దేవుని వలన కలిగే అద్భుతమగు నూతన లోకము
భాగం 10
దేవుని వలన కలిగే అద్భుతమగు నూతన లోకము
1, 2. శుభ్రపరచే అర్మగిద్దోను యుద్ధానంతరం ఏమి సంభవిస్తుంది?
శుభ్రపరచునట్టి దేవుని యుద్ధమగు అర్మగిద్దోను అనంతరం ఏమివస్తుంది? అప్పుడు అద్భుతమగు నూతన యుగం ప్రారంభమౌతుంది. అర్మగిద్దోనును తప్పించుకొనువారు దేవుని పాలనకు తమ యథార్థతను అప్పటికే నిరూపించుకున్నారు, గనుక నూతన లోకమందు ప్రవేశిస్తారు. మానవ కుటుంబానికి దేవునినుండి అద్భుతమైన ప్రయోజనాలు ప్రవహిస్తుండగా అది చరిత్రలో ఎంతటి పులకింపజేయు నూతనకాలమైయుంటుందోగదా!
2 తప్పించుకున్నవారు దేవుని రాజ్య నడిపింపు క్రింద పరదైసును విస్తరింప జేయనారంభిస్తారు. వారి శక్తి సామర్థ్యాలు అప్పుడు జీవించువారందరికి ప్రయోజనాన్నిచ్చే నిస్వార్థకార్యాలకు సమర్పించబడతాయి. అప్పుడు భూమి మానవుల కొరకు అందమైన, శాంతియుతమైన, సంతృప్తికరమైన గృహంగా మారుట కారంభిస్తుంది.
దుష్టత్వానికి మారుగా నీతి నిలుస్తుంది
3. అర్మగిద్దోను తర్వాత ఎట్టి సత్వర విముక్తి కల్గును?
3 సాతానులోకాన్ని నాశనం చేయుటమూలంగా యిదంతా సాధ్యమగును. విచ్ఛిన్నకర ప్రభుత్వాలు అబద్ధమతాలు, సాంఘీక వ్యవస్థలు, ఇకవుండవు; ప్రజలను మోసపుచ్చే సాతాను ప్రచారభేరి ఇకవుండదు; దానినుత్పన్నముచేసే సంస్థలన్నీ సాతాను విధానముతోపాటు అంతమౌతాయి. ఆలోచించండి: సాతాను లోకపు విషపూరిత వాతావరణమంతా అంతర్థానమొందుతుంది. అదెంతటి ఉపశమనమై యుండునో!
4. సంభవింపబోవు బోధనా పద్ధతిలోని మార్పును వర్ణించుము.
4 మానవపాలన యొక్క వినాశకర తలంపుల స్థానే దేవునినుండి వచ్చే ప్రోత్సాహకరమైన బోధ ఉంటుంది. ‘‘నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశమునొందెదరు.” (యెషయా 54:13) ప్రతిసంవత్సరం లభించే ఈ హితోపదేశంతో ‘‘సముద్రము జలములతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును.” (యెషయా 11:9) ప్రజలు చెడ్డవాటిని నేర్చుకొనరు గాని, ‘‘లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.” (యెషయా 26:9) అప్పుడు ప్రోత్సాహకరమగు తలంపులు క్రియలు ఉంటాయి.—అపొస్తలుల కార్యములు 17:31; ఫిలిప్పీయులు 4:8.
5. దుష్టత్వానికి దుష్టులకు ఏమి సంభవించును?
5 ఆ విధంగా, యిక హత్య, దౌర్జన్యం, మానభంగం, దోపిడి, మరేయితర నేరము ఉండదు. ఇతరుల దుష్క్రియలనుబట్టి ఎవరును బాధపడనక్కర్లేదు సామెతలు 10:30 యిట్లంటున్నది: ‘‘నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు; భక్తిహీనులు దేశములో నివసింపరు.”
పరిపూర్ణ ఆరోగ్యం పునరుద్ధరింపబడెను
6, 7. (ఎ) ఏ అసాధారణ విషయాన్ని రాజ్యపాలన అంతమొనర్చును? (బి) యేసు భూమిమీదనున్నపుడు దీనినెలా ప్రదర్శించాడు?
