మీరు నిజమైన మతాన్ని ఎలా కనుగొనగలరు?
పాఠం 13
మీరు నిజమైన మతాన్ని ఎలా కనుగొనగలరు?
మతాలన్నీ దేవునికి ప్రీతికరమైనవేనా, లేక ఒకటి మాత్రమేనా? (1)
క్రైస్తవులని చెప్పుకొనే వారిలో అనేక శాఖలు ఎందుకున్నాయి? (2)
నిజ క్రైస్తవులను మీరెలా గుర్తించవచ్చు? (3-7)
1. యేసు ఒకే నిజమైన క్రైస్తవమతాన్ని ప్రారంభించాడు. కాబట్టి నేడు యెహోవా దేవుని సత్యారాధికుల ఒకే సమూహము లేక గుంపు ఉండాలి. (యోహాను 4:23, 24; ఎఫెసీయులు 4:4, 5) జీవానికి నడిపే ఇరుకు మార్గంలో కేవలం కొద్దిమందే ఉన్నారని బైబిలు బోధిస్తుంది.—మత్తయి 7:13, 14.
2. అపొస్తలుల మరణం తర్వాత తప్పుడు బోధలు, క్రైస్తవేతర ఆచారాలు క్రమేణ క్రైస్తవ సంఘంలోకి ప్రవేశిస్తాయని బైబిలు ముందే తెలియజేసింది. క్రీస్తును అనుసరించే బదులు తమను అనుసరించేలా ఆ మనుష్యులు విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తారు. (మత్తయి 7:15, 21-23; అపొస్తలుల కార్యములు 20:29, 30) అందుకే క్రైస్తవులమని చెప్పుకొనే అనేక విభిన్న శాఖలను మనం చూస్తాము. మనం నిజ క్రైస్తవులను ఎలా గుర్తించగలము?
3. నిజ క్రైస్తవులను గూర్చిన అత్యంత విశేషమైన గుర్తు ఏమిటంటే, నిజమైన ప్రేమ వారి మధ్య ఉండడమే. (యోహాను 13:34, 35) ఇతర జాతులు లేక ఇతర శరీర రంగుల ప్రజలకంటే తాము శ్రేష్ఠులమని తలంచేలా వారికి బోధింపబడలేదు. ఇతర దేశాలకు చెందిన ప్రజలను ద్వేషించమనీ వారికి బోధింపబడలేదు. (అపొస్తలుల కార్యములు 10:34, 35) కాబట్టి వారు యుద్ధాల్లో పాల్గొనరు. నిజ క్రైస్తవులు ఒకరినొకరు సహోదర సహోదరీల వలె చూసుకుంటారు.—1 యోహాను 4:20, 21.
4. నిజమైన మతంయొక్క మరో గుర్తు ఏమిటంటే, దాని సభ్యులకు బైబిలు ఎడల ప్రగాఢమైన గౌరవం ఉండడమే. వారు దాన్ని దేవుని వాక్యమని అంగీకరించి, అది చెప్పేదాన్ని నమ్ముతారు. (యోహాను 17:17; 2 తిమోతి 3:16, 17) వారు మానవ ఉద్దేశాలు లేక ఆచారాల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తారు. (మత్తయి 15:1-3, 7-9) వారు అనుదినం బైబిలు అనుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వారు ఒకటి చెప్పి, మరొకటి చేయరు.—తీతు 1:15, 16.
5. నిజమైన మతం దేవుని నామాన్ని గౌరవించాలి కూడా. (మత్తయి 6:9) యెహోవా అనే దేవుని పేరును యేసు ఇతరులకు తెలియజేశాడు. నిజ క్రైస్తవులు అలాగే చేయాలి. (యోహాను 17:6, 26; రోమీయులు 10:13, 14) మీ ప్రాంతంలో ఉన్న ఎవరు దేవుని పేరు గురించి ఇతరులకు చెబుతున్నారు?
6. నిజ క్రైస్తవులు దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి. యేసు అలాగే చేశాడు. ఆయన ఎల్లప్పుడూ ఆ రాజ్యం గురించి మాట్లాడాడు. (లూకా 8:1) ఇదే వర్తమానాన్ని భూవ్యాప్తంగా ప్రకటించమని ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 24:14; 28:19, 20) కేవలం దేవుని రాజ్యమే ఈ భూమిపైకి నిజమైన శాంతి భద్రతలను తెస్తుందని నిజ క్రైస్తవులు నమ్ముతారు.—కీర్తన 146:3-5.
7. యేసు శిష్యులు ఈ దుష్ట లోకంలో భాగమై ఉండకూడదు. (యోహాను 17:16) వారు ప్రపంచ రాజకీయ, సామాజిక వివాదాల్లో జోక్యం చేసుకోరు. ప్రపంచంలో సర్వసాధారణమైయున్న హానికరమైన ప్రవర్తనను, అలవాట్లను, దృక్పథాలను వారు విసర్జిస్తారు. (యాకోబు 1:27; 4:4) నిజ క్రైస్తవత్వపు ఈ గుర్తులున్న ఒక మత గుంపును మీరు మీ ప్రాంతంలో గుర్తించగలరా?
[27వ పేజీలోని చిత్రం]
నిజ క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, బైబిలును గౌరవిస్తారు, మరియు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తారు