కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

13వ అధ్యాయం

దేవునికి ఇష్టంలేని పండుగలు, ఆచారాలు

దేవునికి ఇష్టంలేని పండుగలు, ఆచారాలు

‘ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుకొనుడి.’—ఎఫెసీయులు 5:10.

1. (ఎ) యెహోవా ఎలాంటి ప్రజల్ని తనవైపు ఆకర్షించుకుంటాడు? (బి) ఆయనకు ఏది ప్రీతికరమైనదో వారు ఎందుకు పరీక్షిస్తూ ఉండాలి?

 ‘యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధిస్తారు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు’ అని యేసు చెప్పాడు. (యోహాను 4:23) అలాంటివారిని కనుగొన్నప్పుడు యెహోవా మిమ్మల్ని ఆకర్షించినట్లే వారిని కూడా తనకు, తన కుమారునికి దగ్గరయ్యేలా చేస్తాడు. (యోహాను 6:44) అదెంత గొప్ప వరం! అయితే, బైబిలు సత్యాన్ని ప్రేమించేవారు, ‘ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుకోవాలి.’ ఎందుకంటే సాతాను పచ్చి మోసగాడు.—ఎఫెసీయులు 5:10; ప్రకటన 12:9.

2. సత్యారాధనను అబద్ధారాధనను మిళితం చేస్తే యెహోవా సహిస్తాడా? వివరించండి.

2 సీనాయి పర్వతంపై ఏమి జరిగిందో చూడండి. ఇశ్రాయేలీయులు తమ కోసం ఒక దేవతను తయారు చేయమని అహరోనును అడిగారు. అప్పుడు ఆయన ఒక బంగారు దూడను చేసి, అదే యెహోవా అన్నట్లు మాట్లాడుతూ, “రేపు యెహోవాకు పండుగ జరుగును” అని చెప్పాడు. అయితే, సత్యారాధనను అబద్ధారాధనతో మిళితం చేసినప్పుడు యెహోవా చూస్తూ ఊరుకున్నాడా? లేదు. ఆయన ఆజ్ఞమేరకు దాదాపు మూడువేలమంది విగ్రహారాధకులు చంపబడ్డారు. (నిర్గమకాండము 32:1-6, 10, 28) దీనిలో మనకే పాఠం ఉంది? దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే, మనం ‘అపవిత్రమైన దేనినీ ముట్టకూడదు,’ యెహోవాపై సంపూర్ణ భక్తితో సత్యారాధనను కలుషితం చేసే వేటికైనా దూరంగా ఉండాలి.—యెషయా 52:11; యెహెజ్కేలు 44:23; గలతీయులు 5:9.

3, 4. ప్రజాదరణ పొందిన పండుగల, ఆచారాల గురించి పరిశీలిస్తున్నప్పుడు బైబిలు సూత్రాలను పరిగణలోకి తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

3 అపొస్తలులు బ్రతికున్నంతకాలం మతభ్రష్టత్వానికి అడ్డుగా నిలిచారు. విచారకరంగా వారు చనిపోయిన తర్వాత, బైబిలు సత్యంపట్ల ప్రేమలేని నామకార్థ క్రైస్తవులు అన్యమత ఆచారాలను, వేడుకలను, సెలవుదినాలను పాటించడం మొదలుపెట్టి వాటిని క్రైస్తవ పండుగలుగా చిత్రీకరించారు. (2 థెస్సలొనీకయులు 2:7, 10) అలాంటి ఆచారాలు, పండుగల్లో కొన్నిటిని మీరు పరిశీలిస్తుండగా, వాటిలో దేవుని ఆలోచనా విధానం కాదుగానీ ఈ లోక ఆలోచనా విధానం ఎలా కనిపిస్తుందో తెలుసుకుంటారు. సాధారణంగా ఈ లోక వేడుకలు ఆకర్షణీయంగా ఉండి, “మహాబబులోను” సంబంధమైన అబద్ధమత నమ్మకాలను, దయ్యాల సంబంధమైన ఆచారాలను ప్రోత్సహిస్తాయి. a (ప్రకటన 18:2-4, 23) నేడు ప్రజాదరణ పొందిన ఆచారాలు ఎలాంటి హేయకరమైన అన్యమత ఆచారాల నుండి పుట్టుకొచ్చాయో యెహోవాకు తెలుసన్న విషయం మరచిపోకండి. కాబట్టే యెహోవా ఇప్పటికీ వాటిని అసహ్యించుకుంటున్నాడు. ఈ విషయంలో యెహోవా అభిప్రాయాలే మనకు ప్రాముఖ్యం.—2 యోహాను 6, 7.