6 తొలి తిరుగుబాటువలన కలిగిన చెడుప్రభావములన్నింటికి నూతన లోకములో తిరోగమనముండును. ఉదాహరణకు, ఆ రాజ్యపాలన రోగాలను, వృద్ధాప్యమును తీసివేయును. నీవు ఏదోకొంత ఆరోగ్యాన్ని కల్గియున్నా, తుదకు నీవు మరణించే పర్యంతం వృద్ధుడవగుతూ చూపుమందగిస్తూ పల్లు ఊడిపోతూ వినికిడి క్షీణిస్తూ చర్మం ముడతలుపడుతూ అంతర్గత అవయవాలు పాడైపోతాయన్నది ఈనాటి చేదు నిజం.
7 అయితే, మన ఆది తలిదండ్రులనుండి మనం వారసత్వంగా పొందిన అట్టి దుఃఖకర స్థితిగతులు త్వరలోగతించి పోతాయి. యేసు భూమి మీదనున్నపుడు ఆరోగ్యం విషయంలో ఏమిప్రదర్శించి చూపెనో నీకు జ్ఞాపకమున్నదా? బైబిలు ఇలా వర్ణిస్తున్నది. ‘‘బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయనవారిని స్వస్థపరచెను. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడిరి.”—మత్తయి 15:30, 31.
8, 9. పరిపూర్ణ ఆరోగ్యం పునరుద్ధరించ బడినపుడు నూతన లోకంలో కల్గే ఆనందాన్ని వర్ణించుము.
8 నూతన లోకంలో మన రుగ్మతలన్నీ తొలగించబడగా ఎంతటి గొప్ప సంతోషం కల్గునో! అనారోగ్యంవల్ల కలిగే బాధ ఇక మనలనెన్నడు చిత్రవధకు గురిచేయదు. “‘నాకు దేహములో బాగులేదని’ అందులో నివసించువాడెవడును అనడు.” ‘‘గ్రుడ్డివారి కన్నులు తెరువబడును చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును. మూగవాని నాలుకపాడును.”—యెషయా 33:24; 35:5, 6.
9 ప్రతి ఉదయాన నీవు మేల్కొని క్రితంకంటె మరింత ఆరోగ్యవంతుడివిగా వున్నావని గుర్తెరుగుట పులకింతగా వుండదా? ఒక్కొక్కదినము గతించుచుండగా వృద్ధులైన వారు యౌవనులగుతున్నారని, చివరకు వారు ఆదాము హవ్వలు మొదట్లో అనుభవించిన శారీరక, మానసిక పరిపూర్ణతకు క్రమేపి చేరుకొందురని తెలుసుకొనుట వారికి సంతృప్తిదాయకం కాదా? బైబిలు వాగ్దానమేమంటే, ‘‘అప్పుడువాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగానుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును.” (యోబు 33:25) కళ్లద్దాలను, మందులను విసిరి పారవేయుట ఎంత ఆనందంగా ఉంటుంది! ఆసుపత్రులు, డాక్టర్లు, దంతవైద్యనిపుణులు యిక ఎన్నటికి అవసరముండదు.
10. మరణమున కేమి సంభవించును?
10 అట్టి అద్భుతమైన ఆరోగ్యాన్ని అనుభవించే వ్యక్తులు మరణించాలని కోరరు. వారు మరణించ నక్కర్లేదుకూడా, ఎందుకంటే మానవజాతి యిక వారసత్వ అపరిపూర్ణత, మరణము యొక్క బంధకముల క్రింద ఉండదు. ‘‘తన శత్రువులనందరిని తన పాదములక్రింద ఉంచువరకు ఆయన [క్రీస్తు] రాజ్యపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” ‘‘దేవుని కృపావరము . . . నిత్యజీవము.”—1 కొరింథీయులు 15:25, 26. రోమీయులు 6:23; మరియు యెషయా 25:8 కూడ చూడండి.
11. నూతనలోక మేలులను ప్రకటన ఎలా సంక్షిప్తపరుస్తుంది?
11 పరదైసునందలి మానవ కుటుంబం యెడల శ్రద్ధజూపే దేవునినుండి వచ్చు మేలులను సంక్షిప్తపరుస్తూ, బైబిలునందలి ఆఖరి పుస్తకమిట్లంటున్నది: ‘‘[దేవుడు] వారి కన్నుల ప్రతిబాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:3, 4.
