కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రగతిశీలురై ఉండండి—అభివృద్ధిని సాధించండి

ప్రగతిశీలురై ఉండండి—అభివృద్ధిని సాధించండి

మీరు మొదటి సారిగా బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం నేర్చుకున్నప్పుడు మీలో బలంగా వేళ్ళూనుకుపోయిన ఆలోచనా విధానమూ మీ మాట తీరూ మీ ప్రవర్తనా నెమ్మదిగా మారనారంభించాయి. ఈ మార్పులో అధిక శాతం, మీరు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరక ముందే జరిగింది. ఈపాటికి మీరు మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకునేంతగా మీరు ప్రగతి సాధించివుండవచ్చు. దానర్థం మీరు ప్రగతిని సాధించడం ఇక ఆపవచ్చనా? కానే కాదు. బాప్తిస్మం కేవలం ఆరంభం మాత్రమే.

శిష్యుడైన తిమోతి తన “అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము” తనకు ఇవ్వబడిన ఉపదేశాన్ని, తనకు అప్పజెప్పబడిన సేవాధిక్యతను ‘మనస్కరించుకోవాలి’ అనీ ‘వాటియందే సాధకము చేసికోవాలి’ అనీ పౌలు తిమోతికి చెప్పేటప్పటికి ఆయన క్రైస్తవ పెద్దగా సేవచేస్తున్నాడు. (1 తిమో. 4:11-15) మీరు సత్యపు మార్గంలో ఇప్పుడిప్పుడే నడవడం మొదలుపెడుతున్నప్పటికీ లేక క్రైస్తవ జీవన విధానంలో ఎంతో అనుభవమున్నవారైనప్పటికీ అభివృద్ధి సాధించడానికి మీరు ఆసక్తి చూపించాలి.

పరిజ్ఞానము, పరివర్తన

తన తోటి విశ్వాసులు, సత్యపు “వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించ”గలగాలని అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడని ఎఫెసీయులు 3:14-19 వచనాల్లో మనం చదువుతాము. అలా గ్రహించాలనే ఉద్దేశంతో, సంఘానికి బోధించడానికీ సరిదిద్దడానికీ క్షేమాభివృద్ధి కలుగజేయడానికీ యేసు మనుష్యులలో ఈవులను ఇచ్చాడు. అనుభవజ్ఞులైన బోధకుల మార్గనిర్దేశముతోపాటు దేవుని ప్రేరేపిత వాక్యాన్ని క్రమంగా ధ్యానించడం మనం ఆధ్యాత్మికంగా ‘ఎదిగేందుకు’ మనకు సహాయపడగలదు.—ఎఫె. 4:11-15.

ఆ ఎదుగుదలలో, “చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై” ఉండడం కూడా ఉంది. అందులో దేవునికీ క్రీస్తుకూ అనుగుణమైన బలమైన మనోవైఖరిని అలవరుచుకోవడం ఉంది. మనం “నవీనస్వభావమును ధరించు”కోవాలంటే, వారి ఆలోచనా విధానాలు మనపై ప్రభావం చూపేందుకు మనం అనుమతించాలి. (ఎఫె. 4:23,24) మీరు సువార్తలను అధ్యయనం చేసేటప్పుడు, క్రీస్తు జీవితాన్ని గురించిన వృత్తాంతాలను మీరు అనుసరించవలసిన మాదిరులుగా దృష్టిస్తారా? యేసులో కనిపించిన నిర్దిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని మీ వ్యక్తిగత జీవితంలో అనుకరించడానికి మీరు నిజంగా కృషి చేస్తారా?—1 పేతు. 2:21.