4 యెహోవా కొన్ని పండుగల్ని, ఆచారాల్ని ఇష్టపడడని నిజ క్రైస్తవులమైన మనకు తెలుసు. కాబట్టి మనం అలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకోవాలి. యెహోవా ఎందుకు వాటిని ఇష్టపడడంలేదో తెలుసుకుంటే, మనం ఆయన ప్రేమలో నిలిచివుండకుండా అడ్డుపడే దేనికైనా దూరంగా ఉండగలుగుతాం.

సూర్యుని పండుగే క్రిస్మస్‌గా మారింది

5. యేసు డిసెంబరు 25న పుట్టలేదని మనం ఎందుకు ఖచ్చితంగా చెప్పవచ్చు?

5 యేసు జన్మదిన వేడుక గురించి బైబిల్లో ఎలాంటి ప్రస్తావనా లేదు. నిజానికి, ఆయన పుట్టిన తేదీ ఏదో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆయన డిసెంబరు 25న పుట్టలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, ఎందుకంటే ఆ నెలలో బేత్లెహేములో విపరీతమైన చలి ఉంటుంది. b యేసు పుట్టినప్పుడు, ‘గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాస్తున్నారు’ అని లూకా రాశాడు. (లూకా 2:8-11) ఒకవేళ సంవత్సరం పొడవునా వాళ్లు అలా “పొలములో” ఉండేవారైతే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండేదికాదు. అయితే, డిసెంబరు నెలలో బేత్లెహేములో వర్షాలు, మంచు కురుస్తూ, చలిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మందల్ని ‘పొలములోకి’ తీసుకువెళ్ళే ప్రసక్తే లేదు. అంతేకాదు, జనాభా లెక్కించాలని కైసరు ఔగుస్తు ఆజ్ఞాపించడంతో యోసేపు మరియలు బేత్లెహేముకు వెళ్లారు. (లూకా 2:1-7) అప్పటికే రోమా పరిపాలనంటే గిట్టని ప్రజలకు ఎముకలు కొరికే చలిలో, జనాభా లెక్కల కోసం స్వస్థలాలకు వెళ్ళమని కైసరు ఆజ్ఞ ఇచ్చుండేవాడు కాదు.

6, 7. (ఎ) క్రిస్మస్‌ ఆచారాలు ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి? (బి) క్రిస్మస్‌ రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి, క్రైస్తవులు బహుమతులు ఇవ్వడానికి తేడా ఏమిటి?

6 బైబిల్లో క్రిస్మస్‌ గురించి లేదు. అది ప్రాచీన అన్యమతాల పండుగల నుండి పుట్టింది. ఉదాహరణకు, ఆ రోజునే రోమన్లు శాటర్న్‌ అనే వ్యవసాయ దేవతకు శాటర్నేలియా అనే పండుగ చేసేవారు. అలాగే మిత్ర అనే దేవతను ఆరాధించే ప్రజలు డిసెంబరు 25 “అజేయుడైన సూర్యుని పుట్టిన రోజు” అని అనుకొని పండుగ జరుపుకునేవారని న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది. క్రీస్తు చనిపోయిన దాదాపు మూడు శతాబ్దాల తర్వాత, “రోములో సూర్యుని ఆరాధన ప్రబలంగా ఉన్న కాలంలో క్రిస్మస్‌ పండుగ జరుపుకోవడం ఆరంభించారు” అని అదే ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది.

