కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆటంకాలకు ముందే సిద్ధపడి ఉండండి

ఆటంకాలకు ముందే సిద్ధపడి ఉండండి

ఆటంకాలకు ముందే సిద్ధపడి ఉండండి

“పుట్టిన మా పసిబిడ్డ ఆరోగ్యం కోసం నేను సిగరెట్‌ మానేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే, మా ఇంట్లో ‘నో స్మోకింగ్‌’ బోర్డ్‌ని తగిలించాను. కానీ ఒక్క గంట కూడా ఆగలేకపోయాను. సిగరెట్‌ తాగాలని నా నాలుక పీకేసింది. వెంటనే ఒక సిగరెట్‌ వెలిగించాను.”​—యోషిమిట్సు, జపాన్‌.

సిగరెట్‌ మానేసేటప్పుడు ఆటంకాలు వస్తాయని యోషిమిట్సు ఉదాహరణ చూపిస్తుంది. అంతేకాదు, కొన్ని అధ్యయనాల ప్రకారం, దాదాపు 90 శాతం మంది, సిగరెట్‌ మానేసే క్రమంలో విఫలమైతే, ఇక తమ ప్రయత్నాల్ని ఆపేసి మళ్లీ మొదటికి వచ్చేస్తారు. కాబట్టి, మీరు సిగరెట్‌ మానేయడానికి ప్రయత్నిస్తుంటే, మీకు ఎదురవ్వగల ఆటంకాల కోసం సిద్ధంగా ఉండండి. అలా సిద్ధంగా ఉంటే మీరు విజయం సాధించవచ్చు. ఇంతకీ ఎలాంటి ఆటంకాలు వస్తాయి?

సిగరెట్‌ తాగాలని నాలుక పీకేయడం: మాములుగా, సిగరెట్‌ మానేసిన మూడు రోజుల వరకు ఆ కోరిక బలంగా ఉంటుంది, దాదాపు రెండు వారాల తర్వాత అది తగ్గడం మొదలౌతుంది. “ఆ కోరిక అలానే ఉండిపోదు గానీ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది” అని సిగరెట్‌ మానేసిన ఒకతను అంటున్నాడు. ఆఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఉన్నట్టుండి సిగరెట్‌ తాగాలని మీకు నాలుక పీకేయవచ్చు. అలాంటప్పుడు తొందరపడి సిగరెట్‌ ముట్టించకండి. ఒక్క ఐదు నిమిషాలు ఓర్చుకుంటే, ఆ కోరిక దానంతట అదే పోతుంది.

వేరే ఇబ్బందులు (withdrawal symptoms): సిగరెట్‌ మానేసిన కొత్తలో చాలామందికి చురుగ్గా ఉండడం, అవధానం నిలపడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు వాళ్లు త్వరగా బరువు పెరుగుతారు. వాళ్లకు ఒళ్లు నొప్పులు, దురద, చెమటలు పట్టేయడం, దగ్గు రావచ్చు. అలాగే వెంటవెంటనే మూడ్‌ మారిపోతూ చిరాకు, కోపం, డిప్రెషన్‌ రావచ్చు. కానీ చాలావరకు, ఈ లక్షణాలు నాలుగు నుంచి ఆరు వారాల్లో తగ్గుతాయి.

ఈ ఇబ్బందులతో పోరాడుతున్నప్పుడు, మీరు కొన్ని పనులు చేయవచ్చు. ఉదాహరణకు:

● కంటినిండా నిద్రపోండి.

● ఎక్కువగా నీళ్లు, జ్యూస్‌లు తాగండి. పౌష్టిక ఆహారం తీసుకోండి.

● తగినంత వ్యాయామం చేయండి.

● గట్టిగా శ్వాస తీసుకుంటూ, మీ ఊపిరితిత్తుల్ని స్వచ్ఛమైన గాలితో నింపుతున్నట్టు ఊహించుకోండి.

సిగరెట్‌ మళ్లీ తాగాలనిపించేలా చేసేవి: కొన్ని విషయాలు మీరు మళ్లీ సిగరెట్‌ తాగాలనిపించేలా చేస్తాయి, అవి పనులు కావచ్చు లేదా మీ ఫీలింగ్స్‌ కావచ్చు. ఉదాహరణకు మీకు ఇంతకుముందు టీ, కాఫీ, కూల్‌డ్రింక్‌ లాంటివి తాగుతూ సిగరెట్‌ కాల్చే అలవాటు ఉంటే, సిగరెట్‌ మానేయాలి అనుకున్నప్పుడు వాటిని ఎక్కువసేపు తాగుతూ కూర్చోకండి. ఎందుకంటే, మళ్లీ మీకు సిగరెట్‌ కాల్చాలనిపిస్తుంది. సిగరెట్‌ అలవాటును పూర్తిగా మానుకున్న తర్వాత, అప్పుడు మీరు నింపాదిగా కూర్చుని వాటిని తాగొచ్చు.

