కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ అధ్యాయం

యేసుకు దయ్యాలను నాశనం చేయగల శక్తి ఉంది

యేసుకు దయ్యాలను నాశనం చేయగల శక్తి ఉంది

దేవదూతల్లో ఒక దేవదూత, అపవాది అయిన సాతానుగా ఎందుకు మారాడో మీకు గుర్తుందా?— అందరూ తనను ఆరాధించాలనే దురాశతో అతడు దేవుని మీద తిరగబడ్డాడు. వేరే దేవదూతలు కూడా సాతానుతో కలిశారా?— కలిశారు. బైబిలు వాళ్లను, ‘సాతాను దూతలు’ లేదా దయ్యాలు అని పిలుస్తోంది.—ప్రకటన 12:9.

ఈ చెడ్డ దూతలకు లేదా దయ్యాలకు దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉందా?— ‘దేవుడు ఉన్నాడనే నమ్మకం దయ్యాలకు ఉంది’ అని బైబిలు చెప్తోంది. (యాకోబు 2:19) కానీ ఇప్పుడు దయ్యాలకు భయంగా ఉంది. ఎందుకంటే, తాము చేసిన చెడ్డ పనులకు దేవుడు తమను శిక్షించబోతున్నాడని దయ్యాలకు తెలుసు. దయ్యాలు ఏ చెడ్డ పనులు చేశారు?—

ఆ చెడ్డ దూతలు పరలోకంలోని తమ స్థలాన్ని విడిచిపెట్టి, మానవుల్లా జీవించడానికి భూమ్మీదకు వచ్చారని బైబిలు చెప్తోంది. భూమ్మీద ఉన్న అందమైన స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికే వాళ్లు అలా వచ్చారు. (ఆదికాండము 6:1, 2; యూదా 6) లైంగిక సంబంధం అంటే ఏమిటో తెలుసా?—

ఒక స్త్రీ, ఒక పురుషుడు చాలా ప్రత్యేకమైన విధంగా దగ్గరవడాన్నే లైంగిక సంబంధం అంటారు. దానివల్ల స్త్రీ గర్భంలో ఒక బిడ్డ ప్రాణం పోసుకుంటుంది. కానీ దూతలు లైంగిక సంబంధం పెట్టుకోవడం తప్పు. పెళ్లి చేసుకుని భార్యాభర్తలైన స్త్రీకి, పురుషునికి మధ్య మాత్రమే లైంగిక సంబంధం ఉండాలని దేవుడు చెప్పాడు. ఎందుకంటే బిడ్డ పుడితే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకోగల్గుతారు.

ఈ దూతలు ఏ చెడ్డ పనులు చేశారు?

మానవ శరీరాలతో వచ్చిన దూతలు, భూమ్మీద ఉన్న స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఆ తర్వాత భారీశరీరంతో భీకరంగా పెరిగారు. వాళ్లు చాలా క్రూరంగా ఉండేవాళ్లు, ప్రజలకు హాని చేసేవాళ్లు. వీళ్లతోపాటు చెడ్డవాళ్లందర్నీ నాశనం చేయడానికి దేవుడు పెద్ద జలప్రళయం రప్పించాడు. సరైనది చేస్తున్న కొంతమందిని కాపాడడానికి ఓడను కట్టమని దేవుడు నోవహుకు చెప్పాడు. ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఏమి జరిగిందో గుర్తుంచుకోవడం ప్రాముఖ్యమని గొప్ప బోధకుడు చెప్పాడు.—ఆదికాండము 6:3, 4, 13, 14; లూకా 17:26, 27.

జలప్రళయం వచ్చినప్పుడు ఆ చెడ్డ దూతలకు ఏమైందో తెలుసా?— వాళ్లు తమ కోసం చేసుకున్న మానవ శరీరాలను వదిలేసి పరలోకానికి తిరిగి వెళ్లారు. కానీ వాళ్లు దేవునికి దూతలుగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దాంతో వాళ్లు సాతాను దూతలు లేదా దయ్యాలు అయ్యారు. మరి వాళ్ల పిల్లలకు ఏమైంది?— వాళ్లు జలప్రళయంలో చచ్చిపోయారు. వాళ్లతోపాటు, దేవుని మాట వినని వాళ్లంతా చచ్చిపోయారు.

