లెసన్ 24
వాళ్లు ఇచ్చిన మాట తప్పారు
యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ‘కొండ ఎక్కి నా దగ్గరకు రా. నేను నా నియమాలను రాతి పలకల మీద రాసి ఇస్తాను.’ మోషే కొండ ఎక్కి అక్కడ 40 పగళ్లు, రాత్రులు ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు యెహోవా రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలను రాసి వాటిని మోషేకు ఇచ్చాడు.
కొన్ని రోజుల తర్వాత మోషే వాళ్లను వదిలి వెళ్లిపోయాడని ఇశ్రాయేలీయులు అనుకున్నారు. వాళ్లు అహరోనుతో ఇలా అన్నారు: ‘మాకు ఎవరైన నాయకుడు కావాలి. మా కోసం ఒక దేవున్ని చెయ్యి.’ అహరోను ‘మీ బంగారాన్ని ఇవ్వండి’ అని చెప్పాడు. ఆయన ఆ బంగారాన్ని కరిగించి, దానితో దూడ బొమ్మను తయారు చేశాడు. అప్పుడు ప్రజలు ‘ఈ దూడే మనల్ని ఐగుప్తునుండి బయటకు తెచ్చిన దేవుడు!’ అన్నారు. వాళ్లు ఆ బంగారు దూడను ఆరాధించడం మొదలుపెట్టి పెద్ద పండుగ చేసుకున్నారు. అది తప్పా? అవును, తప్పే. ఎందుకంటే ప్రజలు యెహోవాను మాత్రమే ఆరాధిస్తామని మాటిచ్చారు. కాని ఇప్పుడు వాళ్లు మాట తప్పారు.
జరుగుతున్నదాన్ని యెహోవా చూశాడు. ఆయన మోషేతో ఇలా అన్నాడు: ‘కిందకు ప్రజల దగ్గరకు వెళ్లు. వాళ్లు నా మాట వినకుండా అబద్ధ దేవుడిని ఆరాధిస్తున్నారు.’ మోషే ఆ రెండు పలకలు పట్టుకుని కొండ మీద నుండి దిగాడు.
ప్రజలు ఉంటున్న చోటుకు వస్తున్నప్పుడు వాళ్లు పాటలు పాడడం మోషేకు వినిపించింది. ఆ తర్వాత వాళ్లు డాన్స్ చేయడం, ఆ దూడ ముందు వంగి నమస్కారం చేయడం కూడా చూశాడు. మోషేకు చాలా కోపం వచ్చింది. ఆ రెండు పలకలను నేల మీద పడేశాడు. అవి ముక్కలుముక్కలు అయిపోయాయి. వెంటనే ఆయన ఆ బొమ్మని తీసేసి నాశనం చేశాడు. అప్పుడు అహరోనును ‘ఇంత చెడ్డ పని చేసేలా ప్రజలు నిన్ను ఎలా ఒప్పించగలిగారు?’ అని అడిగాడు. అహరోను ఇలా అన్నాడు: ‘కోపపడకు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్లో నీకు తెలుసు కదా. వాళ్లకు ఒక దేవుడు కావాలని అన్నారు. అందుకే నేను వాళ్ల బంగారాన్ని మంటలో పడేస్తే ఈ దూడలా అయ్యింది!’ అహరోను అలా చేయకుండా ఉండాల్సింది. మోషే మళ్లీ కొండ మీదకు వెళ్లి ప్రజలను క్షమించమని యెహోవాను బతిమాలాడు.
ఆయన మాట వినాలని అనుకున్న వాళ్లను యెహోవా క్షమించాడు. నాయకుడైన మోషే చెప్పినట్టు వినడం ఇశ్రాయేలీయులకు ఎంత ముఖ్యమో మీకు అర్థమైందా?
“నువ్వు ఎప్పుడైనా దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకు, ఎందుకంటే మూర్ఖుల్ని చూసి ఆయన సంతోషించడు. నువ్వు మొక్కుకున్నది చెల్లించు.”—ప్రసంగి 5:4