నిజ క్రైస్తవులు ప్రేమతో ఇస్తారు

7 అన్యులు తమ పండుగల్లో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ విందులు చేసుకునేవారు, అవే ఆచారాలు నేడు క్రిస్మస్‌ పండుగలో కూడా కనిపిస్తాయి. అయితే అప్పటిలాగే నేడు కూడా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటున్న చాలామంది 2 కొరింథీయులు 9:7⁠లోని ఈ మాటలను పాటించడం లేదు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” నిజ క్రైస్తవులు ప్రేమతో బహుమతులు ఇస్తారు కానీ అవతలి వ్యక్తి ఏదో తిరిగి ఇవ్వాలని ఆశించరు, అలాగే ఫలానా తేదీనే బహుమతులు ఇవ్వాలని అనుకోరు. (లూకా 14:12-14; అపొస్తలుల కార్యములు 20:35 చదవండి.) క్రిస్మస్‌ సమయంలో ప్రజలు అదుపుతప్పి చేసే అల్లర్ల నుండి, అనవసరమైన అప్పుల భారం నుండి విముక్తులైనందుకు వారెంతో ఆనందిస్తారు.—మత్తయి 11:28-30; యోహాను 8:32.

8. జ్యోతిష్కులు యేసుకు ఇచ్చినవి జన్మదిన కానుకలా? వివరించండి.

8 “జ్ఞానులు [‘జ్యోతిష్కులు,’ NW]” యేసుకు జన్మదిన కానుకలు ఇచ్చారు కదా అని కొందరు వాదించవచ్చు. బహుమతులు తీసుకువెళ్ళడం వాస్తవమే, కానీ అప్పట్లో సాధారణంగా ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు బహుమతులు తీసుకువెళ్ళినట్లే యేసుకోసం కూడా తీసుకువెళ్ళారు. (1 రాజులు 10:1, 2, 10, 13; మత్తయి 2:2, 10, 11) అయితే, అవి పుట్టినరోజు కానుకలు కాదు. అసలు ఆ రోజు వాళ్లు అక్కడికి వెళ్లనే లేదు. యేసు పశువుల పాకలో ఉన్నప్పుడు కాదుగానీ కొన్ని నెలల తర్వాతే వాళ్ళింటికి వెళ్ళారు.

జన్మదిన వేడుకల గురించి బైబిలు ఏమి చెబుతోంది?

9. బైబిల్లో ప్రస్తావించబడిన రెండు జన్మదిన వేడుకల్లో ఏమి జరిగింది?

9 పిల్లలు పుట్టడం సంతోషకరమైన విషయమే అయినా, దేవుని సేవకులు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న దాఖలాలు బైబిల్లో లేవు. (కీర్తన 127:3) అయితే, దేవుని సేవకులుకాని ఇద్దరు అంటే ఐగుప్తు రాజైన ఫరో, హేరోదు అంతిప జరుపుకున్న జన్మదిన వేడుకల గురించి బైబిలు ప్రస్తావిస్తోంది. (ఆదికాండము 40:20-22; మార్కు 6:21-29 చదవండి.) ఈ రెండు సందర్భాల్లోనూ చెడే జరిగింది, ముఖ్యంగా రెండవ దానిలో బాప్తిస్మమిచ్చు యోహాను తల తీసివేయబడింది. అందుకే బైబిలు వాటి గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడడం లేదు.

10, 11. తొలిక్రైస్తవులు జన్మదిన వేడుకలను ఎలా చూసేవారు? ఎందుకు?

10 “తొలి క్రైస్తవులు జన్మదిన వేడుకలు జరుపుకోవడాన్ని అన్యమత ఆచారంగా చూసేవారు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెప్పింది. ఉదాహరణకు, ప్రతీ వ్యక్తిని ఒక ఆత్మ రక్షిస్తుందని, అది వాళ్ల పుట్టిన రోజు వేడుకకు హాజరై అప్పటినుండి జీవితాంతం వారిని కాపాడుతుందని ప్రాచీన గ్రీసు దేశస్థులు నమ్మేవారు. “ఆ వ్యక్తి ఏ దేవుడు పుట్టిన రోజునైతే పుట్టాడో ఆ దేవునికి,” ఈ ఆత్మకు “ఏదో సంబంధం ఉంటుంది” అని ద లోర్‌ ఆఫ్‌ బర్త్‌డేస్‌ అనే పుస్తకం చెప్పింది. అంతేగాక, చాలాకాలంగా ప్రజలు పుట్టినరోజు నాడు తిథి, నక్షత్రాలను, జ్యోతిష్యాన్ని చూస్తారు.