మృతులు తిరిగి లేస్తారు
12. దేవుడనుగ్రహించిన పునరుత్థాన అధికారాన్ని యేసు ఎలా ప్రదర్శించాడు?
12 యేసు రోగులను స్వస్థపరచి, అంగవిహీనులను బాగుచేయుటయేగాక యింకా ఎంతోచేశాడు. ఆయన సమాధినుండి వ్యక్తులను కూడ లేపాడు. ఆ విధంగా, దేవుడాయనకు యిచ్చిన అద్భుతమైన పునరుత్థాన శక్తిని ఆయన ప్రదర్శించాడు. కుమార్తె చనిపోయిన ఓ వ్యక్తియింటికి యేసువచ్చిన సందర్భాన్ని నీవు జ్ఞాపకం తెచ్చుకోగలవా? చనిపోయిన బాలికతో యేసు యిట్లన్నాడు: ‘‘చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నాను.” అప్పుడేమైంది? “వెంటనే ఆ చిన్నదిలేచి నడవసాగెను.” దానినిచూచి అక్కడున్న ప్రజలు “బహుగా విస్మయమొందారు.” వారు సంతోషాన్ని పట్టలేకపోయారు!—మార్కు 5:41, 42; మరియు లూకా 7:11-16; యోహాను 11:1-45 కూడ చూడండి.
13. ఎలాంటి వ్యక్తులు పునరుత్థాను లౌతారు?
13 నూతనలోకంలో ‘‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవును.” (అపొస్తలుల కార్యములు 24:15) ఆ సమయాన యేసు మృతులను లేపుటకు దేవుడాయనకిచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తాడు. ఎందుకంటే, ఆయనిట్లన్నాడు: ‘‘పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.” (యోహాను 11:25) ఆయన యిలా కూడ అన్నాడు: ‘‘సమాధులలో [దేవుని జ్ఞాపకమందు] నున్న వారందరు ఆయన [యేసు] శబ్దమువిని . . . బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.
14. మరణమిక ఉండదు గనుక, ఏమేమి గతించిపోతాయి?
14 మృతులైనవారు సజీవులై గుంపులు గుంపులుగా తమ ప్రియులను కలుసుకునేందుకు వస్తున్నపుడు లోకమంతటా ఆనందం పెల్లుబుకుతుంది. బ్రతికున్నవారికి విచారాన్ని కల్గించే మరణవార్తలు యిక ఉండవు. ప్రతిగా దానికి భిన్నమైనవి ఉండవచ్చు: క్రొత్తగా పునరుత్థానము చేయబడిన వారిని గూర్చిన ప్రకటనలు వారి ప్రియులకు ఆనందాన్ని కల్గిస్తాయి. కావున అంత్యక్రియలు, చితులు, దహనవాటికలు, స్మశానవాటికలు యిక ఉండవు.
నిజమైన శాంతియుత లోకము
15. మీకా ప్రవచనం సంపూర్ణంగా ఎలా నెరవేరును?
15 జీవితమందలి అన్నిరంగాలలోను నిజమైనశాంతి నెలకొనియుంటుంది. యుద్ధాలు, యుద్ధాలను ప్రోత్సహించే వారు, ఆయుధాల తయారి గతించిపోతాయి. ఎందుచేత? ఎందుకంటే విభేదాలకు కారణమైన జాతి, తెగ, వర్ణవివక్షతలు అదృశ్యమౌతాయి. పిమ్మట సంపూర్ణస్థాయిలో ‘‘జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇకమానివేతురు.”—మీకా 4:3.
16. ఇక యుద్ధాలు జరుగకుండా దేవుడెలా చేస్తాడు?
16 తదేకంగా కొనసాగుతున్న యుద్ధపిపాసతోనిండిన మానవ చరిత్రదృష్ట్యా, ఈ విషయం ఆశ్చర్యంగా ఉండవచ్చును. అయితే, మానవజాతి మానవుల, దయ్యముల పాలన క్రింద ఉన్నందున అదలావుంది. నూతనలోకంలో, ఆ రాజ్యపాలన క్రింద యిలా జరుగుతుంది: ‘‘యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి . . . ఆయనే భూదిగంతములవరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”—కీర్తన 46:8, 9.
