లెసన్ 92
యేసు చేపలు పట్టేవాళ్లకు కనిపిస్తాడు
అపొస్తలులకు యేసు కనిపించిన కొంతకాలానికి, పేతురు గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లాలని అనుకుంటాడు. తోమా, యాకోబు, యోహాను ఇంకా కొంతమంది శిష్యులు అతనితో వెళ్తారు. రాత్రంతా కష్టపడినా వాళ్లకు చేపలు పడవు.
తర్వాత రోజు ఉదయం వాళ్లు సముద్రతీరాన ఒకతను నిలబడి ఉండడం చూస్తారు. ఆయన అక్కడ నుండి వాళ్లను, ‘మీరు ఏమైనా చేపలు పట్టారా?’ అని అడుగుతాడు. వాళ్లు, “లేదు” అని చెప్తారు. అప్పుడు ఆయన, “పడవ కుడిపక్క వల వేయండి” అని చెప్తాడు. అలా వేసినప్పుడు, వల నిండా చేపలు పడ్డాయి, వాళ్లు ఆ వలను లాగలేకపోయారు. అప్పుడు యోహానుకు అతను యేసు అని అర్థమై ఇలా అన్నాడు: “ఆయన ప్రభువు!” వెంటనే పేతురు నీళ్లలోకి దూకి, ఈదుకుంటూ ఒడ్డుకు వస్తాడు. మిగతా శిష్యులు వెనుక పడవలో వస్తారు.
వాళ్లు ఒడ్డుకు వచ్చే సరికి మంట మీద రొట్టెని, చేపల్ని చూస్తారు. యేసు వాళ్లు పట్టిన చేపల్లో కొన్నిటిని కాల్చడానికి తీసుకురమ్మని చెప్తాడు. తర్వాత వాళ్లను వచ్చి తినమని అంటాడు.
వాళ్లు తినడం పూర్తయ్యాక, యేసు పేతురును ఇలా అడుగుతాడు: ‘పేతురు నువ్వు చేపలు పట్టడం కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?’ పేతురు ఇలా చెప్పాడు: ‘అవును ప్రభువా ప్రేమిస్తున్నానని నీకు తెలుసు.’ అప్పుడు యేసు, ‘అయితే, నా గొర్రెలను కాయి’ అని చెప్తాడు. యేసు మళ్లీ, ‘పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?’ అని అడుగుతాడు. పేతురు ఇలా చెప్తాడు: ‘అవును ప్రభువా ప్రేమిస్తున్నానని నీకు తెలుసు.’ యేసు ఇలా అంటాడు: “నా చిన్న గొర్రెల్ని కాయి.” యేసు మూడవసారి అడుగుతాడు. అప్పుడు పేతురుకు చాలా బాధేస్తుంది. అతను ఇలా జవాబిస్తాడు: ‘ప్రభువా, నీకు అన్నీ తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు.’ యేసు ఇలా చెప్తాడు: “నా చిన్న గొర్రెల్ని మేపు.” తర్వాత ఆయన పేతురుతో, “నన్ను అనుసరిస్తూ ఉండు” అని చెప్తాడు.
“[యేసు] వాళ్లతో, ‘నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను’ అన్నాడు. వాళ్లు వెంటనే తమ వలలు వదిలేసి ఆయన వెంట వెళ్లారు.”—మత్తయి 4:19, 20