11 జన్మదిన ఆచారాలు దయ్యాల సంబంధమైనవి, అన్యమతాల నుండి వచ్చాయన్న కారణాలవల్లే కాదుగానీ తమ మత నమ్మకాలనుబట్టి కూడా పూర్వం దేవుని సేవకులు వాటికి దూరంగా ఉండేవారు. ఎందుకు? ఎందుకంటే వారు వినయం, నమ్రతగల ప్రజలు. తాము పుట్టి, ఈ లోకంలోకి అడుగుపెట్టడం వేడుక జరుపుకోవాల్సినంత గొప్ప విశేషమని వారు అనుకోలేదు. c (మీకా 6:8; లూకా 9:48) బదులుగా యెహోవా తమకు విలువైన జీవాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞులుగా ఉంటూ ఆయనను మహిమపర్చారు. dకీర్తన 8:3, 4; 36:9; ప్రకటన 4:10, 11.

12. మన జన్మదినంకంటే మరణదినమే మేలు అని ఎందుకు చెప్పవచ్చు?

12 యథార్థవంతులు ఒకవేళ చనిపోయినా, దేవుడు వారిని గుర్తుంచుకుంటాడు, వారికి భవిష్యత్తులో మళ్లీ జీవం అనుగ్రహిస్తాడు. (యోబు 14:14, 15) “సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మదినముకంటె మరణదినమే మేలు” అని ప్రసంగి 7:1 చెబుతోంది. “మంచి పేరు” అంటే దేవుణ్ణి నమ్మకంగా సేవించి ఆయన దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవడమని అర్థం. మనకు రక్షణ కలుగజేసే శ్రేష్ఠమైన “నామము” యేసు పొందాడు. కాబట్టి క్రైస్తవులకు, ఆయన జన్మదినం కాదుగానీ మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోమని మాత్రమే ఆదేశించబడింది.—హెబ్రీయులు 1:3, 4; లూకా 22:17-20.

సంతాన సాఫల్య దేవత ఆరాధనే ఈస్టర్‌కు మూలం

13, 14. అనేకమంది ఆచరించే ఈస్టర్‌ పండుగకు మూలం ఏమిటి?

13 క్రీస్తు పునరుత్థాన పండుగగా జరుపుకుంటున్న ఈస్టర్‌ నిజానికి అబద్ధ మతం నుండి పుట్టింది. ముందుగా, ఈస్టర్‌ అన్న పదమే ఆంగ్లో-శాక్సన్‌ల వెలుగు దేవత, వసంత రుతువు దేవతయైన ఈస్ట్రే లేదా ఈయోస్టర్‌ పేరు నుండి వచ్చింది. మరి ఈస్టర్‌ పండుగలో కుందేళ్లు, గుడ్లు ఎందుకు వాడతారు? గుడ్లు సాధారణంగా “కొత్త జీవితానికి, పునరుత్థానానికి సూచన”గా ఉపయోగించబడతాయి అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. అదే కుందేళ్ళైతే చాలాకాలంగా సంతాన సాఫల్యానికి గుర్తుగా ఉపయోగించబడుతున్నాయి. కాబట్టి నిజం చెప్పాలంటే సంతాన సాఫల్యానికి సంబంధించిన ఆచారమే కొద్దిగా మారి క్రీస్తు పునరుత్థాన పండుగైన ఈస్టర్‌గా మారింది. e

14 అంత అసహ్యకరమైన మూలం నుండి పుట్టుకొచ్చిన పండుగను తన కుమారుని పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకొనే పండుగగా మారిస్తే యెహోవా సహిస్తాడా? అస్సలు సహించడు! (2 కొరింథీయులు 6:16-18) యేసు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వేడుక జరపాలని బైబిల్లో ఎక్కడా లేదు. పైగా ఈస్టర్‌ పేరుతో దాన్ని చేయడం యెహోవాను మరింత అవమానపర్చినట్లు అవుతుంది.

ఆల్‌ సెయింట్స్‌ డే, ఆల్‌ సోల్స్‌ డే

15. ఆల్‌ సెయింట్స్‌ డే, ఆల్‌ సోల్స్‌ డే పండుగల్లో లేఖన విరుద్ధమైన ఎలాంటి ఆచారాలు కనిపిస్తాయి?