17, 18. నూతనలోకంలో మనిషికి, మృగాలకు మధ్యఎట్టి సంబంధ ముంటుంది?
17 ఏదెనులో ఉన్నట్లే మనిషి, మృగముకూడ శాంతియుతంగా ఉండును. (ఆదికాండము 1:28; 2:19) దేవుడిలా అన్నాడు: ‘‘ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలనుప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును . . . వారిని నిర్భయముగా నివసింపజేయుదును.”—హోషేయ 2:18.
18 ఆ శాంతి ఎంత విస్తృతంగావుంటుంది? ‘‘తోడేలు గెఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును. చిరుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.” జంతువులిక తమకు తాముగాని, మానవునికిగాని హాని చేయవు. ‘‘సింహము ఎద్దువలె గడ్డి తినును.”—యెషయా 11:6-9; 65:25.
భూమి పరదైసుగా మారును
19. భూమి ఎలా మారుతుంది?
19 మానవజాతి కొరకు భూమియంతా ఒక పరదైసుగా మారుతుంది. అందుకే యేసు తనను విశ్వసించిన వానితో ‘‘నీవు నాతోకూడ పరదైసులో ఉందువు” అని వాగ్దానం చేయగల్గాడు. బైబిలు యిలా అంటున్నది: ‘‘అరణ్యము ఎండిన భూమి సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలె పూయును . . . అరణ్యములో నీళ్లు ఉబుకును. అడవిలో కాలువలు పారును.”—లూకా 23:43; యెషయా 35:1, 6.
20. మానవజాతిని ఆకలి యిక ఎన్నటికి ఎందుకు బాధించదు?
20 దేవుని రాజ్యం క్రింద ఆకలిబాధ లక్షలాదిమందిని ఇక ఎన్నటికి బాధించదు. ‘‘దేశములోను పర్వతశిఖరముల మీదను సస్యసమృద్ధి కలుగును.” ‘‘ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంటపండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు.”—కీర్తన 72:16; యెహెజ్కేలు 34:27.
21. నిరాశ్రయులకు, మురికివాడలకు, నేరముతోనిండిన ప్రాంతాలకు ఏమి సంభవిస్తుంది?
21 పేదరికం, మురికివాడలు, నిరాశ్రయులు, లేక నేరముతోనిండిన ప్రాంతాలు ఇక ఎంతమాత్రముండవు. ‘‘జనులు ఇండ్లుకట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్షాతోటలు నాటించుకొని వాటిఫలము ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు.” ‘‘ఎవరి భయము లేకుండ ప్రతివారును తనద్రాక్ష చెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును.”—యెషయా 65:21, 22; మీకా 4:4.
22. దేవునిపాలన యొక్క ఆశీర్వాదములను బైబిలు ఎలా వర్ణిస్తుంది?
22 పరదైసులో మానవులు వీటికి తోడు మరియితర అనేకమైన వాటితో ఆశీర్వదింపబడతారు. కీర్తన 145:16 యిట్లంటున్నది: ‘‘నీవు [దేవుడు] నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు.” బైబిలు ప్రవచనం యిట్లనడంలో ఆశ్చర్యం లేదు: ‘‘దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు . . . నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:11, 29.
గతాన్ని తీసివేయుట
23. మనము అనుభవించిన బాధనంతటిని దేవుని రాజ్యమెలా అంతమొనర్చును?
23 గత ఆరువేల సంవత్సరాలనుండి మానవ కుటుంబానికి సంభవించిన నష్టాన్ని దేవుని రాజ్యం తీసివేస్తుంది. అప్పుడుండే ఆనందడోలలు ప్రజలు అనుభవించియున్న ఎట్టి బాధనైనా మరిపింపజేస్తాయి. ప్రజల దైనందిన జీవితమందలి ప్రోత్సాహకరమగు ఆలోచనలు, చర్యలు, బాధాకరమైన జ్ఞాపకాలను క్రమేపి తుడిచివేస్తాయి.
24, 25. (ఎ) సంభవింపబోవు దానినిగూర్చి యెషయా ఎలా, ఏమని ప్రవచించాడు? (బి) గతమందలి బాధను గూర్చిన జ్ఞాపకాలు అదృశ్యమగునని మనమెందుకు నిశ్చయత కల్గియుండ గలము?
