తప్పిపోయిన కుమారుని కథ
అధ్యాయము 86
తప్పిపోయిన కుమారుని కథ
తప్పిపోయిన గొర్రె మరియు పోగొట్టుకొనిన వెండి నాణెము తిరిగిపొందుటనుగూర్చి పరిసయ్యులకు ఉపమానములను చెప్పుట పూర్తిచేసి, యేసు ఇప్పుడు మరొక ఉపమానము చెప్పసాగును. ఇది ఒక ప్రేమగల తండ్రి, మరియు గంభీరమైన లోపములుగల తన ఇద్దరు కుమారులను ఆయన ఆదరించిన విధానమును గూర్చిన ఉపమానమే.
మొదట, ఉపమానములోని ముఖ్యపాత్రధారి అతని చిన్నకుమారుడే. అడిగిన వెంటనే వెనుదీయక తండ్రి అతనికిచ్చిన స్వాస్థ్యమును అతడు తీసికొనును. ఆ పిమ్మట అతడు ఇల్లువిడిచి వెళ్లిపోయి, లైంగిక అవినీతికర జీవిత విధానములో చిక్కుకొనును. అయితే యేసుచెప్పే కథను వింటూ, ఆయాపాత్రలు ఎవరెవరిని సూచించునో నీవు తీర్మానించగలవేమో పరిశీలించుము.
యేసు ఆరంభించి ఇట్లనును: “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, ‘తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని’ తనతండ్రి నడుగగా, అతడు [తండ్రి] వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.” తాను పొందినదానితో ఈ చిన్నవాడు ఏమిచేయును?
“కొన్నిదినములైన తర్వాత, ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను” అని యేసు వివరించును. నిజానికి అతడు తన డబ్బుయావత్తు జారస్త్రీలతో జీవించుటకు ఖర్చుచేయును. యేసు ఇంకను చెప్పినట్లు, ఆ తర్వాత అతనికి కష్టకాలము వచ్చును:
“అదంతయు ఖర్చుచేసిన తరువాత ఆ దేశమందు గొప్పకరవురాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.”
ధర్మశాస్త్రము ప్రకారము ఈ పందులు అశుద్ధమైన జంతువులు కావున, వాటిని మేపుటకు బలవంతపెట్టబడుట ఎంత నీచమైన పని! అయితే ఆ కుమారుని ఎక్కువ బాధపరచిన సంగతియేమనగా, అతనికి కలిగిన అమితమైన ఆకలి పందులకు పెట్టు ఆహారము సహితము అతడు ఇష్టపడుటకు కారణమాయెను. తనకు కలిగిన భయంకర దుస్థితి మూలంగా, అతనికి “బుద్ధివచ్చెనని” యేసు చెప్పును.
తన కథను కొనసాగించుచు, యేసు ఇట్లు వివరించును: “వాడు [తనలోతాను] నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి, తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రియొద్దకు వచ్చెను.”
ఇక్కడ ఆలోచించవలసినది కొంత ఉన్నది: అతడు ఇల్లువిడిచి వెళ్లిన సమయములో అతని తండ్రి కోపపడి అతనిపై కేకలువేసియున్నట్లయిన, ఆ కుమారుడు తనేమి చేయవలెననే విషయంలో కేవలము ఒకేవిధముగా ఆలోచించియుండెడి వాడుకాదు. అతడు తిరిగివచ్చి, తండ్రిఎదుట పడకుండులాగున తనదేశములో మరొకచోట పనిచూసికొనుటకు ప్రయత్నించవలెనని నిర్ణయించుకొని యుండెడివాడు. అయితే, అటువంటి ఆలోచనేదియు అతని మదిలో లేకుండెను. తనయింటికే వెళ్లాలని అతడు కోరుకున్నాడు!
స్పష్టముగా, యేసుచెప్పిన ఉపమానములోని తండ్రి ప్రేమగల, కనికరముగల మన పరలోకపు తండ్రియగు యెహోవా దేవునిని సూచించుచున్నాడు. బహుశ మీరుకూడ ఆ తప్పిపోయిన, లేక దుర్వ్యయంచేసిన కుమారుడు, పేరుమోసిన పాపులకు సూచనగా ఉన్నాడని గుర్తించుదురు. యేసు ఇప్పుడు మాట్లాడుచున్న పరిసయ్యులే, ఇంతకుముందు యేసు వారితోనే కలిసి భుజించెనని విమర్శించిరి. అయితే పెద్దకుమారుడు ఎవరిని సూచిస్తున్నాడు?
తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు
యేసు ఉపమానములోని తప్పిపోయిన, లేక దుర్వ్యయంచేసిన కుమారుడు తన తండ్రియింటికి తిరిగివచ్చినప్పుడు, అతనికెటువంటి స్వాగతమిచ్చెదరు? యేసు వివరణ వినండి:
“వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానినిచూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.” మన పరలోకపు తండ్రియగు, యెహోవాను ఎంతచక్కగా సూచిస్తున్నాడో ఆ కనికరం, ఆప్యాయతగల తండ్రి!
బహుశ ఆ తండ్రి తన కుమారుని వ్యభిచారజీవితమును గూర్చి వినియుండవచ్చును. అయినను ఎక్కువ వివరణ కొరకు వేచియుండకుండ ఆయన అతనిని ఇంటిలోనికి ఆహ్వానించును. ఉపమానములోని తప్పిపోయిన కుమారునిద్వారా సూచింపబడిన పాపులను మరియు సుంకరులను సమీపించుటలో చొరవ తీసికొనుచు, యేసుకూడ అటువంటి ఆహ్వానించు ఆత్మను కలిగియున్నాడు.