15 క్యాథలిక్‌ చర్చి “సెయింట్ల” గౌరవార్థం జరుపుకునే వేడుకను ఆల్‌ సెయింట్స్‌ డే అంటారు. దీన్ని పాశ్చాత్య దేశాల్లో నవంబరు 1న జరుపుకుంటారు. అసలు ఆ తేదీని ఎందుకు ఎంచుకున్నారనేది తెలియదు. దానికి ద న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా కొంత వివరణ ఇచ్చింది. బ్రిటన్‌ ద్వీపాల్లో, ఐరోపా దేశాల్లో ఒకప్పుడు సెల్టు జాతివారు నివసించేవారు. ‘వారు సమ్‌హేయిన్‌ అనే పేరుతో చనిపోయినవారి కోసం పండుగ చేసేవారు. దాని స్థానంలో మరో పండుగను పెట్టాలనే ఉద్దేశంతో క్రైస్తవులు ఆ తేదీని ఎన్నుకుని ఉండవచ్చు. అంతేకాదు, నవంబరు 1వ తేదీతో ఆ ప్రాంతంలో శీతాకాలం మొదలయ్యేది కాబట్టి బహుశా సెయింట్ల గౌరవార్థం విందు చేసుకోవడానికి ఆ రోజు మంచిదనిపించి ఆ తేదీని ఎన్నుకొని ఉండవచ్చు.’ ఇక ఆల్‌ సోల్స్‌ డే విషయానికొస్తే దాన్ని నవంబరు 2వ తేదీన జరుపుకుంటారు. దాని గురించి అదే ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “సమాధులలో ఉన్న ఆత్మలు ఆ రోజున బయటకు వచ్చి, చనిపోయే ముందు తమకు హాని చేసినవారికి దయ్యాల, కప్పల రూపంలో కనిపిస్తాయని మధ్య యుగంలో ప్రజలు నమ్మేవారు.” నేటికీ ప్రజలు ఊరేగింపుగా శ్మశాన వాటికకు వెళ్లి భోజన పదార్థాలు పెట్టి, ఇతరత్రా ఆచారాలు పాటిస్తారు. సత్య దేవుడైన యెహోవాకు అసహ్యమైన అన్యమత నమ్మకాల, ఆచారాల నుండి ఈ పండుగ వచ్చిందని మనకు స్పష్టంగా తెలుస్తోంది.

పెళ్లి వేడుకల్లో అపవిత్రమైన ఆచారాలు పాటించకండి

16, 17. (ఎ) పెళ్లి చేసుకోవాలనుకునే క్రైస్తవులు బైబిలు సూత్రాల ప్రకారం స్థానిక ఆచారాలు సరైనవో కావో ఎందుకు పరిశీలించాలి? (బి) బియ్యం లేదా పువ్వులు లాంటివి చల్లే ఆచారాల విషయంలో క్రైస్తవులు వేటి గురించి ఆలోచించాలి?

16 “పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును [మహా బబులోనులో] ఇక ఎన్నడును వినబడవు.” (ప్రకటన 18:22, 23) ఎందుకు? ఎందుకంటే, మహా బబులోను త్వరలోనే నాశనం చేయబడుతుంది. అబద్ధ మతాలకు చెందిన దయ్యాల సంబంధిత ఆచారాలవల్ల మొదటి రోజే భార్యాభర్తల బంధం అపవిత్రమయ్యే అవకాశం ఉంది.—మార్కు 10:6-9.

17 ఆచారపద్ధతులు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని ఆచారాలు పైకి మామూలుగానే కనిపిస్తాయి కానీ, అవి బబులోను సంబంధమైన ఆచారాల నుండి పుట్టుకొచ్చినవై ఉండవచ్చు. వధూవరులకు లేదా వారి బంధువులకు ‘మంచి జరగాలని’ వాటిని పాటిస్తారు. (యెషయా 65:11) అలాంటి ఆచారాల్లో వధూవరులపై బియ్యం లేదా పువ్వులు లాంటివి చల్లడం ఒకటి. అలా చల్లితే దయ్యాలు శాంతించి వధూవరులకు ఏ హానీ చేయవనే నమ్మకం నుండి ఈ ఆచారం వచ్చివుండవచ్చు. అంతేకాదు, బియ్యం సంతాన సాఫల్యానికి, సంతోషానికి, దీర్ఘాయుష్షుకు తోడ్పడుతుందని చాలాకాలంగా ప్రజలు నమ్ముతున్నారు. కానీ, దేవుని ప్రేమలో నిలిచివుండాలని కోరుకునేవారు ఇలాంటి హేయకరమైన ఆచారాలకు దూరంగా ఉండాలి.—2 కొరింథీయులు 6:14-18 చదవండి.