దీన్నిబట్టి, మీ శరీరానికి నికోటిన్‌ అవసరం లేకపోయినా, కొన్ని పనులు చేస్తున్నప్పుడు సిగరెట్‌ కాల్చాలనే ఫీలింగ్‌ కలుగుతుంది. ముందు చెప్పిన టోర్బన్‌ అనే ఆయన ఇలా ఒప్పుకుంటున్నాడు: “సిగరెట్‌ మానేసి పంతొమ్మిది ఏళ్లయినా, ఇప్పటికీ నాకు విరామ సమయంలో కాఫీ తాగుతున్నప్పుడు సిగరెట్‌ కాల్చాలనిపిస్తుంది.” అయితే చాలావరకు, ఇలాంటి ఫీలింగ్‌ మెల్లమెల్లగా పోతుంది.

అయితే, మందు తాగుతూ సిగరెట్‌ కాల్చేవాళ్ల పరిస్థితి వేరు. సిగరెట్‌ మానాలనుకునేవాళ్లు మందును కూడా పూర్తిగా మానేయాలి. దాన్ని తాగే చోట్లకు కూడా వెళ్లకూడదు. ఎందుకంటే, సిగరెట్‌ మానేసిన చాలామంది, మందు తాగేటప్పుడు ఆ సిగరెట్‌ అలవాటును తిరిగి మొదలుపెట్టారు. ఎందుకని అలా జరుగుతుంది?

● మందు కొంచెం మోతాదులో తాగినా, నికోటిన్‌ వల్ల వచ్చే కిక్కు పెరుగుతుంది.

● ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొడుతున్నప్పుడు, వాళ్లు సిగరెట్‌ కాలుస్తుంటే చూసి మీకు కూడా కాల్చాలని అనిపిస్తుంది.

● మందు తాగినప్పుడు మీరు సరిగ్గా ఆలోచించలేరు, చేయాలనుకున్నవి చేయలేరు. అందుకే బైబిలు ఇలా చెప్తుంది: ‘ద్రాక్షారసం సరైనది చేయాలనే ప్రేరణను అణచివేస్తుంది.’​—హోషేయ 4:11.

స్నేహితులు: మీ స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. ఉదాహరణకు, సిగరెట్‌ తాగేవాళ్లతో గానీ, తాగమని అడిగేవాళ్లతో గానీ అనవసరంగా తిరగకండి. మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీ పట్టుదలను నీరుగార్చేవాళ్లకు కూడా దూరంగా ఉండండి.

ఒత్తిడి లేదా కోపం: ఒక అధ్యయనం ప్రకారం, ఎక్కువశాతం మంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా కోపంలో ఉన్నప్పుడు సిగరెట్‌ అలవాటును మళ్లీ మొదలుపెట్టారు. మీకు కూడా అలా సిగరెట్‌ తాగాలని అనిపించినప్పుడు, మీ మనసును వేరేవైపు మళ్లించండి. బహుశా ఆ సమయంలో మీరు నీళ్లు తాగొచ్చు, బబుల్‌ గమ్‌ నమలొచ్చు, లేదా వాకింగ్‌కి వెళ్లొచ్చు. అంతేకాదు దేవునికి ప్రార్థించడం ద్వారా, బైబిల్లోని కొన్ని పేజీలు చదవడం ద్వారా మీ మనసును మంచి విషయాలతో నింపుకోవడానికి ప్రయత్నించండి.​—కీర్తన 19:14.

సాకులు చెప్పకండి

నాకు సిగరెట్‌ అంతా వద్దు, ఒక్క దమ్ము చాలు.

నిజానికి: ఒక్క దమ్ము, మీ శరీరానికి కావల్సిన నికోటిన్‌లో 50 శాతం ఇచ్చి, మూడు గంటల పాటు సంతృప్తిపరుస్తుంది. ఫలితం? మీరు ఒక్క దమ్ముతో ఆగలేరు.

ఒత్తిడిలో ఉన్నప్పుడు సిగరెట్‌ తాగితే హాయిగా అనిపిస్తుంది.

నిజానికి: సిగరెట్‌లో ఉన్న నికోటిన్‌, ఒత్తిడి కలిగించే హార్మోన్లను పెంచుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. కొంతమంది సిగరెట్‌ తాగితే హాయిగా ఉంటుందని అనుకుంటారు. వాళ్ల శరీరానికి కావల్సిన నికోటిన్‌ అందుతుంది కాబట్టి, ఆ కాసేపు వాళ్లకు హాయిగా అనిపిస్తుంది.