మీ సంభాషణలోని చర్చనీయాంశాలు, మీరెంత మేరకు అలాంటి అభివృద్ధిని సాధించారన్నది సూచించగలవు. నవీన స్వభావాన్ని ధరించినవారు అసత్యమైన, చెడ్డవైన, అశ్లీలమైన మాటల్లో గానీ ప్రతికూలమైన సంభాషణల్లో గానీ భాగం వహించరు. వారి మాట, “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచన”ముగానే ఉంటుంది. (ఎఫె. 4:25,26,29,31; 5:3,4; యూదా 16) సంఘ కూటాల్లోగానీ సన్నిహితులు మాత్రమే ఉన్నప్పుడుగానీ వారు చేసే వ్యాఖ్యానాలూ వ్యక్తం చేసే ఉద్వేగాలూ సత్యం వారి జీవితాలను మార్చివేస్తోందని చూపిస్తాయి.

మీరు “గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన”వారిలా ఉండకపోతే, అది కూడా మీ అభివృద్ధికి నిదర్శనమే. (ఎఫె. 4:14) ఉదాహరణకు, ఈ లోకం అనేక క్రొత్త తలంపులతో గానీ క్రొత్త ఉద్యమాలతో గానీ క్రొత్త రకం వినోదాలతో గానీ మిమ్మల్మి ఆకర్షిస్తుంటే మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? అటువంటివాటిలో నిమగ్నమయ్యేందుకు, ఆధ్యాత్మికంగా మీరు చేయ నిబద్ధులైవున్న విషయాలకు ఉపయోగించవలసిన సమయాన్ని వాటికి వెచ్చించేంత బలంగా మీ మనస్సు అటువైపుకే మళ్ళుతోందా? అలా చేయడం, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకం కాగలదు. ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంత జ్ఞానయుక్తమైన పని!—ఎఫె. 5:15,16.

మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారన్నది కూడా మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి సూచనగా ఉండగలదు. మీరు “దయగలిగి కరుణాహృదయులై” మీ సహోదర సహోదరీలను “క్షమించు”వారై ఉండడం నేర్చుకున్నారా?—ఎఫె. 4:32.

కార్యాలను యెహోవా విధానంలో చేయడంలో మీరు సాధించిన ప్రగతి సంఘంలోను ఇంట్లోను స్పష్టంగా కనబడాలి. అది పాఠశాలలోను, బహిరంగ స్థలాల్లోను, మీ ఉద్యోగ స్థలంలోను కూడా స్పష్టంగా ఉండాలి. (ఎఫె. 5:21–6:9) అలాంటి అన్ని పరిస్థితుల్లోను మీరు దైవిక గుణాలను సంపూర్ణస్థాయిలో కనబరుస్తుంటే, అప్పుడు మీ అభివృద్ధి దానంతటదే స్పష్టమౌతుంది.

మీకివ్వబడిన వరాన్ని ఉపయోగించండి

యెహోవా మనలో ప్రతి ఒక్కరికీ సామర్థ్యాలనూ వరాలనూ ఇచ్చాడు. యెహోవా తన అపాత్ర కృపను మన ద్వారా ఇతరులకు వ్యక్తం చేయగలిగే విధంగా, మనం ఆ వరాలను ఉపయోగించాలని ఆయన ఎదురుచూస్తున్నాడు. దీని గురించి చెబుతూ అపొస్తలుడైన పేతురు, “పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకులవలె, ప్రతి వ్యక్తియు, దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరమును ఇతరుల మేలుకై ఉపయోగింపవలెను” అని వ్రాశాడు. (1 పేతు. 4:10, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) నిర్వాహకునిగా మీ బాధ్యతను మీరు ఎలా చేస్తున్నారు?

“ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను” అని కూడా పేతురు అంటున్నాడు. (1 పేతు. 4:11) దేవుడు మహిమపరచబడేలా, దేవుని వాక్యానికి ఏ మాత్రం విరుద్ధం కాకుండా దానికి పొందికగా మాట్లాడవలసిన మన బాధ్యతను ఈ వచనం నొక్కి చెబుతోంది. మనం మాట్లాడే తీరు కూడా యెహోవాను మహిమపరచాలి. మీకివ్వబడిన వరాన్ని ఇతరులకు సహాయపడడం ద్వారా దేవుణ్ణి మహిమపరిచేలా ఉపయోగించేందుకు, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మీకు ఇవ్వబడుతున్న శిక్షణ సహాయపడుతుంది. ఆ లక్ష్యంతో, పాఠశాలలో మీ అభివృద్ధిని మీరు ఎలా కొలుచుకోవాలి?

