క్రైస్తవ పురుషుడు ఇలా చెప్పాడు: “లైంగిక కోరికలు ఎంతో బలీయంగా ఉంటాయి, కాని మీరు వాటిని అదుపు చేసుకోగలరు. మీ మనస్సులోకి ఒక తలంపు వచ్చినప్పుడు మీరు దాన్ని గురించే ఆలోచిస్తూ ఉండకూడదు. మీరు దాన్ని వెళ్లగొట్టాలి. మీ పిల్లల గురించి ఆలోచించడం కూడా సహాయకరంగా ఉంటుంది.” దేవుని వాక్యం ఇలా సలహా ఇస్తుంది: “మీ అవయవములను, అనగా . . . కామాతురతను . . . చంపి వేయుడి.” (కొలొస్సయులు 3:5) మీరు మీ ఆకలిని చంపుకోవాలని ప్రయత్నిస్తుంటే, రుచికరమైన ఆహరం యొక్క చిత్రాలుండే పత్రికలను మీరు చదువుతారా లేక తదేకంగా తిండి గురించే మాట్లాడే ప్రజలతో సహవసిస్తారా? అలా ఎంతమాత్రం చేయరు! శారీరక కోరికల విషయంలో కూడా అదే వాస్తవం.

20. (ఎ) అవిశ్వాసులతో ప్రణయ వ్యవహారాలను నడిపే వారికి ఏ ప్రమాదం పొంచివుంది? (బి) మొదటి శతాబ్దంలోని మరియు నేటి ఒంటరి వారు ఒంటరితనంతో ఎలా పోరాడారు?

20 కొందరు క్రైస్తవులు అవిశ్వాసులతో ప్రణయ వ్యవహారాలను ప్రారంభించారు. (1 కొరింథీయులు 7:39) అది వారి సమస్యను పరిష్కరించిందా? లేదు. విడాకులు తీసుకున్న ఒక క్రైస్తవ స్త్రీ ఇలా హెచ్చరించింది: “ఒంటరిగా ఉండటంకంటే మరీ ఘోరమైన విషయం ఒకటి ఉంది. అది మీకు తగని వ్యక్తిని వివాహం చేసుకోవడమే!” మొదటి శతాబ్దపు క్రైస్తవ విధవరాండ్రను ఒంటరితనం ఎంతగానో పీడించివుండవచ్చు, అయితే వివేకులైన వారు ‘పరదేశులకు ఆతిథ్యమిచ్చి, పరిశుద్ధులపాదములు కడిగి, శ్రమపడువారికి సహాయము’ చేయడం ద్వారా ఎక్కువ పనిని కలిగి ఉన్నారు. (1 తిమోతి 5:10) దేవునికి భయపడే జత కొరకు అనేక సంవత్సరాలు వేచివుండిన నమ్మకస్థులైన క్రైస్తవులు నేడు అదే విధంగా తమ కొరకు ఎక్కువ పనిని ఉంచుకుంటున్నారు. 68 సంవత్సరాల క్రైస్తవ విధవరాలు తాను ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుందో అప్పుడు ఇతర విధవరాండ్రను దర్శించడం ప్రారంభిస్తుంది. ఆమె ఇలా చెప్పింది: “ఇలా దర్శించడం, నా ఇంట్లో పని చేసుకోవడం మరియు నా ఆత్మీయత ఎడల శ్రద్ధ వహించడం ద్వారా నేను ఒంటరిదాన్నని భావించేందుకు నాకు సమయమే ఉండదని నేను తెలుసుకున్నాను.” ఇతరులకు దేవుని రాజ్యాన్ని గురించి బోధించడం ప్రాముఖ్యంగా ఒక ప్రయోజనకరమైన మంచి పని.—మత్తయి 28:19, 20.

21. ఒంటరితనాన్ని అధిగమించేందుకు ప్రార్థన మరియు మంచి సహవాసం ఏ మార్గంలో సహాయపడగలవు?