24 శ్రద్ధచూపే దేవుడిలా తెల్పాడు: ‘‘నేను క్రొత్త ఆకాశమును [మానవ జాతిని పాలించు ఒక క్రొత్త పరలోక ప్రభుత్వము] క్రొత్తభూమిని [నీతియుక్తమైన మానవ సమాజం] సృజించుచున్నాను. మునుపటివి మరువబడును. జ్ఞాపకమునకురావు. నేను సృజించుదాని గూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించుడి.” ‘‘భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు.”—యెషయా 14:7; 65:17, 18.
25 నేటివరకు కొనసాగిన చెడుపరిస్థితి నంతటిని దేవుడు తన రాజ్యం ద్వారా పూర్తిగా మార్చివేయును. గతంలో మనం పొందిన ఎటువంటి హానినైనను మరిపించగల గొప్ప ఆశీర్వాదములను మనపై కురిపించుటద్వారా ఆయన తన అధికశ్రద్ధను నిరంతరం మన యెడల చూపిస్తాడు. క్రితం మనం అనుభవించిన సమస్యలను జ్ఞప్తికి తెచ్చుకోవాలని ప్రయత్నించినా అప్పుడవి మన జ్ఞాపకమునకు రావు.
26. మన గత బాధలకు దేవుడెందుకు పరిహారం చెల్లించును?
26 మనమీ లోకంలో సహించిన బాధకు దేవుడావిధంగా పరిహారం చెల్లిస్తాడు. మనం అసంపూర్ణులుగా జన్మించుట అది మన దోషం కాదని, మన ఆది తలిదండ్రులనుండి మనం అసంపూర్ణతను సంతరించుకున్నందున అలా జన్మించామని ఆయనకు తెలుసు. మనం సాతాను లోకంలో జన్మించడం మన తప్పుకాదు, ఎందుకంటె ఆదాము హవ్వలు నమ్మకముగావుంటె మనం పరదైసులో జన్మించేవాళ్లమే. కావున మనపై గతంలో మోపబడిన చెడును తొలగించుటేగాక దేవుడు కనికరముతో ఇంకెంతో నెరవేర్చుతాడు.
27. నూతన లోకంలో ఏ ప్రవచనములు అద్భుత నెరవేర్పును కలిగిఉంటాయి?
27 మానవజాతి నూతన లోకంలో రోమీయులు 8:21, 22 నందు ప్రవచించబడిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తుంది: ‘‘ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనైన దాస్యమునుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందు నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దాని లోపరచిన వానిమూలముగా వ్యర్థపరచబడెను.” అప్పుడు ప్రజలు ఈ ప్రార్థన యొక్క సంపూర్ణ నెరవేర్పును చూడగలరు: ‘‘నీ రాజ్యము వచ్చుగాక. నీచిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.” (మత్తయి 6:10) భూపరదైసులో నుండు అద్భుత పరిస్థితులు పరలోక పరిస్థితులను పోలియుండును.
[అధ్యయన ప్రశ్నలు]
[23 వ పేజీలోని చిత్రాలు]
నూతనలోకంలో వృద్ధులు యౌవనస్థితికి తిరిగి చేరుకుంటారు
[24 వ పేజీలోని చిత్రం]
నూతనలోకంలో సమస్త రుగ్మతలు, అంగవికలతలు నిర్మూలించబడతాయి
[25 వ పేజీలోని చిత్రం]
నూతనలోకంలో మృతులు పునరుత్థానులౌతారు
[26 వ పేజీలోని చిత్రం]
‘వారిక ఎన్నడును యుద్ధం నేర్చుకొనరు’
[27 వ పేజీలోని చిత్రాలు]
పరదైసునందు మనుష్యులు, మృగాలు సంపూర్ణ సమాధానములతో ఉండును
[27 వ పేజీలోని చిత్రం]
‘దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవికోరికను తృప్తిపరచును’
[28 వ పేజీలోని చిత్రం]
మన మనుభవించిన సమస్త బాధను తొలగించుటకంటె దేవుని రాజ్యం యింకెంతో నెరవేరుస్తుంది?