మీ సలహా పత్రంలో మీరు ఎన్ని ప్రసంగ లక్షణాలపై పని చేశారు లేదా, మీకు ఎలాంటి నియామకాలు ఇవ్వబడ్డాయి అని ఆలోచించుకునే బదులు, మీ స్తుతియాగపు నాణ్యతను ఈ శిక్షణ ఎంతగా మెరుగుపరిచిందో ఆలోచించుకోండి. మనం పరిచర్యలో మరింత సమర్థవంతులుగా ఉండేలా పాఠశాల మనలను సిద్ధం చేస్తుంది. కాబట్టి, ‘నేను క్షేత్ర పరిచర్యలో మాట్లాడబోయే విషయాలను నిజంగా సిద్ధపడతానా? నేను ఎవరికైతే సాక్ష్యమిస్తానో వారిపై వ్యక్తిగత శ్రద్ధ చూపించడం నేర్చుకున్నానా? ప్రజల దగ్గరి నుండి వచ్చే ముందు, పునర్దర్శనాల్లో చర్చించేందుకు పునాదిగా ఒక ప్రశ్న వేస్తున్నానా? నేను ఎవరితోనైనా బైబిలు అధ్యయనం చేస్తున్నట్లయితే, హృదయాలను చేరుకునే బోధకుడిగా మెరుగుపడేందుకు కృషి చేస్తున్నానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

మీకివ్వబడిన సేవాధిక్యతలను బట్టి మీ ప్రగతిని అంచనా వేసుకోకండి. మీ అభివృద్ధి మీ నియామకాల్లో కాదు గానీ మీరు వాటిని ఎలా నిర్వహిస్తున్నారన్న దానిలో కనిపిస్తుంది. బోధించడం ఉన్న నియామకం మీకు లభిస్తే, ‘నేను నిజంగా బోధనా కళను ఉపయోగించానా? శ్రోతల జీవితాల్లో మార్పు వచ్చేలా నేను సమాచారాన్ని అందించానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

మీకివ్వబడిన వరాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్బోధలో చొరవ తీసుకోవాలన్న సందేశం ఉంది. క్షేత్ర పరిచర్యలో ఇతరులతో కలిసి సేవచేయడానికి మీరు చొరవ తీసుకుంటారా? మీ సంఘ సభ్యుల్లోని క్రొత్తవాళ్ళకూ యౌవనులకూ నిస్సహాయులకూ సహాయపడే అవకాశాల కోసం మీరు చూస్తున్నారా? రాజ్య మందిరాన్ని శుభ్రం చేయడానికి గానీ ప్రత్యేక, ప్రాంతీయ, జిల్లా సమావేశాల్లో వివిధ విధాలుగా సహాయపడేందుకు గానీ స్వచ్ఛందంగా ముందుకు వెళ్తారా? అప్పుడప్పుడు సహాయ పయినీరింగ్‌ చేస్తారా? క్రమ పయినీరుగా సేవ చేయగలుగుతారా, అవసరం ఎక్కువ ఉన్న ఒక సంఘానికి సహాయం చేస్తారా? మీరు ఒక సహోదరుడైతే, పరిచర్య సేవకుడిగాను పెద్దగాను అయ్యేందుకు లేఖనాధారిత యోగ్యతలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? సహాయం అందించడానికీ బాధ్యతను అంగీకరించడానికీ మీరు చూపే సుముఖత మీ అభివృద్ధికి ఒక సూచన.—కీర్త. 110:3.