భూమ్మీదవున్న ప్రజలు ముందెప్పుడూ పడనన్ని బాధలు ఇప్పుడు ఎందుకు పడుతున్నారు?

జలప్రళయం తర్వాత ఆ చెడ్డ దూతలు మళ్లీ మనుషుల్లా ఉండడానికి దేవుడు ఒప్పుకోలేదు. మనం వాళ్లను చూడలేకపోయినా, వాళ్లు మనుషులతో చాలా చెడ్డ పనులు చేయించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రజలు ముందెప్పుడూ పడనన్ని బాధలుపడేలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు పరలోకం నుండి భూమ్మీదకు తోసివేయబడ్డారు.

మనం వాళ్లను ఎందుకు చూడలేమో తెలుసా?— ఎందుకంటే వాళ్లు మన కంటికి కనిపించరు. కానీ వాళ్లు ఉన్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. సాతాను ‘సర్వలోకంలోని ప్రజలను మోసగిస్తున్నాడు’ అని బైబిలు చెప్తోంది. అతని దూతలు అతనికి సహాయం చేస్తున్నారు.—ప్రకటన 12:9, 12.

అపవాది, అతని దూతలు మనల్ని కూడా మోసం చేయగలరా?— అవును, మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని కూడా మోసం చేయగలరు. కానీ మనం భయపడక్కర లేదు. ఎందుకంటే, అపవాది తనను ఏమీ చేయలేడని చెప్తూ గొప్ప బోధకుడు, ‘నాతో అపవాదికి ఏ సంబంధం లేదు’ అన్నాడు. మనం దేవునికి దగ్గరగా ఉంటే అపవాది నుండి అతని దయ్యాల నుండి ఆయన మనలను కాపాడతాడు.—యోహాను 14:30.

ఆ దూతలు మనతో ఎలాంటి చెడ్డ పనులు చేయించడానికి ప్రయత్నిస్తారో తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఒకసారి ఆలోచించండి. చెడ్డ దూతలు భూమ్మీదకు వచ్చినప్పుడు ఎలాంటి చెడ్డ పనులు చేశారు?— జలప్రళయానికి ముందు వాళ్లు స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు, కానీ దేవదూతలు అలాంటి పని చేయకూడదు. ఇప్పుడు, లైంగిక విషయాలకు సంబంధించి దేవుడిచ్చిన ఆజ్ఞలను ప్రజలు పాటించకపోతే, ఆ చెడ్డ దూతలు సంతోషిస్తారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అసలు ఎవరి మధ్య మాత్రమే లైంగిక సంబంధం ఉండవచ్చు?— సరిగ్గా చెప్పారు, భార్యాభర్తల మధ్య మాత్రమే లైంగిక సంబంధం ఉండాలి.

అయితే, ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు, కానీ అది తప్పు. దేవుడే, స్త్రీపురుషులకు జననాంగాలను ఇచ్చాడని బైబిలు చెప్తోంది. (ద్వితీయోపదేశకాండము 23:1) దేవుడు వాటిని, పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండాల్సిన ఒక ప్రత్యేకమైన సంబంధం కోసం వాళ్లకు ఇచ్చాడు. ప్రజలు యెహోవాకు ఇష్టంలేని పనులు చేసినప్పుడు దయ్యాలు సంతోషిస్తారు. ఉదాహరణకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకరి జననాంగాలతో ఒకరు ఆడుకోవడం దయ్యాలకు ఎంతో ఇష్టం. మనం దయ్యాలను సంతోషపెట్టాలని అనుకుంటామా?—

యెహోవా అసహ్యించుకునేది, దయ్యాలకు నచ్చేది మరొకటి ఉంది. అదేంటో తెలుసా?— బలాత్కారం లేదా హింస. (కీర్తన 11:5) హింస అంటే వేరేవాళ్లతో క్రూరంగా ప్రవర్తిస్తూ వాళ్లను బాధపెట్టడం. మీకు గుర్తుండే ఉంటుంది, చెడ్డ దూతలకు పుట్టిన పిల్లలు అలాంటి పనులే చేశారు.