18. పెళ్లి చేసుకునేవారు, అతిథులు ఏ బైబిలు సూత్రాలను మనసులో ఉంచుకోవాలి?

18 యెహోవా సేవకులు, పెళ్లి వేడుకల్లో క్రైస్తవులకు తగని లేదా ఎవరికైనా అభ్యంతరంగా అనిపించే ఆచారాలు పాటించరు. ఉదాహరణకు, వ్యంగ్యంగా, సరసంగా, ద్వంద్వార్థాలు మాట్లాడరు. వధూవరుల్ని, ఇతరుల్ని ఇబ్బందిపెట్టే అల్లరి పనులు చేయరు. (సామెతలు 26:18, 19; లూకా 6:31; 10:27) అంతేకాదు, అణకువను కాక ‘జీవపుడంబాన్ని’ ప్రతిబింబించే ఆడంబరమైన విందులు చేసుకోరు. (1 యోహాను 2:16) మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే, మీ పెళ్లిరోజు తీపి గుర్తుగా ఉండాలే గానీ చేదు అనుభవంగా మిగిలిపోకూడదని యెహోవా కోరుకుంటున్నాడని మరచిపోకండి. f

మద్యం గ్లాసులు పైకెత్తి తాకించడం తప్పా?

19, 20. (ఎ) టోస్టింగ్‌ ఎలా ప్రారంభమైందని ఒక పుస్తకం చెబుతుంది? (బి) క్రైస్తవులు టోస్టింగ్‌ ఎందుకు చేయరు?

19 పెళ్లిళ్లలో, పార్టీల్లో మద్యం తాగేముందు చాలామంది గ్లాసులు ఒకదానికొకటి తాకించి “చియర్స్‌” అని అంటారు. దాని గురించి ఇంటర్‌నేషనల్‌ హ్యాండ్‌బుక్‌ ఆన్‌ ఆల్కహాల్‌ అండ్‌ కల్చర్‌ 1995 ఇలా చెబుతోంది: ‘పూర్వం ప్రజలు, ఒకరి దీర్ఘాయుష్షు లేదా సంక్షేమం కోసం దేవునికి ప్రార్థించి, వాటిని తీర్చేందుకు దేవుళ్ళకు పవిత్ర జలాన్ని అర్పించేవారు. అలా జలాంజలి అర్పించే ఆచారమే నేడు టోస్టింగ్‌ [గ్లాసులు తాకించి చియర్స్‌ అనడం] ఆచారంగా మారింది.’

20 దానికి, మతంతో గానీ మూఢనమ్మకాలతో గానీ అసలు సంబంధమే లేదని చాలామంది అనుకుంటారు. అయితే అలా గ్లాసులను పైకెత్తడం అనేది ఏదైనా వరమిమ్మని మానవాతీత శక్తులను కోరినట్లు అవుతుంది. కానీ బైబిలు ప్రకారం అలా చేయడం తప్పు.—యోహాను 14:6; 16:23. g

“యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి”

21. మతంతో సంబంధం లేకపోయినా, ప్రజాదరణ పొందిన ఎలాంటి పండుగలకు క్రైస్తవులు దూరంగా ఉండాలి? ఎందుకు?

21 కొన్ని దేశాల్లో జరిగే వార్షిక కార్నివాల్స్‌ లేదా పండుగలను చూస్తే నేడు లోకంలో నైతిక విలువలు ఎంతమేరకు దిగజారిపోతున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. వాటిలో కొన్ని మహా బబులోనుకు సంబంధించినవై ఉండవచ్చు, మరి కొన్నింటికి మతంతో అంతగా సంబంధం లేకపోవచ్చు. అలాంటి కార్నివాల్స్‌లో అసభ్యకరంగా డ్యాన్స్‌ చేయడం, స్వలింగ సంయోగుల జీవన శైలిని ప్రోత్సహించడం కనిపిస్తుంది. యెహోవాను ప్రేమించేవాళ్లు అలాంటి వేడుకలకు వెళ్లడం, వాటిని చూడడం సరైనదేనా? అలాచేసే వాళ్లు తాము నిజంగా చెడును అసహ్యించుకుంటున్నామని చూపిస్తారా? (కీర్తన 1:1, 2; 97:10) “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము” అని ప్రార్థించిన కీర్తనకర్తను అనుకరించడం ఎంత శ్రేష్ఠమో కదా!—కీర్తన 119:37.

