28
సంభాషణా శైలి
ప్రజలు సాధారణంగా తమ స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ మాటలు సహజంగా ఉంటాయి. కొందరు చైతన్యంగా ఉంటారు; మరి కొందరు భావప్రకటన అంతగా చేయరు. అయినా మాటల్లో సహజత్వం ఉట్టిపడితేనే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
అయితే ఒక అపరిచితుడ్ని సమీపించేటప్పుడు, అతి చనువు చూపించడం గానీ మరీ అనియతంగా మాట్లాడడంగానీ సముచితం కాదు. వాస్తవానికి కొన్ని సంస్కృతులవారు అపరిచితులతో చేసే సంభాషణలన్నీ చాలా నియతమైన పద్ధతిలోనే మొదలుపెడతారు. తగిన గౌరవం చూపించిన తర్వాత, వివేచననుపయోగిస్తూ మరీ అంత నియత శైలిలో మాట్లాడకుండా ఇంకొంచెం సంభాషణా శైలిలో మాట్లాడడమే అభిలషణీయం కావచ్చు.
మీరు వేదిక మీది నుండి ప్రసంగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరీ మామూలు సంభాషణలోలా మాట్లాడడం క్రైస్తవ కూటాల హుందాతనానికి భంగం కలిగిస్తుంది, చెబుతున్న విషయ గాంభీర్యం నుండి అవధానాన్ని ప్రక్కకు మళ్ళిస్తుంది. కొన్ని భాషల్లో వయస్సులో పెద్ద వ్యక్తినీ ఉపాధ్యాయుడ్నీ ఉపాధ్యాయురాలినీ అధికారినీ లేదా తల్లినీ తండ్రినీ సంబోధించేటప్పుడు నిర్దిష్టమైన మాటలను వాడడం అవసరం. (అపొ. 7:2; 13:17 లో ఉపయోగించబడిన పదాలను గమనించండి.) ఒకరు తన భార్యనో భర్తనో సన్నిహిత స్నేహితుడ్నో సంబోధించేటప్పుడు వేరే మాటలను ఉపయోగిస్తారు. మనం వేదిక మీది నుండి మాట్లాడే విధానం మరీ నియతంగా ఉండకూడదు కానీ మర్యాదగా ఉండాలి.
అయితే ఒక వ్యక్తి మాట్లాడే విధానం మరీ బిగుసుకుపోయినట్లుగా గానీ మరీ నియతంగా గానీ ఉన్నట్లు అనిపించడానికి అనేక కారణాలుండవచ్చు. ఆ కారణాల్లో ఒకటి వాక్య నిర్మాణం లేదా పదబంధాలు. ఒక ప్రసంగీకుడు ముద్రిత సమాచారంలో ఉన్న మాటలను ఉన్నవి ఉన్నట్లు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు సమస్య తలెత్తుతుంది. లిఖిత పదానికీ వ్యావహారిక పదానికీ సాధారణంగా చాలా తేడా ఉంటుంది. ఒక ప్రసంగం సిద్ధపడేందుకు చేసే పరిశోధన సాధారణంగా ప్రచురిత సమాచారాన్ని ఉపయోగించి చేయబడుతుందన్నది నిజమే. ప్రసంగానికి ఆధారం ఒక ముద్రిత సంక్షిప్త ప్రతి కావచ్చు. కానీ ప్రసంగించేటప్పుడు విషయాలను ముద్రిత సమాచారంలో ఉన్నది ఉన్నట్లుగానే చెప్పినా, సంక్షిప్త ప్రతి నుండి నేరుగా చదివినా మీ మాటలు సంభాషణలా ఉండే అవకాశం మాత్రం లేదు. సంభాషణా శైలిని కొనసాగించడానికి ఆలోచనలను మీ సొంత మాటల్లో చెప్పండి. వాక్యనిర్మాణం సంక్లిష్టంగా ఉండకుండా జాగ్రత్తపడండి.
మరొక కారణం వేగంలో వ్యత్యాసం. మాట్లాడే విధానం బిగుసుకుపోయినట్లుండడానికీ మరీ నియతంగా ఉండడానికీ గల కారణాల్లో, తరచూ ఒక క్రమం చొప్పున ఆగడమూ ఒకే వేగంలో పదాలను చెప్పుకుపోవడమూ ఉన్నాయి. మామూలు సంభాషణల్లో వేగంలో మార్పులు వస్తాయి, తరచూ ఇచ్చే విరామాల వ్యవధుల్లో తేడా ఉంటుంది.
మీరు పెద్ద సభ ఎదుట ప్రసంగిస్తున్నప్పుడు సంభాషణా శైలిని అనుసరించడంతో పాటు, సభికుల అవధానాన్ని నిలిపి ఉంచేందుకు స్వరాన్నీ తీవ్రతనూ ఉత్సాహాన్నీ పెంచాలి.
పరిచర్య చేసేటప్పుడు తగిన సంభాషణా శైలిలో మాట్లాడాలంటే ప్రతిరోజు మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. దానర్థం మీరు పెద్ద చదువులు చదివివుండాలని కాదు. కానీ మీరు చెప్పేదాన్ని ఇతరులు గౌరవపూర్వకంగా వినేలా మాట్లాడే అలవాట్లను అలవరుచుకుంటే బాగుంటుంది. మీ దైనందిన సంభాషణల్లో దాన్ని మనస్సులో పెట్టుకొని ఈ క్రింది అంశాల మీద కృషి చేయవలసిన అవసరముందేమో పరిశీలించుకోండి.
-
మంచి వ్యాకరణాన్ని అతిక్రమించే పదాలనూ దైవిక ప్రమాణాలను నిర్లక్ష్యం చేసే జీవనశైలిని అవలంబించేవారిని స్ఫురింపజేసే పదాలనూ వాడకుండా జాగ్రత్తపడండి. కొలొస్సయులు 3:8 లోని ఉపదేశాన్ని అనుసరిస్తూ పరుషమైన పదాలను అశ్లీల పదాలను విడిచిపెట్టండి. మరొకవైపు వాడుక భాష అభ్యంతరపడవలసినది కాదు. వాడుక భాషా దైనందిన సంభాషణలో ఉపయోగించే మాటలూ అనియతంగా వాడేవే. కానీ అవి అంగీకృత వ్యావహారిక భాషా ప్రమాణాలకు పొందికగా ఉంటాయి.
-
మీరు చెప్పాలనుకున్న విభిన్నమైన ప్రతి ఆలోచనను తెలియజేయడానికి చెప్పిన మాటలనే పదబంధాలనే మళ్ళీ మళ్ళీ వాడకుండా ఉండండి. మీ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసే పదాలను వాడడం నేర్చుకోండి.
-
మీరు చెప్పినదాన్నే చెప్పకుండా ఉండేందుకు జాగ్రత్తపడండి. చెప్పాలనుకుంటున్న విషయాలు ఏమిటో మీ మనస్సులో స్పష్టంగా నిర్ణయించుకున్న తర్వాతనే మాట్లాడడం మొదలుపెట్టండి.
-
అనేక పదాలను వాడడం మూలంగా మంచి విషయాలు మరుగున పడిపోకుండా జాగ్రత్తపడండి. జ్ఞాపకముంచుకోవలసిన అవసరమున్న అంశాన్ని సరళమైన వాక్యంలో స్పష్టంగా చెప్పడం అలవాటు చేసుకోండి.
-
ఇతరుల మీద గౌరవం చూపించే విధంగా మాట్లాడండి.