అనుభవం వహించే పాత్ర

మీకు క్రైస్తవ జీవనంలో అనుభవం లేనందువల్ల పరిమితులు ఉన్నాయని అనిపిస్తే ధైర్యం తెచ్చుకోండి. దేవుని వాక్యం, “బుద్ధిహీనులకు [“అనుభవం లేనివారికి,” NW] జ్ఞానము పుట్టించును.” (కీర్త. 19:7; 119:130; సామె. 1:1-4) బైబిలు ఉపదేశాన్ని అనుసరించడం వల్ల, పరిపూర్ణమైన యెహోవా జ్ఞానము నుండి ప్రయోజనం పొందడం వీలవుతుంది, ఆ జ్ఞానము కేవలం అనుభవం ద్వారా నేర్చుకున్న దానికన్నా ఎంతో ఎక్కువ విలువైనది. అవును, మనం యెహోవాకు సేవ చేయడంలో అభివృద్ధిని సాధిస్తుండగా మనం ఎంతో విలువైన అనుభవాన్ని తప్పకుండా పొందుతాము. దానిని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?

జీవితంలో వివిధ పరిస్థితులకు గురైన వ్యక్తి, ‘నాకు ముందు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఏమి చేయాలో నాకు తెలుసు’ అని తనలో తాను తర్కించుకోవచ్చు. అది జ్ఞానయుక్తమేనా? “నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు” అని సామెతలు 3:7 హెచ్చరిస్తోంది. మనం జీవితంలో వివిధ పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు, ఆయా విషయాల గురించిన మన దృక్కోణాన్ని అనుభవం నిశ్చయంగా విశాలపరచాలి. కానీ మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తున్నట్లయితే, సాఫల్యతకు యెహోవా ఆశీర్వాదం అవసరమన్న విషయాన్ని మన అనుభవం మన మనస్సులపై హృదయాలపై చెరగని ముద్ర వేయాలి. కాబట్టి మన అభివృద్ధి, మనపై మనం ఆధారపడుతూ మన పరిస్థితులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడంలో కాదు కానీ, మన జీవితాల్లో మార్గనిర్దేశం కోసం ఇష్టపూర్వకంగా దేవుని వైపు చూడడంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని అనుమతి లేకుండా ఏదీ జరగదన్న నమ్మకం కలిగి ఉండడంలోనూ మన పరలోక తండ్రితో విశ్వసనీయమైన ప్రేమానురాగాలతో కూడిన సంబంధాన్ని నిలబెట్టుకోవడంలోనూ మన అభివృద్ధి కనిపిస్తుంది.

ముందున్న వాటి కోసం వేగిరపడుతూ ఉండండి

అపొస్తలుడైన పౌలు, ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన అభిషిక్త క్రైస్తవుడైనప్పటికీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి, తాను ‘ముందున్న వాటి కోసం వేగిరపడుతూ’ ఉండవలసిన అవసరముందని గ్రహించాడు. (ఫిలి. 3:13-16) మీకూ అలాంటి దృక్కోణమే ఉందా?

మీరు ఎంత ప్రగతిని సాధించారు? మీరు నవీన స్వభావాన్ని ఎంత సంపూర్ణంగా ధరించారు, యెహోవా సర్వాధిపత్యానికి ఎంత సంపూర్ణంగా లోబడ్డారు, యెహోవాను ఘనపరిచేందుకు ఆయన మీకు అనుగ్రహించిన వరాలను ఎంత శ్రద్ధగా ఉపయోగిస్తున్నారు అన్న వాటిని బట్టి మీ ఎదుగుదలను చూసుకోండి. మీరు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందుతుండగా, దేవుని వాక్యంలో నొక్కి చెప్పబడిన గుణాలు మీరు మాట్లాడే విధానంలోను బోధించే విధానంలోను క్రమానుగతంగా బహిర్గతమవ్వాలి. మీ ఎదుగుదలకు సంబంధించిన ఈ విషయాల మీద మీ మనస్సును నిలపండి. అవును, వాటిని బట్టి ఆనందించండి, మీ ప్రగతి సులభంగా స్పష్టంగా కనబడుతుంది.