లెసన్ 66
ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించాడు
ఇశ్రాయేలీయుల్లో చాలామంది యెరూషలేముకు వెళ్లి దాదాపు 70 సంవత్సరాలు అయ్యింది. కానీ కొంతమంది ఇంకా పర్షియా సామ్రాజ్యంలోనే వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వాళ్లలో ఒకరు యెహోవా ధర్మశాస్త్రాన్ని బోధించే యాజకుడైన ఎజ్రా. యెరూషలేములో ఉన్న ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని ఎజ్రా విన్నప్పుడు వెళ్లి వాళ్లకు సహాయం చేయాలని అనుకుంటాడు. పర్షియా రాజైన అర్తహషస్త ఆయనతో ఇలా చెప్తాడు: ‘దేవుడు నీకు ధర్మశాస్త్రాన్ని బోధించేలా తెలివిని ఇచ్చాడు. వెళ్లు, నీతో పాటు రావాలని అనుకుంటున్న వాళ్లను కూడా తీసుకువెళ్లు.’ యెరూషలేముకు వెళ్లాలని అనుకున్న వాళ్లందరినీ ఎజ్రా కలిశాడు. దూర ప్రయాణంలో వాళ్లను కాపాడమని యెహోవాకు ప్రార్థన చేసి, వాళ్లు అక్కడ నుండి బయలుదేరారు.
నాలుగు నెలల తర్వాత వాళ్లు యెరూషలేముకు వచ్చారు. అక్కడ అధిపతులు ఎజ్రాకు ఇలా చెప్పారు: ‘ఇశ్రాయేలీయులు యెహోవా మాట వినలేదు, అబద్ధ దేవుళ్లను ఆరాధించే స్త్రీలను పెళ్లి చేసుకున్నారు.’ ఎజ్రా ఏమి చేశాడు? ప్రజల ముందు మోకాళ్ల మీద ఇలా ప్రార్థన చేశాడు: ‘యెహోవా నువ్వు మా కోసం ఎన్నో చేశావు, అయినా మేము పాపం చేశాం.’ ప్రజలు పశ్చాత్తాప పడ్డారు, కానీ ఇంకా కొన్ని విషయాల్లో మార్చుకోవాల్సి ఉంది. ఈ విషయాలను పరిశీలించడానికి ఎజ్రా పెద్దలను, న్యాయాధిపతులను పెడతాడు. తర్వాత మూడు నెలల్లో యెహోవాను ఆరాధించని వాళ్లను అక్కడ నుండి పంపించేశారు.
పన్నెండు సంవత్సరాలు అయిపోయాయి. ఈలోగా యెరూషలేము గోడలు తిరిగి కట్టారు. దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించడానికి ఎజ్రా ప్రజలను బహిరంగ ప్రదేశానికి పోగుచేశాడు. ఎజ్రా గ్రంథాన్ని విప్పినప్పుడు ప్రజలు అక్కడ నిలబడ్డారు. ఆయన యెహోవాను స్తుతిస్తుండగా వాళ్లు కూడా ఒప్పుకుంటూ చేతులు ఎత్తారు. తర్వాత ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి వివరించాడు, ప్రజలు శ్రద్ధగా విన్నారు. వాళ్లు యెహోవా నుండి దూరమైపోయామని ఒప్పుకుని ఏడ్చారు. తర్వాత రోజు ఎజ్రా ధర్మశాస్త్రంలో ఇంకొన్ని విషయాలు చదివి వినిపించాడు. కొంతకాలంలోనే పర్ణశాలల పండుగ జరుపుకోవాలని వాళ్లు తెలుసుకున్నారు. తెలిసిన వెంటనే, ఆ పండుగ చేయడానికి ఏర్పాట్లను మొదలుపెట్టారు.
వాళ్లకు మంచి పంటను ఇచ్చినందుకు ఈ ఏడు రోజుల పండుగలో ప్రజలు చాలా సంతోషించి యెహోవాకు కృతజ్ఞత చెప్పారు.
యెహోషువ కాలం నుండి ఇప్పటివరకు ఇలాంటి పర్ణశాలల పండుగ జరగలేదు. పండుగ అయిపోయాక ప్రజలు వచ్చి ఇలా ప్రార్థన చేశారు: ‘యెహోవా నువ్వు మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించావు, ఎడారిలో ఆహారం పెట్టావు, ఈ అందమైన దేశాన్ని మాకు ఇచ్చావు. కానీ ఎన్నోసార్లు మేము నీ మాట వినలేదు. ప్రవక్తలను పంపించి హెచ్చరికలు ఇచ్చావు కానీ మేము వినలేదు. అయినా ఎంతో సహనం చూపించావు. అబ్రాహాముకు నువ్వు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నావు. నీ మాట వింటామని ఇప్పుడు మేము వాగ్దానం చేస్తున్నాము.’ వాళ్లు చేసిన వాగ్దానాన్ని రాశారు దానిమీద అధిపతులు, లేవీయులు, యాజకులు తమ ముద్రను వేశారు.“దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!”—లూకా 11:28