21 ఒంటరి తనానికి సత్వర నివారణ ఏమీ లేదన్న విషయాన్ని ఒప్పుకోవలసిందే. అయితే యెహోవానుండి లభించే బలంతో దాన్ని సహించవచ్చు. ఒక క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు “విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా” ఉన్నప్పుడు అలాంటి బలమే లభిస్తుంది. (1 తిమోతి 5:5) విజ్ఞాపనలు అంటే తీవ్రంగా కోరే విన్నపాలు, అవును, బహుశా బిగ్గరగా ఏడ్వడం ద్వారా, కన్నీళ్ల ద్వారా సహాయం కొరకు అర్థించడం. (హెబ్రీయులు 5:7 పోల్చండి.) “రేయింబగలు” యెహోవాకు మీ హృదయాన్ని కుమ్మరించడం వాస్తవంగా సహాయం చేయగలదు. అంతేకాకుండా, ఆరోగ్యదాయకమైన సహవాసం ఒంటరితనపు ఖాళీని పూరించేందుకు ఎంతో చేయగలదు. చక్కని సహవాసం ద్వారా, ఒకరు సామెతలు 12:25 నందు వివరింపబడిన ప్రోత్సాహకరమైన ‘దయగల మాటను’ పొందగలరు.

22. ఒంటరితనపు భావాలు అప్పుడప్పుడూ ఉత్పన్నమైతే ఏ విషయాల గురించి ఆలోచించడం సహాయపడుతుంది?

22 అప్పుడప్పుడూ ఒంటరితనపు భావాలు తప్పక వస్తాయి, ఒకవేళ అలా వచ్చినా ఎవరికీ జీవితంలో పరిపూర్ణమైన ఆనందం లభించదని జ్ఞాపకముంచుకోండి. వాస్తవానికి, ‘లోకమందున్న మీ సహోదరులు’ ఏదో ఒక విధంగా శ్రమను అనుభవిస్తున్నారు. (1 పేతురు 5:9) గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉండటాన్ని మానుకోండి. (ప్రసంగి 7:10) మీరు ఇప్పుడు అనుభవించే ప్రయోజనాలను పునఃపరిశీలించుకోండి. అన్నిటికంటే మిన్నగా, మీ యథార్థతను నిలుపుకోడానికి, యెహోవా హృదయాన్ని ప్రీతిపర్చడానికి నిశ్చయించుకోండి.—సామెతలు 27:11.

ఇతరులు ఎలా సహాయం చేయగలరు

23. సంఘంలోని ఒంటరి తల్లి/తండ్రుల ఎడల తోటి క్రైస్తవులకు ఏ బాధ్యతలున్నాయి?

23 తోటి క్రైస్తవుల మద్దతు మరియు సహాయం ఎంతో విలువైనవి. యాకోబు 1:27 ఇలా చెబుతుంది: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయునే.” అవును, ఒంటరి తల్లి/తండ్రిగల కుటుంబాలకు తోడ్పడాల్సిన బాధ్యత క్రైస్తవులకు ఉంది. అలా చేసేందుకుగల కొన్ని ఆచరణాత్మకమైన మార్గాలు ఏవి?

24. అవసరతల్లో ఉన్న ఒంటరి తల్లి/తండ్రిగల కుటుంబాలకు ఏయే విధాలుగా సహాయపడవచ్చు?

24 వస్తురూపమైన సహాయాన్ని ఇవ్వవచ్చు. బైబిలు ఇలా చెబుతుంది: “ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?” (1 యోహాను 3:17) “చూచియు” అనే పదానికున్న మూల గ్రీకు పదం, మామూలుగా చూడటం కాదుగానీ, సావధానంగా గమనించడమని అర్థం. దయగల క్రైస్తవులు మొదట ఆ కుటుంబ పరిస్థితులు మరియు అవసరాలతో సుపరిచితులవ్వాలని ఇది సూచిస్తుంది. బహుశా వాళ్లకు డబ్బు అవసరం ఉందేమో. కొందరికి ఇంట్లో మరమ్మత్తుల విషయంలో సహాయం అవసరం కావచ్చు. లేదా ఒకసారి భోజనానికి లేక సాంఘిక వేడుకలకు వారిని ఆహ్వానిస్తే వారెంతో సంతోషించవచ్చు.

25. ఒంటరి తల్లుల/తండ్రుల ఎడల తోటి క్రైస్తవులు దయను ఎలా చూపవచ్చు?