అంతేకాదు, వాళ్లకు మనుష్యులను భయపెట్టడమంటే సరదా. కొన్నిసార్లు వాళ్లు, చనిపోయినవాళ్లు బ్రతికివున్నప్పుడు ఎలా చేసేవారో అలా చేస్తూ వాళ్లలా నటిస్తారు. చనిపోయిన వాళ్ల స్వరంతో మాట్లాడతారు. ఇలా వాళ్లు, చనిపోయినవాళ్లు బ్రతికేవుంటారని, బ్రతికివున్నవాళ్లతో మాట్లాడగలరని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తారు. అవును, భూతాలున్నాయని ఆ చెడ్డ దూతలు చాలామందిని నమ్మిస్తున్నారు.

సాతాను, అతని చెడ్డ దూతలు మనల్ని మోసం చేయకుండా ఉండాలంటే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిలు ఇలా హెచ్చరిస్తోంది, ‘సాతాను తాను మంచి దూత అని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అతని సేవకులు కూడా అలాగే చేస్తున్నారు.’ (2 కొరింథీయులు 11:14, 15) కానీ, నిజానికి వాళ్లు చాలా చెడ్డ దూతలు. మనల్ని కూడా వాళ్లలా తయారుచేయడానికి వాళ్లు ఎలా ప్రయత్నిస్తారో చూద్దాం.

హింస, అక్రమ లైంగిక సంబంధం, దయ్యాలు, భూతాలు వంటివాటి గురించి ప్రజలు ఎక్కువగా ఎక్కడ నేర్చుకుంటున్నారు?— కొన్ని టీవీ కార్యక్రమాలను, సినిమాలను, ఇంటర్నెట్‌ను చూసి, కంప్యూటర్‌ గేమ్‌లు, వీడియో గేమ్‌లు ఆడి, కామిక్‌ పుస్తకాలను చదివి నేర్చుకుంటున్నారు. అలాంటి పనులు చేసినప్పుడు మనం దేవునికి దగ్గరవుతామా లేక సాతానుకు, అతని దయ్యాలకు దగ్గరవుతామా? మీరు ఏమనుకుంటున్నారు?—

మనం హింసను చూస్తూవుంటే ఏమి జరగవచ్చు?

మనం చెడ్డవాటిని వినాలని, చూడాలని ఎవరు కోరుకుంటున్నారు?— సరిగ్గా చెప్పారు. సాతాను, అతని దూతలు అలా కోరుకుంటున్నారు. మరైతే, మనమేమి చేయాలి?— మనకు ఉపయోగపడేవాటిని, యెహోవాను సేవించడానికి మనకు సహాయం చేసేవాటిని చదవాలి, వినాలి, చూడాలి. అలాంటి మంచి వాటిలో కొన్ని చెప్పగలరా?—

మనం ఏంచేయడం మంచిది?

మనం మంచిపని చేస్తుంటే దయ్యాలకు అస్సలు భయపడాల్సిన అవసరంలేదు. యేసు చెడ్డ దూతలకన్నా శక్తివంతుడు, ఆయనంటే వాళ్లకు భయం. ఒకరోజు చెడ్డ దూతలు యేసును చూసి, ‘మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా?’ అని కేకలు వేశారు. (మార్కు 1:24) యేసు సాతానును, అతని దయ్యాలను నాశనం చేసే సమయం వచ్చినప్పుడు మనకు సంతోషం అనిపించదా?— ఈలోపు మనం యేసుకు, ఆయన పరలోక తండ్రికి దగ్గరైతే యేసు మనల్ని దయ్యాల నుండి తప్పక కాపాడతాడు.

మనల్ని మనం సాతాను, అతని దయ్యాల నుండి కాపాడుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకోవడానికి, 1 పేతురు 5:8, 9; యాకోబు 4:7, 8 వచనాలను చదువుదాం.