22. ఎలాంటప్పుడు మాత్రమే క్రైస్తవులు ఫలానా వేడుకలో పాల్గొనాలో వద్దో సొంతగా నిర్ణయించుకోవచ్చు?

22 లోకంలో ప్రజలు వేడుకలు జరుపుకునే రోజుల్లో ఒక క్రైస్తవుడు వాటిలో పాల్గొంటున్నాడని ప్రజలు అపార్థం చేసుకునేలా ప్రవర్తించకూడదు. “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” అని పౌలు రాశాడు. (1 కొరింథీయులు 10:31; 180-181 పేజీల్లోవున్న “ జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోండి” అనే బాక్సు చూడండి.) ఒకవేళ ఫలానా వేడుకకు అబద్ధమత మూలం లేదు, రాజకీయపరమైనది లేదా జాతీయపరమైనది కాదు, బైబిలుకు విరుద్ధమైనది కాదు అనుకోండి అప్పుడు, దానిలో పాల్గోవాలో వద్దో క్రైస్తవులు సొంతగా నిర్ణయించుకోవాలి. అదే సమయంలో ఇతరులు అభ్యంతరపడే నిర్ణయాలు తీసుకోకూడదు.

మాటల్లో చేతల్లో దేవుణ్ణి మహిమపర్చండి

23, 24. యెహోవా ఏర్పర్చిన నీతియుక్తమైన ప్రమాణాల గురించి మనం ఇతరులకు ఎలా చక్కగా సాక్ష్యమివ్వవచ్చు?

23 ఆత్మీయులతో, బంధు మిత్రులతో సమయం గడపడానికి పండుగలు మంచి అవకాశమని చాలామంది అనుకుంటారు. బైబిలుకు విరుద్ధమైన పండుగల్ని చేయనప్పుడు, ఒకవేళ ఎవరైనా మీకు ప్రేమలేదని, గిరి గీసుకొని బ్రతుకుతారని విమర్శిస్తే, అప్పుడు యెహోవాసాక్షులముగా మనం కుటుంబంతో, స్నేహితులతో కలిసి వేరే రోజుల్లో సమయం గడపడం మాకిష్టమేనని దయాపూర్వకంగా వివరించవచ్చు. (సామెతలు 11:25; ప్రసంగి 3:12, 13; 2 కొరింథీయులు 9:7) సంవత్సరమంతటిలో మనం మన ప్రియమైనవారితో ఎన్నోసార్లు సంతోషంగా గడుపుతాం. అయితే, దేవునిపట్ల, ఆయన నీతియుక్తమైన ప్రమాణాలపట్ల ప్రేమ ఉంది కాబట్టి మనం అలాంటి సందర్భాల్లో దేవునికి ఇష్టంలేని ఆచారాలు పాటించం.—178వ పేజీలోని “ సత్యారాధన గొప్ప సంతోషాన్నిస్తుంది” అనే బాక్సు చూడండి.

24 కొంతమంది సాక్షులు నిజమైన ఆసక్తి ఉన్నవారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? h పుస్తకంలోని 16వ అధ్యాయంలోవున్న అంశాలను వివరించగలిగారు. అయితే, మనం వారిని సత్యారాధన వైపు ఆకర్షించాలే గానీ వారిది తప్పు అని నిరూపించడానికి ప్రయత్నించకూడదు. అందుకే, సంభాషణ మర్యాదగా, మృదువుగా, ‘ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగా కృపాసహితముగా’ ఉండేలా చూసుకోవాలి.—కొలొస్సయులు 4:6.