25 దానికి తోడు 1 పేతురు 3:8 ఇలా చెబుతుంది: “మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గల వారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునైయుండుడి.” ఆరుగురు పిల్లలున్న ఒక ఒంటరి తల్లి ఇలా చెప్పింది: “పరిస్థితి ఎంతో కష్టతరంగా ఉండేది, కొన్నిసార్లు నేను చాలా కృంగిపోతాను. అయితే, అప్పుడప్పుడూ ఎవరైనా సహోదరుడు లేక సహోదరి నాతో ఇలా అంటారు: ‘జోన్‌, మీరు చక్కగా కృషి చేస్తున్నారు. దాని ఫలితం యోగ్యమైనదిగా ఉంటుంది.’ ఇతరులు మీ గురించి ఆలోచిస్తున్నారు, వారు శ్రద్ధ కలిగి ఉన్నారు అనేది చాలా సహాయకరంగా ఉంటుంది.” ఒంటరి తల్లులైన యౌవన స్త్రీలు ఒక పురుషునితో చర్చించడానికి ఇబ్బందికరంగా ఉండే సమస్యలను కలిగివున్నప్పుడు ప్రాముఖ్యంగా పెద్ద వయస్సుగల క్రైస్తవ స్త్రీలు వారి సమస్యలను వింటూ సహాయం చేయడంలో ప్రభావవంతంగా ఉండగలరు.

26. తండ్రిలేని పిల్లలకు పరిపక్వత చెందిన క్రైస్తవ పురుషులు ఎలా సహాయపడగలరు?

26 క్రైస్తవ పురుషులు ఇతర మార్గాల్లో సహాయం చేయగలరు. నీతిమంతుడైన యోబు ఇలా చెప్పాడు: “తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడిపించితిని.” (యోబు 29:12) అదే విధంగా నేడు కొందరు క్రైస్తవ పురుషులు, తండ్రిలేని పిల్లల విషయంలో ఆరోగ్యకరమైన ఆసక్తిని కనపరుస్తారు, ఎలాంటి అవాచ్య భావాలు లేకుండా “పవిత్ర హృదయమునుండి . . . కలుగు” యథార్థ “ప్రేమ”ను కనపరుస్తారు. (1 తిమోతి 1:5) తమ స్వంత కుటుంబాలను నిర్లక్ష్యం చేయకుండా, అట్టి యౌవనులతో వారు అప్పుడప్పుడూ క్రైస్తవ పరిచర్యలో పని చేసేందుకు ఏర్పాటు చేసుకోవచ్చు మరియు కుటుంబ పఠనంలో లేక వినోదంలో పాల్పంచుకునేందుకు ఆహ్వానించవచ్చు. అలాంటి మంచితనం తండ్రిలేని పిల్లవాన్ని తప్పుడు మార్గంనుండి తప్పకుండా కాపాడవచ్చు.

27. ఒంటరి తల్లులు/తండ్రులు తమకు ఏ మద్దతు లభిస్తుందని నిశ్చయతను కలిగివుండగలరు?

27 అయితే తుదకు, ఒంటరి తలిదండ్రులు తమ బాధ్యతల ‘బరువు తామే భరించుకోవాల్సి’ ఉంటుంది. (గలతీయులు 6:5) అయినప్పటికీ, వారు క్రైస్తవ సహోదరసహోదరీల ప్రేమను మరియు యెహోవా దేవుని ప్రేమను కలిగివుండగలరు. ఆయన గురించి బైబిలు ఇలా చెబుతుంది: “ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించువాడు.” (కీర్తన 146:9) ఆయన ప్రేమపూర్వక మద్దతుతో ఒంటరి తల్లి/తండ్రిగల కుటుంబాలు విజయవంతం కాగలవు!

a అనైతిక ప్రవర్తన వలన ఒక యౌవన క్రైస్తవురాలు గర్భవతి అయితే, క్రైస్తవ సంఘం ఆమె చేసిన పనిని ఏ విధంగా కూడా ఆమోదించదు. అయితే ఆమె పశ్చాత్తాప పడితే, సంఘ పెద్దలు మరియు సంఘంలోని ఇతరులు ఆమెకు సహాయాన్ని అందించాలని ఇష్టపడవచ్చు.

b హింసించే తల్లి/తండ్రి నుండి పిల్లవాన్ని కాపాడవలసిన అవసరం ఉండే పరిస్థితులను మేము సూచించడం లేదు. అంతేకాకుండా, బహుశా పిల్లలు మిమ్మల్ని వదిలేయాలని వారిని ఒప్పించాలనే ఉద్దేశంతో మీ జత మీ అధికారాన్ని బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తే, ఆ పరిస్థితితో ఎలా వ్యవహరించాలనే విషయంలో సలహా కొరకు క్రైస్తవ సంఘంలోని పెద్దలవంటి అనుభవంగల స్నేహితులతో మాట్లాడటం మంచిది.