నేను మానేసే స్టేజీ ఎప్పుడో దాటేశాను, ఇక నావల్ల కాదు.

నిజానికి: మీరు అలా నిరుత్సాహపడితే, ఎప్పటికీ మానుకోలేరు. బైబిలు ఇలా చెప్తుంది: “కష్టం వచ్చిన రోజున నిరుత్సాహపడితే నీ శక్తి తగ్గిపోతుంది.” (సామెతలు 24:10) కాబట్టి నెగిటివ్‌గా ఆలోచించకండి. మానేయాలని నిజంగా కోరుకుని, ఈ పత్రికలో చెప్పినలాంటి సలహాల్ని పాటిస్తే ఎవరైనా మానుకోగలుగుతారు.

మానేయడం వల్ల వచ్చే శారీరక ఇబ్బందులు (withdrawal symptoms) నేను భరించలేను.

నిజానికి: ఒప్పుకుంటాం, మానేస్తే వచ్చే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి, కానీ అవి కొన్ని వారాల్లోనే తగ్గిపోతాయి. కాబట్టి వెనకడుగు వేయకండి! కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత మళ్లీ సిగరెట్‌ తాగాలనే కోరిక పుట్టినా, అది కూడా కొద్ది నిమిషాల్లోనే పోవచ్చు. ఎప్పుడంటే, కేవలం మీరు సిగరెట్‌ వెలిగించనప్పుడు మాత్రమే.

నాకు మానసిక సమస్య ఉంది.

నిజానికి: మీరు ఒకవేళ డిప్రెషన్‌, స్కిజోఫ్రీనియా లాంటి మానసిక సమస్యలకు మందులు వాడుతుంటే, సిగరెట్‌ మానేయడానికి సహాయం చేయమని మీ డాక్టర్‌ని అడగండి. అతను లేదా ఆమె బహుశా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండి, మీరు వాడుతున్న మందుల్ని మార్చవచ్చు.

సిగరెట్‌ మానేసే క్రమంలో నేను మళ్లీ మొదలుపెడితే, ఓడిపోయినట్లే అని నాకు అనిపిస్తుంది.

నిజానికి: మీరు ఎప్పుడైనా మళ్లీ సిగరెట్‌ తాగడం మొదలుపెడితే, ఇక అంతా అయిపోయినట్లే అనుకోకండి. చాలామందికి అలానే జరుగుతూ ఉంటుంది. మీరు పడిపోయినప్పుడు లేవండి, లేచి ముందుకెళ్లండి. పడిపోవడం తప్పు కాదు. ఎలాగూ పడిపోయాం కదా అని మీ ప్రయత్నాలు ఆపేయడం తప్పు. కాబట్టి ప్రయత్నిస్తూ ఉండండి. ఏదోకరోజు విజయం సాధిస్తారు!

రొమాల్డో అనే ఆయన ఉదాహరణ పరిశీలించండి. ఆయన 26 ఏళ్ల పాటు సిగరెట్‌ తాగాడు. సిగరెట్‌ మానేసి ఇప్పుడు 30 ఏళ్లు పైనే అవుతుంది. ఆయన ఇలా రాస్తున్నాడు: “నేను ఎన్నిసార్లు మానేద్దాం అనుకుని మళ్లీ మొదలుపెట్టానో లెక్కేలేదు. అలా మొదలుపెట్టిన ప్రతీసారి, ఇక నేను ఈ అలవాటును మానుకోలేనేమో అని చాలా బాధపడేవాణ్ణి. అయితే, యెహోవా దేవునితో మంచి సంబంధం కలిగివుండాలని గట్టిగా తీర్మానించుకుని, సహాయం కోసం పదేపదే ప్రార్థించాను. అలా చివరికి ఈ అలవాటును మానుకోగలిగాను.”

మీరు సిగరెట్‌ మానేయడానికి ఉపయోగపడే ఇంకొన్ని సలహాలు, ఈ సిరీస్‌లోని చివరి ఆర్టికల్‌లో ఉన్నాయి.

[బాక్సు/చిత్రం]

ఏ రూపంలోనైనా ప్రమాదకరమే

పొగాకును చాలా రకాలుగా వాడతారు. కొన్ని పొగాకు ఉత్పత్తుల్ని ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో సేంద్రీయ పదార్థాల షాపుల్లో, వనమూలికల షాపుల్లో అమ్ముతున్నారు. కానీ నిజానికి, “అన్ని రకాల పొగాకు ఉత్పత్తులు ప్రమాదకరమే” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. పొగాకు వల్ల క్యాన్సర్‌, గుండె జబ్బులు వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. తల్లులు పొగతాగడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు కూడా హాని జరగవచ్చు. సాధారణంగా, పొగాకు ఉత్పత్తుల్ని ఏయే విధాలుగా వాడతారు?