నిజమే, యేసుయొక్క ఉపమానమందలి వివేచనగల తండ్రి, తన కుమారుడు తిరిగివచ్చుచుండగా దుఃఖముతోనిండిన, అతని విచారవదనమును గమనించుటద్వారా తన కుమారునిలో కలిగిన పశ్చాత్తాపమునుగూర్చి నిస్సందేహముగా కొంత అర్థముచేసికొనును. అయితే యేసు వివరించుచున్నట్లుగా, తండ్రియొక్క ప్రేమపూర్వకమైన చొరవ, కుమారుడు మరింత సులభముగా తన తప్పులు ఒప్పుకొనునట్లు చేయును. “అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుము అనెను.”
అయినను, ఆ కుమారుని నోటిమాటలు పెదవి దాటకముందే అతని తండ్రి కార్యశీలుడై, తన దాసులను పిలిచి ఇట్లు ఆజ్ఞాపించును: “ప్రశస్త వస్త్రము త్వరగాతెచ్చి వీనికి కట్టి, వీనిచేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; ఈ నాకుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెను.” అంతట వారు “సంతోషించసాగిరి.”
ఈ సమయములో, తండ్రియొక్క “పెద్దకుమారుడు పొలములో ఉండెను.” మిగతా కథను వినుచు అతను ఎవరిని సూచిస్తున్నాడో మీరు గుర్తించగలరేమో చూడండి. యేసు పెద్దకుమారునిగూర్చి ఇలా చెప్పనారంభించును: “వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి, ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చియున్నాడు; అతడు తనయొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లకపోయెను. గనుక అతని తండ్రి వెలుపలికివచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో యిన్ని యేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.”
పెద్దకుమారునివలె, పాపులను నిర్దాక్షిణ్యంగా విమర్శించినదెవరు? వారు పరిసయ్యులు, శాస్త్రులు కాదా? యేసు పాపులను ఆహ్వానిస్తున్నందుకు వారు ఆయనను విమర్శించినందున, ఆయన ఈ ఉపమానము చెప్పుటకు పురికొల్పబడెను. కావున వారు స్పష్టముగా పెద్దకుమారుని సూచిస్తున్నారు.
“కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి; మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని” తండ్రి పెద్దకుమారునికి చేసిన విన్నపముతో యేసు తన కథను ముగించును.
ఆ విధముగా పెద్దకుమారుడు చివరకు ఏమిచేస్తాడో యేసు చెప్పకుండా అంతరార్థంగా ముగిస్తాడు. ఆ పిమ్మట, యేసు మరణ పునరుత్థానముల తర్వాత, నిజంగా “యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి,” యేసు ఇక్కడ మాట్లాడుచున్న, “పెద్దకుమారుని” తరగతికి చెందిన కొందరు బహుశ వీరిలో చేరియుండవచ్చును.
అయితే ఈ ఆధునిక కాలములలో ఆ ఇద్దరు కుమారులు ఎవరిని సూచించుచున్నారు? వారు యెహోవాతో సంబంధమేర్పరచుకొనుటకు ఒక ఆధారము కలిగియుండునంతగా ఆయన సంకల్పములనుగూర్చి తెలిసికొనినవారై యుండవచ్చును. పెద్దకుమారుడు “చిన్నమంద,” లేక “పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘములోని” సభ్యులలో కొందరిని సూచించుచున్నాడు. వీరు పెద్దకుమారుని పోలిన దృక్పధమును అలవరచుకొనిరి. వీరు భూసంబంధమైన తరగతి వారిని “వేరేగొర్రెలను” ఆహ్వానించుటకు ఇష్టపడలేదు, వారు ప్రముఖస్థానములను కాజేస్తారేమోనని వీరు భావించిరి.
మరొకవైపున, దుర్వ్యయం చేసిన కుమారుడు, లోకము అందించు సుఖభోగములను అనుభవించుటకు వెళ్లిన దేవుని ప్రజలను సూచించుచున్నాడు. అయితే తగిన కాలమున, వీరు పశ్చాత్తాపముతో తిరిగివచ్చి మరలా దేవుని చురుకైన సేవకులగుదురు. క్షమాపణయొక్క అవసరతను గుర్తించి ఆయనయొద్దకు తిరిగివచ్చు వారియెడల తండ్రి నిజముగా ఎంత ప్రేమ, కనికరము చూపును! లూకా 15:11-32; లేవీయకాండము 11:7, 8; అపొ.కార్యములు 6:7; లూకా 12:32; హెబ్రీయులు 12:23; యోహాను 10:16.
▪ యేసు ఈ ఉపమానము, లేక కథను ఎవరికి చెప్పును, ఎందుకు?
▪ కథలో ముఖ్యపాత్రధారి ఎవరు, మరియు అతనికి ఏమి సంభవించును?
▪ యేసు దినములలో తండ్రి మరియు చిన్నకుమారుడు ఎవరిని సూచించిరి?
▪ తన ఉపమానములోని కనికరముగల తండ్రి మాదిరిని యేసు ఎట్లు అనుకరించును?
▪ తన తమ్ముని ఆహ్వానించుటలో పెద్దకుమారుని దృక్పధము ఏమైయున్నది, మరియు పరిసయ్యులు ఎట్లు పెద్దకుమారునివలె ప్రవర్తించుదురు?
▪ యేసు ఉపమానము మన కాలములో ఎటువంటి అన్వయింపును కలిగియున్నది?