25, 26. పిల్లలు యెహోవాపట్ల ప్రేమా, విశ్వాసం పెంచుకోవడానికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

25 యెహోవా సేవకులముగా మనకు సత్యమేంటో తెలుసు. మనం కొన్నింటిని ఎందుకు నమ్ముతామో, కొన్నింటికి ఎందుకు దూరంగా ఉంటామో మనకు బాగా తెలుసు. (హెబ్రీయులు 5:14) అందుకే ఏదైనా చేసే ముందు బైబిలు సూత్రాల గురించి ఆలోచించాలని మీ పిల్లలకు నేర్పించండి. అప్పుడు యెహోవాకు వారిమీద ప్రేమ ఉందన్న నమ్మకాన్ని కలిగించగలుగుతారు. అంతేకాదు దానివల్ల వారి విశ్వాసం బలపడి, ఎవరైనా మన నమ్మకాల గురించి ప్రశ్నిస్తే బైబిలు నుండి చక్కగా జవాబులు ఇవ్వగలుగుతారు.—యెషయా 48:17, 18; 1 పేతురు 3:15.

26 దేవుణ్ణి ‘ఆత్మతో సత్యముతో’ ఆరాధించేవారందరూ బైబిలు బోధలకు విరుద్ధమైన పండుగలకు, ఆచారాలకు దూరంగా ఉండడమేకాక ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. (యోహాను 4:23) చాలామంది, ‘నిజాయితీగా ఉంటే ఈ లోకంలో బ్రతకలేం’ అంటారు. కానీ మనం తర్వాతి అధ్యాయంలో చూడబోతున్నట్లుగా దేవుడు చెప్పినట్లు జీవిస్తే ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది.

a ఈ పుస్తకంలోని 170-171 పేజీల్లోవున్న “ నేను ఈ పండుగలో, ఆచారంలో భాగం వహించాలా?” అనే బాక్సు చూడండి. వివిధ సెలవుదినాల, వేడుకల గురించి యెహోవాసాక్షులు ప్రచురించిన వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ చూడండి.

b బైబిల్లోని కాలపట్టికనుబట్టి, చరిత్ర ఆధారాలనుబట్టి చూస్తే యేసు, దాదాపు సా.శ.పూ. 2వ సంవత్సరం ఏతనీము నెలలో (మన క్యాలెండర్‌ ప్రకారం సెప్టెంబరు/అక్టోబరు) పుట్టాడు.—యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) 2వ సంపుటి, 56-57 పేజీలు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 221-222 పేజీలు చూడండి.

c 172వ పేజీలోవున్న “ సేటనిజమ్‌ అనే మతంలో జన్మదినాలు” బాక్సు చూడండి.

d ఒక స్త్రీ బిడ్డను కన్నప్పుడు దేవునికి పాపపరిహారార్థ బలి అర్పించాలని ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించబడింది. (లేవీయకాండము 12:1-8) తల్లిదండ్రులనుండి పిల్లలకు పాపం ప్రాప్తిస్తుందని ఆ ఆజ్ఞ ఇశ్రాయేలీయులకు గుర్తుచేస్తూ ఉండేది. అంతేకాదు, బిడ్డ పుట్టుకకు వేడుక జరపాల్సినంత ప్రాముఖ్యత లేదని అర్థం చేసుకొని, జన్మదిన వేడుకలకు సంబంధించిన అన్యమత ఆచారాలకు దూరంగా ఉండేందుకు ఆ ఆజ్ఞ సహాయం చేసింది.—కీర్తన 51:5.

e ఈయోస్ట్రీ (లేదా ఈస్టర్‌) కూడా సంతాన సాఫల్య దేవతే. ద డిక్షణరీ ఆఫ్‌ మిథాలజీ ప్రకారం, “చంద్రుని మీద ఆమెకు ఓ కుందేలు ఉండేది, దానికి గుడ్లు అంటే ఎంతో ఇష్టం. కొన్నిసార్లు ఈయోస్ట్రీ దేవత తలను కుందేలు తలలా చిత్రీకరించేవాళ్లు.”

f కావలికోట అక్టోబరు 15, 2006 సంచికలోని 18-21 పేజీల్లో పెళ్లిళ్లు, పార్టీలకు సంబంధించిన మూడు ఆర్టికల్‌లను చూడండి.

h యెహోవాసాక్షులు ప్రచురించారు.