బీడీలు: ఇవి చిన్నగా ఉంటాయి. వీటిని చేతితో చుడతారు. వీటిని సాధారణంగా దక్షిణ ఆసియాలో ఉపయోగిస్తారు. సిగరెట్లతో పోలిస్తే బీడీల వల్ల ఎక్కువ నికోటిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, తారు శరీరంలోకి వెళ్తాయి.

చుట్ట: పొగాకును గానీ, పొగాకుతో తయారుచేసిన పేపరును గానీ గట్టిగా చుట్టి వీటిని తయారుచేస్తారు. సిగరెట్లలో ఉండే పొగాకు ఆమ్ల స్వభావం (acidic) కలిగి ఉంటుంది, చుట్టలో ఉండే పొగాకు కాస్త క్షార స్వభావం (alkaline) కలిగి ఉంటుంది. కాబట్టి చుట్టను వెలిగించకపోయినా నోట్లో పెట్టుకుంటే, బుగ్గ ద్వారా నికోటిన్‌ శరీరంలోకి వెళ్తుంది.

లవంగాల సిగరెట్‌: సాధారణంగా వీటిలో 60 శాతం పొగాకు, 40 శాతం లవంగాలు ఉంటాయి. మామూలు సిగరెట్ల కన్నా వీటివల్ల ఎక్కువ నికోటిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, తారు శరీరంలోకి చేరతాయి.

పొగాకు గొట్టాలు: సిగరెట్లు తాగడం కన్నా, గొట్టాల ద్వారా పొగాకును పీల్చడం తక్కువ ప్రమాదమని అనుకోవడానికి లేదు. ఎందుకంటే, ఈ రెండు అలవాట్లు ఎన్నో క్యాన్సర్‌లకు, జబ్బులకు దారితీస్తాయి.

పొగాకు నమలడం, వాసన చూడడం: దక్షిణ ఆసియాలో పొగాకును నమలడం, ముక్కుపొడి పీల్చడం, మసాలా గుట్కాను నమలడం చేస్తుంటారు. నికోటిన్‌ నోటి ద్వారా నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. పొగాకును ఇలా తీసుకున్నా ప్రమాదకరమే.

నీటి గొట్టాలు (హుక్కా, షీషా): ఈ పరికరాల్లో, పొగాకు కాలినప్పుడు వచ్చే పొగ, నీటి గుండా ప్రవేశించి గొట్టంలోకి వస్తుంది, దాన్ని నోటి ద్వారా పీలుస్తారు. అయితే ఇలా తాగినంత మాత్రాన, ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే హానికరమైన పదార్థాలు, క్యాన్సర్‌ కారకాలు ఏమీ తగ్గవు.

[బాక్సు/చిత్రం]

ఈ అలవాటును మానుకునేలా వేరేవాళ్లకు సహాయం చేయడం

మంచిగా మాట్లాడండి. విమర్శించే బదులు, క్లాస్‌ పీకే బదులు మెచ్చుకోవడం, పొగడడం మంచి ఫలితాల్ని తెస్తాయి. “మళ్లీ మొదలుపెట్టేశావా? నాకు తెలుసు నీవల్ల కాదని” అనే మాట కన్నా, “నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా చేయగలవు” అనే మాటకు ఎక్కువ శక్తి ఉంటుంది.

క్షమించండి. సిగరెట్‌ మానేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి మీ మీద కోప్పడవచ్చు, చిరాకు పడవచ్చు. కాబట్టి ఆ వ్యక్తితో ఓపిగ్గా ఉండండి. దయతో ఇలా మాట్లాడండి: ”నీకు ఇది చాలా కష్టమని నాకు తెలుసు, కానీ నువ్వు ప్రయత్నిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది.” అయితే, ఇలా మాత్రం ఎప్పుడూ అనకండి: “నువ్వు సిగరెట్‌ తాగేటప్పుడే బాగున్నావ్‌. ఇప్పుడేంటో ఇంతలా చిరాకు పడుతున్నావ్‌!”

నిజమైన స్నేహితుడిగా ఉండండి. బైబిలు ఇలా చెప్తుంది: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.” (సామెతలు 17:17) అవును, సిగరెట్‌ మానేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తితో “ఎల్లప్పుడూ,” అంటే రోజులో ఏ సమయంలోనైనా, ఆ వ్యక్తి ఏ మూడ్‌లో ఉన్నా ఓపిగ్గా, ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి.